పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (నంద - నిర్మలారూఢ)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


2507} నంద  - శుక్లపక్షమునుండి మొదటి ఐదు తిథులు (పాడ్యమి విదియ తదియ చవితి పంచమి) :-
[5.2-62-వ.]

2508} నందకధరుడు  - నందకము అను కత్తిని ధరించువాడు, విష్ణువు :-
[3-19-చ., 3-434-చ., 6-121-క.]

2509} నందకము  - విష్ణుమూర్తి ఖడ్గము పేరు, సంతోషించునది, సంతోషపెట్టునది, అలరించునది,. వ్యు. టునది సమృద్ధౌ నంద+ ణ్యుల్, కృ.ప్ర. :-
[1-39-వ., 10.2-421-మ.]

2510} నందకహస్తుడు  - నందకము చేతిలో ధరించినవాడు, కృష్ణుడు :-
[10.2-421-మ.]

2511} నందగోపకుమారుడు  - నందగోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు :-
[1-188-వ., 5.1-1-క., 5.2-1-క.]

2512} నందగోపసుందరి  - గోపాలుడైన నందుని భార్య, యశోద :-
[10.2-1064-చ.]

2513} నందతనయుడు  - నందుని కొడుకు, కృష్ణుడు :-
[10.1-784-క., 10.1-903-శా.]

2514} నందతనూజుడు  - నందుని పుత్రుడు, కృష్ణుడు :-
[3-96-క.]

2515} నందతపఃఫలము  - నందుని యొక్క తపస్సునకు ఫలితముగ లభించినవాడు, కృష్ణుడు :-
[10.1-1249-ఉ.]

2516} నందనందననందనుడు  - నందుని కొడుకు యొక్క (కృష్ణుని) కొడుకు, సాంబుడు :-
[10.2-562-తే.]

2517} నందనందనుడు  - నందుని కొడుకు, సంతోషమునకే సంతోషము కలిగించువాడు, కృష్ణుడు :-
[10.1-451-వ., 10.1-1015.1-ఆ., 10.1-1100-క., 10.1-1524-వ., 10.2-275-వ., 10.2-615-వ.]

2518} నందనవనము  - స్వర్గములోని ఇంద్రుని ఉద్యానవనము :-
[10.1-1615-వ., 10.2-214-వ.]

2519} నందితనందుడు  - ఆనందింప జేయబడిన నందుడు కలవాడు, కృష్ణుడు :-
[10.2-625-క.]

2520} నందితాత్మ  - ఆనందమున ఉన్న ఆత్మ కలవాడు, శుకుడు. :-
[10.1-350-ఆ.]

2521} నందుపట్టి  - నందుని పుత్రుడు, కృష్ణుడు :-
[10.1-1321-వ.]

2522} నంద్యావర్తబంధము  - అరవైనాలుగు అక్షరముల కాలముగల నంద్యావర్తము అనెడి తాళమానమునకు సరిపడ నృత్యమండలమును చుట్టివచ్చి హస్త విన్యాసాదులను కనుపింప చేయునది, రాసక్రీడ యందలి పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

2523} నక్తంచరుడు  - నక్తము (రాత్రి) చరుడు (చరించువాడు), రాక్షసుడు :-
[7-392-వ., 10.1-736-వ.]

2524} నక్షత్రములు  - అశ్విని ఆది నక్షత్రములు (తారకల సమూహములు) ఇవి 27 :-
[1-521-వ., 3-346-వ.]

2525} నఖక్షతములు  - గిల్లుటచేత చర్మముపై ఏర్పరచు గోటి గుర్తు, ఒక శృంగార క్రియ :-
[10.1-755-క.]

2526} నగచరుడు  - కొండలమీద చరించువాడు, వానరుడు :-
[10.2-542-క.]

2527} నగచరేంద్రముఖ్యుడు  - నగచర (కొండల మీద తిరిగెడిది, భల్లూకము) లలో ఇంద్ర (శ్రేష్ఠులలో) ముఖ్యమైనవాడు, జాంబవంతుడు :-
[10.2-64-క.]

2528} నగచాపుడు  - మేరుపర్వతమును చాపము (ధనుస్సు)గా పట్టినవాడు, శివుడు :-
[4-121-క.]

2529} నగజాత  - నగ (పర్వతుని) జాత (పుట్టినామె), పార్వతి :-
[10.1-1742.1-ఆ.]

2530} నగధరుడు  - నగ (గోవర్ధన పర్వతమును) ధరుడు (ధరించినవాడు), కృష్ణుడు :-
[10.1-1553-వ., 10.1-1700-వ., 10.1-1767-వ., 10.2-270-క., 10.2-886-వ., 11-118-వ.]

2531} నగభేది  - పర్వతాల గర్వమణచినవాడు, ఇంద్రుడు :-
[9-205.1-తే.]

2532} నగారాతిగజేంద్రము  - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము :-
[10.1-1750-మ.]

2533} నడ్వలము  - 1.పక్వానికి వచ్చిన పైరు, 2.కిక్కసకసవు గల దేశము, 3.చక్షుర్మనువు భార్యా ఉల్ముకుని తల్లీ, నడ్వల. :-
[4-390-వ.]

2534} నతమందారుడు  - మొక్కినవారికి కల్పవృక్షము వంటివాడు, కృష్ణుడు :-
[10.2-207-మ.]

2535} నతాఖిలామృతాహారి  - నమస్కరిస్తున్న సమస్త దేవతలు (అమృతాహారులు) కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

2536} నదము  - పడమరకు ప్రవహించు నది :-
[1-199-వ., 2-89-వ., 2-178-మ., 3-38-క., 5.2-55-వ., 10.2-948-వ.]

2537} నది  - తూర్పునకు ప్రవహించు నదము :-
[1-199-వ., 2-89-వ., 2-178-మ., 5.2-55-వ.]

2538} నదీలలామ  - నదులలో లలామ (శ్రేష్ఠురాలు), యమున. :-
[10.2-504-తే.]

2539} నభస్వతి  - నభస్ (ఆకాశము) వంటి రూపము కలది, విజితాశ్వుని రెండవ భార్య నభస్వతి, వీరి కొడుకు హవిర్ధానుడు. :-
[4-675-క.]

2540} నభస్సు  - ఆకాశము తానైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

2541} నభోమణి  - నభస్ (ఆకాశమునకు) మణి (మణి వంటి వాడు), సూర్యుడు :-
[6-142-ఉ.]

2542} నమత్సంత్రాత  - నమత్ (మ్రొక్కువారిని) సంత్రాత (చక్కగాకాపాడువాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

2543} నమస్కరించుటలు+చేయక  - నమస్కరించుటలుసేయక, గసడదవాదేశ సంధి :-
[10.2-1269-క.]

2544} నమస్కారము  - న మహః (నేను నీకు ఇతరుడను కాను) అని తెలుపుకొను ప్రక్రియ, చేతులు జోడించుటాది, గౌరవసూచక క్రియ :-
[10.1-1654-వ.]

2545} నముచి  - ఒక దానవుడు, ఇంద్రునిచేతిలో మరణించినవాడు, విప్రచిత్తి కొడుకు. స్వర్భానుని కూఁతురు అగు ప్రభ భార్య, న+ముచ్+కి, న ముంచతి పరపదార్థాన్ దుష్టాచారం వా, ఇతరుల వస్తువులను వదలిపెట్టనివాడు. దొంగ; దుష్టాచారము కలవాడు. ఒక రాక్షసుడు. :-
[7-29-వ.]

2546} నమ్రైకరక్షుడు  - నమ్రత ఏక (ఒక్కటితోనే) రక్షణుడు ఇచ్చువాడు, విష్ణువు :-
[3-203-దం.]

2547} నయచరితుడు  - నీతిగల నడవడిక కలవాడు, ధర్మరాజు. :-
[10.2-714-తే.]

2548} నయవేది  - నీతి తెలిసినవాడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

2549} నరకాసురుడు  - భూమాత పుత్రుడు, సత్యభామ చేత హతుడు అయిన అసురుడు :-
[2-190-చ.]

2550} నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్యుడు  - మానవులు దేవతలు దైత్యులు యక్షులు రాక్షసులు మునులలో ఇంద్రుని వంటివారుచేత స్తుతింపబడువాడు, శ్రీకృష్ణడు :-
[5.1-181-మ.]

2551} నరదేవుడు  - నరులకు దేవుడు, రాజు :-
[1-291-వ., 5.1-26-వ.]

2552} నరనాథుడు  - నరులకు నాథుడు (పాలించువాడు), రాజు :-
[3-217-క., 4-397-క., 4-765-క., 4-864.1-తే., 5.1-61-చ., 6-60.1-ఆ., 8-135.1-తే., 9-6-ఆ., 9-239-మ.]

2553} నరనాథోత్తముడు  - నరనాథు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు :-
[9-140-మ.]

2554} నరనాయకుడు  - నరుల (మానవుల)కు నాయకుడు, రాజు :-
[4-449-క., 4-470-క.]

2555} నరనారాయణులు  - పూర్వం ధర్మునికి భార్య మూర్తికి నరనారాయణులుగా విష్ణువు అవతరించాడు, వారే ఇప్పుడు ద్వాపరయుగంలో అర్జునుడు కృష్ణుడుగా అవతరించారు, :-
[10.2-114-వ.]

2556} నరపతి  - నరులకు ప్రభువు, రాజు :-
[5.1-61-చ., 5.1-179-చ.]

2557} నరపాలకుడు - నరులను పాలించువాడ, రాజు :-
[4-420-క.]

2558} నరపాలుడు  - నరులను పాలించువాడు, రాజు :-
[4-424-చ., 11-52-వ.]

2559} నరభోజనుడు  - నర (మానవులను) భోజనుడు (తినెడివాడు), రాక్షసుడు :-
[7-304-క., 10.2-1262-క.]

2560} నరలోకేశుడు  - నరలోక (నరలోకుల) కు ఈశుడు (ప్రభువు), రాజు. :-
[7-301-క.]

2561} నరవరుడు  - నరులకు వరుడు (భర్త), రాజు :-
[3-43-చ., 3-216-క., 5.1-6-క., 6-57-క., 10.1-1220-క., 11-57.1-తే.]

2562} నరవరేణ్యుడు  - నరులలో వరేణ్యుడు (మన్నింపదగినవాడు), రాజు. :-
[5.1-113.1-ఆ., 8-706.1-ఆ.]

2563} నరవరోత్తముడు  - నరవరుల (రాజుల)ల ఉత్తముడు, మహారాజు :-
[10.1-1612.1-తే.]

2564} నరవాహనుడు  - నరుని వాహనముగ కలవాడు, నిరృతి, కుబేరుడు :-
[4-426-క.]

2565} నరవిభుడు  - మానవుల ప్రభువు, రాజు :-
[9-152-ఆ.]

2566} నరసఖుడు  - అర్జునునకు సఖుడు, కృష్ణుడు :-
[1-201-శా.]

2567} నరసింహుడు  - నరుడు సింహము రూపములు కూడి యున్న విష్ణు అవతారుడు, హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని పాలించిన వాడు. :-
[7-371-వ.]

2568} నరహరి  - నరసింహావతారము ఎత్తినవాడు, హరి :-
[6-33-క., 6-57-క.]

2569} నరుడు  - నరనారాయణులలో నరుడు, అర్జునుడు :-
[1-371-క.]

2570} నరునిసఖుడు  - నరుడు (అర్జునుడు) యొక్క సఖుడు, కృష్ణుడు :-
[6-23-ఆ.]

2571} నరేంద్రచంద్రముడు  - నరేంద్రు (రాజు) లను తారలలో చంద్రునివంటివాడు, మహారాజు. :-
[7-459-ఉ.]

2572} నరేంద్రచంద్రుడు  - నరేంద్రులు (రాజులు) అనెడి తారలలో చంద్రునివంటివాడు, మహారాజు :-
[9-128-వ.]

2573} నరేంద్రముఖ్యుడు  - నరేంద్రుడు (రాజు)లలో ముఖ్యుడు, మహారాజు. :-
[9-45.1-తే.]

2574} నరేంద్రాగ్రణి  - నరేంద్రు (రాజు)లలో అగ్రణి (అధికుడు), మహారాజు. :-
[9-146-శా.]

2575} నరేంద్రు+కున్  - నరేంద్రునకున్, నుగాగమ సంధి :-
[10.2-1265-వ.]

2576} నరేంద్రుడు  - నరులకు ఇంద్రుడు, రాజు. :-
[1-346-క., 1-390-క., 1-428-వ., 1-502-ఉ., 2-2-వ., 2-261-క., 4-2-వ., 4-421-వ., 4-626-వ., 4-885-వ., 5.1-3-క., 5.1-178-వ., 5.2-30-వ., 6-449-వ., 7-7-వ., 7-156-క., 8-2-వ., 9-2-వ., 9-52-క., 10.1-110-క., 10.1-459-క., 10.1-1204-క., 10.1-1402-క., 10.2-7-క., 12-2-వ.]

2577} నరేంద్రుడు  - నరులలో ఇంద్రుని వంటి వాడు, రాజు :-
[1-437-వ., 4-853-వ., 6-192-వ.]

2578} నరేంద్రోత్తముడు  - ఉత్తముడైన నరుల కింద్రుడు రాజు, మహారాజు. :-
[1-368-మ.]

2579} నరేశ్వరాసనము  - రాజుకి ఐన పీఠము, సింహాసనము :-
[10.1-1398-చ.]

2580} నరేశ్వరుడు  - నరులకు ప్రభువు, రాజు :-
[1-465-వ., 3-30-ఉ., 9-418-ఉ., 10.1-1107-క.]

2581} నలకూబరుడు  - కుబేరుని కొడుకు. మణిగ్రీవుడు ఇతని సోదరుడు. గొప్ప అందగాళ్ళు. నారదశాపంతో జంట మద్ది చెట్లుగా అయి కృష్ణబాలుని వలన శాపవిముక్తి పొందారు :-
[10.1-391-వ.]

2582} నలినగర్భుడు  - నలినము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-320.1-తే., 3-377.1-తే.]

2583} నలినజుడు  - నలిన (పద్మము) నందు జుడు (పుట్టిన వాడు), బ్రహ్మ :-
[2-221.1-తే.]

2584} నలినదళాక్షుడు  - నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-332-క.]

2585} నలిననయన  - నలినము (పద్మము)ల వంటి నయన (కన్నులుగలామె), స్త్రీ :-
[4-943.1-తే.]

2586} నలిననాభుడు  - నలినము (పద్మము) నాభియందు కలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[10.2-697.1-తే., 10.2-1073-తే.]

2587} నలినభవుడు  - నలినము (పద్మము)న భవ (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-268-తే., 4-941-క.]

2588} నలినముఖి  - నలిన (పద్మమువంటి) ముఖి (ముఖము కలామె), స్త్రీ :-
[6-446.1-తే.]

2589} నలినసఖుడు  - నలిన (పద్మములకు) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు :-
[12-23.1-తే.]

2590} నలినాక్షుడు  - నలినము (పద్మము)లవంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-290-మ., 3-294.1-తే., 3-567-క., 3-844-చ., 10.1-97.1-తే.]

2591} నలినాయతాక్షి  - నలిన (పద్మముల వంటి) ఆయత (పెద్ద) అక్షి (కన్నులు ఉన్నామె), స్త్రీ :-
[3-951-క.]

2592} నలినాసననందనులు  - నళినాసన (బ్రహ్మదేవుని) నందనులు (పుత్రులు), నారదుడు మరియు సనకసనందనాదులగు యోగులు :-
[2-255-క.]

2593} నలినాసనుడు  - నలినము (పద్మము)న ఆసీనుడు (ఉండువాడు), బ్రహ్మదేవుడు :-
[3-588-ఉ.]

2594} నలినోదరుడు - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-772.1-తే.]

2595} నలినోదరుడు  - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[4-944-క., 11-77-వ.]

2596} నలుదిక్కులు  - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము :-
[3-538.1-తే., 10.1-1199-వ., 10.1-1241-క., 10.2-638-తే.]

2597} నలుమొగములప్రోడ  - నలు (నాలుగు 4) మొగముల (ముఖములుగల) ప్రోడ (పెద్ద), బ్రహ్మ :-
[7-80-వ.]

2598} నలువ  - నలు (నాలుగు) వ (మోములుగలవాడు), చతుర్ముఖుడు, బ్రహ్మ :-
[8-171-క., 9-72-ఆ., 10.1-88-వ., 12-22-వ.]

2599} నల్లనయ్య  - నల్లని అయ్య, కృష్ణుడు :-
[10.1-145-వ.]

2600} నళినదళాక్షి  - నళినము (పద్మము) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[4-848-క.]

2601} నళినదళాక్షుడు  - నళిన (తామర) దళ (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-692-చ., 10.1-775-క., 10.1-1045-క.]

2602} నళిననయన  - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ, గోపిక. :-
[10.1-1474-ఆ.]

2603} నళిననేత్ర  - నళినము (పద్మముల) వంటి నేత్రములు గలామె, స్త్రీ. :-
[5.1-37-ఆ.]

2604} నళిననేత్రుడు  - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[4-286.1-తే.]

2605} నళినలోచనుడు  - నళినము (పద్మముల) వంటి లోచనుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[10.1-130-త., 10.1-600.1-ఆ.]

2606} నళినాక్షుడు  - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[2-105-ఉ., 4-203.1-తే., 7-124.1-ఆ., 10.1-560.1-తే.]

2607} నళినాప్తుడు  - నళినము (పద్మము)లకు ఆప్తుడు (బంధువు), సూర్యుడు :-
[9-455-క.]

2608} నళినాయతాక్షుడు  - నళిని (కమలముల) ఆయత (వలె విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు, కృష్ణుడు :-
[4-169-ఉ., 10.2-1281.1-తే.]

2609} నళినాసనజనకుడు  - నళినాసనుని (బ్రహ్మ యొక్క) జనకుడు, విష్ణువు :-
[11-108-క.]

2610} నవకంజదళాక్షుడు  - నవ (కొత్త, తాజా) కంజము (పద్మము)ల దళము (రేక)ల వంటి అక్షులు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు :-
[3-530-ఉ.]

2611} నవగ్రహములు  - 1సూర్యుడు 2చంద్రుడు 3అంగారకుడు 4బుధుడు 5బృహస్పతి 6శుక్రుడు 7శని 8రాహువు 9కేతువు :-
[10.2-573-వ., 11-105-వ.]

2612} నవతోయజనేత్రుడు  - నవ (అప్పుడే పూసిన) తోయజ (పద్మములవంటి) నేత్రుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.2-1109-ఉ.]

2613} నవద్రవ్యములు  - పృథ్వ్యాది, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు :-
[2-84-వ., 2-86-వ., 10.1-1779-వ.]

2614} నవనిధులు  - 1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము 5కచ్చపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము :-
[1-39-వ., 6-326-వ., 8-114-క.]

2615} నవనీతము  - నవోద్ధృతము, క్రొత్తగా అప్పుడే తీసిన వెన్న :-
[10.1-1334-మ.]

2616} నవనీరజగంధి  - తాజా పద్మముల వంటి సువాసనలు ఉన్నామె, పద్మినీ జాతి సుందరి, రుక్మిణి :-
[10.1-1698-ఉ.]

2617} నవనీరజనేత్రుడు  - నవ(కొత్త, తాజా) నీరజ (ఫద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-364-చ.]

2618} నవపద్మదళాక్షుడు  - నవ (లేత) పద్మముల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు :-
[3-590-ఉ.]

2619} నవపద్మముఖి  - నవ (తాజా) పద్మమువంటి ముఖముగలామె, అందగత్తె. :-
[9-577-క.]

2620} నవపద్మలోచనుడు  - నవ (లేత) పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-747.1-తే.]

2621} నవపుండరీకాక్షుడు  - కొత్త (తాజా) పుండరీకము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-407.1-తే.]

2622} నవప్రజాపతులు  - నవబ్రహ్మలు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి :-
[2-112-వ., 2-199-వ., 4-872.1-తే., 6-196-తే., 8-681-వ.]

2623} నవబ్రహ్మలు  - ప్రజాపతులు తొమ్మండుగురు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి :-
[11-105-వ.]

2624} నవరంధ్రములు  - కళ్ళు రెండు (2) ముక్కురంధ్రములు (2) నోరు (1) చెవులు (2) రహస్యావయవము (1) గుదము(1) :-
[10.1-91.1-తే.]

2625} నవరత్నములు  - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము :-
[3-518.1-తే., 3-538.1-తే., 4-315.1-తే., 10.1-840-క., 10.2-600.1-తే., 10.2-697.1-తే.]

2626} నవరసములు  - 1శృంగారము 2హాస్యము 3కరుణము 4వీర్యము 5రౌద్రము 6భయానకము 7భీభత్సము 8అద్భుతము 9శాంతము, పాఠ్యంతరములు కలవు :-
[2-68.1-తే., 10.1-762.1-తే., 10.1-788-ఉ., 10.1-1054-తే.]

2627} నవలతాతన్వి  - నవ (లేత) లత వంటి తన్వి (దేహము కలామె), అందమైన స్త్రీ :-
[10.2-235.1-తే.]

2628} నవవర్షములు  - భారతాది, 1భారతము 2రమ్యకము 3కింపురుషము 4హరి 5భద్రాశ్వము 6కురువు 7హిరణ్మయము 8ఇలావృతము 9కేతుమూలము :-
[5.2-37-క.]

2629} నవవిధప్రపంచము  - నవవిధసృష్టి కలది, 6 ప్రాకృత సృష్టులు (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మఱియు 3 వైకృతసృష్టులు (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు)) అను 9విధముల సృష్టులు కలది :-
[3-248-క.]

2630} నవవిధభక్తి  - 1సఖ్యము 2శ్రవణము 3దాసత్వము 4వందనము 5అర్చనము 6సేవ 7ఆత్మలోననెరుక 8సంకీర్తనము 9చింతనము, పాఠ్యంతరము, 1శ్రవణము 2కీర్తనము 3స్మరణము 4పాదసేవనము 5అర్చనము 6వందనము 7దాస్యము 8సఖ్యము 9ఆత్మనివేదనము :-
[7-167-మ., 10.2-249-వ.]

2631} నవవిధసంబంధములు  - 1పితృపుత్ర సంబంధము 2రక్ష్యరక్షక సంబంధము 3శేషిశేష సంబంధము 4భర్తృభర్త సంబంధము 5జ్ఞాతృజ్ఞేయ సంబంధము 6స్వస్వామి సంబంధము 7శరీరిశరీర సంబంధము 8 ఆధారాధేయ సంబంధము 9భోక్తృభోగ్య సంబంధము :-
[7-356-వ.]

2632} నవవిధసర్గములు  - 1మహత్సర్గము 2అహంకారసర్గము 3భూతసర్గము 4ఇంద్రియసర్గము 5దేవసర్గము 6తమస్సర్గము 7వనస్పత్యాదిసర్గము 8 తిర్యక్సర్గము 9మనుష్యసర్గము ఇవికాక కుమారసర్గము ఒకటుంది అదికూడ వానిలోని భాగమే :-
[3-972-వ.]

2633} నవవిధసృష్టి  - ప్రాకృతసృష్టి (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మరియు వైకృతసృష్టి (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు)) :-
[3-344-వ.]

2634} నవీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రుడు  - నవీన (సరికొత్తగా) ఉజ్జ్వల (ప్రకాశిస్తున్న) నీలమేఘముల నిభ (వంటి) గాత్రము (శరీరము) కలవాడు, విష్ణువు :-
[3-284-మ.]

2635} నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణుడు  - నవోఢ (కొత్తపెళ్ళికూతురు) వలె ఉల్లసత్ (ఉల్లాసము గల) ఇందిరా (లక్ష్మీదేవికి) పరిచరిష్ణుడు (పరిచారునిగా ఉండు వాడు. కలిసి విహరించు వాడు), విష్ణువు :-
[8-105-మ.]

2636} నవ్యము - నవ్యతరము నవ్యతమము :-
[3-550-చ.]

2637} నాకలోకము  - స్వర్గము, దుఃఖము లేని లోకము :-
[2-112-వ.]

2638} నాకవాసులు  - నాకము (స్వర్గలోకము)న వాసులు (నివసించెడివారు), దేవతలు :-
[8-168-మత్త.]

2639} నాకారాతులు  - నాకా (స్వర్గవాసులైన దేవతలకు) ఆరాతులు (శత్రువులు), రాక్షసులు :-
[10.2-159-శా.]

2640} నాకుజుడు  - నాకువు (పుట్ట)లో పుట్టినవాడు, వాల్మీకి :-
[10.2-1117-ఉ.]

2641} నాకుట  - నాలుకతో రుచి చూచు, రాయుటాదులు చేయుట. :-
[10.1-523-చ.]

2642} నాకులు  - నాక (స్వర్గ) లోకమున ఉండు వారు, దేవతలు :-
[3-323-క.]

2643} నాకౌకసుడు  - వేల్పు, దేవత, వ్యు. నాకః ఓకస్ అస్య, బ.వ్రీ., స్వర్గము ఉనికిగా గలవాడు :-
[10.2-1154.1-తే.]

2644} నాగ  - పాము రూపమున వచ్చిన అఘాసురుడు :-
[2-190-చ.]

2645} నాగపాశము  - వరుణుని ఆయుధము, (ఇది ప్రయోగింపబడిన వాని చలనములు బంధింపబడును) :-
[10.2-385-క.]

2646} నాగబంధము  - పాముల వలె పెనవైచుకొనుచు నర్తించుచు లయ తప్పక అంగ విన్యాసాదులను చూపునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2647} నాగరజనులు  - నగరములోనుండెడి జనులు, పౌరులు, సంస్కారవంతులు :-
[9-346.1-ఆ.]

2648} నాగసూదనుడు - నాగు (పాము)లను చంపువాడు, గరుత్మంతుడు, గరుడుడు :-
[4-16-చ.]

2649} నాచనసోమన  - ఉత్తర హరివంశం వ్రాసిన మహాకవి :-
[6-11.1-తే.]

2650} నాడి  - నరముల కూడలి స్థానము :-
[2-30-వ.]

2651} నాడు+ఒదిగి  - నాడొదిగి, ఉకార సంధి :-
[10.2-1237-క.]

2652} నాథదైవత  - నాథ (భర్తయే) దైవత (భగవంతునిగ గలది), పతివ్రత :-
[7-233-శా.]

2653} నాదము  - ఓంకారము ఉచ్చారణలో బిందువు తరువాత పలికెడి అనునాదరూపము నాదము :-
[7-467-వ.]

2654} నానావిధైకమత్యుపలక్షణమహితుడు  - నానావిధైక (అనేక విధములైన) మతి (బుద్దులకు) ఉపలక్షణ (ఉపలక్ష్ణణమైన) మహితుడు (గొప్పవాడు), విష్ణువు :-
[3-198.1-తే.]

2655} నామములు  - గుణాదులను వర్ణించుచు సంకేతముగా ఉండు పేర్లు, శ్రీరామ, గోవింద నారాయణ మున్నగునవి :-
[10.1-1653.1-ఆ.]

2656} నారదుడు  - బ్రహ్మదేవుని మానస పుత్రుడు, నరస్యేదంనారం నారంవిజ్ఞానానందదాతీతి నారదః అని వ్యుత్పత్తి, అవినాశమైనదానికి (ఆత్మ) చెందినది నారం (బ్రహ్మ) అట్టి బ్రహ్మజ్ఞానమును కలుగజేయువాడు నారదుడు అనబడును, బ్రహ్మవేత్త :-
[10.1-397-వ., 10.1-411-క.]

2657} నారసములు  - నారినుండి వెలువడునవి, బాణములు :-
[1-369-చ.]

2658} నారాచము  - నరసమూహము ఆచమించునది, అచ్చము ఇనుప బాణము :-
[10.1-1757-వ.]

2659} నారాయణదేవుడు - నారాయణుడు అను దేవుడు, విష్ణువు :-
[10.1-1654-వ.]

2660} నారాయణాశ్రమము  - నరనారాయణులు తపముచేసిన ప్రదేశము :-
[7-451-వ., 10.2-1203-వ.]

2661} నారాయణి  - సుపార్శ్వక్షేత్రమున నారాయణి (సర్వులందు విజ్ఞానరూపమున ఉండునామె) :-
[10.1-61-వ.]

2662} నారాయణుడు  - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు, :-
[1-61-వ., 1-202-వ., 1-214-వ., 1-232-వ., 1-388.1-తే., 1-513-వ., 1-530-గ., 2-84-వ., 2-89-వ., 2-112-వ., 2-173.1-తే., 2-205-మ., 2-238-వ., 2-272.1-ఆ., 2-277.1-తే., 3-131.1-తే., 3-196-వ., 3-244-వ., 3-272.1-తే., 3-344-వ., 3-507-వ., 3-720.1-తే., 3-722-వ., 3-839-వ., 3-873-తే., 3-897.1-తే., 3-1007-వ., 3-1026.1-తే., 3-1047-వ., 4-126-తే., 4-163.1-తే., 4-233.1-తే., 4-963.1-తే., 5.2-115-వ., 7-239-వ., 7-240.1-తే., 7-271-శా., 8-97-వ., 8-122-మ., 8-479-క., 10.1-53-క., 10.1-236-వ., 10.1-559-క., 10.1-560.1-తే., 10.1-1236-దం., 10.1-1450.1-ఆ., 10.1-1654-వ., 10.2-49-క., 10.2-1187-తే., 10.2-1313-వ., 11-56-వ., 11-77-వ.]

2663} నాలవపాదంబు  - కలియుగము యొక్క చివరి (4వ) పాదము. 432000 సంవత్సరాలలో చివరి 108000 సంవత్సరములు.. :-
[12-13-వ.]

2664} నాలుగవఅవస్థ  - తురీయము, క్రింది అవస్థాత్రయములు జాగృత మెలకువ, సుషిప్తి నిద్ర స్వప్న కల, :-
[1-459.1-తే.]

2665} నాలుగష్టలు  - మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసములందలి కృష్ణపక్షమునందలి అష్టమితిథులు, శ్రాద్ధభేదంబులు :-
[7-448-వ.]

2666} నాలుగుదిక్కులు  - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తర దిక్కులు :-
[4-58.1-తే., 4-163.1-తే.]

2667} నాలుగుమోములనలువ  - నాలుగు ముఖములు కల బ్రహ్మ,, చతుర్ముఖ బ్రహ్మ :-
[9-8.1-తే.]

2668} నాహుషుడు  - నహుషుని పుత్రుడు, యయాతి :-
[9-562-శా.]

2669} నిండుపున్నమిచంద్రునిపదహారుకళలు  - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5పుష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత :-
[10.1-1-క.]

2670} నికషాత్మజుడు  - నికష అను రాక్షసికి పుట్టినవాడు, నైరృతి, నైరృత దిక్పతి :-
[10.2-773-చ.]

2671} నికుంచితకరణము  - అవయవములను ముడుచుకొనుట, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

2672} నికుంచితశిరోభావాలు  - వంపబడిన శిరస్సు కలవి, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

2673} నికృతి  - వంచన, తిరస్కారము, కపట భేదం :-
[4-215-వ.]

2674} నిఖిలదేవాత్ముడు  - నిఖిల (సమస్తమై) దేవ (దేవతలు) ఆత్ముడు (తానైనవాడు), విష్ణువు :-
[8-466-ఆ.]

2675} నిఖిలధరావరనుతసుగుణధాముడు  - నిఖిల (సమస్తమైన) ధరావర (రాజుల) చేత నుత (స్తోత్రము చేయబడిన) గుణములకు ధాముడు (నిలయ మైనవాడు), శ్రీరామ :-
[4-1-క.]

2676} నిఖిలధర్ముడు  - సమస్తమైన ధర్మములు తానైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

2677} నిఖిలపావనుడు  - నిఖిల (సమస్తమును) పావనుడు (పవిత్రము జేయువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]

2678} నిఖిలబీజుడు  - సర్వప్రాణ సహిత రహితలకు మూల జన్మ స్థానము యైన వాడు, విష్ణువు :-
[10.1-942-ఆ.]

2679} నిఖిలరూపకుడు  - సమస్త రూపములు తానే అయినవాడు :-
[2-89-వ.]

2680} నిఖిలస్తుత్యుడు  - సర్వులచే స్తుతింపబడువాడు, కృష్ణుడు :-
[1-180-క.]

2681} నిఖిలాధిపతి  - నిఖిల (సమస్తమునకు) అధిపతి (ప్రభువు), విష్ణువు. :-
[8-132-క.]

2682} నిఖిలాధీశుడు  - నిఖిల (సమస్తమునకు) అధీశుడు (పై అధికారి), విష్ణువు. :-
[8-731-క.]

2683} నిఖిలేశుడు  - సర్వ లోకములకు ఈశుడు, విష్ణువు :-
[10.2-49-క.]

2684} నిఖిలైకనేత  - సమస్తమునకు కల ఏకైక అధినేత, శంకరుడు :-
[3-465-క.]

2685} నిగమచయాంతవేద్యుడు  - నిగమ (వేద) చయ (సముదాయముల) అంత (సర్వస్వము వలన, వెంబడి) వేద్యుడు (తెలియబడువాడు), (వేదాంతవేద్యుడు), విష్ణువు :-
[3-506-చ.]

2686} నిగమవినుత  - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు :-
[3-311.1-తే.]

2687} నిగమస్తుత  - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు :-
[3-310-క.]

2688} నిజతాండవఖేలనుడు  - నిజ (స్వకీయమైన) తాండవమను నాట్యమును ఖేలనుడు (ఆడు వాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

2689} నిజభక్తత్రాణపారాయణు  - తనభక్తులను కాపాడుటలో బహునేర్పరిని, విష్ణువు :-
[2-237-మ.]

2690} నిజభక్తవరదుడు  - సత్యమైన తన భక్తులకు వరములను ఇచ్చెడి వాడు, విష్ణువు :-
[4-963.1-తే.]

2691} నిజాలంకారుడు  - నిజ (తననుతనే) అలంకారుడు (అలంకరించుకొన్నవాడు), గర్వముగలవాడు :-
[8-182-వ.]

2692} నిటలతటాక్షుడు  - నిటలతట (నుదట భాగమున) అక్షుడు (కన్ను గలవాడు) శివుడు :-
[8-171-క.]

2693} నిటలాంబకుడు  - నిటలము (నుదురు) అందు అంబకము (కన్ను) కలవాడు, శివుడు :-
[3-1052-చ., 10.2-324-ఉ., 10.2-406-వ., 10.2-1274-ఉ.]

2694} నిటలాక్షుడు  - నిటలమున (నుదుట) అక్షి (కన్ను) కలవాడు, శంకరుడు :-
[4-47-వ., 10.2-592-క.]

2695} నిట్టూర్పు  - నిడు (దీర్ఘమైన) ఊర్పు (శ్వాస), మనసులోని శ్రమకు సంకేతము :-
[1-358-వ., 8-93-వ.]

2696} నితంబిని  - గొప్ప పిరుదులు కలామె, స్త్రీ :-
[1-29-ఉ., 10.1-1121-చ.]

2697} నితాంతసౌఖ్యనిధి  - నితాంత (క్షీణములేని) సౌఖ్య (ఆనందమునకు) నిధివి (స్థానమైనవాడు), విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

2698} నిత్యకర్మలు  - సంధ్యావంద నాది విహిత కర్మలు :-
[10.1-766-వ.]

2699} నిత్యకల్యాణనిధి  - శాశ్వతమైన మేలులకు నిధివంటివాడు, విష్ణువు. :-
[10.2-49-క.]

2700} నిత్యఖేలనుడు  - నిత్య (శాశ్వతమైన) ఖేలనుడు (వర్తన) కలవాడు, విష్ణువు. :-
[3-572-చ.]

2701} నిత్యనైమిత్తికములు  - నిత్యమును చేయునవి మరియు నిమిత్తము (అవసరము) అనుసరించి చేయవలసినవి అగు పూజాదికములు :-
[3-959.1-తే.]

2702} నిత్యప్రళయము  - నిత్యము ప్రాణులకు కలుగుతుండెడి నిద్ర, మరణము :-
[12-24-వ.]

2703} నిత్యమంగళాకరుఁడు  - శాశ్వతమైన శుభప్రదమైన ఆకారము కలవాడు, విష్ణువు :-
[3-212-చ.]

2704} నిత్యలక్ష్మీవిహారుడు  - నిత్య (శాశ్వతమైన) లక్ష్మీదేవి (సంపదలు) తో విహారుడు (వర్తించువాడ), విష్ణువు. :-
[3-304.1-తే., 3-753.1-తే., 4-171.1-తే.]

2705} నిత్యశుద్ధము  - నిత్యము (భూత భవిష్య వర్తమానము లందు) శుద్ధము (శుద్ధమైనది, పంచమలములైన ఆణవ కార్మిక మాయిక మాయేయ తిరోధానములు లేనిది) :-
[10.1-1472.1-తే.]

2706} నిత్యశోభనయుతుడు  - శాశ్వతమైన శుభములతో కూడి ఉండువాడు, విష్ణువు :-
[3-236-చ.]

2707} నిత్యసత్యమూర్తి  - నిత్య (శాశ్వతమైన) సత్య (సత్యమే) మూర్తి (తన స్వరూపైనవాడు), నిత్యమైన సత్యమైన స్వరూపుడు విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

2708} నిత్యస్వతంత్రుడు  - శాశ్వతమైన స్వతంత్రుడు, విష్ణువు :-
[4-963.1-తే.]

2709} నిత్యాత్మీయలోకము  - శాశ్వతమైనట్టి తనది (విష్ణునిది) అయినట్టి లోకము, వైకుంఠము :-
[10.1-962-మ.]

2710} నిత్యానందసంధాయి  - నిత్యమైన ఆనందమును కూర్చెడివాడు, విష్ణువు :-
[4-177-మ.]

2711} నిత్యానుకంపానిధి  - శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు. :-
[1-201-శా.]

2712} నిత్యుడు  - నిత్యప్రకాశమానుడు :-
[2-23-వ., 2-110-మ.]

2713} నిధులు  - ఇక్కడ ఎనిమిది చెప్పబడినవి (1మత్స్య 2కూర్మ3పద్మ 4మహాపద్మ 5శంఖము 6ముకుందము 7కచ్ఛపము 8నీలము) తొమ్మిదవది వరము తప్పించి, నవనిధులు పాఠ్యంతరము (1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము (మొసలి) 5కచ్ఛపము (తాబేలు) 6ముకుందము 7కుందము (పంది) 8నీలము 9వరము (ఖర్వము)), పాఠ్యంతరము (1. కాళము 2. మహాకాళము 3. పాండుకము 4. మాణవకము 5. నైసర్పము 6. సర్వరత్నము 7. శంఖము 8. పద్మము 9. పింగళము.) :-
[10.1-1613-వ.]

2714} నిన్ను – కలిదోష నివారక సమర్థుడైన నిన్ను - :-
[1-52-క.]

2715} నిబిడము - నిబిడతరము నిబిడతమము :-
[5.1-118-వ.]

2716} నిభృతాత్మ  - వృద్ధిక్షయములులేని స్థిరమైన ఆత్మ, విష్ణువు :-
[4-703.1-తే.]

2717} నిమేషము  - క్షణములో మూడోవంతు కాలము, ( 1.2 sec.) :-
[12-20-వ.]

2718} నియతేంద్రియుడు  - నియత (నియమింపబడిన) ఇంద్రియుడు (ఇంద్రియములుగల వాడు), ఏకాగ్రచిత్తుడు :-
[8-153-వ.]

2719} నియమము  - బహిరింద్రియ నిగ్రహము, అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము :-
[2-253.1-తే., 4-618-వ., 8-629.1-తే.]

2720} నిరంకుశము  - అంకుశములేని (ఏనుగు వలె), హద్దులులేనిది :-
[4-412-చ.]

2721} నిరంజనుడు  - మచ్చలేనివాడు, కంటికి పొరలులేనివాడు, పరిశుద్ధుడు :-
[2-279-మ., 4-179.1-తే., 10.1-567.1-ఆ.]

2722} నిరగ్నులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, మంటలేక నుండు అగ్నులు? అగ్నిహోత్రమునకు కాని అగ్నులు? :-
[4-34-వ.]

2723} నిరతిశయుడు  - మించినది లేనివాడు, విష్ణువు :-
[4-179.1-తే.]

2724} నిరపేక్షణ  - దేనియందును కుతూహలము లేకుండుట. :-
[1-386-వ.]

2725} నిరపేక్షుడు  - దేనిని కోరని వాడు :-
[2-279-మ.]

2726} నిరయము  - నరకము, దుర్గతి :-
[4-215-వ.]

2727} నిరర్గళము  - గళములు లేనిది, అడ్డులేనిది :-
[2-32-వ.]

2728} నిరవద్యుడు  - నిందలేని వాడు, వంకలు పెట్టుటకురానివాడు, విష్ణువు, భగవంతుడు :-
[2-279-మ., 4-179.1-తే.]

2729} నిరీహయోగిజనవర్గసుపూజితుడు  - నిర్ (లేని) ఈహ (కోరికలు కల) యోగి (యోగులైన) జన (వారి) వర్గ (సమూహము)చే పూజితుడు, విష్ణువు :-
[4-175-చ.]

2730} నిరుత్తరుడు  - జవాబు చెప్పనివాడు, మౌని :-
[1-381-వ.]

2731} నిరుపమ  - ఉపమానము లేనట్టి, సాటిలేని :-
[2-59-వ.]

2732} నిరుపమగుణహారుడు  - నిరుపమ (సాటిలేని) గుణ (సుగుణము లనెడి) హారుడు (దండను ధరించినవాడు), రాముడు :-
[4-976-మాలి.]

2733} నిరుపమఘనగాత్రుడు  - నిరుపమ (సాటిలేని) ఘన (గొప్ప, మేఘముల వంటి) గాత్రుడు (శరీరము కలవాడు), శ్రీకృష్ణుడు :-
[5.1-183-మాలి.]

2734} నిరుపమనయవంతుడు  - నిరుపమ (సాటిలేని) నయవంతుడు (నీతిగలవాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

2735} నిరుపమశుభమూర్తి  - సాటిలేని శుభమూర్తి, భగవంతుడు :-
[2-262-క., 10.1-1791-మాలి.]

2736} నిరృతి  - 1. అభాగ్యము, 2. ఋతము (సత్యమైనది) లేనివాడు, 3. అష్టదిక్పాలకులలో ఒకడు, నైరృతి మూల (దక్షిణపశ్చిమ)ను ఏలెడి దిక్పాలకుడు :-
[3-378.1-తే., 4-215-వ.]

2737} నిర్గుణత్వము  - శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు లేకపోవుట, మూటికి అతీతముగ వుండుట :-
[10.1-681-వ.]

2738} నిర్గుణము  - శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు లేకపోవుట, మూటికి అతీతముగ వుండుట :-
[10.1-553.1-ఆ.]

2739} నిర్గుణుడు  - త్రిగుణాతీతుడు, శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు మూటికి అతీతముగ వుండువాడు, శివుడు, విష్ణువు :-
[2-110-మ., 3-473-వ., 4-195-చ., 4-704-తే., 7-368-వ.]

2740} నిర్జరగంగ  - నిర్జర (ముసలితనములేనివారి, దేవతల) గంగానది, దేవగంగ :-
[10.1-951-మ.]

2741} నిర్జరధాని  - దేవతల రాజధాని, అమరావతి :-
[8-473-మ.]

2742} నిర్జరలోకము  - నిర్జరుల (దేవతల) లోకము, స్వర్గము :-
[12-18-వ.]

2743} నిర్జరారాతి  - నిర్జర (ముసలితనము లేనివారి, దేవతల) ఆరాతి (శత్రువు), రాక్షసుడు :-
[7-80-వ., 8-667.1-ఆ.]

2744} నిర్జరారాతిహంత  - నిర్జరారాతి (దేవతలశత్రువులగు రాక్షసులను) హంత(చంపినవాడు), రాముడు :-
[7-481-మాలి., 11-126-మాలి.]

2745} నిర్జరులు  - జర (ముసలితనము లేనివారు), దేవతలు :-
[2-151-చ., 7-302-క., 8-646.1-తే., 10.1-726-మ., 10.1-1398-చ., 10.2-1332-క.]

2746} నిర్జితశ్వాసేంద్రియాత్ముడు  - 1.నిర్జిత (జయింపబడిన) శ్వాసేంద్రియ(శ్వాస వాయువులు) (ప్రాణాయామము అందు నేర్పు) ఆత్ముడు (కలవాడు), 2.ప్రాణాయామ నిష్ణాతుడు :-
[3-501-వ.]

2747} నిర్దయాపరిపాల్యవధూరక్షకుడు  - నిర్దయ (దయలేని) పరిపాల్య ( పరిపాలింపబడు) వధువులకు రక్షకుడు (రక్షించువాడు), శంకరుడు :-
[3-473-వ.]

2748} నిర్దళితాసమబాణుడు  - నిర్దళిత (చంపబడిన) అసమబాణుడు (మన్మథుడు) కలవాడు, శివుడు :-
[10.2-312-క.]

2749} నిర్ద్వంద్వండు  - సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను అధిగమించినవాడు :-
[4-11.1-తే.]

2750} నిర్భేదనుండు  - ముక్కలుచేయుటకు వీలకానివాడు, విష్ణువు :-
[3-874-వ.]

2751} నిర్మంథరము  - మంథరము (మెల్లగా సాగుట) లేకుండునది :-
[10.1-1722-ఉ.]

2752} నిర్మలజ్ఞానపాత్రుడు  - నిర్మల (స్వచ్ఛమైన) జ్ఞానముచే పాత్రుడు (తగినవాడు), శ్రీకృష్ణుడు :-
[5.1-183-మాలి.]

2753} నిర్మలనవరత్ననూపురవిరాజితుడు  - నిర్మల (స్వచ్ఛమైన) నవరత్నములు పొదిగిన నూపుర (అందెలు)తో విరాజిల్లువాడు, కృష్ణుడు :-
[5.2-165-చ.]

2754} నిర్మలాత్ముడు  - నిర్మల (స్వచ్ఛమైన) ఆత్ముడు (స్వరూపుడు), పంచమలములు లేని పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు. :-
[4-179.1-తే., 7-354.1-తే., 10.1-682.1-తే.]

2755} నిర్మలానందకారుడు  - నిర్మల (స్వచ్ఛమైన) ఆనంద (ఆనందమును) కారుడు (కలిగించెడివాడు), రాముడు :-
[4-976-మాలి.]

2756} నిర్మలారూఢకీర్తి  - నిర్మల (పరిశుద్ధమైన) ఆరూఢ (నిలకడైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]