పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : జడభరతుని కథ

జడ భరతుని కథ.
Suguna Rupanagudi
ముఖపుస్తకం 25-10-2016


“అగ్నీధ్రుడు” జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు. “పూర్వాచిత్తి” అనే అప్సరస వలన అతనికి తొమ్మండుగురు పుత్రులు కలిగారు. వారు “నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రంయకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు” అనువారు. జంబూ ద్వీప వర్షాలను (దేశాలను)ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు. తండ్రి అగ్నీధ్రుడు. తమ తమ పేర్లతో వున్న వర్షాలను పరిపాలిస్తూ వచ్చారు.
పెద్దవాడయిన “నాభి” భార్య “మేరుదేవి”. వారిరువరికీ విష్ణువు కుమారుడుగా జన్మించాడు. అతని పేరు “ఋషభుడు”. అతను తన అద్భుత శక్తి చేత ఇంద్రుడిని అణచి వేశాడు. తన రాజ్యానికి “అజనాభం” అని పేరు పెట్టాడు. అతని భార్య “జయంతి”. వారికి నూర్గురు పుత్రులు కలిగారు. వారందరూ గుణగణాలలో తండ్రికి సాటి అయినవారు. వారిలో పెద్దవాడు “భరతుడు”. అతను ప్రసిద్ధుడై గొప్ప కీర్తి గడించాడు.
భరతుడు పరమ భాగవతోత్తముడు. విశ్వరూపుని కుమార్తె అయిన “పంచజని”ని పెళ్ళాడాడు. అన్ని విధాల తనతో సమానులైన 5 గురు పుత్రులను కన్నాడు. భరతుడు తన తండ్రి తాతల వలెనె ప్రజానురంజంకంగా పదివేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. ఎన్నో యజ్ఞాలూ, యాగాలూ, సత్కర్మలూ చేసి పరమ పురుషుడిని ఆరాధించాడు. శ్రీమన్నారాయణుని తన మనసులో ప్రతిష్టించుకొని పూజిస్తూ వచ్చాడు. తుదకు కుమారులకు రాజ్యాన్ని అప్పగించి విరక్తుడై సర్వం త్యజించి “పులహ మహర్షి” ఆశ్రమ మైన “సాలగ్రామ క్షేత్రానికి” వెళ్లి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని ప్రశాంత వాతావరణంలో భగవంతుడిని ఆరాధిస్తూ గడపసాగాడు. లేడి చర్మం వస్త్రం గా ధరించి వివిధ పుష్పాలతో, తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తూ భగవచ్చింతన తప్ప వేరొకొ విషయం పట్టకుండా గొప్ప భక్తుడై బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అన్నిటికీ అతీతుడై జడత్వముతో వుండడము వల్ల అతనికి “జడభరతుడు” అని పేరు వచ్చింది.
ఒకనాడు అతడు పరమ పవిత్ర మైన “చక్రనది”కి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించి ప్రణవమును జపిస్తూ కాసేపు ఆ నది ఒడ్డుననే కూర్చున్నాడు. అప్పుడొక లేడి అక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చింది అది నిండు గర్భవతి. నీళ్ళు తాగుతుండగా సమీపంలో నుండి సింహ గర్జన వినిపించింది. అసలే పిరికి దయిన ఆ లేడి బెదిరిపోయి నదికి అడ్డంపడి నదిని దాటడానికి ప్రయత్నిస్తూ వుంటే, అప్పుడు దానికీ గర్భస్రావమై దాని బిడ్డ నదిలో పడిపోయింది. అదికూడా చూసుకోకుండా ప్రాణభయంతో నది దాటి ఒడ్డుకు వెళ్లి ఆయాసంతో అక్కడే మరణించింది. జడభరతుడు నదిలోకి దిగి ఆ చిన్న లేడికూనను చేతిలోకి తీసుకొని, దాన్ని శుబ్రంగా కడిగి తుడిచి తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. తల్లి లేని దాన్ని చూసి అతనికి దయ, జాలి కలిగాయి. అప్పటినుండీ దానిని యెంతో అభిమానంగా చూసుకునే వాడు. దానికీ గడ్డి ఆకులు తినిపించడం దాన్ని మృగాల బారిన పడకుండా కాపాడడం అలా కన్నబిడ్డ వలె చూసుకోసాగాడు. అది కూడా ఒక క్షణం కూడా అతన్ని విడిచి పెట్టకుండా అతని వెనక వెనకే తిరుగుతూండేది.
స్నానానికి వెళ్ళినా ధ్యానం చేసుకుంటున్నా ఎప్పుడూ అతని వెంటే వుండేది. అన్ని బంధాలూ విడిచి భగవంతుని ఆరాధనలో కాలం గడుపుతున్న భరతుడికి ఈ లేడి మూలంగా ఒక ఎడతెగని బంధం ఏర్పడిది. దిన దినానికీ ఎక్కువైపోయి ఆ లేడి పిల్లే అతని లోకం అయిపోయింది. క్రమంగా అతని పూజలూ, జపతపాలూ, దేవతార్చనలు, అనుష్టాన క్రియలూ గంగలో కలిశాయి. తన భాగవత్పూజ వెనక పడినందుకు జడభరతుడు విచారించ లేదు. పైగా పరోపకారం, శరణాగత రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు. ఆ లేడి క్షణం కనిపించక పొతే విలవిలలాడి పోయేవాడు. ఈ స్థితిలో కొన్ని సంవత్సరాలు గడిచాయి. అతనికి అవసాన దశ వచ్చేసింది.
అయితే మరణ సమయంలో కూడా తను భగవన్నామ స్మరణ చేయక ఆ లేడినే తలుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆకారాణం వల్ల అతను మరుజన్మలో ఒక లేడిగా పుట్టాడు. అయితే అతను పూర్వజన్మలో చేసిన పుణ్యం, తపోబలం వల్ల అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తన పూర్వజన్మ తలుచుకొని యెంతో దుఃఖపడ్డాడు.
“భగవదారాధన చేస్తూ యోగిగా తను మోక్ష పదం పొందడానికి బదులు అవివేకియై ఒక లేడి పిల్లను చేరదీసి తుదకిట్లా భ్రష్టుడనయ్యానే” అని వాపోయాడు. ఆ విధంగా జడభరతుడు విరక్తి పొంది తాను వుండే “కాలాంజనం” అనే పర్వతం నుండి సాలగ్రామ క్షేత్రమైన పులహ ఆశ్రమానికి వెళ్లి పోయాడు. ఈ మృగ జన్మ ఎప్పుడు అయిపోతుందా? అని ఆరాట పడుతూ తుదకు ఆహారాదులు వర్జించి నదీజలాలలో ప్రవేశించి ఆ మృగ దేహాన్ని విడిచి పెట్టాడు.
దేనిమీదా అతిగా వ్యామోహం పెంచుకోకూడదు. తమ పిల్లల మీద గానీ, మనవలూ, మనవరాళ్ళూ అని అతి ప్రేమ పెంచుకొని దైవారాధన మరిచి, వాళ్ళే సర్వస్వమని ఎక్కువ మమకారాన్ని పెంచుకో కూడదు. తామరాకు మీది నీటి బొట్టు వలె వుండాలి. ఎకువ మమకారం చూపించే వాళ్ళను మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు “వీడేమిరా జడభరతుడి లాగ అయిపోయాడు.” అనే వాళ్ళు. యిప్పటి వాళ్లకు తెలీదు ఆ సంగతి. ధనం మీదా, పిల్లల మీదా, వేరే దేని మీద ఐనాసరే విపరీత వ్యామోహం (ఇష్టం, ప్రేమ వేరు, వ్యామోహం వేరు) వుండకూడదు. అని ఈ కథ సారాంశం.