పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : మధు కైటభుల కథ

    ఒకానొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది. అంటే మనం ఉండే యీ భూలోకం, తక్కిన లోకాలూ ఒక్క మాటుగా ఉన్నట్టుండి, భగ్గుమని మండిపోయి, నుసైపోయాయి అన్నమాట. అలా ఒక్కమాటు అన్నిలోకాలూ నాశనమై పోతాయా యెప్పుడైనా? కాని, ఐపోయాయి. ఎలా అంటారేమో, మొదట ఒక్కమాటు పెద్ద సుడిగాలి రంయ్ మని వచ్చేసి, లోకాలన్నీ ఒకదాన్నొకటి డీడిక్కి కొట్టేసుకుని ముక్క ముక్కలయి పోయాయి. ఆ తర్వాత పన్నెండుగురు సూర్యు లొక్కమాటుగా పొడిచి భగభగ మండటం మొదలెట్టారు. ఆ సూర్యగోళాలలోనించే బయలుదేరిందో ఎక్కడనుండి బయలుదేరిందో గాని బయలుదేరి సుడిగాలికి ముక్కలై పోయి ఉన్న లోకాలన్నీ అంటుకుని, పెద్ద భోగి మంట తయారైంది. ఆ మంటకు గాలి తోడై మరి కాసేపటికి నుసి తప్ప మరేమి మిగలలేదు. తర్వాత వర్షం ప్రారంభమైంది.ఆ వర్షం కూడా ఎన్నడూ కనివిని ఎరుగని వర్షం! కడవలు దిమ్మరించినట్లు కురిసింది.ఏనుగు తొండా లంత లావున ధారకట్టి కురిసింది. దానితో ఎక్కడ చూచినా జలమయమే. కాని ఆ నీరు చూడడానికి ఎవరైనా మిగుల్తేగా? దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు వారేమిటి, వీరేమిటి అందరూ నుసి ఐపోయి, ఆనీటిలో కరిగిపోయారు. దేవు డైనటువంటి ఒక్క విష్ణుమూర్తి మిగిలేడు. లోకాలన్నీ నాశనమై పోయినా దేముడికి నాశనం ఉండదు. ఆ మహా సముద్రం లో, అతనొక్కడే ఓ మఱ్ఱి ఆకుమీద పడుకుని గుఱ్ఱుపెట్టి నిద్ర పోతున్నాడు. ఇంతకాలం లోకా లన్నింటినీ కనిపెట్టుకుని ఉండడంలో ఒక్క కునుకు కూడా తీయలేదాయన. ఇప్పుడే కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాడు.

    నడుం వాల్చాడేగాని అలా ఆయన ఎంతసేపో పడుకోలేదు. ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి, ఎందుకూ పనికి రాకపోవటం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేసాడు. మెలుకువ రావటంతోనే లోకాలన్నీ మళ్ళీ ఎలాగ సృష్టించాలి, లేకపోతే ఆయన కొక్కడికీ ఆమహాసముద్రం లో ఏంతోస్తుంది? కాసేపయాక లేచి, బ్రహ్మచేత మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేయిద్దామని అనుకుని ఆయన కన్ను మూసాడు. కాని మీకో సందేహం వస్తుందిప్పుడు. మళ్ళీ లోకాలన్నీ సృష్టి చెయ్యటానికి బ్రహ్మ ఏడి? అతడు మాత్రం ఈ ప్రళయంలో నుసి ఐపోలేదా? అని. ఐపోయాడు. పోతేనేం మళ్ళీ పుట్టాడు. ఆ మఱ్ఱిఆకుమీద నిద్రిస్తోన్న మహావిష్ణువు బొడ్డు లోనుంచి ఓ తామరతూడూ, పద్మం పుట్టేయి. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టెలో పిల్లవాడికి మల్లే ఆడుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడ నుంచి వచ్చారో గాని ఇద్దరు రాక్షసు లొచ్చారు. వారిలో మొదటివాడి పేరు మధువు. రెండో వాడిపేరు కైటభుడు. కమలంలో ఆడుకుంటున్న పసిబ్రహ్మను చూసేటప్పటికీ, వాళ్ళకి అతణ్ణి ఏడిపించాలని బుద్దిపుట్టింది. మధువేమో పిల్లవాని బుగ్గ గిల్లేడు. కైటభుడు తొడపాయశం పెట్టాడు. వాటితో బ్రహ్మ ‘’కేరు’ మన్నాడు.

    విష్ణుమూర్తికి మెలుకువ వచ్చి, కళ్ళు తెరిచేటప్పటికి, ఆభయంకరాకారులు ఇద్దరు కనపడ్డారు. విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది. “ఈ ప్రళయం లో అందరూ నాశనమైపోయారనుకుంటే వీళ్ళెలా మిగిలారు?” అనిపించింది ఆయనకి.ఆయనకే కాదు మీకూ అనిపిస్తుంది. దేవతలు, రాక్షసులు, మనుషులు, అందరూ నశించి పోయా రనుకున్నాంగా మరి? అందరూ నశించి, వీళ్ళిద్దరూ మాత్రమే మిగిలారూ అంటే, వీళ్ళు ఎవరో ఉపద్రులన్నమాట. “ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేక పోయింది గనక, మీ సామర్థ్యానికి, ప్రజ్ఞకి, మెచ్చుకున్నాను. అందుచేత ఏదైనా వరం కోరుకోండి” అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలు వినేటప్పటికి వాళ్ళిద్దరూ పకపకా నవ్వుతూ “ ఏమిటి? నువ్వా మాకు వరాలివ్వటం?” అన్నారు. ఏం అలా అంటున్నారు? అని అడిగాడు విష్ణుమూర్తి. “అలా అంటావేమిటి? ప్రళయానికి ప్రళయాల మైన మాకా ఒకడా వరాలివ్వటం? ఇంకా నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నావు గనక, అది ప్రథమ తప్పిదం కింద భావించి నిన్ను వదిలేశాం” అన్నారు వాళ్ళు.

    ఆ మాటలు వినేటప్పటికి విష్ణుమూర్తే తెల్లబోయాడు. ఏమనాలో తోచక ఆలోచిస్తూ ఉంటే, మధువు “కైటభా! ఇతగాడికి మనసంగతి తెలియదు గనుక ఇలా మాట్లాడేడు. మనగొప్పతనం కాస్తంత మచ్చు చూపించాలి” అన్నాడు. కైటభుడు “మనకి వరాలిస్తానని వాగేడు గనుక మనం ఒకళ్ళకి వరాలిచ్చే బాపతే గాని ఒకళ్ళ వద్దనించి పుచ్చుకొనే బాపతు కాదని వీడికి తెలియజేస్తే సరి” అన్నాడు. “శభాష్” అన్నాడు మధువు. ‘మహాప్రజ్ఞావంతులం' అనే గర్వం చేత కళ్ళుమూసుకుపోయి, బుద్ది మందగించి, తామేం చేస్తున్నదీ కూడా తెలుసుకోకుండా ఆ మధుకైటభు లిద్దరూ గర్వంగా విష్ణుమూర్తి కేసి తిరిగి “ కోరుకో నీకేం కావాలో కోరుకో? మేమే ఇస్తాం“ అన్నాడు. విష్ణుమూర్తి ఆలోచించి “వీళ్ళని ఉపేక్షిస్తే కొంప మునుగుతుంది. వీళ్ళపని పడదాం” అని నిశ్చయించుకొని వినయం కనపరుస్తూ “మహాత్ములారా! మీరు చాలా ఉదారపురుషులు, మీ దర్శనంవలన నాజన్మ పావనమైనది. ధన్యుణ్ణి. మీలాంటి వాళ్ళు వచ్చి ,”వరం కోరుకో” అంటే “వద్దు” అంటానా? అనుగ్రహించండి.” అన్నాడు. “ఊ! సందేహిస్తావేమిటి?” అన్నారు వాళ్ళు. “అబ్బే. సందేహంమెందుకు? మీలాంటి వాళ్ళు ఆడితప్పుతారు గనుకనా? కోరుకుంటున్నా వినండి. మీరిద్దరూ కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి” అన్నాడు విష్ణుమూర్తి. ఆమాట వినేటప్పటికి మధుకైటభులకి తెలిసొచ్చింది. నవ్వులన్నీపోయి ఒకళ్ళ మోహం ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఐతయేం? ఒక క్షణమే అలా ఉన్నారు. ’ఏవరమైనా ఇస్తాం,' అన్నారుగా? ఆడితప్పరు. వాళ్ళు దుర్మార్గు లైన రాక్షసులు ఐనా వాళ్ళలో ఆ నిజాయితీ ఉంది. “విష్ణుమూర్తి! నీతెలివితేటలకి మెచ్చుకున్నాం. పుచ్చేసుకో మాప్రాణాలు!” అని సిద్ధపడ్డారు. సిద్ధపడటమే కాదు, వాళ్ళు మరోమాట కూడా చెప్పారు. ”మాకు నీరు ఉన్నచోట చావులేదు. ఇప్పు డెక్కడ చూసినా నీటిమయం. మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో” అన్నారు. విష్ణుమూర్తికి, వాళ్ళని చంపే ఉపాయం ఆలోచించటం ఓ లెక్కా? ”ఎంతసేపు” అంటూ ఆయన తన రెండు తొడలూ పెంచేసి తొడలమీద చెరొకరాక్షసుడినీ పడుకోబెట్టి , తన సుదర్శన చక్రంతో వాళ్ళ కంఠాలు తరిగేసాడు.ల

~ సౌజన్యం: చందమామ వారు