పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : పీఠిక

ద్విపద బాల భాగవతము
దోనేరి కోనేరునాథ కవి విరచితము

భాగవత గణనాధ్యాయి
2021


పూర్వ పీఠిక

కోనేరునాథ కవి ద్విపద బాల భాగవతము

ఆంధ్రసాహిత్యం

దక్షిణభారతదేశంలో గోదావరి నుండి కావేరి వరకూ గల నదీ పరివాహక ప్రాంతలలో పురాతన కాలంలో అనేకమైన భాషలు, యాసలు, లిపికలవి లిపిలేనివి ఉండేవి. జీవనశైలులు మెరుగు పడుతుండగా ప్రాంతాల మధ్య రాకపోకలు సంబంధ బాంధవ్యాలు పెరుగుతుండగా, కాలక్రమంలో భాషల ఏకీకరణలు జరుగసాగాయి. అది రెండు సమాంతర విభాగాలుగా కొనసాగి కర్ణాటక, తెలుగు సమూహాలుగా ఏకీకరణలు సాగుతూ స్థిరపడసాగాయి. వానిలో . .

ఆంధ్రమని, తెనుగు అని తెలుగు అని అచ్చతెలుగు మున్నగు పేర్లతో పిలువబడే మనభాష వెయ్యేళ పైబడిన చరిత్రతో ప్రకాశిస్తున్నది. ఎంతో విలువైన సాహిత్యకృషి జరిగింది, జరుగుతోంది, జరుగుతుంది. పూర్వరచనలు ప్రధానంగా పద్యరూపంలో, వచనరూపంలో, రెండూ కలిసుండే చంపూశైలిలో, ద్విపదరూపంలోనూ వ్రాయబడ్డాయి. సంగీతాది సకల కళారూపా లలో కూడా వికసించింది.

పురాతన ప్రామాణిక సాహిత్యం విషయంలో సంస్కృత మూల రామాయణ, భారత, భాగవతాలు నుండి గ్రహించినవి అత్యధికంగా ఈనాటికీ ప్రజాదరణతో వెలుగొందుతున్నాయి. ఈ గ్రంథాలు ఎందరో తెలుగులోకి విరచించారు. అందులో భాగవతము ప్రజలలోనికి బాగా చొచ్చుకు పోయినది.

భాగవతం

శ్రీమద్భాగవతం మోక్షశాస్త్రం, ఇది శ్రవణమాత్రంచేతనే ముక్తిని ప్రసాదిస్తుంది. చతుర్విధ పురుషార్థాలలో శ్రీమద్రామాయణం ధర్మాన్ని, శ్రీమద్భారతం అర్థాన్ని, శ్రీమద్భాగవతం మోక్షాన్ని అందిస్తాయి అని పెద్దలు చెప్తారు. ఈ ముక్తిమార్గం చూపినవారు శుకబ్రహ్మ, మరణభయం వడిచి మోక్షంపొందిన వారు పరీక్షిన్మహారాజు. “భగవతః ఇదమ్ భాగవతమ్.” భగవంతుని గూర్చి, భగవత్స్వరూపులైన భాగవతుల గురించి చెప్పేది భాగవతం. భాగవతం నా స్వరూప మని భగవంతుడే చెప్పాడు. పెద్దలు “భాగవతస్వరూప పరబ్రహ్మ” మని పూజిస్తారు.

పండితభాష సంస్కృతం లోనున్న శ్రీమద్భాగవత అమృతాన్ని ప్రాంతీయ భాషలలోనికి తెచ్చి ప్రాంతీయ పండిత పామరులకు పంచాలనే బృహత్కార్యంలో పాలుపంచుకుని ఎందరో మహానుభావులు తమ పాండిత్య ప్రకర్షకు పదునుపెట్టి సమస్త జనములను అనుగ్రహించారు.

తెలుగులో వెలసిన “భాగవతాలసంగ్రహం” తెలుగుభాగవతం.ఆర్గ్ నందు (వివరణలు అను విభాగంలో, వ్యాసములు అను శీర్షికలో) భాగవతము- ప్రాంతీకరణ అను పుటలో సంకలనం చేయడం జరిగింది. చంపూ విధానంలో జాతీయ మహాకవి బమ్మెఱ పోతనామాత్యుల ప్రణీతమైన సా.శ. 15వ శతాబ్దపు భాగవతం మొట్టమొదటి సర్వసమగ్ర ప్రాంతీకరణ. పోతనులవారు తన స్వతంత్ర అనుసృజనతో సంస్కృత మూలం అనే విషయాన్ని కూడ పాఠకులు మరచిపోయేలా చేసారు. లభ్యమౌతున్న ఈ మహాపుణ్యాత్ముని భాగవతంలో గంగన్న, సింగన్న, నారయ పుణ్యకవులు కూడ పూరణలతో పాలుపంచుకున్నారు, తెలుగులకు అద్భుతమైన మహాప్రసాదం అందింది. వీరికి ముందు చెప్పుకోదగ్గ భాగవతం ద్విపద శైలిలో మడికి సింగన కవీశ్వరుడు చేసారు కాని, అది దశమ స్కంధానికి మాత్రమే పరిమితమైనది. ఇది తెలుగు జాలజనులకు మన తెలుగుభాగవంత.ఆర్గ్ నందు లభించును. వీరి తరువాత కీ.శ. 16వ శతాబ్దపు కవిసార్వభౌమ బిరుదాంకిత, ప్రౌఢకవి దోనూరి కోనేరునాథ కవి సంక్షిప్తంగానే కావచ్చు సంపూర్ణంగా వ్యాస భాగవతాన్ని ద్విపద శైలిలో ఆంధ్రీకరించారు.

ద్విపద వాఙ్మయం

భాగవతాన్ని తెనిగించడంలో పూర్వం నుండి కవులు పద్య, చంపూ, వచన, ద్విపద మున్నగు ప్రక్రియలు వాడారు. పద్య కావ్యం అంటే వృత్తాలు, జాతులు మున్నగు ఛందస్సుతో వ్రాసినవి సాధారణంగా నాలుగు పాదాలు ఆ పైన ఉండేవి, వచనం లేదా గద్యం వాడరు. చంపూ అంటే వచనం, గద్యం కూడా వాడతారు. వచన కావ్యం అంటే ఛందోరహితమైన గద్య, వచనాది రూపాలను వాడతారు. ద్విపద అంటే రెండు పాదాలు ఉండే ఛందో రూపాలను వాడతారు. ఉత్తర భారతంలో సమాంతర దోహాలు అని వాడుక కలదు. తెలుగు సాహిత్యంలో వీరశైవులు సా.శ. (12వ శతాబ్దంలో) ద్విపద వాఙ్మయానికి శ్రీకారం చుట్టారు. ద్విపద, ద్విపద మాలిక, మంజరీ ద్విపద అని స్వల్ప ఛందో బేధాలతో వాడుక కలదు. ద్విపదకు 2 పాదాలు, ప్రతి పాదంలో మూడు ఇంద్ర, ఒక సూర్య గణాలు, ప్రాస నియమం ఉంది (తెలుగు సంప్రదాయం), ప్రతి పాదంలో 3 వ గణం మొదటి అక్షరం యతి స్థానం. ద్విపదమాలిక అంటే ద్విపద ఛందస్సుతో రెండు ద్విపదలు పై నియమాలతో కలిసి (4 పాదాలు) ఉండాలి. మంజరీ ద్విపద అంటే పైనియమాలతో (ద్విపద మాలికలా 4 పాదాలు? ఉండాలి.) ప్రాసనియమం లేదు. 16వ శతాబ్దపు మన కోనేరునాథుల వారు ద్విపద బాల భాగవతంలో మంజరీ ద్విపద వాడలేదు. వీరికి ముందు పొతనగారికన్నా ముందు 14వ శతాబ్దపు ప్రౌఢకవి మడికి సింగన భాగవత దశమ స్కంధాన్ని ద్విపదలో రచించారు. ద్విపదలో వ్రాసిన కవులలో శ్రీనాథుడు, పాల్కుర్కి సోమనాథుడు, తాళ్ళపాక కవులు మున్నగు మహాకవులు ఉన్నారు. తాళ్ళపాక కవులలో అన్నమయ్య అహోబిలంలో శ్రీనృసింహ మంత్రాన్ని ఉపదేశం పొందారు. దోనూరి కోనూరినాథుల వారు కూడ ఈ ఉపదేశం పొందారు.

దోనూరి కోనేరునాథ కవి

దోనూరి కోనేరునాథ కవి భాగవతాన్ని రెండుమార్లు వ్రాసిన పరమ భాగవతుడు. ఇది అపూర్వం తెలుగులోనే కాదు సకల భారతీయ భాషలలోనూ అపూర్వమే కావచ్చు. అంతేకాదు సమాకాలీన చరిత్రకు తనదైన అద్దంపట్టిన మహానుభావుడు. ఈ కవి శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలకు కొద్దిగా తరువాత కాలంవాడు. తాళ్ళపాకవారి యుగానికి అనగా సా.శ. 16వ శతాబ్దానికి చెందిన వారు, కడపజిల్లా కమలాపురం తాలూకా, కోడూరు దగ్గరి ఎఱ్ఱగుంట్ల అగ్రహారీకుడు, ఇతడు నియోగి బ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; ఆశ్వలాయన సూత్రుడు; దోనూరి నాగయ్యమంత్రి పుత్రుడు. ఈ అగ్రహారం కోనేరుకవికి నంద్యాల నారసింహరాజుగారు, ఆరవేటి వంశస్తుల బంధువు, దానం చేసారు. కోనేరునాథుడు ఆరవీటి తిరుమలరాజు ఆస్థాన కవి. శ్రీనృసింహోపాసకుడు, వారి కాలం 1500-1580 అని అంటారు. 16వ శతాబ్దంలో ప్రసిద్ధమైన ప్రబంధ శైలిని అనుసరించి రెండు బాల భాగవతాలు రచించారు. తాళ్ళపాక చిన్నన్న సమకాలకుడు. చిన్నన్న నిర్వచించిన ద్విపద ఛందస్సు ఈ గ్రంథంలో వాడాడు. తన పద్య, ద్విపద బాల భాగవతాలు రెంటిలోనూ విశిష్టాధ్వైతం అనుసరించాడు. వారి రచనలపై తాళ్ళపాక కవులే కాదు, నాచన సోమనాథుడు, బమ్మెఱ పోతన రచనల ప్రభావం కనబడుతుంది. వీరు అగ్రహారాలు, బిరుదులు మున్నగు సత్కారాలు అందుకున్న కవి పుంగవుడు.

ఆర్వేటి నల తిరుమల రాజు మొదట చంపూ శైలిలో పద్య బాల భాగవతం కోనేరునాథునిచే సా.శ. 1542 ప్రాంతంలో వ్రాయించి, పిమ్మట ద్విపద శైలిలో కూడ సా.శ. 1547లో వ్రాయించాడు.

వచియించి తౌనన పద్య కావ్యముగఁ
బ్రచురంబుగా బాలభాగవతంబు
వాసికి నెక్కి యివ్వసుధా తలమున
భాసిల్లు నా బాలభాగవతంబె
అరుదుగా నడచిన యన్ని మార్గములఁ
దిరముగా మా చినతిమ్మయ్య పేర
ద్విపద కావ్యంబుగా వెలయంగఁ జేయు
మిపుడు మాకెంతయు హితమిది” యనుచు

కృతిభర్త ఆర్వేటి రాజుల వంశం గురించి, రాజుల గురించి, ఆ కాలపు పరిస్థితులు గురించి ప్రామాణీకమైన, చారిత్రక విషయాలు వీటిలో ఉల్లేఖించాడు. పద్య గ్రంథం నల తిరుమల రాజు ప్రేరణతో వారి తండ్రి రామరాజ తిమ్మరాజుకు అంకితమిచ్చేరు. ద్విపదను తమ్ముడు చినతిమ్మరాజు నకు అంకితమిచ్చేరు.

కోనేరునాథుడు వివిధాష్టభాషా కవిత్వ ధుర్యుడు, సంస్కృత, తెనుగు భాషలలో చక్కని చవులూరు కవిత లల్లుటలో మిక్కిలి సమర్థుడు. వీరు సంస్కృత ప్రాకత మున్నగు భాషలలో కావ్యాలు వ్రాసారు. శబ్ద తర్క అలంకార శాస్త్రజ్ఞులు లోకంలోని సమకాలీన కవులు అందరి మెప్పు పొందారు. వీరి శైలి స్వతంత్రత గల విజ్ఞాన పూర్వకము. వీరి కవిత్యం మధురము, ప్రౌఢము. నన్నయ శైలి ఎక్కువ. అచ్చ తెలుగు కవిత్వం చక్కగా చెప్పగలడు. గొప్ప పాండిత్యం కలవాడు.

బాల భాగవతం

వీరి పద్య ద్విపద భాగవతాలు సంక్షిప్త రూపంలో ఉండుటచేత బాలభాగవతము అను పేరు సార్థకమై యున్నది. గ్రంథానికి నామకరణ చేయుటలో కూడ కోనేరునాథుని ప్రతిభ కనబడుచున్నది. ఇవి ఆఱు ఆశ్వాసాలుగా విభాగించి పన్నెండు స్కంధాలుతో సమగ్రంగా వ్రాసారు.

వీరు తమ ద్విపదలో-

వ్యాస, వాల్మీకి సంయముల నపార
భాసుర కవితా ప్రభావుల గొలుతు
నాళీకభవ సమానత బెంపుఁగన్న
కాళిదాసాదిక కవులఁ గీర్తింతు
నన్నపార్యుఁడు, భీమనయుఁ, దిక్క శౌరి,
సన్నుతక్రముఁడై,న శంభు దాసుండు
మొదలైన వారల మున్నాంధ్ర కవిత
యొదవించినది యార్యులఁ బ్రస్తుతింతు

అని వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, అన్నపార్యుడు, భీమన, తిక్కన, శంభుదాసుడు లను ప్రస్తావించాడు. ప్రబంధంలో కవిత్రయాన్ని శ్రీనాథుని ప్రస్తావించారు. వీరి ప్రబంధ ద్వయంలో పోతన పోకడలు అక్కడక్కడ ద్యోతక మగుచున్నవి.

పద్య భాగవతంలో పోతన భాగవతం తల్లి వంటిది. ప్రౌఢ సౌందర్యం. బాలభాగవతం పిల్ల వంటిది. తల్లిని పోలిన బిడ్డ కనుక ఈ పిల్ల భాగవతాన్ని లోకంలో అందరూ ఆదరిస్తారు అని వీరు పద్య ప్రబంధంలో సూచించారు. సా.శ. 1540 ప్రాంతాల బాల భాగవతములను రచించిన దోనూరి కోనేరునాథ మహాకవి ఈ అన్నింటినీ అధ్యయనం చేసి, తన పద్య భాగవతం తృతీయాశ్వాసంలో షష్ఠ స్కంధం కథ వచ్చినప్పుడు ప్రధానంగా ఏర్చూరి సింగనామాత్యుని షష్ఠ స్కంధ భాగాన్ని అనుసరించినట్లు కనబడుతుంది. అని “ఆచార్య ఏల్చూరి మురళీధరరావు” గారు తమ “మహాకవి సింగనామాత్యుడు వ్యాసం” లో ఉటంకించారు.

ద్విపద బాల భాగవతం చివర ప్రయోగించిన చంపకమాల-

అరుదుగ శాలివాహన శతాబ్దములెన్న నిధాన, తర్క, సా
గర, శశి సంఖ్యచే వెలయఁ గల్గు ప్లవంగ మనంగ మించు వ
త్సరమునఁ బల్కెఁ దిమ్మవసుధాపతికిన్ గవిసార్వభౌముఁ డీ

హరిహిత బాలభాగవతహారి పదద్విపదప్రబంధమున్.

పద్యాన్ని బట్టి ఆ శాలివాహనశకాబ్దములకు సమానమైన సా.శ. 1547 నాటి ప్లవ నామ సంవత్సరం నందు ద్విపద ప్రబంధం రచించినట్లు తెలియుచున్నది. దీనికి ముందు సుమారు నాలుగైదేళ్ళ ముందు పద్య ప్రబంధం రచనా కాలం కావచ్చును.

ఆర్వేటి రాజుల వంశం

ఆరెవీటి సోమదేవరాజు, “మహమ్మద్” అనే మహమ్మదీయ రాజుపై యుద్ధంచేసి ఒకేరోజున ఏడు (7) కోటలను జయించి, అతడిని ఓడించాడు. తనకు పుట్టబోయే కొడుకుకు సోమదేవరాజు పెరు పెట్టుకుంటానని ఆ మహమ్మదీయరాజు శరణు వేడుకోవడంతో, శిక్షించకుండా విడిచి పెట్టాడు. ఇలా అని ఆరవీటి వారి దానశాసనాలలోను, ప్రశస్థిలోను, వంశచరిత్రలలోను, కైఫీయత్తులలోను కనిపిస్తుంది. శ్రీవిరూపాక్ష- శ్రీరామ శాసనంలో ఇదే విషయం ఇలా రాసి ఉంది..

“తతో జనిహరం దుర్గాణి సప్తాహితాత్
అహ్నైకేన స సోమిదేవ నృపతిః”
కోనేరునాథ కవి ద్విపద బాల భాగవతంలో ఇలా చెప్పారు
“నరుల కసాధ్యమైన మొసలిమడుగు
ధరనెన్నదగిన సాతానికోటయును
కడునుతింపగజాలుఁ కందనవోలు
కడిమి విశేషంబుల కల్వకొలను
అరుదైన రాచూరు నలయార గిరియు
నిరుపమంబగు గంగినేని కొండయును
ననఁగ నొప్పారు నేడైన దుర్గముల
వినుత ధాటి మహా వేగంబు నెఱపి
సురపతియోగి యాబ్రాంశువంశ
కరుడొక్క నాడు లగ్గలుగొన్న వాఁడు.”

(తాత) పెన్నమరాజు- కొడుకు సోమదేవ- ఇతని కొడుకు రాఘవదేవ- వీరి కొడుకు పెన్నమరాజు- ఆయన పుత్రుడు ఆరెవీటి బుక్కరాజు-భార్య భల్లాదేవి- వారి కుమారుడు రామరాజు-భార్య లక్కమదేవి. ఈ రామరాజుకు ముగ్గురు (3) పుత్రులు 1. తిమ్మరాజు-భార్య గోపమ్మ, 2. కొండ, 3. శ్రీరంగ-భార్య తిర్మలాంబ. ఈ శ్రీరంగని కొడుకు ఆళియ రామరాజు. పెద్ద కొడుకు తిమ్మరాజు పేరనే పద్య బాల భాగవత ప్రబంధం అంకితమివ్వబడింది. ఈ తిమ్మరాజు గారికి నలుగురు (4) కొడుకులు 1. తిరుమల రాజు-వీరి కోరిక మేరకే పద్య ప్రబంధం కోనేరునాథుల వారు వ్రాసి తిమ్మరాజుగారికి అంకితమిచ్చారు, 2. విఠలేశ్వరుడు, 3. చినతిమ్మరాజు-మన ద్విపద బాల భాగవత ప్రబందానికి కృతిభర్త, 4. పాప తిమ్మరాజు.

ద్విపద భాగవతం

ధ్విపద ప్రబంధం శ్రీ అక్షరంతోనూ, తగణంతోనూ శోభన ప్రదంగా, సాంప్రదాయ పద్దతిగా ఆరంభించారు.

ఆరంభంలో శ్రీవేంకటేశుని స్మరించిన తీరు బాగుంది. స్వామి కోనేరు నాథుడు అని పేరు ఉంది. కవి పేరు అదే అంటారు.

ఇందు ప్రదర్శించిన కవితా ప్రౌఢిమకు నిదర్శనాలు వీరు పొందిన ప్రౌఢేకవి, కవిసార్వభౌమ వంటి బిరుదులు ప్రశంసలు.

కవిసార్వభౌమ బిరుదు శ్రీనాథునికి, కోనేరునాథునికి కలదు.

నన్నయాది పూర్వకవుల నడచిన సంప్రదాయంలోనే, కృతిభర్త, వారి ఆరెవీటి వంశాన్ని ప్రస్తుతించారు.

చారిత్రక విశేషాల ప్రస్తావనలు

ఆరెవీటి సోమదేవరాజు ఒకేరోజున ఏడు కోటలను జయించి, మహమ్మద్ అను మహమ్మదీయ రాజును ఓడించి, తనకు పుట్టబోయే కొడుకుకు సోమదే-వరాజు పెరు పెట్టుకుంటానని ఆ మహమ్మదీయ రాజు శరణు వేడుకోవడంతో, వానిని శిక్షించకుండా సోమదేవరాజు విడిచి పెట్టాడు వంటి ఆరెవీటి రాజుల ప్రరాక్రమాలు చారిత్రక విషయాలు చెప్పాడు.

కందనవోలు, నేటి కర్నూలు చారిత్రక ప్రాశస్త్యం చూపాడు.

కవితారీతులు

కుసాకుళికాపురం అని విచిత్రపదబంధంతో కైలాసాన్ని ద్వితీయాశ్వాసంలో 441వ ద్విపదలో నిందాపూర్వకంగా వర్ణించారు. దక్షుడు శివుని తూలనాడడం సందర్భంలో ఇలా ప్రయోగించారు. కైలాసం అనేది అందరికీ కనబడేది కాదు కదా. అందుకని అది హుళిక్కి అని వేళాకోళం ఆడినట్లు ఈ విచిత్ర పదబంధం వాడారు. ఇది హేయమైన తిట్టే కాని దాని పద డాంబికం సందర్భంలో చక్కగా నప్పింది. ఇదీ దోనూరి వారి ప్రొఢోక్తి, వక్రోక్తి, ఊహా వైచిత్రుల వైభవం.

దక్షుడు అరుద్రక యాగం తలపట్టాడు. ఈ సందర్భంలో 468వ ద్విపదలో “అయ్యవినీతుని నడక శంకరాభరణమై జరిగెడుంగాదె” అని, దక్షుని మూర్ఖత్వాన్ని ఒక ప్రక్క సూచిస్తున్నాడు. అతని బుద్ధి శంకరాభరణం అంటే పాము కదా అట్టి కుత్సితము, కుటిలము అని సూచిస్తున్నాడు. దక్షుని చేతలన్నీ శివునికి ఆఙరణాలు కాబోతున్నా యని రాబోయే కథ సూచిస్తున్నాడు కవి.

ఇలాంటి చమత్కారాలు చిన్న పదాలలో అనేక అర్థాలు స్పురింప జేయడంలో కవి ప్రౌఢత్వం మాధుర్యం కనబడుతోంది. ఇంలాంటి ప్రయోగాలు అనేకం ఉన్నాయి.

“మనసార రెక్కలమాటునం బెట్టుకుని పెంచితిరి కదా” అని ధర్మరాజు చేత విదురునితో పలికించిన వంటి సంభాషణా నైపుణ్యం చెప్పుకోదగ్గది.

“కలకంఠముల కుత్తికల గల కసటు కసంకలు దీర్చు నీ కలమంత్ర ఘనుడు” అని వసంతుని వర్ణించడంలో, కలకంఠములు ఐన కోకిల హంసలో కంఠంలోని జీఱను తొలగించి అవ్యక్తమధుర ధ్వని వెలువడేలా చేయడంలో వసంతుడు నేర్పరని చేప్పిన వర్ణన వంటి చక్కటి వర్ణనలు చేయడంలో కవి వర్ణనా చాతుర్యం కనబడుతోంది.

అవభృధము, ప్రాగ్వంశము, అమితేషణాసక్తి వంటి అందమైన పారిభాషిక పదాలు ప్రయోగించారు.

సూక్తులు వాడడంలో నేర్పు, “కడుపున బుట్టిన కన్యకుఁ బెండ్లికొడు కనుకూలుడు గూడుట బోలె”, “ఎట్టివారికి నైన నెన్న గాలంబు పట్టుదప్పిన ధాత్రి బడక పోరాదు” వంటివి అనేకం.

రాచరికమునకి రాచర్కె అని, మేనఱికానిరి మేనర్కమని, సహించుకు సయించు, క్రిందకు గిద్ద వంటి వ్యావహారిక పదాలను అలవోకగా ప్రయోగించడంలో కవిది అందెవేసిన చెయ్యి.

ప్రథమ ఆశ్వాసంలో 950వ ద్విపదలో సారవంతమైన అనే అర్థంలో “బలవంతమైన శ్రీభాగవతంబు” అనుటలో అర్థవిపర్యం వంటివి కూడ అందంగా ఉన్నాయి.

రచనా విధానంతో, పద మాధుర్యంతో, శైలిలోని నేర్పుతో, కవితా ప్రౌఢత్వంతో కవి ఈ ద్విపద భాగవతాన్ని మిక్కిలి సరసవంతంగా, శోభనకరంగా చేసి ధన్యు డయ్యాడు. పఠించే పాఠకులకు సంతోషం తృప్తి కలుగుతాయి.

ఉపసంహారం

ఇలా విశిష్ఠతలతో కూడిన ఈ ప్రబంధం ద్విపద శైలిలో ఉంది కనుక, బయటకు పాడుకోడానికి గానీ, చదువుకోడానికి గానీ శ్రావ్యంగాను ఎంతో అనుకూలంగానూ ఉంటుంది. భాగవతం కనుక చదువుకుంటే బాగవుతాము. మొత్తానికి ఇహపర సౌఖ్య ప్రదాయిని ద్విపద బాల భాగవతం

ఈ సంకలనం చేయడానికి స్పూర్తి సౌజన్యాలు (అ) శోధగంగావారు అందించిన పరిశోధన పత్రాలలో కనబడిన ద్విపద బాల భాగవతం. పేరు చూడగానే ఆకర్షించింది. మహాతల్లి డా. బూదూరు కుసుమాంబ, ఎమ్ఎ., ఎమ్.ఫిల్., పిహెచ్.డి గారు ఏంతో శ్రమకోర్చి, ముందు పద్య బాల భాగవతంపైన పిహెచ్.డి పొంది, పిమ్మట ద్విపద బాల భాగవతం పైన బహు రమ్యంగా పరిష్కరిస్తూ శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో చేసి 1998లో 2వ పిహెచ్.డి సాధించిన అసాధారణ కృషికి కృతజ్ఞతభివందనములు, వీరు ఆ కోనేరునాథుని మార్గంలో పద్య బాలభాగవతం పై ముందు పిహెచ్.డి చేసి పిమ్మట ద్విపద ప్రబంధంపై పిహెచ్.డి చేసారు శోధగంగావారికి ధన్యవాదములు. (ఆ) 1954లో పద్యప్రబంధం పరిష్కరించి ప్రచురించిన విద్వాన్, పంగనామాల బాలకృష్ణమూర్తి, ఎంఎ వారికి ధన్యవాదాలు. సాయం గ్రహించిన ఇతర గ్రంథాలు అంతర్జాల వేదికలు, నిఘంటువులు సమర్పించిన మహానుభావులకు మనసా ప్రణామములు. గణనాలయం క్రింద తెలుగుభాగవతం.ఆర్గ్ ఇచ్చిన అవకాశానికి, మా భాగవత బంధువులకు, ప్రోత్సాహకులకు, వీక్షకులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.

దీనిన ఆదరిస్తున్న భాగవతాభిమానులు, తెలుగు జాలజనులు అందరకు ధన్యవాదాలు. ఆ సరసహృదయులు, సాహిత్యాభిమానులు, తెలుగు జాలజనులు అందరు ఈ ప్రబంధాన్ని చక్కగా ఆస్వాదించి మా నల్లనయ్య అపార అనుగ్రహాన్ని అందుకోగలరని మనవి.

  ~ భాగవత గణనాధ్యాయి.

~ X ~