పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

యక్షగానములు : తృతీయాంకము

వ.
ఈలాగున ప్రహ్లాదస్వామి శ్రీమన్నారద గురువు పలికిన శ్రీవైకుంఠ వృత్తాంతమంతయు వినఁగానే పరవశమున సర్వస్వము శ్రీహరిమయమై తోచియుండగ నాలుగు దిక్కులుఁ గలయ వీక్షించి యింకను శ్రీహరి ప్రత్యక్షము గాలేదని యత్యంత వ్యసనాక్రాంతుఁడై ప్రలాపించు మార్గం బెట్టులనిన.
సీ.
ఆది నెఱుగు మాటలా మౌని తెల్పగ
నడగిన పరితాప మధికమాయె
వ్యసనాగ్నిచేఁ జాలవేగు చుండగ మౌని
వార్తలు నాజ్య ప్రవాహమాయె
హరినిఁ గానని వహ్నినార్ప లేకుండగ
- మౌని పల్కులు పవమాన మాయెఁ
దత్తరమందుచుఁ దనువుస్రుక్కుచు నుండ
ముని పల్కు మోహాబ్ధి మునుఁగనాయెఁ

గనులు తెరచినఁ గూర్చిన కంతుజనకు
చాక చక్యంబు చెలగంగ సారసాక్షు
వెఱ్ఱి తలకెక్కి నామముల్‌ వేవిధాలఁ
దాను దలపోసి పలికెను తాలలేక.

కీర్తన
నీలాంబరి - ఆది

పల్లవి
ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
పన్నుగఁ గనుగొనని కన్నులేలే - కన్నులేలే - కంటి మిన్నలేలే
చరణ (1):
మోహముతో నీలవారి వాహకాంతినిఁ గేరిన
శ్రీహరినిఁ గట్టుకొనని దేహమేలే - దేహమేలే - ఈగేహమేలే
చరణ (2):
సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచేఁ బూజించని కరములేలే - కరములేలే - ఈ కాపురములేలే
చరణ (3):
మాలిమిని త్యాగరాజునేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే - నాలికేలే - సూత్రమాలికేలే
వ.
ఇవ్విధంబున ప్రహ్లాదస్వామి తిరుగఁ జింతించునది యెట్టులనిన.
ఉ.
శ్రీవసుధాధినాథ సుర సేవిత దివ్య పదారవింద యో
దేవ భవత్పదాంబుజము దిక్కని నా మదిలోన నమ్మి నీ
సేవకు దోసిలొగ్గి మది చింతయొనర్చిన వాఁడగాన నా
భావ మెఱింగి నీదు ముఖపంకజముం దగఁ జూపవే హరీ.
ఉ.
శ్రీధర! రామచంద్రముని చింతిత పాద సరోజ! శ్రీహరీ!
మాధవ! మారకోటి నిభ! మంగళదాయక! మంజుభాషణా!
ఓ ధనవీర! వీరవర! యోగి హృదాలయ! నన్నుబ్రోవవే!
నాథ! సురోత్తమాకృతిని నారద సన్నుత వేగఁ జూపవే.
ఈలాగున నతి చింతా క్రాంతుండై కఱఁగుచుఁ బలుకుటెట్టులనిన.

కీర్తన
వరాళి - చాపు

పల్లవి
ఏటి జన్మమిది హా ఓ రామ
అనుపల్లవి
ఏటి జన్మమిది యెందుకుఁ గలిగెను
యెంతని సైరింతు హా ఓ రామ
చరణ (1):
సాటిలేని మారకోటి లావణ్యుని
మాటిమాటికిఁ జూచి మాటలాడని తన
చరణ (2):
సారెకు ముత్యాల హార మురము పాలు
గారు మోమును గన్నులారఁ జూడని తన
చరణ (3):
ఇంగితమెఱిగిన సంగీతలోలుని
పొంగుచుఁ దనివార గౌగిలించని తన
చరణ (4):
సాగరశయనుని త్యాగరాజనుతుని
వేగమె చూడక వేగెడి హృదయము తన
వ.
ఈలాగున ననేక విధముల మొరపెట్టియు శ్రీహరి దర్శనము లేదని యతిచింతాక్రాంతుఁడై పలుకునది యెట్టులనిన.
క.
కరివరదుని గన గోరుచు
గరగుచు గన్నీరునించి కలఁడో, లేఁడో
హరిహయ బ్రహ్మాదులకును
హరియగ పడువాఁడుగాఁడె యని మూర్ఛిల్లెన్‌.
వ.
ఇవ్విధంబున ప్రహ్లాదుండు ప్రపంచమంతయు మఱచి మూర్ఛఁజెంది యుండు సమయంబున.
ద్వి.
అణురేణువుల యందు నచలంబులందు
నణఁగి చెలఁగుచు నుండు నాదిదేవుండు॥
ఆద్యంతరహితుండు నమలుండు వేద
వేద్యుండు నిజభక్తు వ్యసనంబుఁ దెలిసి॥
పొంగారు జలధిలోఁ బొందుగా నడుమ
బంగారు చవికెలో బాగుగానుండు॥
శృంగారి లక్ష్మిని శ్రీహరి మఱచి
రంగైన వస్త్రంబు రాపాడుచూడ॥
మాణిక్యమయమగు మకుటంబు కదల
నాణి ముత్యపు సరు లసియాడ మిగుల॥
చిన్ని మోమునఁ జిరు చెమటలూరంగఁ
బన్నీరు గంధంబు పరిమళింపంగ॥
వసుధపైఁ బవళించి వాడియున్నట్టి
యసుర పుత్రుని చెంత కాక్షణమునందు॥
అత్యంత ప్రేమతో నంకమందుంచ
సత్యవంతుని జూడ శౌరి తా వెడలె॥
వ.
ఈలాగున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండు శ్రీమన్నారాయణుండు అత్యంత కృపాళుండై శ్రీవైకుంఠము నుండి వేంచేయు వైభవమెట్టులనిన.
ఉ.
శ్రీవనితామనః కుముద శీతకరుండతి మోదయుక్తుడై
పావన మూర్తి తా నసుర బాలుని భావ మెఱింగి వేగమే
భావజ కోటికోట్ల నిజ భాసురమెల్లను గోటఁజూపుచు
న్నీ వసుధా తలంబునకు నీశ్వరుఁడేగు విధంబు జూడరే.
క.
శ్రీమదనే కాండములను
ప్రేమనుఁ గాపాడు హరిని ప్రేమముతోడన్‌
నామామృత పానంబుల
నేమముతోఁ జేసికొంచు నేర్పునఁ గనరే.

కీర్తన
సౌరాష్ట్ర - చాపు

పల్లవి
ఎంతనుచు వర్ణింతునే యీ - యిందిరా రమణుని నే
అనుపల్లవి
సంతతము నమ్ము సజ్జనుల యా - సంత తీర్చు వసంత కుమారు
చరణ (1):
మెఱుగు బంగరు చేల మిరవొంద మఱియు నూపురములు ఘల్లనఁగ భక్తులఁగని
కరుణామృతము చల్లగ యోగుల దహరములు ఝల్లనఁగ వేంచేసిన
చరణ (2):
తిలకము చెలగఁగ జలజాక్షుఁడిలకు క - దలు ఠీవి వినిపింపఁగ తుంబురు నార
దులు కని నుతియింపఁగ సురలు సుమ - ముల వాన గురియింపఁగ వేంచేసిన
చరణ (3):
ఘననీలమునుఁ గేరు తనువుపై బునుగు చం - దనము పరిమళింపఁగ బాగు ఉర
మున ముక్తామణులాడగ త్యాగరాజుఁ - గని చేలావియ్యగ వేంచేసిన
వ.
ఈలాగున శ్రీహరి యత్యంత దయతో వేంచేయు సమయంబున ప్రహ్లాదునిఁ జూచి పలికినది యెట్టులనిన.
క.
పుడమిచెలిమగడు తాళక
కడు వడిగా నడచివచ్చి కరుణాయుతుఁడై
జడియకుమని ప్రహ్లాదుని
నుడుపతి ముఖుఁ డప్రమేయుఁ డురమునఁ జేర్చెన్‌.
వ.
ఇవ్విధంబున నడలి బడలి హరిగుణముల పాడి వాడి మేను చిక్కి సొక్కి సోలియున్న ప్రహ్లాదస్వామి నిస్సంగుఁడైన శ్రీరంగనాథుని శుభాంగ సంగము చేత మూర్ఛదెలిసి తన యంతరంగమున యోచించునది యెట్టులనిన.
సీ.
శ్రీలక్ష్మికైననుఁ జిక్కని యంకంబు
హరియు భక్తునకిచ్చి యాదరించె
నా సుఖంబులచేత నార్తులెల్లనుఁ దీర
నేఁడు భాగ్యంబని యాడుకొనుచుఁ
గడు దీర్ఘబాహుని కమలాయతాక్షుని
గమనీయవదనునిఁ గనుగొనంగ
నాశ్చర్యమొకవంక హర్షంబు నొకవంక
గడుభయంబొకవంకఁ గల్గునటుల

నింతసౌఖ్యంబు లెటుగల్గెనిపుడు తనకు
చింతచేఁ గుంది మూర్ఛిల్లు చిత్తభరమొ
స్వాంతమందునఁ గన్నట్టి స్వప్నమేమొ
యనుచు ప్రహ్లాదుఁడీరీతి నాడుకొనెను.
వ.
ఇటువలెఁ బలికి ప్రహ్లాదుండు యేలనిట్టి భ్రమలు జెందినానని సాక్షాత్కరించిన శ్రీహరి నేత్రానందముగ సేవించి నిశ్చయించున దెట్టులనిన.
క.
ఇదిగో శ్రీహరి వారిధి
యిదిగో భూమ్యంతరిక్ష మిదిగో
ఇదిగో స్వప్నముగాదిది
యిదిగో నను గౌరవించె నిదె ధన్యుండన్‌.
వ.
ఇవ్విధంబున నిశ్చయించి తన మనంబున గోరుచున్న మహాభాగ్యంబుఁ గొనసాగెననుచు బ్రహ్మానంద జలధిలో నోలలాడుచుఁ బరవశుండై యున్న వివరంబెట్టులనిన.
సీ.
హర్యంక కరసౌఖ్య మనుభవించుటచేతఁ
బూర్ణుఁడై యీ బాహ్యబోధలేక
విస్మయంబులవల్ల వికసింపఁ గన్నులు
హర్షంబుపట్టక యట్టె కూర్చి
యానంద మూర్ఛచే నంత యింతని లేక
యాద్యంతరహితుని హరినిఁ జూడ
చిత్తషట్చరణంబు శ్రీమాధవ ముఖాబ్జ
మాధుర్యములచేత మలయుచుండఁ

దనువు సర్వోన్నతంబైన దశనుఁ గూడ
దొరకరానట్టి భాగ్యంబు దొరికెననఁగ
బుద్ధి యానంద పరవశంబునను తగుల
నసురపుత్రుఁడు నపరాధమనుచు మ్రొక్కె.
వ.
అంతట ప్రహ్లాదుండు దిగ్గునలేచి జగన్మోహనాకారుని, జగద్గురుని, శంఖచక్ర శార్ఙ్గనందక గదా పంచాయుధ ధరుని శరణాగతసులభుని, పుండరీకాయతాక్షుని, పురాణపురుషుని, నవరత్నఖచిత కుండల దీపిత సుందర గండస్థలుని, నారాయణుని, సకల దిక్పాల మకుటవిరాజిత పదారవిందుని, సార్వభౌముని, శ్రీవత్సాంకిత వక్షఃస్థలుని, సీతామోహన విగ్రహుని, నాజానుచతుర్బాహుని, ననంత గరుడ విష్వక్సేనాది సపరివారుని, నాద్యంతరహితుని, నవ్యపీతాంబరధారిని, నతజనార్తహరుని, నవ్యాజ కృపాసాగరుని, నచ్యుతుని, ననిర్వాచ్యచరితుని, నఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు శ్రీమన్నారాయణమూర్తిని సేవించి స్తోత్రంబు సేయు మార్గం బెట్టులనిన.
సీ.
సర్వలోకాధార శాశ్వతాగమసార ' ధరసుతారమణ వందనము నీకు
సర్వోపనిషదర్థ! సారసదళనేత్ర!
తరణికోటిసమ! వందనము నీకు!
నెవ్వరిభాగ్యమో యెందున దాగితో!
యెందు గౌగిలిఁజేర్తు నేమిసేతు!
నింతముద్దింత ఠీవింత ధీరతనంబు!
నల్పచిత్తులకెల్ల నరుదు కానఁ!

గంటి తొల్లింటి పుణ్యంబు కన్నులార
నిదియ భాగ్యంబు నిపుడు తనకు
ననుచు నానందజలధిలో నట్టె మునిగి
వదరి హరిపాద కమలముల్‌ పట్టుకొనెను.
ఈలాగున శ్రీహరి పదముల బట్టుకొని ప్రహ్లాదుండు పలుకునది యెట్టులనిన.

కీర్తన
భైరవి - ఆది

పల్లవి
ఏనాటి నోము ఫలమో - ఏ దాన బలమో
అనుపల్లవి
శ్రీనాథ బ్రహ్మకైనను నీదు సేవ దొరకునా తనకు గలుగుట
చరణ (1):
నేను గోరిన కోర్కులెల్లను నేఁడు తనకు నెరవేరెను
భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా తన
చరణ (2):
నీదు దాపు నీదు ప్రాపు దొరికెను నిజముగా నే నీసొమ్మైతిని
ఆదిదేవ ప్రాణనాథ నా దంకముననుంచి పూజించ తన
చరణ (3):
సుందరేశ సుగుణబృంద దశరథనంద నారవిందనయన పావన
అందగాఁడ త్యాగరాజనుత సుఖమనుభవింప దొరకెరా భళి తన
వ.
ఈలాగున పలికి ప్రహ్లాదుండు తిరుగ స్మరణ దర్శనానంద జలధినీదుచు బలుకునది యెట్టులనిన.
క.
తిరుగానందాంబుధిలో
బరమాత్ముని దన్నుమఱచి పరవశతను తా
హరి హరి హరి యనుచుండగ
వరదుఁడు తారకముఁబట్టి వార్తలు పలికెన్‌.

తృతీయాంకము సమాప్తము.