పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

యక్షగానములు : నౌకా చరిత్రము - ముందుమాట


నౌకాచరిత్రము
త్యాగరాజవిరచిత – యక్షగానము

సంకలనము:-
భాగవత గణనాధ్యాయి
నందవరపు సర్వలక్ష్మి

2020

సౌజన్యము: : ఆంద్రభారతి.కాం (andhrabharati.com)


నౌకాచరిత్రము

మున్నుడి:-

ఆంద్ర మహాసామ్రాజ్యానికి రాజులు మువ్వురే. వారు పోతరాజ, త్యాగరాజు, గోపరాజు. ఇతరులందరూ పేరుకు మాత్రమే రాజులు. అవును కరుణశ్రీ వారు అన్నారు కదా -

గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు

అన్నట్లు గోపన్న బండరాళ్ళతో గుళ్ళు కట్టించాడు; త్యాగరాజు రాగాల గుళ్ళు కట్టించాడు; పోతన తెలుగువారి గుండెలలో కృష్ణుడికి గుళ్ళు కట్టించాడు.

దక్షిణ భారత సంగీతమునకు మకుటంలేని మహారాజు - మహా విద్వాంసులు త్యాగరాజు ప్రాతఃస్మరణీయులు. వారు తెలుగు వారు అగుట తెలుగులు అందరూ గర్వించదగ్గ విషయం; దక్షిణ భారతదేశానికే విద్యాధర చక్రవర్తి మన త్యాగరాజు. వారు నిత్యం పోతన ప్రణీతమైన మహాభాగవత పురాణాన్ని పారాయణం చేసేవారట. వారి దస్తూరీతో ఉన్న వ్రాత ప్రతి ఇప్పటికీ మధురలో భద్రపరచబడి ఉన్నదట. వారికి భాగవతముపై ఉన్న అపార ఆసక్తి వలననే ప్రహ్లాద విజయం, నౌకా చరిత్రములను యక్షగాన రచనకు తీసుకుని ఉంటారు. అక్కిరాజు ప్రసాదు గారు అన్నట్లు "పోతన గారు రచించిన ఆంధ్ర మహాభాగవతం ప్రభావం త్యాగరాజస్వామిపై చాలా ఉంది అన్నదానికి గీటురాళ్ళు ఈ యక్షగానములు."

మొన్నటిదాకా యక్షగాన వాజ్మయం దక్షిణ భారతదేశంలో అంతటా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉండేది. సాధారణంగా పురాణాది గ్రంథాలనుండి చక్కటి కథాంశం తీసుకుని దానిని పద్యాలు. గద్యాలు, పాటలు రూపంలో సులువుగా అర్థం అయ్యేలా మనసును ఆకట్టుకొనేలా అందించడము యక్షగాన ప్రత్యేకత. ఈ కథాంశాన్ని యక్షగానంలో ఉపాఖ్యానం అంటారు. మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో బహు విస్తారంగా వ్యాప్తిలో ఉండేది. "వీథి భాగవతాల" మాతృకలు ఈ యక్షగానాలే. యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. నటు లందరూ మెరిసే దుస్తులు, రంగులు సింగారించుకున్న ముఖములు మరియు తలపై సవరం, కిరీటాలు ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాథలను వివరిస్తుంటాయి. భాగవతారు అను కథకుడు కథ చెబుతుండగా, వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా ప్రాసంగికులు అను నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. సంగీతం మట్టు మరియు యక్షగాన తాళాలతో రంగరించిన కర్ణాటక సాంప్రదాయ రాగాలపై ఆధారపడి ఉంటుంది. యక్షగాన తాళాలే తరువాతి రోజుల్లో కర్ణాటక సంగీత తాళాలుగా మార్పు చెందా యన్నది ఒక మాన్యత. యక్షగానంలో ప్రధాన అంశాలు (1) ఉపాఖ్యానము, (2) పాత్రధారులు, (3) వస్త్రధారణ / వస్త్రాది యలంకరణ (4) భాగవతారు, (5) ప్రాసంగికులు, (6) నేపథ్యము. ఉపాఖ్యానం రచయిత వ్రాస్తే, భాగవతారు ప్రధానంగా దానిని పాడుతూ చెప్తూ కథ రసవత్తరంగా నడిపిస్తాడు, ఆయా పాత్రలను ధరించి వచ్చే ప్రాసంగికులకు మౌన ఆంగికం ఎక్కువగా, మౌఖింకంగా పలికే సంభాషణలు తక్కువగా ఉంటాయి. మిగతా అంశాలు కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తాయి.

బహు ప్రసిద్ది పొందిన "నౌకా చరిత్రము" యక్షగానము త్యాగరాజు గారు రచించినారు. దీని నేపథ్యము సైతము భాగవత లోంచి గ్రహించినదే. కడలి దాటాలంటే కర్ణధారుడు కావలిసిందే. భవసాగరాన్ని దాటడానికి సాక్షాత్ శ్రీకృష్ణపరమాత్మను మించిన కర్ణధారుడు ఎవరుంటారు. అలాంటి కృష్ణానుగ్రహం పొందుటకు ఆ గోపికలు ఎంతటి పుణ్యములు చేసిరో? పూర్వజన్మలలో ఏమినోములు నోచిరో? ఏమి మహత్కార్యములు చేసిరో? ఎంతటి ప్రభువుల వరములను అందుకొంటిరో? శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యానికి నోచుకున్నారు. ప్రేమతో పరమపదాన్ని అందుకున్నారు. ఆ గోపికలు శ్రీకృష్ణునితో నౌకా విహారానికి వెళ్ళడం అన్న ఇతివృత్తం తీసుకుని దానిని రసరమ్యం చేసి, రూప తాళములద్ది, కర్ణాటక సంగీతంతో అలంకారములు చేసి, రసికహృదయులారా! ఆస్వాదించండి! తరించండి! అంటూ మన త్యాగరాజువారు అనుగ్రహించిన నౌకా చరిత్రము ఇది.

శ్రీ భాగవత గణనాధ్యాయి, శ్రీమతి నందవరపు సర్వలక్ష్మి గారు కర్ణాటక రాజధాని బెంగళూరులో కలిసి అందాలు దిద్ది జాలజనులకు మరింత చేరువ చేయడానికి ఈ నౌకా చరిత్రమును సంకలనం చేసారు. శ్రీ భాగవత గణనాధ్యాయి అన్న కలం పేరు వారు ఊలపల్లి సాంబశివ రావు. వీరు వృత్తి రీత్యా విద్యుత్ ఇంజనీరుగా పదవీవిరమణానంతరం పోతన తెలుగు భాగవతం చేపట్టినవారు. శ్రీమతి సర్వలక్ష్మిగారు పదవీవిరమణ చేసిన తెలుగు ఉపాధ్యాయురాలు. గృహిణిగా పిల్లల సంసారాలలో సహకరిస్తూ. మనవలకు మంచీచెడూ నేర్పుతూ ఎంతో శ్రమకోర్చి ఈ సంకలనంలో పాలుపంచుకున్నారు. వీరికి, తెలుగు భాగవత బంధువులకు, ఆంధ్రభారతి వారికి, ఈ గ్రంథ వినియోగదారులకు, ఆస్వాదించు రసహృదయులకు నల్లనయ్య అండదండ మెండుగా అందుగాక.

- భాగవత గణనాధ్యాయి.