పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తె.భాగవతమాహాత్మ్యం : మొదటి అధ్యాయము

శ్రీ కృష్ణశ్శరణంమమ
శ్రీ పద్మపురాణాంతర్గత

శ్రీ తెలుగు భాగవత మాహాత్మ్యము

మొదటి అధ్యాయము

దేవర్షి నారదులు భక్తినిఁ జూచుట :

  సమస్త జగముల సృష్టి, స్థితి వినాశములకు హేతువయి ఆధ్యాత్మి కాధిదైవి కాధిభౌతిక తాపములకు ధూమఖేతువయి భక్తజనజీవాత్ముడవై సచ్చిదానంద మూర్తి యైన భగవంతుఁ డగు శ్రీకృష్ణునకు నమస్కరించెద.

  శ్రీశుకదేవుఁడు, యజ్ఞోపవీత సంస్కారమయినను గాలేదు; లౌకిక వైదిక కర్మముల ననుష్ఠించుట కవసర మయినను రాలేదు; అట్టి పసితనముననే యొంటిగానే సన్న్యాసమును గ్రహించు నుద్దేశముతో నాశ్రమమునుండి వెడలిపోయెను. అట్టి పరమభాగవతుఁ డగు బుత్రుఁడు బాల్యావస్థ యందే సన్న్యాసి యగుట చూచి, వాని తండ్రి యగు వ్యాసభగవానుడుఁ మిగుల వగలఁ బొగిలి (పొగులు అనగా పరితపించు), విరహకాతురుఁడయి (బెంగపడి) “కొడకా! కొడకా! నీ వెందుఁ బోయెదవురా” యని పిలుచుచు వెంటఁజనుచుండెను. ఆ సమయమున శ్రీశుకమహర్షి పక్షమున వృక్షములుం బ్రతిధ్వనులు చక్కంజేసె నట్టి భూతమయునకు మ్రొక్కెదను.

ఒక సమయమున భాగవత కథామృత రసాస్వాదన కుశలుఁ డగు శౌనక మునివరుఁడు నైమిశారణ్యమున విరాజమానుఁ (మిక్కిలి ప్రకాశించు వా) డయి యున్న మహామతి యగు శ్రీ సూతమహర్షినిఁ గాంచి యిట్లని యడిగెను.

శౌనకుఁడు_:-
“సూతా! ధీసమేతా! (మిక్కిలి జ్ఞానము గలవాడా) మీ జ్ఞానము. అజ్ఞానాంధ కారమును బోఁగొట్టుట యందుఁ గోటి సూర్యులకు సాటి. ఈ సమయమున మా వీనుల (చెవుల) కమృతమువలె నుండి, సారగర్భితమయిన కథను దేనినయినఁ జెప్పుము. భక్తి, జ్ఞాన వైరాగ్యములచేఁ బొడమిన వివేకము దేనివలన వృద్ధిపొందునో, వైష్ణవు లేవిధమున నీ మాయామోహమును వెనుకకుఁ ద్రోవఁగలరో. యట్టి దానిని గృపతోఁ దెలుపుము. ఈ ఘోరమగు కలికాలమున జీవులు తఱుచు ఆసురీ (రాక్షస) స్వభావము కలిగి యుందురు. ఆ కారణమున విపత్పరంపరలో మునిఁగి తేలుచుందురు. కావున, నట్టి యాసురీ స్వభావమును చక్కఁబఱిచి జీవులఁ బావనులఁ జేయఁగల సర్వశ్రేష్ఠమగు నుపాయమేది? మా కిప్పు డన్నింటికంటె నధిక కల్యాణమును గలిగించునదియు, నంతఃకరణమును బవిత్రము చేయునదియు, శాశ్వతముగ భగవంతుఁ డగు శ్రీకృష్ణునిఁ బ్రాపింపఁ జేయునదియు నగు సాధనమేదియో దానిని దెలుపుము. చింతామణి కేవల లౌకిక సుఖమునే యొసఁగ జాలును. కల్పవృక్ష మధికములో నధికము స్వర్గభోగముల నీయఁగలదు. కాని గురుదేవుఁడు ప్రసన్నుఁ డయినచో భగవంతుని శ్రీవైకుంఠధామమునే ప్రసాదింపఁగలుగును. అది యోగిజనుల కయినను నెంతో కష్టముమీఁద లభించు నందురు. కావునఁ, దమ కృప యుండిన మాకుఁ బడయరాని దేమున్నది?”

సూతుఁడు_:-
“శౌనకమునిపుంగవా! మీ హృదయమునందు భగవంతుని యెడఁ బ్రేమ కలదు. కావున నేను యాలోచన మొనరించి, మీకు సమస్త సిద్ధాంతములలో దేలిన నిగ్గును (సారమును) వచించెద. జన్మ మరణ భయమును బావు నట్టియు, భక్తి ప్రవాహమును బ్రబలఁ జేయునట్టియు, శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నతకుఁ బ్రధానకారణ మయినట్టియు, సాధనకు మీకుఁ దెలిపెదను. మీరు దానిని సావధానుల రయి వినుఁడు. సకలజీవులు కాలరూప కరాళ వ్యాళ ముఖమునఁ బడునవే. జీవున కన్నింటి కంటెఁ దప్పించుకొన వలనుపడని గొప్ప గండ మిదియే. దీనిని దప్పించుకొని బయటఁబడిననే కాని మఱి యే యుపాయము చేతను శాంతి లభింపఁజాలదు. ఈ భయమును దూరమొనరించుటకే కలియుగమందు శ్రీశుకదేవులవారు శ్రీమద్భాగవతమను నొక శాస్త్రమును జెప్పెను. మనశ్శుద్ధి కింతకుమించిన గొప్ప సాధనము మఱేదియు లేదు. జన్మజన్మాంతరము లందు సమార్జించిన పుణ్యము పండినఁ గాని, భాగవతశాస్త్రప్రాప్తి కలుగదు. చూడుఁడు. శ్రీశుకమహర్షి పరీక్షిన్మహారాజున కీ కథ వినిపించుటకై సభలో వేంచేసియుండి నప్పుడు, దేవత లమృత కలశమునుగొని యక్కడకు వచ్చిరి. వారు తమ పని నెగ్గించుకొనుటలో మిగులఁ జతురులు. వడుపు తెలిసిన బేరగాండ్రు. కావున, నిందును, వారెల్లరు శ్రీశుకులను సమీపించి నమస్కరించి “మీరీ యమృతమును స్వీకరించి, దానికి బదులు మాకుఁ గథామృతమును నొసఁగుడు. మీకీ బేరము నచ్చిన యెడల, నీ యమృతమును ద్రావి పరీక్షిన్మహారాజు అమరుఁడు కాఁగలఁడు. మేమో కథామృతమును బానము చేసెద” మని యడిగిరి. అప్పుడు శ్రీశుకభగవానుఁడు తన మనమున “లోకమున నమృతమేడ? హరికథ యేడ? గాజు పెంకేడ? అమూల్యమగు మణి యేడ?” యని యోజించి, దేవతలాడిన మాటలను విని నవ్వి, వీరు బేరమాడువారు. ఈతగింజవేసి త్రాటిగింజలాగువారే కాని భక్తి శూన్యు లని యెఱిఁగి, కథామృతపానమున వారికిఁ బాలొసఁగ నిష్టపడలేదు. శ్రీమద్భాగవత కథ దేవతలకును దుర్లభమని దీనివలన నేర్పడుచున్నది.

శౌనకమునీంద్రా! శ్రీమద్భాగవతకథను వినుటచేతనే శ్రీపరీక్షిన్మహారాజు ముక్తుఁడగుట చూచి, తొల్లి నలువయు మిగుల నచ్చెరువు చెందెను. అంత నా బ్రహ్మ సత్యలోకమున నొక తరాజు (తక్కెడ) నందు సర్వసాధనములను దూఁచెను ఆ సాధనము లన్నియుఁ దేలిక యయ్యెను. తన మహత్త్వము కారణమున భాగవతమే యన్నిటికంటే బరువు తూఁగెను. ఇది చూచి ఋషు లందఱు పరమ విస్మయమును జెంది, భగవద్రూప మయిన శ్రీమద్భాగవతశాస్త్రము పఠించుటచేతను, వినుటచేతను నీ కలికాలమునఁ దత్క్షణము (వెంటనే) మోక్షము నిచ్చునని నిశ్చయము చేసిరి. సప్తాహపారాయణ విధిచే దీనిని శ్రవణము చేసినచో నిశ్చయముగ నిది ముక్తి ప్రదానము చేయును. పూర్వకాలమున దీనిని సనకాదులు దేవర్ష యగు శ్రీ నారదభగవానునకు వినిపించిరి. శ్రీనారదభగవానులు మొట్టమొదట దీనిని బ్రహ్మగారివలన వినియుండెను. కాని సప్తాహపారాయణ విధానమును మాత్రము సనకాదులే నారదభగవానునకు విశదముగఁ దెలియఁజేసిరి.”

శౌనకుఁడు_:- “సూతా! దేవర్షియగు నారదులవారు సంసారపు జంజాట మొక్కింతయు లేనివారు కదా. ఒకచోటఁ గాలుకుదిరి నిలుకడగా నుండువారు కారే? అట్టివారి కీ ప్రకారము సప్తాహవిధి ననుసరించి భాగవతము వినుట యందెట్లు ప్రేమ కలిగెను? సనకాదులతో వారికి సమాగమ మెక్కడ కలిగినది?”

సూతుఁడు_:-   “మంచిది. ఇప్పుడు నేను మీకా భక్తిపూర్ణ మగు కథానకమును (పెక్కు చిన్న కథలు గల గ్రంథము) వినిపించెదను. శ్రీశుకులవారు నన్నుఁ దన కనన్యభక్తి గల శిష్యునిగా స్వీకరించి యేకాంతమున దీని నుపదేశించిరి. ఒకసారి విశుద్ధాంతఃకరణు లగు మునివరేణ్యు లయిన సనకాదులు నల్వురును సత్సంగమునకయి బదరికావనంబు నందలి విశాలపురి కేగిరి. నారదుఁడును దీనవదనుఁడై వడివడిగాఁ బోవుచుండఁ జూచి, సనకాదులు నారదునితో “బ్రాహ్మణ శ్రేష్ఠా! నీ వదనమేల విన్ననై (చిన్నబోయి) యున్నది? నీ వేల చింతాగ్రస్తుఁడవైతివి? ఇంత వడివడిగా నెక్కడకుఁ బోయెదవు? ఎక్కడనుండి వచ్చుచున్నావు? సర్వస్వము కోలుపోయిన వానివలె నుదాసీనుఁ డయి కానిపించెదవు. నీ వంటి విరక్తులగు పురుషుల కిట్టిదశ రారాదే? కృపయుంచి దీనికిఁ గారణమును దెలుపుము?” అని యడిగిరి. ఆ మాటలను విని,

నారదుఁడు_:-   "మహాత్ములారా! మనుష్యులుండు లోకము కర్మభూమి. కావున నది సర్వశ్రేష్ఠమయిన దని తలఁచి యచటకుఁ బోయితిని, అందుఁ బుష్కరము, ప్రయాగ, కాశి, గోదావరి (నాసిక), హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధము మున్నగు తీర్థములు కలవు. నేను వాని నన్నిటి పలుమఱు సేవించితిని. కాని నాకెందును (ఎక్కడా) మనస్సునకు సంతోష జనకమగు శాంతి రవంతయు లభించినది కాదు. ఈ సమయమున నధర్మమునకు సహాయక మగు ఘోరమగు కలి పుడమి నంతయుఁ బీడించు చున్నది. ఇప్పు డందు సత్యము, తపము, శౌచము, దయ, దానము మున్నగునవి యపురూపము లయ్యెను. పాపము! జీవులు కేవలము పొట్టపోసికొనుటయే ముఖ్య పురుషార్థముగఁ దలపోసి యందే మునిఁగి యున్నారు. వా రసత్యములాడువారు, అలసులు, మందబుద్ధులు, భాగ్యహీను లయి యున్నారు. వారిని వింత వింతలగు విపత్తు లలముకొనినవి. సాధుసంత లనెడివారు పూర్ణముగఁ బాషండు లయిరి. పైకిఁ జూచుటకేమో విరక్తుల వలెఁ గానఁబడెదరు. కానివారు కామినీకాంచనాదుల నన్నిటిని బరిగ్రహించెదరు. గృహములందో యాఁడువారిదే రాజ్యము. స్యాలకుఁడే (భార్య సోదరుడు) యాలోచన చెప్పువాఁడు. కాసులమీఁది పేరాసచేఁ బాపము! యభము శుభము యెఱుఁగని యాఁడుపడుచులు విక్రయింపఁబడుచున్నారు. ఆలుమగలకు నిత్యము జగడము జరగుచున్నది. మహాత్ముల యాశ్రమములు, తీర్థములు, నదులు మున్నగు వానిమీఁద విధర్ముల యధికారము ప్రబలినది. ఆ దుష్టు లనేక దేవాలయముల నాశముచేసిరి. ఇప్పు డందు యోగి లేఁడు, జ్ఞాని లేఁడు, సత్కర్మము లొనరించువాఁడును లేఁడు. సర్వసాధనములు కలి యనెడి కార్చిచ్చుచే మండి, భస్మమైపోయినవి. ఈ కలియుగము నందు వాడవాడను నంగడులలో నన్న మమ్మఁ జాగిరి. విప్రులు కాసుల కాసపడి, వేదమును జదివించుచున్నారు; పడఁతులు పడుపుకూటికి లోబడి పడరాని బదవలు (ఇబ్బందులు) పడుచున్నారు.

ఈ విధముగా కలియుగమునందలి దోషములను దిలకించుచుఁ బుడమిమీఁదఁ దిరిగి తిరిగి యమునానది యొడ్డునకు వచ్చి చేరితిని. ఆ ప్రదేశమున శ్రీకృష్ణభగవానుఁ డనేక లీలలు గావించి యుండెను. మునివరులారా! వినుఁడు. అక్కడ నే నొక మహాశ్చర్యమును గంటిని. ఆ సమయమున నొక యువతి మిగుల ఖిన్నచిత్త యయి యచటఁ గూరుచుండి యుండెను. ఆమె సమీపమున నిరువురు పురుషు లొడలెఱుఁగక పడియుండి వడివడిగ నూర్పులు వుచ్చుచుండిరి. ఆ తరుణివారల కుపచార మొనరించుచుండెను. ఒకప్పుడు వారికి స్మారకము గలిగించుటకుఁ బ్రయత్నించుచుండెను. ఒకప్పుడు వారి ముం దేడ్చుచుండెను. మధ్యమధ్య నామె దశదిశలు పరికించుచుఁ దనను రక్షించు పురుషుఁ డెవ్వఁడయిన వచ్చునా యని నిరీక్షించుచుండెను. ఆమె చుట్టును నిలిచి నూర్లకొలఁది స్త్రీలు వీవనలతో (విసనకఱ్ఱలతో) నామెకు విసరుచు, మాటిమాటి కామె నోదార్చుచుండిరి. దూరమునుండి యా చరిత్ర మంతయుఁ జూచి, కుతూహల వశుఁడ నయి యామె కడకుఁ బోతిని. నన్నుఁ జూచి యా యువతి లేచి నిలఁబడి, మిగుల వ్యాకులముతో ”మహాత్మా! ఒక క్షణము సేఁపు నిలిచి, నా గోడు వినుము. మీ దర్శనము, సంసార మందలి పాపతాపముల నెల్ల సర్వవిధముల రూపుమాపు నట్టిది. మీ శ్రీ సూక్తుల మూలమున నా దుఃఖములోఁ గొంత కొంత శాంతింపఁగలదు. మానవుఁ డెంతో భాగ్యముచేసిననే మీ దర్శనము లభింపగలదు” అని దీనయై పలుక. నప్పుడు, నే నామె నిట్లని యడిగితిని. ”దేవీ! నీవెవతవు? ఈ పురుషు లిరువురు నీ కేమయ్యెదరు? నీ సన్నిధి లోనున్న యీ కమలనయన లెవ్వరు? నాకు సవిస్తరముగ నీ దుఃఖ కారణమును దెలుపుము.”

యువతి_:-   “స్వామీ! నా పేరు భక్తి యందురు. వీరు జ్ఞాన, వైరాగ్య నామకులు; నా పుత్రులు; కాలము తాఱుమాఱయి వీరిట్లు ముసలివగ్గు లయి స్మృతితప్పి పడియున్నారు. ఈ నారీమణులు గంగాది నదులు; వీరందఱు నా సేవ చేయ వచ్చిరి. సాక్షాత్తు వీ రీ ప్రకార మెంత యుపచరించినను నాకు రవంత యయిన సుఖముగా లేదు. తపోధనా! కొంచెము మనసుంచి నా వృత్తాంతము వినుము. నా కథ చేఁటభారతము (మిక్కిలి పెద్దది). దాని నోపికతో విని నా కొకింత శాంతిని సమకూర్చుము.

నేను ద్రవిడ దేశమునఁ బుట్టి, కర్ణాటకమునఁ బెరింగి పెద్దదాన నైతిని. మహారాష్ట్రమున నా కందందు మంచి మన్నన కలిగినది కాని ఘూర్జరమున (గుజరాతు) లో నాకు వార్ధక్యము దాపరించినది. అక్కడ ఘోర మగు కలి ప్రభావమునఁ బాషండులు నాకు అంగభంగము కలిగించిరి. అప్పటినుండి నా పుత్రులతో పెక్కుదినములు పడరాని ఇడుమలు గుడిచితిని. ఆ కారణమున నేను గళాకాంతులు లేనిదాననై వనరుచున్నాను. ఇప్పుడు బృందావనమున నడుగుబెట్టితిని. ఇదె యత్యంత ప్రియమైన రూపముగల సుందరి నయి నవయువతివలె నయితిని. కాని నా యొద్దఁ బడియున్న యీ నా పుత్రు లిప్పుడును మనలోకములేక యుస్సురుస్సురనుచుఁ గ్లేశ మనుభవించుచునే యున్నారు. నే నీ చోటు విడిచి, విదేశములకుఁ బోవలె ననుకొనుచున్నాను. వీ రిరువురు చీఁకు ముదుసళ్ళయినారు. వీరలదే నాకు దుఃఖము, మునిచంద్రా! మే మొకరి నొకరము విడిచి యుండ లేము. కూడి యాడి యుండు వారము. కొడుకులు వృద్ధు లయి, తల్లి పడుచుఁదనము గల దయి యుండుట లోక విరుద్దము కదా! ఈ స్థితి కేమి కారణము? తల్లి పెద్ద దయి బిడ్డలు పడుచువా రయి యుండుట తగును. అది సహజము. ఈ కారణమున నా మనస్సు చెదరి, చింత పడుచున్నాను. నీవు బుద్ధిమంతుఁడవు. పైఁగా యోగ నిధివి, దీని కేమి కారణ మయి యుండఁగలదో తెలుపుము”

నారదు_:-   సాధ్వీ! నేను నా హృదయమున జ్ఞానదృష్టితో నిప్పుడే నీ దుఃఖకారణమును దెలిసికొని చెప్పెద. ఓపిక పట్టుము. నీ వే ప్రకారముగను విచారపడకుము; నీకు భగవంతుడు మేలుచేయును గాక.” అని యప్పుడు మునివరుఁ డగు నారదుఁ డొక క్షణము యోజించి కారణమును దెలిసి యిట్లని చెప్పెను.

నారదు_:-
”బాలా! నీవు సావధానురాలయి వినుము. ఇది భయంకర మగు కలికాలము. ఇందుచే నీ సమయమున సదాచారము, యోగమార్గము, తపము మొదలగున వన్నియు లోపించిపోయినవి. లోకుల స్వభావము కుచ్చితముచేతను, గుకర్మలచేతను పావు లగు దైత్యులవలె నయ్యెను. ప్రపంచమున నెక్కడయినఁ జూడుము. సత్పురుషులు దుఃఖములతో నణఁగారి, దుష్టులు పైకోపుగా నున్నారు. (ఈ కాలమున గండాగొండి (ఆరితేరిన దిట్ట) యైన గడుసరియే ధైర్యశాలి యనియు జ్ఞాని యనియుఁ బండితుఁ డనియు గ్రహింపబఁడుచున్నాడు.) చదువుతో సంధ్యతోఁ బనిలేదు. పుడమి క్రమముగా నా యేంటి కా యేఁడు శేషునకు భార రూపమయి పోవుచున్నది. ఇప్పు డది స్పృశించుటకే యోగ్యము కాదన నేల, కనులతోఁ జూచుటకును యోగ్యత కలదిగాను నుండినది కాదు. అందెందు వెదకిచూచినను మంచి గాన రాదు. నీ జోలి నీ బిడ్డల జోలి యిప్పు డెవరికిఁ బట్టినది? మీతో వారి కేమి కావలసి యున్నది? విషయాంధు (భౌతిక విషయ లాలసలతో మంచి చెడు కాన లేని వారు) లయి, వా రుపేక్ష చేయుటచేతనే మీకీ గతి పట్టినది. కాని, శ్రీ బృందావనము నందుఁ జేరుటచే నీవు తిరిగి నవతరుణివలె నయితివి. సర్వత్ర భక్తి తాండవ మొనరించుటచేతనే ఈ శ్రీ బృందావనధామము ధన్యమయినది. అయినను, ఈ జ్ఞాన వైరాగ్యములఁ బ్రస్తావమెత్తువా రిం దెవరును లేరు. ఆ కారణమున వీరికి బడుగు తనము పోయినది కాదు. కాని, హా! వీరి చిత్తమున కొకింత యేదో హాయి చిక్కి యుండవలెను. అందువలననే గాఢనిద్రవంటి సుఖము ననుభవించుచుఁ బడియున్నారు.” అని నారదుఁడు వచింప, విని,

భక్తి_:-   "నాయనా! శ్రీ పరీక్షిన్మహారా జీ పాపి, కలియుగము, నేల బ్రతికియుండ నిచ్చెను? చూడుఁడు! ఇది వచ్చినంతనే యేమి మాయయో, సర్వవస్తువులలోని సారమంతయు నెక్కడకుఁ బోయినదో దెలియదు. కరుణామయుఁ డగు భగవానుఁడును దా నీ యధర్మము నేల చూచుచు నూరకున్నాఁడో? మునినాథా! నాకీ సందేహమును దీర్పుము. నీ శ్రీసూక్తులచే నాకు మిక్కిలి శాంతి చేకూరినది.” అని చెప్ప విని,

నారదుఁడు_:-   "బాలా! నీ వడిగెదవా? ఇదిగో, చెప్పెద; ప్రేమపూర్వకముగ విను. దీనివలన నీ విచార మెంతయు దూరము కాఁగలదు. ఏనాఁడు శ్రీకృష్ణ భగవానుఁ డీ భూలోకమును విడిచి, తన పరమధామమునకు వేంచేసెనో, యానాఁడే యిక్కడ సమస్త సాధనముల బాధించెడి కలియుగము ప్రారంభ మయ్యెను. శ్రీ పరీక్షిన్మహారాజు దిగ్విజయమునకుఁ బోయినప్పు డీ కలిని జూచెను. అప్పు డీ కలి, యెంతో దీనముగ నా ప్రభువును శరణువేఁడెను. రాజు భ్రమరమువలె సారగ్రాహి కావున ”నేను దీనిని వధింపరా దని యోజించి, పోవిడిచెను. ఏల దీనిని జంపరా దన, దీని యం దపూర్వ మగు నొక గొప్ప గుణము కలదు. ఇతర_:-యుగము లందుఁ దపము, యోగము, సమాధి మున్నగు వానివలనఁ బడయ వలనుపడని ఫల మీ యుగము నందుఁ గేవల హరికీర్తనము చేతనే పూర్తిగా లభింపఁగలదు. ఈ కలియుగము సర్వవిధముల సారహీన మయినదే యయినను, యిందలి యొక్క గుణము చూచి యది సారయుక్త మని, యుత్తరానందనుండు కలియుగ మందు బుట్టెడి జీవుల సుఖము కొఱకే దీనిని మని యుండ నిచ్చెను.

ఈ సమయమునఁ గుకర్మములు ప్రబలిన కారణమున సర్వవస్తువులలోని సార మంతయు వట్టిపోయినది, భూమిలో నెన్ని పదార్థము లున్నవో యన్నియు మాడిపోయి నిస్సారము లైన విత్తనము లయినవి.

బ్రాహ్మణులు కూటిమీఁది యాశచే నధికారి యనక యనధికారి యనక యింటింటి కేగి భగవత్కథను వినిపింపఁ జాగిరి. ఇందుచేఁ, గథలోఁ గొంచెమయినను మహత్తు లేకుండఁ బోయినది. తీర్థము లందు మిగుల ఘోరకృత్యము లొనరించు వారు, నాస్తికులు, నారకీయ పురుషులు (మోసము చేయు నరులు) నుండఁజాగిరి. ఇందుచేఁ, దీర్ఘము లందును బ్రభావ మేమియు లేకుండఁ బోయినది. కామము, క్రోధము, లోభము, తృష్ణ మున్నగు వానిచే నిరంతరము తపించెడి చిత్తము గలవారు తపముచేయువారివలె నటించుటచేఁ దపములోను సారము లేకుండఁబోయినది. మనస్సంయమము లేని కారణమునను, దంభము, లోభము, పాషండత్వమున కది యాశ్రయ మయిన, కారణమునను శాస్తాభ్యాసము చేయని కారణమునను ధ్యానయోగమునకు నెట్టి ఫలము లేకుండఁబోయినది. పండితు లన్నవారు దున్నపోతుల వలెఁ దమ స్త్రీలతో రమించుచు, సంతానమును గనుట యందుఁ గౌశల్యమును సంపాదించిరే కాని ముక్తి సాధన మందు సర్వధా యసమర్థు లయిపోయిరి. సంప్రదాయ పరంపరగా వచ్చిన వైష్ణవత్వ మెందును గానరాకున్నది. ఈ ప్రకార మెందెందుఁ జూచినను సమస్త వస్తువులలోని సార మంతయు నడుగంటి పోయినది. ఇది యెన్నను, యీ యుగము యొక్క స్వభావమే; ఇందెవరి దోషము లేదు. ఈ కారణమున నత్యంత సన్నిహితుఁ డయి యుండియు శ్రీహరి యన్నింటి నోర్చి యున్నాఁడు.” అని నారదుఁడు భక్తితో జెప్పెను.

సూతు_:-   శౌనక మునిపుంగవా? యీ ప్రకారము చెప్పిన నారదముని వచనములను విని భక్తికి మిగుల నాశ్చర్యము కలిగెను. తరువాత నామె యేమి యడిగెనో దానిని జెప్పెద, వినుఁడు. అంత భక్తి నారదమహర్షిని జూచి “దేవర్షి! మీరు ధన్యులరు. నేనెంతో యదృష్టవంతురాలను గనుకనే మీ రిక్కడకు విచ్చేసితిరి. సంసారమున సాధుదర్శనము సర్వకార్యముల సిద్ధింపఁజేయునట్టి సర్వశ్రేష్ఠదుగు సాధనము. నారద మహర్షి? మీ యుపదేశ మొకదానిని వినిన మాత్రముననే కయాధూకుమారుఁ (హిరణ్య కశిపుని భార్య, ప్రహ్లాదుని తల్లి పేరు కయాధు అని పాఠ్యంతరం కనబడుచున్నది) డయిన ప్రహ్లాదుఁడు సంసారమందు మాయను గెలిచెను. మీ కృపచేతనే ధ్రువుఁడు ధ్రువపదమును బ్రాప్తించెను. మీరు సర్వమంగళ స్వరూపులరు. సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రులరు. మీకిదే నమస్కార మొనరించెదను.