పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తొండంబులఁ బూరించుచు

కం||
తొండంబులఁ బూరించుచు
గండంబులఁ జల్లుకొనుచు ళగళరవముల్
మెండుకొన వలుఁదకడుపులు
నిండన్ వేదండకోటి నీటిం ద్రావెన్.
బాహ్య|| -వేదండంబులు తమ తమ తొండంబులచే నీటినిఁబూరించి గండస్ధలములయందుఁ జల్లుకొని ఘీంకరించుచుఁ గడుపుల నిండఁ దజ్జలంబులఁ బానముఁజేసెనని తాత్పర్యము-
రహ|| - జీవుఁ డవిద్యావశుడై యున్నను, గామముచే నాకర్షింపఁబడకుండ నుండువఱకు, నాత్మానుసంధానపరుఁడై, స్వరూప సాధనల యందుండు నెట్లనగా? "తొండంబులచేఁబూరింపుచు" శ్రు|| బ్రహ్మైవాహ మస్మితీ, యావృత్తిః పూరతోవాయురుచ్యతే" నేను బ్రహ్మము నైతిననువృత్తి (జ్ఞానము) పూరక మని చెప్పఁబడును. అట్టి వృత్తిచే వాయువును, ఆజ్ఞయందు నిలుపుచు దశవిధ నాధానుసంధానము (గళగళరవముల్) సేయుచుఁ గడుపులు నిండన్-వాయువును గుంభించి "శ్రు|| తద్వృత్తినైశ్చల్యం కుంభకం ప్రాణసంయమః|| " నేనుబ్రహ్మము నైతి నను, వృత్తిచేఁ బూరించి యా వృత్తి యొక్క నిశ్చలత్వముచే గుంభించి మనఃకాసారమందాత్మాకార వృత్తులతో నుండె నని తాత్పర్యము.