పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : రాజేంద్ర విను సుధారాశిలో

సీ||
రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వ;
ము త్రికూటం బనఁ నరుచుండు;
యోజనాయుతమగు నున్నతత్వంబును;
నంతియ వెడలుపు తిశయిల్లుఁ;
గాంచనాయస్సారలధౌతమయములై;
మూఁడు శృంగంబులు మొనసియుండుఁ;
ట శృంగబహురత్న ధాతుచిత్రితములై;
దిశలు భూనభములుఁ దేజరిల్లు;
తే||
భూరి భూజ లతా కుంజ పుంజములును
మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును
రఁగి తిరిగెడు దివ్యవిమానములును
ఱులఁ గ్రీడించు కిన్నరయముఁ గలిగి.
బాహ్య|| పయోరాశి యందు పది యోజనము, లున్నతమును, నంతియ వైశాల్యమును, కలిగి - సువర్ణ, రజిత, అయో (యినుము) మయము లగు మూడు శిఖరములచే నొప్పి చఱియ (కొండపార్శ్వము)ల యందును, శిఖరముల యందును, నిండి యుండు నవరత్న కాంతులచేఁ బ్రకాశింపజేయు దిగంతరాళములును, నానావిధ వృక్షములు, నచ్చటచ్చట బ్రాకు తీవల సమూహములచే, సహజనిర్మితము లగు పొదరిండ్లును, ప్రతిధ్వను లిచ్చు చిన్న చిన్న సెలయేళ్ళును, గూఢముగా సంచరించు, దేవవిమానములును, కిన్నరులు (దేవతా విశేషములు) విహరించు చఱియలును, గలిగి త్రికూటం బని యొకానొక పర్వతముఁ గలదు.
రహ|| సుధారాశి యనఁగా?
శ్లో|| ప్రత్యగ్వస్తునిని స్తరంగసహజా - నందావబోధాంబుధౌ||
సంకల్పరహిత మగు నిశ్చలసమాధియును ప్రత్యగ్రూప సహజానందాంబుధి యనగా. "నాన్యత్పశ్యతి, నాన్యచ్ఛృణోతి, నాన్యద్విజానాతి, సభూమా" యే స్థితి యం దితరముఁ జూడఁడో, వినఁడో, యెఱుఁగఁడో, యా స్థితిని భూమా బ్రహ్మానంద మని చెప్పఁబడును.
శ్లో||
యం లబ్ధ్వాచా౾పరంలాభం - మన్యతేనాధికంతతః
యస్మిస్థితో నదుఃఖేన - గురుణాత్రిపి విచాల్యతే
తంవిద్యాదుఃఖసంయోగ - వియోగంయోగసంజ్ఞితం||
ఏ బ్రహ్మానందసుఖమును బొంది యితర సుఖములను, దానికంటె నధిక మని తలంచఁడో, యే స్థితి యందుండి గాఢదుఃఖము గలిగినను, ఇంచుకైనఁ జలింపఁడో, యా సుఖమును, దుఃఖరహిత మగు బ్రహ్మానంద మని తెలియవలెను. అట్టి సహజ జ్ఞానానంద సుధారాశి యగు పరబ్రహ్మము నందు యోజనాయుత మగు నున్నతమును - పదివేల యోజనముల యెత్తు ననగా పాదోzస్యవిశ్వాభూతాని - త్రిపదస్యామృతం దివిక" అను మంత్రవాక్యము చొప్పున, ననంత మని భావము. అంతియ వెడలవు నోతప్రోతములు (పడుగుపేక)గాఁ గూర్పఁబడిన పరబ్రహ్మము నందు గుణసామ్య మగు ప్రకృతి కాంచన రజోగుణంబును (హిరణ్మయము) అయస్సార - తమోగుణంబును, కలధౌత - సత్వగుణంబును, పృధగ్విధములుగా వ్యక్త మయి, తత్తత్ప్రతిబింబము లగు (ఈశ్వర) బ్రహ్మ, విష్ణు, రుద్రులు, గలిఁగి త్రిగుణంబులను, శృంగములచే బ్రకాశించుచుఁ దట - చఱియ లందు, హిరణ్మయ (సూత్రాత్మ) సూర్యచంద్రాది కాంతులచే, భాసమానంబు లగు మహాత్తత్వ, యహంకార మనస్తత్వ - అన్నమయాది కోశ భూనభోంతరాళములును, సంసార (అశ్వత్థ) పాదపంబులును, ఆశాలతా నిర్మిత (చవిక) పొదరిండ్లును "శుభాశుభాభ్యాంమార్గాభ్యాం వహంతీ వాసనాసరిత్" వ్రాసనా ప్రవాహము, శుభాzశుభ మార్గముల యందుఁ బ్రవహించుచుండును. అను శ్రుతి చొప్పున, వాసనలను ప్రవాహములును, మరిగి తిరిఁగెడు దివ్యవిమానము లనగా?
శ్రు|| ఆత్మానంరధినంవిద్ధి - శరీరం రథమేవచ
బుద్ధింతుసారధింవిద్ధి - మనః ప్రగ్రహమేవచ
ఇంద్రియాణిహయా న్విద్ధి - విషయాస్తేషుగోచరాః
ఇంద్రియై ర్మనసాయుక్తం - భోక్తారంవిద్ధి పూరుషమ్||
శరీరమే రథమును, నింద్రియములే గుఱ్ఱములును మనస్సే, ఖలీనము (కళ్ళెము) బుద్ధియే సారథియును, మనస్సేంద్రియ యుక్తుఁ డగు జీవుఁడే రథి యగు పురుషు, డాతఁడే భోక్త యని యెఱుంగు మట్టి శరీరములను, రథంబులును, స్థూల, సూక్ష్మ, కారణంబు లగు, విమానములును, దత్తదుపాధుల యందుఁ జరించుఁ విశ్వ, తైజస, ప్రాజ్ఞులను, కిన్నరులును, గలిగిన త్రికూటం బను పర్వతంబు కలదు.
సృష్టిక్రమము.
శ్రు|| ఇదమగ్రే సదేవాశీ-త్సౌమ్యపైంగలనిర్గుణం
సత్యజ్ఞానానందపూర్ణం -నిత్యముక్తమవిక్రియం
ఏకమేవాz ద్వితీయంత - త్పరబ్రహ్మసనాతనం
తస్మిన్త్రిగుణసామ్యాసా - మూలప్రకృతిసంజ్ఞికా
శుక్లలోహితకృష్ణైకా - శక్తిరాశీత్స్వయంప్రభా
మరుభూమౌజలంశుక్తౌ - రౌప్యంస్థాణౌచపూరుషః
స్ఫటికేపిచరేఖావా - భాసమానానిజభ్రమాత్
మూలప్రకృత్యామేవాసౌ - నిర్గుణఃప్రతిబింబితః
సోకామయత సృష్ట్యాదౌ - సృజామీతిసదాశివః
తమోరజస్సత్వగుణా - ప్రకృతిర్ద్వివిధాభవతి
సత్వశుద్ధ్యవిశుద్థిభ్యాం - మాయాzవిద్యాచతేమతే
మాయాబింబోవశీకృత్య - తాంస్యాత్సర్వజ్ఞఈశ్వరః
అవిద్యావశగస్త్వన్య - స్తద్వైచిత్రాదనేకధా
నాకారణ శరీరంస్యా - త్ప్రాజ్ఞస్తత్రాభిమానవాన్
సౌమ్యుఁడ వగు నో పైంగలుఁడా? సృష్టిక్రమము, వినుము. పరబ్రహ్మ మనఁగా. సత్యము, జ్ఞానము - ఆనందము - సచ్చిదానంద మెట్లు చక్కెర శ్వేత మృదు మధురములు విభజించుటకు వీలులేదో, యేక పదార్ధముగా నుండునో, యట్లు సచ్చిదానంద మేక రూప మయి, "ఏకమేవాద్వితీయం బ్రహ్మ" మని సజాతీయాది భేదరహితమైన పరిపూర్ణ మగు పదార్థము కలదు. అట్టి బ్రహ్మము నందు, మరుభూమి యందు జలమును - శుక్తి (మంచి ముత్యపుఁ జిప్ప) యందు రజితమును, స్థాణువు నందుఁ పురుషుఁడును, స్ఫటికము నందు రేఖలును గల్పితముగాఁ దోచినట్లు వివర్తోపాదానకారణము (రజ్జసర్పభ్రాంతి) వలె, మూలప్రకృతి, యవినాభావసంబంద (ఆత్మలేనిచోతానభావ)ముగా, నానిర్భవించె నట్టి ప్రకృతి యందు బ్రహ్మము ప్రతిబింబిత మయి సదాశివుండని పేర్కొనఁబడెను.
ఆ ప్రకృతియే, మాయ యనియు, నవిద్య యనియు - సమిష్టివ్యస్టి రూపముగాఁ బరిణమించిన తత్తదుపాధుల యందు మఱల సదాశివుఁడు ప్రతిబింబితుఁ డగు జీవుఁడు, కారణోపాధి (సుషుప్తి) యనఁగా ఆనందమయకోశము, మాయా ప్రతిబింబితుఁ డీశ్వరుఁ డని వ్యవహరింపఁబడుచున్నాడు.
పూర్వపక్షి - బ్రహ్మము పరిపూర్ణము, నిస్సంగము నిరీహము (ఇచ్ఛలేనిది) అను విశేషణ యుక్త మని చెప్పిదాని యందు ప్రకృతి పుట్టిన దని నుడువుట వ్యాహతము (విరోధము) కాదా?
సిద్ధాంతి- ప్రకృతి యనునది యేదోయొక సత్యమగు పదార్ధము కలదనియు, జగత్తు తత్కార్య మగు ననియుఁ జెప్పియుండ లేదు మఱి ఏమనగా?
శ్రు|| స్వప్నమాయే యథాదృష్టే - గందర్వనగరంయధాతధావిశ్వమిదందృష్టం - వేదాంతేషువిచక్షణె
స్వప్నము - మాయ - గంధర్వనగరము - (పైశాచపట్టణము) మున్నగు మాయాకార్యములు వలెఁ బ్రపంచ, మసదాత్మక మని శ్రుతియుక్తము.
పూర్వపక్షి - సుఖదుఃఖ ప్రయచ్ఛక మగు ప్రత్యక్ష ప్రపంచము శూన్య మెట్లగును?
సిద్ధాంతి - మీకు సత్యముగాఁ దోచునది జాగ్రత్ప్రపంచమా? స్వప్నప్రపంచమా? త దుభయమునా? యం దెద్దియును సరికా దెందు వల్ల ననఁగా?
శ్రు|| స్వప్నేజాగరితం నాస్తి - జాగరేస్వప్నతానహి
ద్వయమేనభవేన్మిధ్యా - గుణత్రయ వివర్జితః
జాగ్రత్స్వప్నప్రపంచము లన్యోన్య స్థితుల యం దితరేతరము, లసత్యము లగుచున్నవి. యట్లే గుణాతీత సుషుప్తీ యం దుక్తద్వయమును తద్వయమును తద్వయము నందు సుషుప్తి (మనోలయస్థితి)యు, నభావము నొందుచున్నవి. కావున నితరావస్థల యందస్తంగత మగు ప్రపంచము సత్య మనుట యనుపపన్నము (అసందర్భము) కాదా?
పూర్వపక్ష్షి - పూర్వాపరముల యందగు పడకున్నను (ఘటమువలె) వర్తమానమునం దగుపడు విషయ, మవిషయ మని యెట్లు విషయీకరింతురు
విషయము - ఇంద్రియగోచర పదార్థము.
విషయీకరించుట - ఉద్దేశించుట.
సిద్ధాంతి - వర్తమానము నందు విషయాకారముగాఁ దోచిన నేది ఘటమువలె బ్రాగభాన ప్రధ్వంసా భావమో యనఁగా బూర్వము నందును, నాశనాంతరము నందును - ఘటాకారములేక మృత్తే శేషింపఁబడునో యట్లే - యాద్యంతముల యంద భావ మగు - జగత్తు వర్తమానంబు నందును - అభావ మనియే నిశ్చయింపవలెను. కావున నవిద్యా ప్రభావ జనిత విషయేంద్రియ సంయోగకాల మందు మాత్రము సదాకారమువలెఁ దోచుచున్నది. యదియే మాయా లక్షణము.
పూర్వపక్షి - నేను బాలుఁడను - యౌవనవంతుఁడను - సుఖనిద్ర - యను అనుభవమునకు మిధ్యాత్వ మెట్లు సాధింతురు?
సిద్ధాంతి - అవస్ధా విశేషములకుఁ గాదు.
శ్లో|| నబాల్యం యౌవనే లబ్ధం - యౌవనం స్ధావిరేతధా
నపితుః పునరాయాతి - నాయాత్యేన గతందినం||
యౌవనము నందు, బాల్యమును, స్థవిర (వృద్ధత్వము) నందు యూనభావమును, వర్తించుటలేదు.
శ్లో|| గతం యధాత్రబాలత్వం - తారుణ్యంచగతం తధా
తధాగచ్ఛతి వార్ధక్యం - స్మరధ్వం యమశాసనఁ
బాల్య యౌవన వార్ధక్యములు, కాలానుసరణంబుగా గతించు చున్నవి. కాన మరణమునకు సిద్ధముగా నుండవలెను.
కం|| మతిదలఁపఁగ సంసారం
బతిచంచల మెండమావు - లట్టులు సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలువచ్చు - కాలముకంటెన్
అను మొదలగు శ్రుతి స్మృత్యనుభవముచే, నసదాత్మకమగు ప్రపంచము సత్య మనుట కేవలము హఠము (మూర్ఖవాదము) మీ అద్వైత సిద్ధాంతము నందు మాయ యనఁగా లేనిది. తత్కార్య మగు విశ్వమే ప్రత్యక్షము. అనఁగాఁ గారణ కార్యము లన్యోన్య విరుద్ధములై యున్నవి. యెట్లనగఁ? బులుసు తీపి, పులుసులోని ముక్కచేదు.
శ్రు|| ఆకాశాద్వాయుః వాయోరగ్నిః
చుండఁగాఁ దత్సంధుల యందు నాత్మయే స్థిత మగును.
స్రస్త మగు మనన (మనస్సు) యొక్క యాకారమే స్వరూపస్థితిఁ చెప్పబడుచున్నది. యింకను బంధమోక్షములే సత్య మను నెడఁ బెక్కు, లనర్ధములు గలిగి, ప్రశ్నలనుత్తార్యములై యుండును. . గ్రంధవిస్తర భీతిచే నుదహరించుటలేదు.
పూర్వపక్షి - మీరు బోధించిన తత్వ ముపలబ్ధమయి (బోధపడి) నను అనుభవమునందు నాకు విశ్వాసములేదు.
సిద్ధాంతి - మీ యుక్తి సమంజసముగా లేదు. కడుపు నిండినది గాని - క్షుత్తు బాధించు చున్న దన్నటు, లేకార్ధ ప్రయోగధాతువులలో నొకదానిచేఁ బరిసమాప్తినిఁ జెప్పి వ్యతిరేకముఖ మగు క్రియచే నా సమాప్తినిఁ జెప్పుట ప్రథమ ధాత్వర్ధమునకుఁ గూడ లోప మగును. కావున బోధానుభవములు కలసియే యుండును.
శ్రు|| బ్రహ్మవిద్బ్రహ్మైవభవతి - బ్రహ్మ విదాప్నోతిపరమ్
అద్వైతే బోధితేతత్వే - వాసనా నప్రవర్తతే||
బ్రహ్మము నెఱింగినవాఁడు, బ్రహ్మమే యగు చున్నాడు. పరమును బొందుచున్నాడు. అద్వైతరూప తత్వముఁ దెలియఁబడుచుండగా - వాసనారూప యజ్ఞానము నశించుచున్నది. యిట్లు శ్రుతి స్మృతులవలన - బ్రహ్మమును తెలియుటయే తత్స్వరూపానుభవము కావున
శ్లో|| బోధే ప్యనుభవోయస్య - నకంచన జాయతే
తంకధంబోధయేచ్ఛాస్త్రం - లోష్ఠంనరసమాకృతిం||
ప్రత్యక్షముగాఁ బదార్ధమును జూచుచున్నను, స్ఫురించుట లేదను నట్లు, స్థూల, సూక్ష్మాది సకల విషయములకు సాక్షియై తాను వేఱుగానున్నట్లు అవగతమైనను (బోధపడినను) ఎవఁ డనుభవము లేదని వాదించునో, యట్టి మృణ్మయాకార నరునకు శాస్త్ర మెట్లు బోధించును? బోధింపఁజాల దని యర్ధము.
పూర్వపక్షి - మీ యుపదేశము, అనుభవావరోధమయి యున్నది. స్వప్రకాశము నందు (అవిద్య) చీకటి పుట్టుట తత్కార్యము లగు విక్షేపావరణములును తేజస్తిమిరములవలె వ్యాహతముఁ గావా?
సిద్ధాంతి - కావు. అవిద్యా శబ్దార్ధము శబ్దము నందే, యసత్య మని స్పష్ట మగును. అసత్యము, కల్పిత మం దనుభవము లేదనుట, వృశ్చిక సందష్టుఁడను, జోరుఁడును, నిషిద్ధక్రియ లొనర్చువారును, బహిరమున బాధలేనట్లు నటించి, కపటాడంబర విలాస యుక్త వక్త్రు లైనను, అంతరమున నెట్లు బాధాతిరిక్తులై, కంపితులై, యుందురో, యటువలెఁ గుతర్కాదుల నన్నిటిని ననుభవము గ్రసించును గదా।
శ్లో|| స్వప్రకాశేకుతోzవిద్యా - తాంవినాకధమావృతిః
ఇత్యాది తర్కజాలాని - స్వానుభూతిర్గసత్యసౌ||
స్వప్రకాశము నం దవిద్య యెట్లు జనించును అవిద్య లేనిచో, నావరణ మెట్లు కలుగును? ఇత్యాది కుతర్కోక్తులను, స్వానుభవము, కబళించునుకదా? (కుతర్కమనగా యదార్ధము నెఱింగి యుండి, తెలియనట్లు నటించి, యుపన్యాసకునిఁ బతితునిఁ జేయుటకై వేయు ప్రశ్న) ఇట్లు పూర్వపక్ష సిద్ధాంతములచే సిద్ధాంతీకరింపఁబడిన సుధారాశి యను - బ్రహ్మము నందు గుణసామ్య మగు ప్రకృతియను త్రికూటాచలాహ్వయాచలము సంసార మను అశ్వత్థవృక్ష సహిత మయి వివర్తోపాదాన కారణముగాఁ గలిగె నని రహస్యార్ధము. (వస్తువు మారక - మఱియొక విధముగాఁ గనుబడుట వివర్తము - రజ్జు, సర్పము)