పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : మకరితోడఁ బోరు

వ|| అప్పుడు-
ఆ|| వె||
కరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించి పోవఁ గాళ్ళు రాక
గోరి చూచు చుండెఁ గుంజరీయూథంబు
గలు దగులుఁ గారె గువలకును.
బాహ్య|| -కరణీయూధము గజేంద్రు నొక్కరుని వీడ్కొని పోలేక తమ యజమాని యొక్క సంకటపాటుఁ జూచుచు నిశ్చేష్టితమై యుండెను. మగువలు మగలను విడచి యుండలేరుఁ బంధకములు కదా।
రహ|| -కామవిముక్తికై పోరాడు జీవుని విడువలేక సద్వాసనలు చూచు చుండెనని తాత్పర్యము.
(వివరణ) జీవుఁడు పూర్వవాసనా ప్రారబ్ధముల ననుసరించి దుష్కృతముల నాచరించుచున్నను, నీ పాపకృత్యము నాకెట్లు తప్పు నను విచారణ (పశ్చాత్తాపము కల్గును) అయినను దప్పించుకొన సమర్ధుఁడు కాడు, తజ్ఞి జ్ఞాసయే సద్వాసన యగును అట్టి సద్వాసనలు వర్తమాన పుణ్యకర్మల యొక్క ఫలాదారములని తెలియవలెను. పాపకృత్యములు నింద్యము లని యెఱింగినను, సద్యఃకృతసంధ్యావందనాదికము, వర్తమాన ప్రతిబంధక మగు కామాదులను నివారించ సమర్ధము కాదు గాని, పశ్చాత్తాపజనిత సద్వాసనలు భవిష్యత్తునకు సుకృత కారణములై జననమునకుఁ బూర్వమే సువర్ణరాపిడిపొడిలక్కయందుఁ బొదువఁబడి యున్నట్లు బుద్ధి యం దంతర్భవించి యుండును. "బుద్ధిః కర్మానుసారిణీ" పూర్వకర్మ ఫలవాసనా రూపమై బుద్ధిపుట్టును.
శ్రు|| శుభాశుభాభ్యాంమార్గాభ్యాంవహంతీ వాసనాసరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీ యాశుభేపధి అశుభాచ్చా లితంయాతి శుభం తస్మాదపీతరత్ ద్రాగభ్యాస వశాద్యాతి యదాతే వాసనోదయమ్ తదాభ్యాసస్యసాఫల్య విద్ధిత్వ మరి మర్దన||
తా|| హే శతృసంతాపా। వాసనాప్రవాహము శుభశుభకర్మ ప్రణాళిక కాలువల యందుఁ బ్రవహించుచుండును. - స్వప్రయత్నముచే జిత్తమును, నశుభములనుండి మరలించి శుభమువైపుఁ ద్రిప్పుము అ ట్లభ్యాసముఁజేయ నపుడు సద్వాసన (పశ్చాత్తాప దుఃఖవిచారణ) గల్గునో యదియే యభ్యాసమునకు సఫలము - అట్టి సద్వాసన లుత్తరజన్మమున కుపయోగ మగును - లోకములో "వాఁడు జ్ఞానబోధ సేయుచున్నాడు గాని యాచరణలేదు" అను నింద్య వాక్యముల రహస్య మిదియే; కావున నిట్టి సద్వాసనలు విడువఁజాలక జీవకృత సుకృత, దుష్కృతములను జూచుచున్న వని యాశయము.