పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఇట్లు కరిమకరంబులు

వ|| ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండ దరితంబులై తలపడి నిఖలలోకాలోకన భీకరంబులై యన్యోన్య విజయ శ్రీవళీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరి హరి యును,
గిరి గిరియు నుందాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున నీరాటంబయిన పోరాటంబునం బట్టుచు
వెలికి లోనికిం దిగుచుచుఁ గొలంకు గలంకంబొందఁ గడువడి నిట్టట్టుఁ బడి తడఁబడి బుడ బుడాను కారంబులై భుగులు భుగుల్లను చప్పుళ్ళతో నుఱువులు గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుఁ దప్పక వదన గహ్వరంబుల నప్పళించుచుఁ నిశిత నితాంత దురంత దంత కుంతంబుల నింతింతలు తునియలయి, నప్పళంబునంబునుక చిప్పలు గుదుళ్ళుదప్పి. రక్తంబులు గ్రమ్ముదేఱ హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు నితర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచుఁ బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు మకరకమఠ కర్కట గండక మండుకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండొంటిం దాకు రభసంబున నిక్కలువడ మ్రక్కంద్రొక్కుచు మెండుచెడి చెండుపడి నాచుగుల్ల సిప్పతండంబులఁ పరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోలమాసగొనక గెలుపుఁ దలంపులు బెట్టిదంబు లై రెట్టింప నహోరాత్రంబులుంబోలె గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై యవక్ర పరాక్రమఘోరంబులై పోరుచున్న సమయంబున
బాహ్య|| ఈవచనమునకుఁబై పద్యములలో వర్ణించి నకలహోద్రేక భయంకర విషయంబులనే, స్పష్ఠముగా విశదీకరించెను.
రహ|| - - కామము, తజ్ఞునకు నిత్యవైరి యగుటచేఁ దన్నిరోధ సాధనోపాపాయములే యుద్ధము, యెట్లన
శ్లో|| ధూమేనావ్రియతేహ్ని*ర్యధాzదర్శోమవేనచ
యధోల్బేనావృతోగర్భ*స్తధాతే నేదమావృతమ్
ఆవృతంజ్ఞాన మేతేన *జ్ఞానినో నిత్యవైరిణా
కామరూపేణ కౌంతేయ *దుష్పూరేణానలేనచ||
తా|| ఈ కామము ధూమముచే నగ్నివలెను మలము (కళాయి) చే, దర్పణమువలెను, మావిచే బిండమువలెను, కామమను నజ్ఞానము, ఆత్మజ్ఞానము నావరించుచున్నది. యిచ్చటఁ జిన్న రహస్యము కలదు అగ్నిని జ్వలింపజేసి యూదినంత మాత్రమున నజ్ఞానము నశించు, నిది యారూఢుని లక్షణము. అభ్యాసుని లక్షణమెట్లన దర్పణ మందలి మలినము (కళాయి) కత్తితోఁ గోకినం గాని యాడదు, ఊదుటకంటె గష్టము ప్రారబ్ధ బలిష్ఠము, ఇంక నారంభకుని లక్షణ మెట్టి దనగా నుల్బణమను మావిని నైపుణ్యముచేఁ దొలఁగించని యెడల శిశువునకుఁ బ్రాణభంగ మగును. తొలఁగించుట కష్టతరము గావునఁ దత్వజ్ఞునకు నిత్యవైరి యగు నీ కామము చతుర్థోపాయము (దండోపాయము)చేతనే నశించును.
శ్లో|| హస్తం హస్తేనసంపీడ్య*దంతాన్దంతైర్విచూర్ణ్యచ అంగాన్యంగైసమాక్రమ్య*జయేదాదౌస్వకంమనః
తా|| హస్తసంపీడనము (గ్రుద్దులు) దంతములచేఁ గఱచుట - కుస్తీపట్లు మల్లయుద్ధముఁ జేయుట - మున్నగు దండోపాయములచే ధ్యానమునకుఁ బూర్వమే స్వకీయమైన మనస్సును జయించవలెను.
శ్లో|| "కామజానామితేమూలంసంకల్పాత్వంహిజాయసే"
కామమా! నీ పుట్టుక నే నెఱంగుదును. సంకల్పమున గదా పుట్టుచున్నావు. అనుశ్రుతి చొప్పున సంకల్పరూప మనస్సుని గ్రహించిన యెడలఁ గామము నిగ్రహింపఁబడును. ఇట్లు జీవుఁడు కామముతో యుద్ధము జేసె నని తాత్పర్యము.