పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఎవ్వనిచే జనించు

ఉ||
వ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
తా|| సకల భువనసృష్టిలయ నియామకత్వంబులును, ఉపాదాన కారణత్వమును, ఆది మధ్యాంత రహితత్వమును, సర్వనామ రూపత్వ మెవ్వనిచే ధరింపఁబడుచున్నదో, యట్టి యీశ్వరుని శరణుఁజొచ్చుచున్నాను.
రహ|| "ఎవ్వనిచేజనించు, జగమెవ్వని లోపలనుండు లీనమయి"
శ్రు|| యతోవా ఇమాని భూతాని జాయంతే, యేనజాతానిజీవంతియత్ప్రయంత్యభి నంవిశంతీతి - ఈభూతము లెవనివలన నుత్పత్తియై వృద్ధిఁబొంది, తరంగములవలె నెవని యందు లీనమగుచున్నవో.
శ్లో|| జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చర్ధేష్వభిజ్ఞ స్వరాట్||
తా|| ఆభాసితము లగు సర్వపదార్ధముల యం దన్వయవ్యతిరేకములచే నే స్వయంప్రకాశమానుఁడు. ప్రత్యభిజ్ఞుఁ (తెలియఁబడ్డవాఁ)డగు చున్నాడో, యన్వయ మనగా నన్నమయాది కోశముల యందును.
"సూత్రేమణిగణఇవ" అనునటు లంతర్యామియై యుండుట, వ్యతిరేక మనగాఁ బృధగ్విధములై యుండు కోశాదులం దవచ్ఛేదముగా నుండుట - యాభాస వాదమనగాఁ బ్రతిబింబవాదము.
అవచ్ఛేదవాద మనగాఁ వ్యవహారోపయోగము లేనిస్థితి - స్తంభము - ఱాయి మున్నగునవి. మూలకారణుఁ డనగా "మూలప్రకృత్యామే వాసౌనిర్గుణః ప్రతిబింబితః" మూలప్రకృతి యందే నిర్గుణుఁ డగు పరమాత్మ ప్రతిబింబించెనో యట్టి యీశ్వరుని శరణుజొచ్చెద నని తాత్పర్యము.