పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : అని మఱియును - మాతులుంగ

వచనము. అని మఱియును - మాతులుంగ, లవంగ, లుంగ - చూత - కేతకీ, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుళ, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబూ, జంబీర, మాధవీ, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, ప్రియాళు, బిల్వ, యమాలక, క్రముక, కదంబ, కరవీరః, కదళీ, కపిత్థ, కాంచన, కందరాళ, శిరీష, శింశుప, అశోక, పలాశ, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంప దంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపి, వీరున్నినహలంకృతంబును, మణివాలుకానేక విమలపులిన తరంగిణి సంగత విచిత్ర, విద్రుమలతా మహోద్యాన శుకపిక నికరనిశిత సమంచిత చంచూపుట నిర్దళితశాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్ధిత రసప్రవాహ బహుళంబును - గనకమయ సలిలకాసార కాంచనకుముద కల్హారకమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భారపరిశ్రాంతకాంతా సమాలింగిత కుమార మత్తమధుకర విటసముదయ సమీపసంచార సముదంచిత, శకుంత, కలహంస, కారండవ, జలకుక్కుట, చక్రవాక, బక, బలాక, కోయష్టిక, ముఖర, జలవిహంగ, విసర వివిధ కోలాహల బధిరీభూత, భూనభోంతరాళంబును, దుహినకర, కాంత, మరకత, కమలరాగవజ్ర, వైఢూర్య నీలగోమేధిక, పుష్యరాగ, మనోహర, కనక, కలధౌతమణిమయానేక శిఖరతటదరీ విహరమాణ విద్యాధర, విబుధ, సిద్ధ, చారణ, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, మిధునసంతత సరససల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును - గంధ గజ, గవయ, గండభేరుండ, ఖడ్గ, కంఠీరవ, శరభ, శార్దూల, శశ, చమర, శల్య, భల్ల, సారంగ, సాలావృక, వరాహ, మహిష, మర్కట, మహోరగ, మార్జాలాదినిఖిల మృగనాధసమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునైయొప్పునప్పర్వత సమీపంబునందు.
బాహ్యార్ధము
మాతులుంగ - మాదీఫల.| వకుళ - పగడ
లవంగ - దేవకుసుమ. | వంజుళ - అశోకము
లుంగ - పుల్లమాదీఫల. | కుటజ - కొడిశ
చూత - తియ్యమామిడి. | కుంద - మొల్ల
కేతకి - మొగలి. | కురవక - ఎఱ్ఱగోరింట
భల్లాతకి - నల్లజీడి. | కురంట - పచ్చగోరింట
అమాత్ర. - అంబాళ. | కోవిదార - ఎఱ్ఱకాంచన
నరళ -. దుర్గంధ. | సింధువార- వావిలి
బదరీ -. రేగు. | పిచుమంద- వేప
మందార - జిల్లేడు. | కదంబ - కడప (నీప)
జంబీర - నిమ్మ. | కరవీర - గన్నేరు
మాధవీ - పువ్వులగురివెంద. | కాంచన - సంపంగి
మధూక - ఇప్ప. | కందరాళ - కలజువ్వి
తాల - తాళ (తాటి). | శిరీష - దిరిశెన
తక్కోల - తక్కోలము. | శింశుప - ఇరుగుడు
తమాల - చీకటిచెట్టు. | పలాశ - మోదుగు
హింతాల - గిరకతాడి. | నాగ - కేసరి
రసాల - తియ్యమామిడి. | పున్నాగ - పొన్న
సాల - వేగి. | చంపక - సంపంగి
ప్రియాళు - మొరట. | శతపత్ర - తామర
క్రముక - ఎఱ్రలొద్దుగ. | మరువక - మరువము
మల్లికా | మల్లితీగ
వీరున్ని వహము | దట్టముగ తీగలచే నల్లిన పొదలు

(శేషించిన భాగమునకు బాహ్యార్ధము సులభము)
రహ|| వసంతసమయ - సౌభాగ్యసంపద, అనగా - స్థూలసృష్టి (పంచీకరణ సమయ మందు) - సంసారణ్యములో, రాగాదిపల్లవములును, విషయ పుష్పంబులును, మొదలుగాగల పాదపంబులచే శోభాయుక్తమయి, మోహమును గలిగిఁచుచున్నదని యర్ధము.
శ్లో|| బీజంసంసృతి భూమిజస్యతుతమోదేహాత్మధీరంకురో
రాగఃవల్లవమంబు కర్మతువపుస్కంధోzసవశ్శాఖికాః
అగ్రాణీంద్రియ సంహతిశ్చవిషయాః పుష్పాణిదుఃఖంఫలం
నానాకర్మ సముద్భవం బహువిధంభోక్తాత్రజీవఃఖఃగః
(అడవిని సంసారముగాఁ బోల్చి చెప్పుచున్నారు)
సంసృతి పాదపమునకు నజ్ఞానమే బీజమును - దేహమే యాత్మయను నిశ్చయమే యంకురమను - (విరోచనమతము) రాగమను లేజిగురును కర్మమను దోహజ (జల)మును - స్థూలోపాధి యే స్కంధము. అనగా వ్రేళ్లకును, శాఖలకును, మధ్యభాగము - ఇంద్రియములను చివరకొమ్మలను - శబ్దాది విషయములను పుష్పములును అనేక జన్మకృతకర్మ వాసనాజనిత ప్రారబ్ధానుభవ దుఃఖఫలంబును - తత్ఫల భోక్త యగు జీవ విహంగము గలిగి యున్నది. - యట్టి వృక్షంబులును - మణివాలు కానేక విమలపులిన - రాబోవు దుఃఖంబులును మఱుఁగుఁబఱచి సద్యోఫలంబులు గలిగించు నాభాససుఖంబులను - తత్సౌఖ్యములను, దుఃఖంబులుగా గ్రహించి - భక్తిధ్యానప్రవాహ తీరస్థజ్ఞాన ఫలరంధ్ర స్రావకమగు - ఆనందరసాస్వాదక, శుక, పికాది, ద్విజసంయుతంబులగు వనంబులును -
శ్లో|| శంభుధ్యానవసంతసంగినిహృదారమేzఘజీర్ణచ్ఛదాః
స్రస్తాభక్తిలతాచ్ఛాటావిలసి తాపుణ్యఃప్రవాళశ్రితాః
దీప్యంతేగుణ కోరకాజపవచః పుష్పాశ్చసద్వాసనాః
జ్ఞానానందసుధా మరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః
తా। - ఈశ్వర ధ్యానమను వసంతా గమమునందు. నాయొక్క హృదయ గతములగు పాపములను పండుటాకులు రాలినవి. భక్తిలతయను గుబురులనుండి, లతలు పుట్టి ప్రాకినవి పుణ్యములను జివురు లంటుకొని యున్నవి. సద్గుణములగు మొగ్గలు దీపించుచున్నవి. మంత్రవాక్కులను, సద్వాసనలతోఁ బుష్పములు వికసించినవి. యాత్మనాత్మవిచారణ జనిత సంతోషామృతపుష్పరసస్రవ యుక్త బ్రహ్మజ్ఞానమను ఫలము ఫలించినది. - కనకమయ సలిలకాసారకాంచన విటప సముదయంబును - కనకమయ మనగా - హిరణ్మయమండలము - తద్గతహృత్పద్మ నివాసిత మగు తృష్ణసంబంధీయ మధుపములును -
శ్రు। క్షణమాయాతి పాతాళం - క్షణంయాతి నభస్థలం
క్షణం భ్రమతిదిఃకుంజె - తృష్ణాహృత్పద్మషట్పద్
హృదయపద్మమునందు పసించు తృష్ణాభ్రమర మూర్ధ్వాధోదిగంతములయందు సంచరించును (అసంతుష్టిచే వ్యభిచరించును) సమీపసంచార - నభోంతరాళంబును, కలహంస యవగా - క్షీరనీర విభాగక పక్షిరాజు - పరమహంస.
శ్లో|| క్షీరంబ్రహ్మజగచ్చనీరముభయంతద్యోగమభ్యాగతం
దుర్భేదంత్వితరేతరం చిరతరం సమ్యగ్విభక్తీకృతమ్
యేనాశేష విశేషదో షలహరీం అశేదుషీం శేముషీం
సోzయంశీలవతాంపునాతిపరమోహంసోద్విజాత్యగ్రణీః
సచ్చిదానంద రూపాత్మక బ్రహ్మను క్షీరంబును - మాయాకల్పిత నామరూపాత్మక జగన్నీరంబును - సమ్మేళనమయి, ధీరూపంబున బరిణమించి, యనాదిగా నున్నట్టి దుర్భేద్యమగునట్టియు, సకలదోష జలరూప ప్రవాహినియు నగు నింద్యమైన బుద్ధిని, సత్వశీలుఁడును. పరమహంసయు నగు శంకరుఁడు, జగద్బ్రహ్మములను విభజించి యున్నాడు. అట్టి హంసలును - శరభ, శార్దూల, చమరీమృగములన - నప్పర్వత సమీపంబునందుఁగల కామాదులనెడి క్రూరమృగంబులు -
శ్లో|| క్రోధవ్యాఘ్రమృగః ప్రలోభశరభస్సమ్మోహపంచాననః
కామాచ్ఛోమ దజంబుకః పరితుదన్ మాత్సర్సకోకస్తధా
ఏతైర్లింగ శరీరకాన నమృగైశ్చోతో మృగాపీడ్యతే
మచ్చోతోహరిణ త్వమాశు శరణం శ్రీమత్పుళిందంవ్రజ||
లింగశరీరారణ్య మందుండు, క్రోధమను పెద్దపులియును - లోభమను శరభమును (సింహ సంహారక మగు మృగము)మోహమను పంచాననము (సివంగి) కామ మను భల్లూకము (ఎలుగుగొడ్డు) మదమను జంబుకము (నక్క) మత్సరమను కోక - తోడేలు లేక (అడవికుక్క)లుఁ గలసి చిత్తమను హరిణమును భాధించు చున్నవి. కావున నో రామచంద్రా! వ్యాధకుఁడవై మచ్చేతో హరిణమును కాపాడుము.