పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : అంభోజాకరమధ్య

వ॥ ఇట్లు వంచిన-
శా॥
అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా
రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్
గుంద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.
బాహ్య॥ ఆ సరోవరాంతర మందున్న తామర యందు సూర్యకిరణము లుత్కాంతితోఁ గ్రీడ సల్పినట్లు గుభుల్ గుభుల్లను ధ్వనితోఁ జక్రము ప్రవేశించి సరస్సు కలఁకంబొంద మొసలి యుండు స్థానమునకు మనోవేగముగాఁ బోయె నని తాత్పర్యము॥
రహ॥ యధైదాంసి సమిద్దోగ్నిర్భస్మసాత్కురుతేర్జున
జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి భస్మసాత్కురు తేతధా॥
తా॥ ప్రజ్వలితాగ్నియింధనముల నెట్లు భస్మముఁ జేయునో జ్ఞానాగ్ని యవిద్యాకార్యము లగు కర్మముల నట్లు నశింపఁజేయును. (కర్మహేతుకమగు కామమును నశింపఁజేయును). గావున బ్రహ్మజ్ఞాన మను చక్రము సంకల్పతీవల నడుమఁ బ్రవేశించిన దని తాత్పర్యము.