పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : పోతన – నన్నెచోడులు చిత్రించిన మన్మథుని రథనిర్మాణం

: :చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం: :

పోతన – నన్నెచోడులు చిత్రించిన మన్మథుని రథనిర్మాణం

ప్రముఖ ఆంధ్రభాష ఆచార్యులు ఏల్చూరి మురళీధరరావు గారి అద్భుత రచన "పోతన – నన్నెచోడులు చిత్రించిన మన్మథుని రథనిర్మాణం" మాలిక సాహిత్య మాసపత్రిక (జాలగూడు పత్రిక), అక్టోబరు-2014 లో ప్రచురితమైంది. ఇక్కడ నొక్కి మాలిక సాహిత్ల్య మాసపత్రిక లోని మూల వ్యాసం ఆస్వాదించగలరు.
లేదా
దాని నకలు ప్రతి క్రింద కూడా చూడగలరు:



రచన:ఏల్చూరి మురళీధరరావు
Elchuri Muralidhararao
ఆంధ్ర జాతీయ మహాకవి బమ్మెర పోతనామాత్యుల వారి వీరభద్రవిజయ కావ్యంలో పరమశివుడు దక్షయజ్ఞఫలంగా తనకేర్పడిన సతీవియోగానికి వికలమనస్కుడై హిమవత్పరిసరప్రాంతానికి వెళ్ళి తపోమగ్నుడైనప్పుడు దేవతలు తారకాసుర వధను కావింపగల కుమారోదయం నిమిత్తం పార్వతీపరమేశ్వరులకు పరిణయాన్ని ఘటింపగోరి శివతపోభంగానికి మన్మథుని అభ్యర్థించిన సన్నివేశం ఉన్నది. మన్మథుడు పరమశివుని యోగదీక్షను భగ్నం చేయటానికి సర్వసన్నాహాలతో రథారూఢుడై బయలుదేరుతాడు. ఆ సమయంలో మన్మథునికోసం కామధేనువు తెచ్చిన పుష్పరథాన్ని మహాకవి వర్ణిస్తున్న పద్యం ఇది:

సీ.
మలషండము నున్నఁగాఁ జేసి యిరుసుగాఁ గావించి, కెందమ్మికండ్లఁ గూర్చి
తగ నించు మోసుల నొగలుగాఁ గావించి, ర మొప్ప గేదఁగి కాఁడివెట్టి
సంపెంగ మొగ్గలఁ నుగొయ్య లొనరించి, ల్లవంబుల మీఁదఁ ఱపుఁ జేసి
చెలువైన పొగడదండలచేత బిగియించి, యెలదీఁగె పలుపులు లలిని జొనిపి
గీ.
తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెనవెట్టి
గండు రాజకీరములఁ గట్టి
మెఱయఁ జిగురుగొడుగు, మీనుటెక్కెముఁ గ్రాలఁ
దేరుఁ బన్ని సురభి తెచ్చె నపుడు. (2-94)

ముద్రితప్రతులలోని అరసున్నలు, అచ్చుతప్పులను సరిచేశాను. పద్యం మొదట “కమలషండము" అని గాక, నిజానికి “కమలకాండము" అని ఉండాలి. దానిని మాత్రం అలాగే ఉంచాను.

ద్యాన్ని చూడగానే మొట్టమొదట కవి రూపించిన రథనిర్మాణంలోని సాంకేతిక విజ్ఞానకౌశలం మన దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రకృతి ద్రవ్యాలలో ఏ రథభాగానికి ఏది ఉపకరిస్తుందో నిశ్చయించుకొన్నాడు. ఆవశ్యకమైన ఆ సాధనసామగ్రిలో దేనినీ విడిచిపెట్టకుండా సాకల్యంతో పరికరాలన్నింటిని ముందుంచుకొన్నాడు. ముందుగా సుతిమెత్తనిదైన కమలకాండాన్ని (తామర తూడును) తీసుకొని గమనసౌలభ్యంకోసం మరింత నున్నగా చేశాడు. దానిని ఇరుసుగా నిలిపాడు. తూడు కనుక దాని ఆకృతి రథానికి ఇరుసుగా పనికిరావటం భావ్యమే. ఇరుసుకు అటూయిటూ ఎఱ్ఱతామరలతో చక్రాలను కట్టాడు. రథచక్రం శతారం కాబట్టి చక్రంలోని నూరు ఆకుల వలె రేకులు విప్పారి ఉన్న శతపత్రాలను చక్రాలుగా బిగించటం సమంజసమే. కాడి మానికి ఆధారంగా రథానికి ముందు రకరకాల పువ్వు మోసులతో నిడుపాటి కొయ్యలను నొగలుగా బిగించాడు. గుఱ్ఱాల మెడలపై ఉంచేందుకు గేదంగి పువ్వుల కాడిని నిలిపాడు. గేదంగి పువ్వులు పసిమివన్నెలో చూడ ముచ్చటగా ఉండి, సురభిళ పరిమళాలను విరజిమ్ముతుంటాయి. పచ్చ పూమొగలి అనికూడా అంటారు. పుష్పరథం కనుక పైకి చూడటానికి బిరుసుగా కనుపించే ఆ పువ్వురేకులతో కాడిని రూపొందించాడు. గేదంగి పువ్వును మరుని చేతనుండే పదునైన బాకుగా వర్ణించటమూ ఉన్నదే. పైగా అది పరమేశ్వరుని పూజకు తగదని సంప్రదాయం. శివునితో సమరానికి తలపడుతున్నప్పుడు శివపూజకు అనర్హాలైన పరికరాలతో రథాన్ని పూన్చటం సముచితమే కదా. ఆ పచ్చపూమొగలి కాడిని చూసి పరమశివుని గళాలంకృతులు గానూ, హస్తభూషా విశేషాలు గానూ, కాలి అందెలు గానూ ఉన్న సర్పరాజులు కలవరపడకా తప్పదు.

తర్వాత రథానికి రెండు వైపులా సంపెంగ మొగ్గలతో నిలువుకొయ్యలను (వసిగర్రలను) అందంగా అలంకరించాడు. రథికుడు కూర్చొనేందుకు చిగుళ్లతో మెత్తని పరుపును పరిచాడు. రథబంధంలో ఎక్కడా ఏదీ సడలిపోకుండా (వదులు లేకుండా) పొగడ దండలను కట్టుత్రాళ్ళుగా బిగించాడు. లేదీగెలతో గుఱ్ఱాలకు కట్టే పలుపులను (పగ్గాలను) ముక్కుత్రాళ్ళుగా జొనిపాడు. ఎక్కడన్నా సంధులలో అతుకులు సరిగా లేవేమో అని చూసి పువ్వుతేనెతో కందెన పెట్టాడు. అప్పుడు గండుచిలుకలను గుఱ్ఱాలుగా పూన్చాడు. చివరిగా చిగురు గొడుగును, మత్స్యకేతనాన్ని నిలిపాడు.

మలకాండము" అని గాక “కమలషండము" అని తీసుకొన్నా, ఇరుసు అన్న ఏకవచనానికి కమలముల యొక్క షండము అని ఏకవచనమే ఏ వ్యత్యయమూ లేకుండా ఉన్నది.
పోతన గారు వర్ణించినది రథాన్ని నిర్మించటం ఎలాగో తెలిసిన సాంకేతికనిపుణుని సృష్టి. రథానికి ఇరుసు, చక్రం, ఆకులు, నొగ, కాడి, వసిగర్రలు, రథికుడు కూర్చునేందుకు పరుపు, కట్టుతాళ్ళు, పగ్గాలు, కందెన, చిలుకలు, గొడుగు, టెక్కెం అన్నవి రథాంగాలు. అందుకు తామర తూడు, ఎర్ర తామరలు, పువ్వు మోసులు, గేదంగి పువ్వులు, సంపెంగ మొగ్గలు, పల్లవాలు, పొగడ దండలు, లేదీగలు, పువ్వుతేనె, రాజకీరాలు, చిగుళ్ళు, ఎలమీను అన్నవి పనికివచ్చాయి. “కమలషండము నున్నఁగాఁ జేసి, ఇరుసుగాఁ గావించి", “కెందమ్మి కండ్లఁ గూర్చి", “తగ నించు మోసుల నొగలుగాఁ గావించి", “కరమొప్ప గేదఁగి కాఁడివెట్టి", “సంపెంగ మొగ్గలఁ జనుగొయ్య లొనరించి", “పల్లవంబుల మీఁదఁ బఱపుఁ జేసి", “చెలువైన పొగడదండలచేత బిగియించి", “ఎలదీఁగె పలుపులు లలిని జొనిపి", “తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెనవెట్టి", “గండు రాజకీరములఁ గట్టి", “మెఱయఁ జిగురుగొడుగు, మీనుటెక్కెము గ్రాలఁ, దేరుఁ బన్ని" అంటూ రథంలోని ఒక్కొక్క భాగాన్ని ఎంత శ్రద్ధతో నిర్మించాడో, ఆ క్రియాపదాల మోహరింపు నిరూపిస్తున్నది.

ది పద్ధతైన నిర్మాణక్రమం. దేని తర్వాత దేనిని కట్టాలో తెలిసి బండిని తయారుచేశాడు. పరికరాలను కూర్చిన తీరులో ఏ మాత్రం క్రమం తప్పినా, ముందు వెనుకలు అయినా – రథం నిలబడదు.

ధారాశుద్ధి, అలంకారసామగ్రి, కవిసమయాలు – ఏ విధాన చూసినా సలక్షణమైన పద్యం ఇది. కల్పనలోనూ, క్రమపరిగతిలోనూ ఒక్క లోపమూ లేని రచన. పుష్పరథం కాబట్టి సుకుమారములైన సాధనాలతో మహనీయమైన దృగ్విషయాన్ని నిర్మించాడు. ఏ వస్తువు ఏ విధంగా ఉద్భాసిస్తుందో ఆ వస్తుగతంగా ఔపమ్యాన్ని సాధించాడు. ప్రతివస్తూపమాలంకారాన్ని మనోహరంగా నిబంధించాడు.

దే సన్నివేశంలో నన్నెచోడుని పద్యం ఇది:

సీ.
పంకరుహంబులు బండికండులు, చన్పకంబులు నొగ, లుత్పలంబు లిరుసు,
రవీరములు బలుగాఁడి, జాదులు సనుఁగొయ్య, లశోకముల్ గోడిపీఁట,
సిందువారంబులు సీలలు, గేతకుల్ మెట్టులు, మొల్లలు మెట్టుగుదెలు,
పొగడలు పలుపులు, పున్నాగములు పగ్గములు, సహకారముల్ పూనుగాఁడి,
గీ.
కురవకానీక మాలంపుఁగోల, కైర
ములు మునుకోల, కోకముల్ వాహనములు
గా వసంతుండు సూతుఁ డై పూవుఁదేర
నెరయఁ గుసుమాయుధంబుల నినిపి తెచ్చి. (4-83)

ఇందులో వీరభద్రవిజయంలోని పద్యానికంటె అధికవస్తువులతో రథస్వరూపాన్ని కన్నులకు కట్టే ప్రయత్నం ఉన్నది. అయితే, తామర పువ్వులు బండిచక్రాలు, సంపెంగలు నొగలు, ఉత్పలములు ఇరుసు, కరవీరాలు బలమైన కాడి, జాజులు చనుగొయ్యలు, అశోకాలు నొగకు చివరి క్రిందిభాగంలో ఎత్తుగా ఉంచే మోపుడు కొయ్య, వావిలి పూలు సీలలు, కేతకీ పుష్పాలు మెట్లు, మొల్లలు మెట్టు గుదియలు, పొగడలు పలుపులు, పున్నాగములు పగ్గాలు, సహకారాలు పూనుగాడి, కురవకాలు ఆలపు కోల, కైరవాలు మునుకోల, కోకాలు గుర్రాలు – అని వస్తువులను తెచ్చి రాశిపొయ్యటమే కాని ఆ చెప్పటంలో ఒక ప్రాగుద్దిష్టక్రమమంటూ లేదు. పద్యోపక్రమణికలో “కెందమ్మి కండ్లు" – “పంకరుహంబులు బండికండులు" అని ఉన్నందువల్ల – ఒకరి పద్యాన్ని చూసి ఒకరు వ్రాశారనిపించటం తప్పేమీ కాదు.

న్నెచోడుని పద్యంలో మున్ముందుగా కనుపించే విషయం: ఒక క్రమమంటూ లేని రథనిర్మాణం. వస్తువులను కుప్పగా పేర్చుకొనిపోవటమే కాని, పోతన పద్యంలో ఉన్న సవ్యమైన నిర్మాణక్రమాన్ని కవి గుర్తింపలేదు. ఇరుసుతో మొదలుపెట్టి కేతనం దాకా సాగిన క్రమాన్ని, ఆ నిర్మాణసాధనసంపత్తిని గమనింపలేదు. పైగా, “ఉత్పలంబులు ఇరుసు", “కరవీరములు పలుగాఁడి", “సహకారముల్ పూనుగాఁడి", “కైరవములు మునుకోల" వంటి చోట్ల వచనవ్యత్యయానికి కారణం తెలియదు. ప్రాచీనుల రచనలో ఒక్క పద్యంలో ఇన్ని వ్యత్యయాలుండటం చిత్రమే. పోతన పద్యంలో ఇటువంటి అతిక్రమణం ఒక్కచోటా కనబడదు.

పొగడలు గుర్రాల మెడలను యుగంధరానికి కట్టే పలుపులకు, పున్నాగాలు (సురపొన్నలు) గుర్రాల మెడలకు బిగించి సారథి చేతిలో ఉంచుకొనే పగ్గాలకు సముచితమైన వస్తుకల్పనలు కావు. చంపకాలతో (సంపెంగ పువ్వులతో) బండి కాడికి అటూయిటూ ఉండే కట్టుకొయ్యల నొగలు పెట్టాక మళ్ళీ కరవీరాల (గన్నేరు పువ్వుల) కాడి ఒకటి, సహకారాల (తియ్యమామిడి పువ్వుల) పూనుకాడి ఒకటి పెట్టాడు. “ఆలంపుఁగోల" (యుద్ధదండము లేదా, బెత్తం) రథనిర్మాణంలో భాగం కాదు. నిజానికి పద్యంలో అనవసరం. “కైరవములు మునుకోల" అన్నది కూడా రథనిర్మాణంలో భాగం కాదు. అవి వసంతుని చేతిలో వస్తువులని సరిపెట్టుకోవాలి. సారథి అయిన వసంతుడు కుసుమాయుధాలను సృజించి (ఈని), తెచ్చి రథంలో ఉంచాడనటం సరికాదు. యోద్ధ తానై తన ఆయుధజాతాన్ని తీసికొనిరావటం సంప్రదాయం. కుసుమాయుధాలను రథం నిండా “నింపి" పెట్టడం కూడా అనుచితమే. ఎంతమందిపై ఎన్నేన్ని కుసుమబాణాలను ప్రయోగించాలని ఆ “నినిపి" తేవటం? రథమంతా నింపలేదనుకొంటే, “నినిపి", దేనిలో తెచ్చినట్లు? “పూవుఁదేర, ‘నెరయఁ’ గుసుమాయుధంబుల ‘నినిపి’ తెచ్చి" అన్న ప్రయోగం సరికాదని అంగీకరించాలి. సామాన్యయోధుని రథంలో తూణీరాలలో బాణాలను నింపినట్లు వర్ణిస్తున్నాడే కాని, మన్మథుని కుసుమాయుధాలెన్ని? వాటిని రథం నిండుగా తేవటం ఏమిటి? ఇది సన్నివేశానికి తగిన పాత్రోచితమైన రూపణమా? కాదా? అని ఆలోచించుకోలేదు.

ఇంతకీ రథనిర్మాణానికి అనవసరమైన బెత్తాలను, మునుగర్రలను చెప్పినవాడు అసలు చెప్పవలసిన గొడుగును, జెండాను మర్చిపోయాడు. రథికుడికోసం పల్లవాలతో పరిచిన బాలీసును మర్చిపోయాడు. అంతే కాదు. మన్మథుని తేరికి చక్రవాకాలు వాహనాలని పొరపాటుగా వర్ణించాడు. మన్మథుని వారువాలు చక్రవాకాలు (“కోకముల్") కావు; గండు చిలుకలు.

పోతపోసిన అపరంజి బొమ్మవంటి పోతన పద్యంతో సరిపోల్చినపుడు నాణ్యం తప్పిన నన్నెచోడుని పద్యం వెలవెలపోతున్నది. ఆ పద్యాన్ని చూసి పోతన అనుకరించాడనేందుకు అనువైన లక్షణసౌభాగ్యం అందులో లేనే లేదు. వస్తుసామ్యం ఉండటం వల్ల, కొంత కల్పనలోని సజాతీయత మూలాన ఒకరిని చూసి వేరొకరు పద్యనిర్మాణం చేశారనిపించటం సహజమే. అయితే, పోతన పద్యంలో లేని అధికవస్తువులను కూర్చే అపోద్యమంలో నన్నెచోడుడు అందులోని సాంకేతికనిర్మాణక్రమాన్ని, శబ్దసంయోజనలోని సార్థకతను గమనించినట్లు లేదు. ‘కండులు’, ‘చనుపకములు’ వంటి కొన్ని ప్రాచీనతను స్ఫురింపజేసే పదాలను గుప్పించే ప్రయత్నం వల్ల పద్యానికి ఒనగూరిన ప్రయోజనమూ ఏమీ లేదు.


విజ్ఞపరిశీలకులు వివేచింపవలసిన విశేషం ఇది.



గన్నవరపు నరసింహమూర్తి
Andhra Medical College
స్పందన ; ఆగస్టు 19, 2015.

కుశుమశరునకు నిరువురు ప్రసిద్ధాంధ్ర కవులు సలిపిన పుష్పరథ నిర్మాణ ప్రక్రియల నుదాహరించి ఆయా రథాలను ప్రతిభతో విశ్లేషించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి విన్నాణము ప్రస్ఫుటము.

న్నెచోడుడు మన్మథు డీశ్వరునిచే పరాజితుడవుతాడని అతని రథ నిర్మాణములో తగిన శ్రద్ధ వహించి నట్లు కనిపించదు . పోతన గారు నన్నె చోడుని పద్యమును చూచినా హరిసుతుడైన మన్మథుని రథము నతిచాతుర్యముతో నిర్మించారు. పోతన కవితా పటిమే వేరు. వారి సుమరథము తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చింది . పద్యమును చదువుతుంటే కలిగి నానందము శ్రీ ఏల్చూరి వారి వివరణతో ద్విగుణీకృత మైనది . రథసౌరభాలను మాకంద జేసినందులకు ధన్యవాదములు .

***  ప్రముఖ మాలిక సాహిత్య మాసపత్రిక వారి సౌజన్యంతో. ***