పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : ఆచార్య సినారె వారి పోతన

sinare

మహాకవి పద్మశ్రీ డాక్టర్ సినారె గారె పాదపద్మాలకు నమస్కరించి, పుష్పాంజలిగా పోతనామాత్యునిపై వారి వ్యాఖ్యానం ఒకటి స్మరిద్దాం.
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన
- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"
నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."

భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."

కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయా కవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.