పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : భాగవతంలో రాస పంచాధ్యాయి

ఆచార్యా వర్యా ! నమస్సులు...భాగవతంలో "రాసపంచాధ్యాయి"వలన నా సన్యాసదీక్షసిధ్ధించిందన్నారు పరమాచార్య. ఇంతకీ అదేమిటో వివరింప ప్రార్ధన . 27-09-2020

సౌజన్యము: - ముఖపుస్తకంలో శ్రీ తిప్పభొట్ల వేంకట రామ కృష్ణయ్య గారు టపా

పై ప్రశ్నకు వారిచ్చిన జవాబు:
  మీ ప్రశ్నకి జవాబు శ్రీ ఏ. సీతారామారావుగారు ఇదివరకే ఆంధ్రజ్యోతిలో చెప్పారు. దానిని మరలా మీకోసంపునరుద్ధరిస్తాను.

  నారద ముని నుంచి ప్రేరణ పొందిన వేద వ్యాసుడు భక్తిరస ప్రధానమైన శ్రీకృష్ణ చరిత్రను ‘భాగవత పురాణం’గా రచించాడు. అది భక్తి, జ్ఞాన, వైరాగ్యాల సమ్మేళనం. పురాణాలన్నిటిలోకీ శ్రేష్ఠమైనది పరమ పవిత్రమైన పురాణాలలో భాగవతం, అందులో దశమ స్కంధం, దానిలో ‘రాస పంచాధ్యాయి శ్రేష్ఠతమం’ అని విజ్ఞులు చెబుతారు. రాస పంచాధ్యాయి దశమ స్కంధంలో 29 నుంచి 33 వరకూ గల అయిదు అధ్యాయాలు.. (అద్యాయం 29 ----శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట తెలుగు భాగవతం ; అద్యాయం 33- గోపికలతోడ క్రీడించుట తెలుగు భాగవతం) ఇవి అనన్య భక్తిరసప్లావితాలు. దానిలో మధ్యమమైన 31 అధ్యాయం శ్రీకృష్ణుని పట్ల గోపికలకు ఉన్న భక్తికి పరాకాష్ట. ఈ అధ్యాయం ‘శ్రీగోపికా గీతములు’ అనే పేరుతో బహుళ ప్రాచుర్యంలో ఉంది. రాసలీలగా, రాసక్రీడగా ప్రసిద్ధి పొందిన ఈ అధ్యాయం పంతొమ్మిది శ్లోకాలతో ఆధ్యాత్మిక క్రీడగా భాసిల్లుతోంది. ఆ రాసలీలా విలాసాన్ని అవలోకిద్దాం.

  అది శరత్కాల పున్నమి రేయి. నల్లనయ్య బృందావనంలో మురళి ఊదాడు. ఆ మురళీరవం రేపల్లెలో ప్రతిధ్వనించింది. అదొక పిలుపు. సామాన్యమైన పిలుపు కాదు. దివ్య మోహన నాదం. మనోహర మంజుల నాదం. ఆ నాదం గోపభామలను పిచ్చివాళ్ళను చేసింది. ఇంటి పనుల్లో సతమతమవుతున్నవారంతా ఎక్కడి పని అక్కడే వదిలేసి, చేయవలసిన మంచి పనుల్ని మరచి, తమ ఉనికినే మరచి- ఎవరికివారు విడివిడిగా, కొందరు గుంపులుగా గోపాలుని చెంతకు- నల్లనివాడు, పద్మ నయనమ్ములు కలవాడితో ఆడేటందుకూ, కలిసి పాడేటందుకూ పరుగులు తీశారు. పవిత్రమైన ఈ ఘటనను వర్ణిస్తూ ‘‘విశ్వాత్మయైున ఆత్మారామునితో క్రీడించడమే రాసక్రీడ. బ్రహ్మజ్ఞాన రసమయ జీవనమే రాసక్రీడ. సత్యసాక్షాత్కారానంద ప్రకటనమే రాసక్రీడ. తనలోనూ, యావత్‌ విశ్వంలోనూ వెలుగొందుతున్న పరమాత్మతో ఏకమై, ఆ అద్వైతానుభూతితో ఆనందించడమే రాసక్రీడ’’ అని శ్రీరామతీర్థ స్వామి అన్నారు.

  ఈ గోపభామలకు నల్లనయ్య కొత్త కాదు. యశోద ఇంట పసివానిగా ఉన్నప్పుడు లాలించి, పాలించారు. జోలపాటలు పాడి నిదురపుచ్చారు. వెన్నముద్దనే గోరుముద్దగా తినిపించారు. వాళ్ళలో ఒక యువతి బ్రహ్మగారికి ఏమాత్రం బుద్ధి లేదని విమర్శించింది. ‘‘చూడ్డానికి కళ్ళయితే ఇచ్చాడు గానీ, వాటికి రెప్పలు కూడా ఇచ్చాడు. నిన్ను అనుక్షణం చూసి తరించాలన్న మాకు కనురెప్పలు అడ్డం వస్తున్నాయి!’’ అంటూ బాధను చెప్పుకుంది. గోపయ్య మీద గోపస్త్రీల ప్రేమమయ భక్తి అంతటిది. మురళీరవం వినగానే గోపెమ్మలు గోప్యం లేకుండా గోపాలుని చెంతకు చేరారు. వచ్చిన వాళ్ళందరినీ చూశాడు. మందహాసంతో మత్తెక్కిస్తూనే మందలించాడు. ‘‘ఈ సమయంలో మీరు ఇల్లు విడిచి రాకూడదు. వెళ్ళి మీమీ భర్తలను సేవించండి. బిడ్డలను చేరదీయండి. గోవత్సాలను తృప్తిపరచండి’’ అని బోధించాడు. గోపెమ్మలు ఖిన్నులయ్యారు. ఆ మాటలు వారికి రుచించలేదు.

  వారిలో ఒకామె- పతి పుత్రాదిక నానుమూర్తి వగుచున్‌ భాసిల్లు నీయందు దత్పతి పుత్రాదిక వాంఛలన్‌ జరిపి సంభావించుట న్యాయమే?- అని నిలదీసింది. ఈ పద్యంలో ప్రశ్నార్థకాన్నీ, నిశ్చితార్ధాన్నీ అన్వయిస్తూ ప్రయోగించిన శ్లేష అద్భుతం. నల్లనయ్యనే ఆమె ఖంగు తినిపించింది. ఆయన బదులు చెప్పలేదు. వారి కోరిక కాదనలేకపోయాడు. రాసక్రీడకు ఉపక్రమించాడు. తాను కదలకుండా అందరినీ కదిలిస్తున్నాడు. వారి వారి మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నట్టు ప్రతి ఒక్కరికీ అనిపిస్తూండడంతో, ఎవరికివారు తాము ‘చేసుకున్న అదృష్టం!’ అనుకుంటూ మురిసిపోతున్నారు. అలా అందరూ తన్మయ స్థితికి చేరగా, నల్లనయ్య మాయమయ్యాడు. ఒక్కసారిగా గోపికలు నిరుత్తరలయ్యారు. వారిని విషాదం ఆవరించింది. అంతటా ఆక్రందనం... ఈ అలౌకిక సన్నివేశాన్ని వ్యాసునితో పోటీపడి పోతనామాత్యులు చిత్రాతిచిత్రంగా చిత్రించేడు. గోపికల అనన్యభక్తికి పంచదశాధ్యాయి ప్రతీక. గోపికల విరహాన్ని అర్థం చేసుకొని, ఓటమిని అంగీకరిస్తూ కన్నయ్య వారిమధ్య నిలిచాడు. క్షమించమన్నాడు. మీ భక్తికీ, వాత్సల్యానికీ ప్రత్యుపకారం చేస్తానన్నాడు. ‘మీరందరూ నా హృదయంలో కొలువై ఉంటా’రని వరమిచ్చాడు. ఇంతకూ- రాసక్రీడా సమయంలో కన్నయ్య వయస్సెంతో చెప్పలేదు కదూ! ఎనిమిదేళ్ళే!

  ~ఎ. సీతారామారావు


ఇప్పుడు సన్యాసదీక్షసిధ్ధించిందను పరమాచార్య వాక్యంలోని పరమార్థం తెలిసిదనుకొంటాను. ధన్యవాదాలు.