పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : ద్వితీయ స్కంధము : - 4వ దశకము - అష్టాంగయోగ, యోగసిద్ధి వర్ణనము

||శ్రీమన్నారాయణీయము||
ద్వితీయ స్కంధము
4వ దశకము - అష్టాంగయోగ, యోగసిద్ధి వర్ణనము

4-1-శ్లో.
కల్యతాం మమకురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా।
స్పష్టమష్టవిథయోగచర్యయా పుష్టయాశు తవ తుష్టి మాప్నుయాం||
1వ భావము.
ప్రభూ! యోగమూర్గము ననుసరించుటకు, అష్టాంగయోగమును సాధన చేసి నీ అనుగ్రహమును పొందుటకు, తగినంత మాత్ర మైన ఆరోగ్యమును  మాత్రము  నాకు  ప్రసాదించుము.

4-2-శ్లో.
బ్రహ్మచర్యందృఢతాదిభిర్యమైః ఆప్లవాదినియమైశ్చపావితాః।
కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః||
2వ  భావము.
ధృఢమైన బ్రహ్మచర్యము వంటి యమములచే అంతఃకరణను, స్నానమువంటి నియమములచే శరీరమును, పవిత్రము చేసుకుని సుఖాసనమున కూర్చుని, పద్మాసనాది ఆసనములచే యోగమును సాధన చేయుదును.

4-3-శ్లో.
తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః।
ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః||
3వ భావము.
ప్రభూ! నిరంతరమైన నీనామ స్మరణచే మనస్సును సుస్దిరపరచుకొని, ప్రాణాయామమున వాయువులను  నిరోధించి, మానసికమైన, శారీరికమైన నిర్మలత్వమును సాధన చేసెదను. విషయాసక్తముల నుంచి ఇంద్రియములను  దూరము చేసుకుని , మనోనిగ్రహం సాధించి భగవదుపాసనను ప్రారంభించుటకు సంసిద్ధుడ నగుదును.

4-4-శ్లో.
అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః।
తేన భక్తిరసమంతరార్థ్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః||
4వ భావము.
ప్రభూ! ప్రారంభమున చిత్తము నందు అస్పష్టముగా నున్న నీ రూపము, సుస్దిరమై నిలుచువరకు పదేపదే నీ నామమును ధ్యానము చేసెదను, నీ పాదపద్మములను చింతన చేయుచూ భక్తిరసమును, ఆర్ధ్రతను పొందెదను.

4-5-శ్లో.
విస్ఫుటావయవ భేదసుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్;।
అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః||
5వ భావము.
ప్రభూ! నిన్ను ఆశ్రయించి ధీర్ఘకాలము నిరంతరము ధ్యానము చేయుట వలన, సుందరమైన నీ అవయవములను దర్శించెదను. క్రమముగా సుస్దిరమైన, స్పష్టమైన, నీ భగవద్రూపమును మనస్సు నందు నిలుపుకుని ధ్యానించెదను.

4-6-శ్లో.
ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం।
సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి! తే౾వభాసతే||
6వ భావము.
ప్రభూ! ధ్యానములో సక లావయవ సహితమైన నీరూపమును దర్శించి, ఆ రూప మాధుర్యమునకు వశులయిన  సాధకులకు, నీవు నీ అంతర్గతరూపమును పరిపూర్ణ ఆనందరసమయ మైన బ్రహ్మతత్వమును అనుగ్రహించెదవు.

4-7-శ్లో.
తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక!
ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభేమహి చ ధారణాదికమ్||
7వ భావము.
ప్రభూ! విశ్వాధిపతీ! సాధకులు సమాధి  స్ధితి య౦దు బ్రహ్మతత్వ అనుభూతిని పొ౦దియు, వారి చిత్తమును ఆ స్ధితి య౦దు నిలుపలేక తొలగిపోవుదురు. అట్టివారు, మరల ధ్యానముతో సమాధిస్దితిని సాధన చేయుదురు.

4-8-శ్లో.
ఇత్థమభ్యసననిర్భరోల్లసత్ త్వత్పరాత్మసుఖకల్పితోత్సవాః।
ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్||
8వ భావము.
ప్రభూ! ఈ విధమైన యోగసాధనచే, చిత్తమున అనుభవగోచరమైన బ్రహ్మతత్వరూపమును దర్శించి, పరమానందముతో సాధకుడు ముక్తిని పొందును. అనంతరము ముక్తులలొ శ్రేష్టు లగు శుక, నారదాది మహామునులవలె సంచరించును.

4-9-శ్లో.
త్వత్సమాధి విజయే తు యః పునర్మఙ్క్షు మోక్షరసికః క్రమేణ వా।
యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ! సుషుమ్నయా శనైః||
9వ భావము.
జన్మము లేని వాడవైన పరమాత్మా! మోక్షగామి అయిన సాధకుడు, సమాధి స్ధితి యందు విజయుడై, తక్షణము లేదా క్రమముగా యోగమార్గమును అనుసరించి, షట్చక్రముల యందు ప్రాణవాయువును నిగ్రహించి, సుషుమ్నానాడి సహాయమున దేహమును త్యజించును.

4-10-శ్లో.
లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః।
ఊర్థ్వలోకకుతుకీ తు మూర్ధతః సార్థమేవ కరణైర్నిరీయతే||
10వ భావము.
ప్రభూ! ముముక్షువు అయిన యోగీశ్వరుడు పరబ్హహ్మ యందు తదాత్మ్యము చెంది, దేహమును, సూక్ష్మదేహమును కూడా త్యజంచి, పరబ్రహ్మ యందు ఐక్యము పొందును. అట్లుకాక, ఊర్ధ్వ లోకములను ఆశించిన సిద్ధులు బ్రహ్మరంధ్రము ద్వారా, దేహమును త్యజించి ఇంద్రియములు (సూక్ష్మదేహము) సహితముగా బ్రహ్మ లోకమునకు పయనించెదరు.

4-11-శ్లో.
అగ్నివాసరవలర్క్షపక్షగైః ఉత్తరాయణజుషా చ దైవతైః।
ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే||
11వ భావము.
ఈ విధముగా క్రమ క్రమేణ ము క్తిని సాధించు పధమున సాధకుడు, అగ్ని, పగలు, శుక్లపక్షము మరియు ఉత్తరాయణ అధిష్టానదేవతలను అనుసరించుచు, సూర్యమండలమును అతిక్రమించి, పరతత్వము యందు ఆనందమును అనుభవించుచూ ధృవపథమును చేరును.

4-12-శ్లో.
అస్థితో౾థ మహారాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ద్యతే।
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా||
12వ భావము.
ప్రభూ! సాధకునికి ధృవమండలము నుండి మహర్లోకగతి ప్రాప్తించగా, అచ్చట కల్పాంతమున లోకములన్నీ ఆదిశేషుని ముఖాగ్నికి వశమగుటను గా౦చి, నిన్నే ఆశ్రయించిన భక్తుడగుటవలన ఆ తాపము నుండి శీఘ్ర్రమే విడువబడి, బ్రహ్మలోకము చేరును.

4-13-శ్లో.
తత్ర వా తవ పదే౾థవా వసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం।
స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా||
13వ భావము.
ప్రభూ! సాధకుడు బ్రహ్మలోకము లేదా వైకుంఠ నివాసి అయి ప్రకృతి పరమాత్మ యందు లయ మగు ప్రళయకాలమున ముక్తిని పొందును. లేదా! తన ఇష్ట ప్రకారము ముందుగనే తన యోగశక్తిచే జగదండమును [బ్రహ్మాండమును] భేధించి, విష్ణుపధమును చేరగలడు.

4-14-శ్లో.
తస్య చ క్షితిపయోమహో౾నిలద్యో మహాత్ప్రకృతిసప్తకావృతీ।
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో!
14 వ భావము.
విభో! బ్రహ్మాండమును ఛేధించి, దానిని ఆవరించి ఉన్న సప్తావరణము లగు పంచభూతములు, వాటి సూక్ష్మతత్వములు, ప్రకృతి, మహత్తు, వీటి యందు  తన ఇంద్రియములను లయించి, తుదకు నీ యందు ఐక్యము పొందును.

4-15-శ్లో.
అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే!
సచ్చిదాత్మక! భవద్గుణోదయానుచ్ఛరంతమనిలేశ! పాహి మామ్||
15వ భావము.
జగధీశ! ప్రభూ! నీవు చూపిన  కాంతివంతము, దివ్యమంగళము అయిన  అర్చిరాదిగతిగమనమున  సాధకుడు నిన్నుచేరి ఎన్నటికీ నిన్ను విడువడు, తిరిగి జన్మమును పొందడు. ప్రభూ! సచ్చిదానంద మైన నీ గుణములను స్మరించుచున్న నన్ను రక్షించుము.

ద్వితీయ స్కంధము
4వ దశకము సమాప్తము.
-x-