పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 97వ దశకము – ఉత్తమ భక్తి ప్రార్థన-మార్కండేయోపాఖ్యానము

||శ్రీమన్నారాయణీయము||
ద్వాదశ స్కంధము
97- వ దశకము – ఉత్తమ భక్తి ప్రార్థన-మార్కండేయోపాఖ్యానము

97-1
త్రైగుణ్యాద్భిన్నరూపం భవతి హి భువనే హీనమధ్యోత్తమం యత్
జ్ఞానం శ్రద్ధా చ కర్తా వసతిరపి సుఖం కర్మ చాహరభేధాః।
త్వత్ క్షేత్రత్వన్నిషేవాది తు యదిహ పునస్త్వత్పరం తత్తుసర్వం
ప్రాహుర్నైర్గుణ్యనిష్ఠం తదమ భజనతో మంక్షు సిద్ధో భవేయమ్॥
1వ భావము :-
భగవాన్! లోకమున జీవులలో జ్ఞానము, శ్రద్ధ, కర్త, వసతి, సుఖము, కర్మము, ఆహారము మొదలగునవి త్రిగుణముల ప్రభావముతో బహువిధములుగా ఏర్పడుచుండును. వాటివలననే వారికి కర్మఫలములు ప్రాప్తించుట మరియు ఆ కర్మఫలములలో ఉత్తమము, మద్యమము, హీనము అను భేదములుండుట జరుగుచుండును. ప్రభూ! కృష్ణా! నిన్నుపూజించుట మరియు నీ క్షేత్రములను సేవించుచుచేయు సకల కర్మలు త్రిగుణాతీతమైన ఫలములను ప్రసాదించును. మాయకు అతీతమయిన భక్తిమార్గమును ఆశ్రయించి శీఘ్రమే నీసిద్ధిని పొందెదను.

97-2
త్వయ్యేవ న్యస్తచిత్తస్సుఖమయి విచరన్ సర్వచేష్టాస్త్వదర్థం
త్వద్భక్తైః సేవ్యమానానపి చరితచరానాశ్రయన్ పుణ్యదేశాన్।
దస్యౌ విప్రే మృగాదిష్వపి చ సమమతిర్ముచ్యమానావమాన-
స్పర్ధాసూయాదిదోషస్సతతమఖిల భూతేషు సంపూజయే త్వామ్॥
2వ భావము :-
భగవాన్! నీయందే స్థిరచిత్తము కలిగియుండి నా సర్వకర్మలను నీకే అర్పించెదను. పూర్వము నీ భక్తులు చరించి నిన్ను సేవించిన పుణ్యక్షేత్రములను దర్శించెదను. విప్రుడు, చోరుడు, మృగము ఎవరయినను వారియెడ సమదృష్టికలిగి యుండెదను. అభిమానము, అవమానము, పోటీతత్వము, అసూయ మొదలగు దోషములను త్యజించి సకలజీవులలోను, ప్రభూ! కృష్ణా! నిన్నే భావనచేయుచు నిరంతరమూ నిన్నేపూజింతును.

97-3
త్వద్భావో యావదేషు స్ఫురతి న విశదం తావదేవం హ్యుపాస్తిం
కుర్వన్నైకాత్మ్యబోధే ఝటితి వికసతి త్వన్మయో౾హం చరేయమ్।
త్వద్ధర్మస్యాస్య తావత్ కిమపి న భగవన్।ప్రస్తుతస్య ప్రణాశః
తస్మాత్ సర్వాత్మనైవ ప్రదిశ మమ విభో।భక్తిమార్గం మనోజ్ఞమ్॥
3వ భావము :-
భగవాన్! సర్వమూ నీవే అన్న భావన నాచిత్తమున స్థిరపడునంతవరకూ నిన్నుపూజించుచు, సేవించుచు, సకలమునందు వ్యాపించినది నీ ఆత్మయే అన్న జ్ఞానమును నాలో పెంపొందించుకొనెదను; ఆ ఆత్మానుభూతితో త్వన్మయముచెంది చరింతును. అటువంటి 'భాగవత ధర్మమును ఆనుసరించు భక్తునికి ఎన్నటికీ పతనము కలుగదు!' అని, నీచేతనే వచింపబడినది. అట్టి మనోజ్ఞమయిన భక్తిమార్గమును, సర్వాత్మకుడవైన ప్రభూ! కృష్ణా! నాకు ప్రసాదించుము.

97-4
తం చైవం భక్తియోగం ద్రఢయితుమయి మే సాధ్యమారోగ్యమాయుః
దిష్ట్వా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజాయేవ దుగ్ధమ్।
మార్కండేయో హి పూర్వం గణకనిగదితద్వాదశాబ్దాయురుచ్ఛైః
సేవిత్వా వత్సరం త్వాం తవ భటనివహైర్ద్రావయామాస మృత్యుమ్॥
4వ భావము :-
భగవాన్! ఆయువు, ఆరోగ్యము కలవానికి ధృఢభక్తి పొందుట సాధ్యమగును. ఆయురారోగ్యములను సాధించుటకు నీ పాదపద్మములను ఆశ్రయించుటయే మార్గము. అది ఎట్టిదనగా నీసేవ అను పాలను మందువలె సేవించుట వంటిది. ఆకలితీర్చి శక్తినిచ్చు పాలు ఔషధముగా ఉపయోగపడినట్లు, నీయెడల నాకుగల ధృఢభక్తి ప్రభూ! కృష్ణా! నాకవసరమగు ఆయురారోగ్యములను ప్రసాదించును. పూర్వమొకప్పుడు జ్యోతిష్యులు మార్కండేయునికి ఆయుష్షు పన్నెండువర్షములు మాత్రమే అని చెప్పియుండిరి. పన్నెండువత్సరముల కాలము పూర్తియగుటకు ముందు మార్కండేయుడు ఒకసంవత్సరకాలము నిన్ను ధృఢభక్తితో సేవించెను; నీ అనుగ్రహమునకు పాత్రుడయ్యెను. నీదూతలు మార్కండేయుని, దరిచేరజూచిన మృత్యువును తరిమివేసిరి.

97-5
మార్కండేయశ్చిరాయుస్స ఖిలు పునరపి త్వత్పరః పుష్పభద్రా-
తీరే నిన్యే తపస్యన్నతులసుఖరతిష్షట్ తు మన్వంతరాణి।
దేవేంద్రస్సప్తమస్తం సురయువతిమరున్మన్మథైర్మోహయిష్యన్
యోగోష్మప్లుష్యమాణైర్నతు పునరశకత్త్వజ్జనం నిర్జయేత్॥
5వ భావము :-
భగవాన్! నీ అనుగ్రహముతో చిరాయువయిన మార్కండేయుడు భక్తితత్పరుడై నిన్నుసేవించుచు పుష్పభద్రనదీతీరమున తపస్సు చేసుకొనసాగెను. భక్తియోగముతో నిన్ను ధ్యానించుచు చిత్తమున అత్యంత ఆనందమును అనుభవించుచుండెను. అట్లు ఆరుమన్వంతరముల కాలము గడిచి ఏడవమన్వంతరము నడుచుచుండగా ఇంద్రుడు మార్కండేయుని తపస్సును భగ్నపరుచుటకై మన్మథుడు అప్సరసల సహాయముతో మార్కండేయునికి మోహముకలిగించుటకు ప్రయత్నించెను. అప్పుడు మార్కండేయమునీశ్వరుని శరీరమునుండి బహిర్గతమయిన యోగాగ్ని వారిని దహించసాగెను; వారు అశక్తులయ్యిరి. ప్రభూ! కృష్ణా! నీ భక్తులను జయించుట ఎవరితరము?

97-6
ప్రీత్యా నారాయణాఖ్యస్త్వమథ నరసఖః ప్రాప్తవానస్య పార్శ్వం
తుష్ట్వా తోష్టూయమానస్స తు వివిధవరైర్లోభితో నానుమేనే।
ద్రష్టుం మాయాం త్వదీయం కిల పునరవృణోద్భక్తితృప్తాంతరాత్మా
మాయాదుఃఖానభిజ్ఞస్తదపి మృగయతే నూనమాశ్చర్యహేతోః॥
6వ భావము :-
భగవాన్! కృష్ణా! నరనారాయణులలో నీవు నారాయణుడవు. నీవు నీ సోదరుడగు నరునితో కలిసి ఒకనాడు మార్కండేయుని వద్దకు వెళ్ళితివి. ఆ మునీశ్వరుడు మిమ్ములను అత్యంత ఆనందముతో స్తుతించెను. ప్రభూ! నీవు అనేకములగు వరములు ఇవ్వజూపిననూ ఆ ముని ప్రలోభపడలేదు; నీ మాయనుచూచు వరమును మాత్రము కావలెనని కోరుకొనెను. భక్తితో సంతృప్తిచెంది సంతోషాత్మకుడుగా ఉండు ఆ మునికి మాయవలనకలుగు దుఃఖము ఎట్లుండునో ఎంతమాత్రమూ తెలియదు. అందులకే నీ మాయను చూడవలెనని కోరుకొనెను.

97-7
యాతే త్వయ్యాశు వాతాకులజలదగలత్తోయపూర్ణాతిఘార్ణత్
సప్తార్ణోరాశిమగ్నే జగతి స తు జలే సంభ్రమన్ వర్షకోటీః।
దీనః ప్రైక్షిష్ట దూరే వటదలశయనం కంచిదాశ్చర్యబాలం
త్వామేవ శ్యామలాంగం వదనసరసిజన్యస్తపాదాంగుళీకమ్॥
7వ భావము :-
భగవాన్! నీవు నరునితోకలిసి ఆ ప్రదేశమును విడిచి వెళ్ళగానే ఆకాశము మేఘావృతమయ్యెను; ప్రచండగాలులు వీచసాగెను; దట్టముగా ముసురు క్రమ్మి కుండపోతగా వర్షము కురవసాగెను. ఆ కుంభవృష్టికి సప్తసముద్రములు పొంగిపొరలి ఆజలములో సమస్తజగత్తు మునిగిపోయెను. మార్కండేయుడు ఒంటరిగా ఆజలములో కోట్లకొలది సంవత్సరములు దీనుడుగా గడిపెను. ఆస్థితిలో ఆమునికి అల్లంతదూరమున ఒక వటపత్రముపై శయనించిన బాలుడు కనిపించెను. ఆశ్చర్యకరముగొలుపుచూ ఆ బాలుడు శ్యామలవర్ణముతోనుండెను; తన కాలిబొటనవేలును పద్మమువంటి తననోటిలోపెట్టుకొని కనిపించెను. ప్రభూ! కృష్ణా! ఆ బాలుడివి నీవే!

97-8
దృష్ట్వా త్వాం హృష్ణరోమా త్వరితముపగతః స్ప్రస్టుకామో మునీంద్రః
శ్వాసేనాంతర్నివిష్టః పునరిహ సకలం దృష్టవాన్ విష్టపౌఘమ్।
భూయో౾పి శ్వాసవాతైర్భహిరనుపతితో వీక్షితస్త్వత్కటాక్షైః
మోదాదాశ్లేష్టుకామస్త్వయి పిహితతనౌ స్వాశ్రమే ప్రాగ్వదాసీత్॥
8వ భావము :-
భగవాన్! వటపత్రముపై శయినించియున్న ఆ బాలునిచూచి మార్కండేయుని శరీరము గగుర్పాటుచెందెను. ఆబాలుని తాకిచూచుటకై ఆ ముని త్వరత్వరగా నీ వద్దకు వచ్చెను. ఆసమయమున నీవు నీ ఉచ్వాసనిశ్వాశములలో ఉచ్వాసనను తీసుకొనుచుంటివి. అప్పుడు నీ ఉచ్వాసనతో మార్కండేయముని శరీరము సహితము నీదేహములోనికి ప్రవేశించెను. ఆమునీశ్వరుడు ప్రభూ! కృష్ణా! సకలజగత్తులను అక్కడ చూచెను. నీ నిశ్వాశతో మార్కండేయుడు వెనువెంటనే బయటకువచ్చెను. నీకటాక్షవీక్షణమునకు పాత్రుడయిన మార్కండేయుడు ఆనందముతో నిన్ను ఆలింగనముచేసుకొనదలచెను కాని, అంతలోనే నీరూపము అదృశ్యమయ్యెను. ప్రళయకాలజలమూ అదృశ్యమయ్యెను. ఆ మునీంద్రడు ఎప్పటివలె తన ఆశ్రమముననే ఉండెను. ఈవిధముగా మార్కండేయునికి నీ మాయను సాక్షాత్కరింపజేసితివి.

97-9
గౌర్యా సార్ధం తదగ్రే పురభిదథ గతస్త్వత్ర్పియప్రేక్షణార్థీ
సిద్ధానేవాస్య దత్త్వా స్వయమయమజరామృత్యుతాదీన్ గతో౾భూత్।
ఏవం త్వత్సేవయైవ స్మరరిపురపి స ప్రీయతే యేన తస్మాత్
మూర్తిత్రయ్యాత్మకస్త్వం నను సకలనియంతేతి సువ్యక్తమాసీత్॥
9వ భావము :-
భగవాన్! ఇదిజరిగిన కొంతకాలము పిదప నీ భక్తుడగు మార్కండేయుని చూడవలెనని తలచి పరమశివుడు గౌరీదేవితో కలిసి అతని ఎదుట ప్రత్యక్షమయ్యెను. జరామరణరహితుడు, మునీశ్వరుడు అగు మార్కండేయునికి జరామరణరహితజీవన వరమును పునఃప్రసాదించి వెడలిపోయెను. బ్రహ్మరుద్రాదులు నిన్నుసేవించు భక్తులను సమదృష్టితో అనుగ్రహించుట వలన మూర్తిత్రయమును నియమించువాడివి నీవేయని స్పష్టమగుచున్నది.

97-10
త్ర్యంశే౾స్మిన్ సత్యలోకే విధిహరిపురభిన్మందిరాణ్యూర్ధ్వమూర్ధ్వం
తేభ్యో౾ప్యూర్ధ్వం తు మాయావికృతివిరహితో భాతి వైకుంఠలోకః।
తత్ర త్వం కారణాంభస్యపి పశుపకులే శుద్ధసత్త్వైకరూపీ
సచ్ఛిద్ర్భహ్మాద్వయాత్మా పవనపురపతే।పాహిమాం సర్వరోగాత్॥
10వ భావము :-
భగవాన్! కృష్ణా! సత్యలోకమునగల బ్రహ్మలోకమునకును, విష్ణులోకమునకును మరియు రుద్రలోకమునకును పైన నీ వైకుంఠలోకము ప్రకాశించుచున్నది. మాయవలనకలుగు వికారములకు అతీతమయిన ఆ వైకుంఠలోకమున సమస్తజగత్తుకు కారణమయిన జలమందు శుద్ధసత్వగుణరూపముతో సత్ చిదానందుడవై ప్రభూ! కృష్ణా! నీవు అద్వైత పరబ్రహ్మముగా నిలిచియుంటివి. ఆ నీవే వ్రేపల్లెలో గోపాలునిగా అవతరించితివి. అట్టి గురవాయూరు పురాధీశా! నా రోగమునుండి నన్ను రక్షింపుము.

ద్వాదశ స్కంధము
97వ దశకము సమాప్తము
-x-