పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 92వ దశకము - కర్మ మిశ్ర భక్తిస్వరూపము

||శ్రీమన్నారాయణీయము||
ఏకాదశ స్కంధము
92- వ దశకము - కర్మ మిశ్ర భక్తిస్వరూపము

92-1
వేదైస్సర్వాణి కర్మాణ్యఫలపరతయా వర్ణితానీతి బుద్ధ్వా
తాని త్వయ్యర్పితన్యేవ హి సమనుచరన్యాని నైష్కర్మ్యమీశ।
మా భూద్వేదైర్నిషిద్దే కుహచిదపి మనఃకర్మవాచాం ప్రవృత్తిః
దుర్వర్జం చేదవాప్తం తదపి ఖలు భవత్యర్పయే చిత్ప్రకాశే॥
1వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఫలాపేక్షలేక కర్మను ఆచరించవలయునని వేదములు చెప్పుచున్నవి. ఆ వేదార్థమును గ్రహించుకొని ఫలాపేక్షలేక నా సకల కర్మలను నిర్వర్తించెదను; కర్మఫలమును నీకే సమర్పించెదను. వేదనిషిద్ధమగు కర్మలయెడ నా మనస్సు, వాక్కు, శరీరము అనాసక్తముగా ఉండుగాక! నా చిత్తమున ప్రకాశించు పరమాత్మా! అసంకల్పితముగా నిషిద్ధ కర్మ ఆచరించిననూ, ఆ కర్మఫలమును సహితము నీకే అర్పించెదను; పరమాత్మానుభూతిని పొంది కర్మబంధమునుండి విముక్తుడనగుదును.

92-2
యస్త్వన్యః కర్మయోగస్తవ భజనమయస్తత్ర చాభీష్టమూర్తిం
హృద్యాం సత్వైకరూపాం దృషది హృది మృది క్వాపి వా భావయిత్వా।
పుష్పైర్గందైర్నివేద్యైరపి చ విరచితైశ్శక్తితో భక్తిపూతైః
నిత్యం వర్యాం సపర్యాం విదధయి విభో।త్వత్ప్రసాదం భజేయమ్॥
2వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! వేదవిహితమగు నిష్కామకర్మలను ఆచరించెదను. ఆ కర్మఫలితమును నీకు అర్పించి నీ అనుగ్రహమును పొందెదను. కర్మయోగమున చెప్పిన మరియొక విధముగా కూడా నిన్ను అర్చించెదను. హృదయమున భావించుకొనుచున్న నాకిష్టమగు నీ సత్వగుణ సంపన్న రూపమును ఒక శిలలోగాని, మట్టితోచేసిన ప్రతిమలోగాని ప్రతిష్టించెదను. పుష్పగంధాదినైవేద్యములతో భక్తిగా అర్చించి, ప్రభూ! నీ అనుగ్రహమును పొందెదను.

92-3
స్త్రీశూద్రాస్త్వత్కథాదిశ్రవణవిరహితా ఆసతాం తే దయార్హాః
త్వత్పదాసన్నయాతాన్ ద్విజకులజనుషో హంత శోచామ్యశాంతాన్।
వృత్త్యర్థం తే యజంతో బహుకథితమపి త్వామనాకర్ణయంతో
దృప్తా విద్యాభిజాత్యైః కిము న విదధతే తాదృశం మా కృథామామ్॥
3వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! నీ పాద సన్నిధిలో ఉండుట, నిన్ను అర్చించుట, నీ చరితములు వినుట, నిన్ను కీర్తించుట అను అవకాశము లేనివారు కొందరు ఉందురు. వారియెడల దయకలిగి ఉండవలయును. ఇంకొందరు అర్చనలు చేయుచున్నను, యజ్ఞయాగాది క్రతువులు జరుపుచున్నను, తమ మనసులలో ప్రశాంతతలేక ఉందురు. కొందరు భక్తిహీనులు నీ చరితములను వినిపించుకొనరు. మరికొందరు తాము నేర్చిన విద్యలయెడ, తమవంశములఎడ అహంకారులైయుందురు. ప్రభూ! అట్టి స్వభావము నాకు కలుగకుండు గాక!

92-4
పాపో౾యం కృష్ణ రామేత్యభిలపతి నిజం గూహితుం దుశ్చరిత్రం
నిర్లజ్జస్సాస్య వాచా బహుతరకథనీయాని మే విఘ్నితాని।
భ్రాతా మే వంధ్యశీలో భజతి కిలసదా విష్ణుమిత్థం బుధాంస్తే
నిందంత్యుచ్పైర్హసంతి త్వయి నిహితమతీంస్తాదృశం మా కృథా మామ్॥
4వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! లౌకిక వ్యవహారములలోనే చిక్కుకున్న భక్తిహీనులగు కొందరు జనులు, భక్తులను చూచి హేళన పూర్వకముగా ఇట్లనుచుందురు. "ఈ పాపి తన చెడునడవడికను కప్పిపుచ్చుకొనుటకు తన పలుకు పలుకుకు శ్రీకృష్ణా!రామా! అని పదేపదే అనుచున్నాడు. సిగ్గుమాలిన ఈ సోదరుడు విష్ణువును అర్చించుచూ కాలయాపన చేయుచున్నాడు. ఈ పనికిమాలినవాని మాటలతో నేను అతనికి చెప్పదలచుకొనిన విషయములకు విఘ్నము కలుగుచున్నది". అని పలుకుచూ, వీరు వివేకవంతులగు నీ భక్తులను ఎగతాళి చేయుచుందురు. ప్రభూ! అట్టి గుణమునకు నన్న దూరముగా నుంచుము.

92-5
శ్వేతచ్ఛాయం కృతే త్వా మునివరవపుషం ప్రీణయంతే తపోభిః
త్రేతాయాం స్రుక్ర్సువాద్యంకితమరుణతమం యజ్ఞరూపం యజంతే।
సేవంతే తంత్రమార్గైర్విలసదరిగదం ద్వాపరే శ్యామలాంగం
నీలం సంకీర్తనాద్యైరిహ కలిసమయే మానుషాస్త్వాం భజంతే॥
5వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! కృతయుగమున నీరూపము ‘తెల్లని ఛాయ’ (శుక్లవర్ణము) కలిగిన 'యోగీశ్వర రూపము'; జనులు తపస్సుచేసి నీకు ప్రీతికలిగించిరి. త్రేతాయుగమున నీరూపము ‘ఎర్రని ఛాయ’ (అరుణవర్ణము) కలిగి 'స్రుక్', 'స్రువము' మొదలగు యజ్నోపకరణములను ధరించిన 'యజ్ఞపురుషుని రూపము'; యజ్ఞయాగాదులతో ప్రజలు నిన్ను ఆరాధించిరి. ద్వాపరయుగమున నీరూపము ‘చామన ఛాయ' (శ్యామలవర్ణ) రూపము; చక్రము, ఖడ్గము, గద ధరించిన నీ ఈరూపమును తంత్రవిధానములతో సేవించిరి. కలియుగమున నీరూపము ‘నలుపు ఛాయ’ (నీలివర్ణము); నీ ఈరూపమును ప్రజలు నామసంకీర్తనలతో ఆరాధించుదురు.

92-6
సో౾యం కాలేయకాలో జయతి మురరిపో। యత్ర సంకీర్తనాద్యైః
నిర్యత్నైరేవమార్గైరఖిలద। న చిరాత్ త్వత్ప్రసాదం భజంతే।
జాతాస్త్రేతాకృతాదావపి హి కిల కలౌ సంభవం కామయంతే
దైవాత్ తత్రైవజాతాన్ విషయవిషరసైర్మా విభో। వంచయాస్మాన్॥
6వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఈ కలియుగమున నీ నామసంకీర్తన విజయవంతమగు గాక! నీ సంకీర్తనతో సకల అభీష్టములు అప్రయత్నముగనే సిద్ధింపజేయగల ఏకైకమార్గము ఇది. మురారీ! నీ నామసంకీర్తనతో కలియుగమున జనులు నీ అనుగ్రహమును పొందెదరు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములలో జన్మించినవారు సహితము నీ నామసంకీర్తనార్తులై, ఈ కలియుగమున జన్మించవలెనని కోరుకొనుచుందురు. ప్రభూ! దైవవశమున ఈ కలియుగమున జన్మించితిని. నాకు విషగుళితమిశ్రమమగు ప్రపంచక విషయములయెడ ఆసక్తి కలిగించి నన్ను నీ భక్తికి దూరముచేయవలదు.

92-7
భక్తాస్తావత్ కలౌ స్యుర్థ్రమిళభువి తతో భూరిశస్తత్ర చోచ్చెః
కావేరీం తామ్రపర్ణీమను కిల కృతమాలాం చ పుణ్యాం ప్రతీచీమ్।
హా మామప్యేతదంతర్బవమపి చ విభో కించిదంచద్రసం త్వ-
య్యాశాపాశై ర్నిబధ్య భ్రమయ న భగవన్।పూరయ త్వన్నిషేవామ్॥
7వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఈ కలియుగమున ద్రవిడదేశమున జన్మించినవారు, ప్రత్యేకించి కావేరి, తామ్రపర్ణి నదీతీరప్రాంతములలోను, పశ్చమదిక్కునకు ప్రవహించుచున్న కృతమాల నదీతీరమున నివశించువారును, ఆ పుణ్యనదుల ప్రభావముతో నీకు భక్తులగుదురు. స్వల్పమైన భక్తికలవాడనగు నేను కూడా ఈ ద్రవిడదేశముననే జన్మించితిని. ప్రభూ! నాకు భ్రమలు కలిగించి ఆశాపాశములతో నన్ను బంధించవలదు; నన్ను పరిపూర్ణభక్తుని చేయుము. నిన్ను సదా సేవించు భాగ్యమును నాకు ప్రసాదించుము.

92-8
దృష్ట్వాధర్మద్రుహం తం కలిమపకరుణం ప్రాజ్మహీక్షిత్ పరీక్షిత్
హంతుంవ్యాకృష్టఖడ్గో౾పి న వినిహతవాన్ సారవేదీ గుణాంశాత్।
త్వత్సేవాద్యాశు సిద్థ్యేదసదిహ న తథా త్వత్పరే చైషభీరుః
యత్తు ప్రాగేవ రోగాదిభిరపహరతే తత్ర హ శిక్షయైనమ్॥
8వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! పూర్వం కలియుగ ప్రారంభమునందు పరీక్షత్తు మహారాజు, ఒకనాడు దయారహితుడు, ధర్మద్రోహియగు 'కలిని' చూచెను. ఆ 'కలి' వలన కొంతమేలుకూడా జరుగునని ఎరిగినవాడగుటచేత, పరీక్షత్తు కలిని సంహరించుటకు తనఖడ్గమును తీసియూ అతనిని సంహరించక వదిలిపెట్టెను. ఈ యుగమున ప్రభూ! నిన్ను సేవించుచు చేయు సత్కర్మలు సత్వరముగా ఫలించును. 'కలి' జనులకు రోగములు మొదలగు కష్టములు కలిగించి నీకు దూరము చేయును. నీ భక్తుడు అయినచో 'కలి' భయపడును. దేవా! ఈ 'కలిని' ఉపేక్షించకుము; శిక్షించుము.

92-9
గంగా గీతా చ గాయత్ర్యపి చ తులసికా గోపికాచందనం తత్
సాలగ్రామాభిపూజా పరపురుష।తథైకాదశీ నామవర్ణాః।
ఏతాన్యష్టాప్యయత్నాన్యయి కలిసమయే త్వత్ప్రసాదప్రవృద్ధ్యా
క్షిప్రం ముక్తిప్రదానీత్యభిదధురృషయస్తేషు మాం సజ్జయేథాః॥
9వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఈ కలియుగమున - గంగాస్నానము, భగవద్గీత పారాయణము, గాయత్రీమంత్ర జపము, పవిత్ర తులసీపూజ, గోపీచందన ధారణ, సాలిగ్రామ పూజ, ఏకాదశి ఉపవాసము, నీ నామావళి పఠనము అను ఈ ఎనిమిది అంశములు నీ భక్తులకు సులభముగా లభించగలవనియు, అపారమగు నీ అనుగ్రహమును కలిగించి, మోక్షమును ప్రసాదించగల పవిత్ర సాధనములనియు ఋషులు చెప్పిరి. ప్రభూ! ఈ ఎనిమిది అంశములయెడ నాకు భక్తిని, శ్రద్ధను ప్రసాదించుము.

92-10
దేవర్షీణాం పితౄణామపి న పునరృణీ కింకరో వాసభూమన్।
యో౾సౌ సర్వాత్మనా త్వాం శరణముపగతస్సర్వకృత్యాని హిత్వా।
తస్యోత్పన్నం వికర్మా౾ప్యఖిలమపనుదస్యేవ చిత్తస్థితస్త్వం
తన్మే పాపోత్థతాపాన్ పవనపురపతే।రుంధి భక్తిం ప్రణీయాః॥
10వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! ఫలాపేక్షలేకుండా త్రికరణశుద్ధిగా మనోవాక్కాయకర్మలతో నిన్ను సేవించు భక్తుడు దేవతలకు, పితృదేవతలకు ఋణపడి ఉండడు. అతని హృదయము స్థిరముగా నీయందే లగ్నమై యుండటవలన ఏదేని నిషిద్ధకర్మ జరిగినను అతడు దోషరహితుడగును. అట్టి గురవాయూరు పురాధీశా! పాపము హరించుము; ఋగ్మతనుండి కాపాడుము. నీయందు నాకు పరిపూర్ణభక్తిని ప్రసాదించుము.

ఏకాదశ స్కంధము
92వ దశకము సమాప్తము
-x-