పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 77వ దశకము - జరాసంధాదులతో యుద్ధము-ముచుకుందుని అనుగ్రహించుట

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
77వ దశకము - జరాసంధాదులతో యుద్ధము-ముచుకుందుని అనుగ్రహించుట

77-1
సైరంధ్ర్యాస్తదను చిరం స్మరాతురాయాః
యాతో౾భూస్సులలితముద్ధవేన సార్ధమ్।
ఆవాసం త్వదుపగమోత్సవం సదైవ
ధ్యాయంత్యాః ప్రతిదిన వాససజ్జికాయాః॥
1వ భావము :-
భగవాన్! నీకు ఆగారము ( సుగంధిలేపనము) సమర్పించి, నీ దయకు పాత్రురాలై - గూని శరీరముపోయి రూపవతి అయిన కుబ్జతో -"తిరిగి నీ వద్దకు వచ్చెదను" అని నీవు చెప్పినప్పటినుండియు - ఆ 'కుబ్జ' నీపై ఎనలేని అనురాగమును పెంచుకొని - నీ ఆగమనోత్సవము ఎప్పుడుజరుగునా అని క్షణక్షణము యోచించుచూ , నిత్యమూ తన ఇంటిని అలంకరించుచు, తను కూడా ఎళ్ళవేళలా సుందరముగా అలంకరించుకొనుచు, ప్రభూ! నీ రాకకై ఎదురుచూచుచుండెను. ఇట్లుండగా! ఒకరోజున నీ మిత్రుడగు ఉద్ధవునితో కలిసి నీవు ఆమె ఇంటికి వెళ్ళితివి.

77-2
ఉపగతే త్వయి పూర్ణమనోరథాం
ప్రమదసంభ్రమకంప్రపయోధరామ్।
వివిధమాననమాదధతీం ముదా
రహసి తాం రమయాంచకృషే సుఖమ్॥
2వ భావము :-
భగవాన్! నిన్నుచూడగానే 'కుబ్జ' ఆనందముతో ఉద్వేగమును పొందెను. ఆమె వక్షస్థలము గగుర్పాటుతో కంపించెను. ఆమె నిన్ను అనేకవిధములగా సేవించి ఆనందపరిచెను. ప్రభూ! నీవునూ ఆమెను అనుగ్రహించి - ఆమె మనోభీష్టముగు చిరకాల వాంఛను తీర్చితివి; ఆమెను సంతోషపెట్టితివి; నీ మాటను పరిపూర్ణము గావించితివి.

77-3
పృష్టావరం పునరసావవృణోద్వరాకీ
భూయస్త్వయా సురతమేవ నిశాంతరేషు।
సాయుజ్యమస్త్వితి వదేద్భుధ ఏవ కామం
సామీప్యమస్త్వనిశమిత్యపి నాబ్రవీత్ కిమ్॥
3వ భావము :-
ఆ 'కుబ్జ' చేసిన సేవలకు సంతసించి, భగవాన్! కృష్ణా! ఆమెనునీవు - ఏదయినను 'వరము' కోరుకొనమంటివి. అప్పుడు ఆమె మరికొన్ని దినములు నిన్ను తనతోగడపమని మాత్రమే కోరెను. అంతియేగాని, ఆ దీనురాలు - వివేకవంతులు కోరు సాయుజ్యముక్తిని కాని - కనీసము - నీ సామీప్యముక్తిని కాని ఆమె ఆశించలేదు; నిన్ను కోరలేదు.

77-4
తతో భవాన్ దేవ నిశాసు కాసుచి-
న్మృగీదృశం తాం నిభృతం వినోదయన్।
అదాదుపశ్లోక ఇతి శ్రుతం సుతం
స నారదాత్ సాత్వతతంత్రవిద్బభౌ॥
4వ భావము :-
భగవాన్! కృష్ణా! నీవు ఆమె (కుబ్జ) మాటను మన్నించి - మరికొన్ని దినములు ఆమె సాన్నిధ్యములో గడిపితివి; ఆమెకు "ఉపశ్లోకుడు" అను పుత్రుని ప్రసాదించితివి. ఈ 'ఉపశ్లోకుడు' నారదమునీంద్రుని వద్ద 'సాత్వత తంత్రమును' అధ్యయనముచేసి - జ్ఞానసంపన్నుడై - ప్రసిద్దుడైన భాగవతుడుగా ఖ్యాతినిపొందెను.

77-5
అక్రూరమందిరమితో౾థ బలోద్ధవాభ్యాం
అభ్యర్చితో బహునుతో ముదితేన తేన ।
ఏనం విసృజ్య విపినాగతపాండవేయ-
వృత్తం వివేదిథ తథా ధృతరాష్ట్రచేష్టామ్॥
5వ భావము :-
భగవాన్! ఒకనాడు నీవు బలరామునితోను, ఉద్ధవునితోను కలిసి అక్రూరుని గృహమునకేగితివి. అక్రూరుడు ప్రభూ! నిన్ను అత్యంత ఆనందముతో గౌరవించి స్తుతించెను. అప్పటికి కొలది దినములకు ముందు - నీవు - పాండురాజు మరణించెననియు - పాండవులు అరణ్యమునుండి హస్తినకు తిరిగివచ్చిరనియు - వార్తను విని ఉంటివి. హస్తినాపురమునకువెళ్ళి - ధృతరాష్ట్రుని చర్యలను తెలుసుకొనిరమ్మని ఆ అక్రూరుని పంపితివి.

77-6
విఘాతాజ్ఞామాతుః పరమసుహృదో భోజనృపతేః
జరాసంధే రుంధత్యనవధిరుషాంధే౾థ మథురామ్।
రథాద్యైర్ద్యోర్లబ్దైః కతిపయబలస్త్వం బలయుతః
త్రయోవింశత్యక్షౌహిణి తదుపనీతం సమహృథాః॥
6వ భావము :-
భగవాన్! జరాసంధుడు - తన ప్రియమిత్రుడునూ, అల్లుడునూ అగు భోజరాజగు కంసుడు (నీ చేతిలో) మరణించెనను వార్తను విని - కోపముతో - క్రోదాంధుడయ్యెను; మధురను ముట్టడించెను. ప్రభూ! అప్పుడు నీవు - దేవలోకమునుండి వచ్చిన రధమునెక్కి, నీ అన్న బలరామునితోను, కొద్దిపాటి సైన్యముతోను - ఆ జరాసంధుని ఎదుర్కొని - అతని ఇరువదిమూడు అక్షౌహిణుల సైన్యమును నాశనముచేసితివి.

77-7
బద్ధం బలాదథ బలేన బలోత్తరం త్వం
భూయో బలోద్యమరసేన ముమోచిథైనమ్।
నిశ్శేషదిగ్జయసమాహృత విశ్వసైన్యాత్
కో౾న్యస్తతో హి బలపౌరుషవాంస్తదానీమ్॥
7వ భావము :-
భగవాన్! అప్పుడు బలరాముడు - అత్యంత బలశాలియగు ఆ జరాసంధుని బంధించి తెచ్చెను. అతనికిగల సకల సైన్యముతోను యుద్దము చేయవలెనని తలచి, ప్రభూ! నీవా జరాసంధుని విడిచిపెట్టితివి. ఆ జరాసంధుని వద్ద - సకల దిక్కులలోని రాజులను - యుద్ధమున జయించి -సాధించి తెచ్చిన అత్యధిక సైన్యము కలదు. ఆ కాలమున జరాసంధుని మించిన పరాక్రమశాలి - పౌరుషవంతుడు వేరెవరునూ లేరు.

77-8
భగ్నస్స లగ్నహృదయో౾పి నృపైః ప్రణున్నో
యుద్ధం త్వయా వ్యధిత షోడశకృత్వ ఏవమ్।
అక్షౌహిణీశ్శివ శివాస్య జఘంథ విష్ణో।
సంభూయ సైకనవతిత్రిశతం తదానీమ్॥
8వ భావము :-
భగవాన్! జరాసంధుడు తనకు కలిగిన పరాభవమునకు కృంగిపోయెను. (కొంతకాలమునకు కోలుకొని) సామంతరాజుల ప్రేరణతో - అతడు - పదహారుసారులు- ప్రభూ! నీతో యుద్ధముచేసి - మరలమరల నీచేతిలో పరాజితుడయ్యెను. జరాసంధుని మూడువందల తొంభైయొక్క అక్షౌహిణుల సైన్యమును ఆశ్చర్యకరముగా - త్రిలోకాధిపతివగు విష్ణుమూర్తీ! నీవు ధ్వంసముచేసితివి.

77-9
అష్టాదశే౾స్య సమరే సముపేయుషి త్వం
దృష్ట్వా పురో౾థ యవనం యవనత్రికోట్యా।
త్వష్ట్రా విధాస్య పురమాశు పయోధిమధ్యే
తత్రా౾థ యోగబలతః స్వజనాననైషీః॥
9వ భావము :-
భగవాన్! ఆ జరాసంధుడు - పదునెనిమిదవ పర్యాయము - యవనరాజు సహాయముపొంది - అతని మూడుకోట్ల యవన సైన్యముతో మరల నీపై యుద్ధమునకు వచ్చెను; మధురపై దండెత్తెను. ప్రభూ! నీవప్పుడు విశ్వకర్మను రావించి, సముద్రమధ్యమున ఒక నగరమును నిర్మింపజేసితివి; నీ యోగ - బలముతో మధురలోఉన్న సకలజనులను - ఆనగరమునకు చేర్చితివి.

77-10
పద్భ్యాం త్వం పద్మమాలీ చకిత ఇవ పురాన్నిర్గతో ధావమానో
మ్లేచ్ఛేశేనానుయాతో వధసుకృతవిహీనేన శైలే న్యలైషీః।
సుస్తేనాంఘ్ర్యాహతేన దృతమథ ముచుకుందేన భస్మీకృతే౾స్మిన్
భూపాయాస్మై గుహంతే సులలితవపుషా తస్థిషే భక్తిభాజే॥
10వ భావము :-
ప్రభూ! కృష్ణా! పద్మమాలాధారివై నీవు ఒక్కడివే - కాలినడకన - ఆ మధురానగరిని విడిచి బయలుదేరితివి. అదిచూచి, ఆ యవనుడు నిన్ను వెంబడించి నీ వెంటరాసాగెను. అప్పుడు నీవు భయాశ్చర్యములకు గురిఅయిన వానివలె - పరుగుపరుగున వెళ్ళుచూ - చటుక్కున ఒక పర్వతగుహలోనికి ప్రవేశించితివి. ఆ యవనరాజు కూడా ఆ గుహలోనికి ప్రవేశించి, అచ్చట నిద్రించుచున్న 'ముచుకుందుని' నీవే అని భ్రమపడి కాలితో తన్నెను. నీచేతిలోహతమగు పుణ్యముచేసుకొనని ఆ యవనుడు - పుణ్యాత్ముడగు ఆ 'ముచుకుందుని' కంటిచూపుతో భస్మమయ్యెను. భగవాన్! నీవప్పుడు - నీభక్తుడగు ముచుకుంద మహారాజుకు - సుందరరూపముతో ప్రకాశించుచు సాక్షాత్కరించితివి.

77-11
ఐక్ష్వాకో౾హం విరక్తో౾స్మ్యఖిల నృపసుఖే త్వత్ప్రసాదైకకాంక్షీ
హా దేవేతి స్తువంతం వరవితతిషు తం నిస్ప్రహం వీక్ష్య హృష్యన్।
ముక్తేస్తుల్యాం చ భక్తిం ధుతసకలమలాం మోక్షమప్యాశు దత్వ్తా
కార్యం హింసావిశుద్ధ్యై తప ఇతి చ తదా ప్రాత్థ లోక ప్రతీత్యై॥
11వ భావము :-
నీ దర్శనభాగ్యము పొందిన ముచుకుందుడు -"భగవాన్! నేను ఇక్ష్వాకు వంశీయుడను. రాజరికపు ఐహిక సుఖములయెడ విరక్తుడను. నీ అనుగ్రహమును మాత్రమే కోరుకొనుచుంటిని" - అని పలికెను. ఏ వరము కోరని ముచుకుందుని పలుకులకు నీవు ప్రసన్నుడవైతివి; అతనికి ముక్తితో సమానమగు భక్తిని పొందమనియు - అంత్యమున పాపవిముక్తిని పొంది మోక్షముపొందగలవనియు -వరమిచ్చితివి. అతని రాజ్యమున జరిగిన జీవహింస - అనెడి పాపకార్యము - పునర్జన్మహేతువగుననియు - ఆ పాపపరిహారమునకు లోకప్రతీతి చెందిన తపమాచరించమనియు - ముచుకుందునితో పలికితివి.

77-12
తదను మథురాం గత్వా హత్వా చమూం యవనాహృతాం
మగధపతినా మార్గే సైన్యైః పురేవ నివారితః।
చరమవిజయం దర్పాయాస్మై ప్రదాయ పలాయితో
జలధినగరీం యాతో వాతాలయేశ్వర। పాహిమామ్॥
12వ భావము :-
భగవాన్! అనంతరము నీవు మధురకు వెళ్ళి - ఆ యవనుని సైన్యమునంతనూ అంత మొందించితివి. తిరిగి వచ్చుచుండగా - మగధరాజగు ఆ జరాసంధుడు - మరల మునుపటివలె నిన్ను అడ్డగించెను. వాని అహంకారమును ఇంకనూ పెంచనెంచి - ఆ జరాసంధునికి విజయము చేకూరునట్లుచేసి (నీ చేతిలో మోక్షము పొందు యోగములేని) అతనిని విడిచిపెట్టితివి; మధురను వీడి సముద్రమధ్యమున నిర్మించిన ద్వారకకు వెడలిపోయితివి. అట్టి జగద్రక్షకా! గురవాయూరు పురనాధా! నన్ను రోగమునుండి రక్షించుము.

దశమ స్కంధము
77వ దశకము సమాప్తము
-x-