పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 52వ దశకము - బ్రహ్మకృతవత్సాపహరణము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
52వ దశకము - బ్రహ్మకృతవత్సాపహరణము

52-1
అన్యావతారనికరేష్వనిరీక్షితం తే
భూమాతిరేకమభివీక్ష్య తదాఘమోక్షే।
బ్రహ్మా పరీక్షితుమనాః స పరోక్షభావం
నిన్యే౾థ వత్సకగణాన్ ప్రవితత్య మాయామ్॥

1వ భావము :-

     భగవాన్! అఘాసురుని సంహరించి ఆ రాక్షసునికి మోక్షమునొసగుటలో,  బ్రహ్మదేమునికి నీ ఇతర అవతారములలో కనిపించని విలక్షత కనిపించినది.  బాలునిరూపముననున్న నిన్ను పరీక్షించి నీ మహత్యమును (మరియొకసారి) వీక్షించవలెనని నిశ్చయించుకొనినవాడై, బ్రహ్మ తన శక్తితో మీ గోమందలను అదృశ్యముచేసెను.


52-2
వత్సానవీక్ష్య వివశే పశుపోత్కరే తాన్
ఆనేతుకామ ఇవ ధాతృమతానువర్తీ।
త్వం సామిభుక్తకబలో గతవాంస్తదానీం
భుక్తాంస్తిరో౾ధిత సరోజభవః కుమారాన్॥

2వ భావము:-

  గోవులు (ఆకస్మికముగా)  కనిపించక పోవుటతో గోపబాలురు ఆందోళనచెందిరి. స్వయముగా  నీవే వాటిని వెదికి తేవలెనని నిశ్చయించితివి; మీరప్పుడు భోజనము చేయుచుండిరి.  వాస్తవమునకు, బ్రహ్మదేముని కోరికతీర్చుటకా అనునట్లు, ప్రభూ! సగముతినిన అన్నకబళమును అరచేతిలో పట్టుకొని, నీవు ఆ గోవులను వెదుకుటకు బయలుదేరితివి. పద్మసంభవుడు  ఆ గోపబాలురను సహితము మాయము చేసెను.


52-3
వత్సాయితస్తదను గోపగణాయితస్త్వం
శిక్యాదిభాండమురళీగవలాదిరూపః ।
ప్రాగ్వత్ విహృత్య విపినేషు చిరాయ సాయం
త్వం మాయయా౾థ బహుధా వ్రజమాయయాథ॥

3వ భావము:-

  ప్రభూ! అట్లు జరుగగనే అది 'బ్రహ్మదేముని మాయ' అని గ్రహించితివి. తక్షణమే - నీవే గోమందలుగను, గోపబాలకులుగను, వారు తెచ్చిన 'మట్టి పాత్రలు', అవి పెట్టితెచ్చిన 'ఉట్లు' రూపములుగను; వారు ధరించిన వేణువులు, కొమ్ముబూరల ఆకృతులను పొందితివి. ఆ మాయాబాలురతో - గోవులతో చాలాసమయము ఆ వనములో విహరించి వారితో కలిసి వ్రేపల్లెకు తిరిగి వచ్చితివి.


52-4
త్వామేవ శిక్యగవలాదిమయం దధానో
భూయస్త్వమేవ పశువత్సకబాలరూపః।
గోరూపిణీభిరపి గోపవధూమయీభిః
ఆసాదితో౾సి జననీభిరతిప్రహర్షాత్॥

4వ భావము:-

  భగవాన్!  అందరూ నీవే  అయి - నీవే సృష్టించిన 'ఉట్లు, కొమ్ము బూరలు' ధరించి-  అందరి రూపమున - గోపబాలురు మరియు గోవులుగా, నీవు ఒక్కడివే   ( గోధూళివేళకు) బృందావనమును చేరితివి. గోపాలుర రూపమున ఉన్న నిన్నుచూచి ఆ గోపాలుర - తల్లులు అత్యంతానందముతోను,  మిక్కిలి ప్రేమతోను నిన్ను చేరదీసిరి.


52-5
జీవం హి కంచిదభిమానవశాత్ స్వకీయం
మత్వా తనూజ ఇతి రాగభరం వహంత్యః।
ఆత్మానమేవ తు భవంతమవాప్య సూనుం
ప్రీతిం యయుర్న కియతీం వనితాశ్చ గావః

5వ భావము:-

ప్రాణులు తమసంతానమును అనురాగముతో చేరదీయుట,  చూచినతోడనే ఆనందపడుట అనునవి లోకసహజము. అట్టి ప్రాణులకు - ఆ పరమాత్మే తమ బిడ్డ రూపముతో వచ్చినచో ప్రభూ! వారు ఇంకెంత ఆనందమును పొందుదురో కదా!  తమ గోపబాలకుని రూపముతో దరిజేరిన నిన్ను చూచి ఆ గోపస్త్రీలు అవ్యక్త అలౌకిక ఆనందమునకు లోనయిరి.


52-6
ఏవం ప్రతిక్షణవిజృంభితహర్షభార-
నిశ్శేషగోపగణలాలితభూరిమూర్తిమ్।
త్వామగ్రజో౾పి బుబుధే కిల వత్సరాంతే
బ్రహ్మత్మనోరపి మహాన్ యువయోర్విశేషః॥

6వ భావము:-

  ప్రభూ! ఈ విధముగా ఒక సంవత్సర కాలము గడిచెను. గోపజనులు తమ బిడ్డల రూపమున ఉన్న నిన్ను   (తమబిడ్డేయని అనుకొని) లాలించుచు ప్రతీక్షణము ఆనందించుచుండిరి. నీ అన్న బలరామునకు సహితము ఈ విషయము సంవత్సరాంతమున మాత్రమే తెలిసెను. మీరిరువురును  పరబ్రహ్మస్వరూపులే అయిననూ నీవు మాత్రము ప్రత్యేకముగానుంటివి.


52-7
వర్షావధౌ నవపురాతనవత్సపాలాన్
దృష్ట్వా వివేకమసృణే ద్రుహిణే విమూఢే।
ప్రాదీదృశః ప్రతినవాన్ మకుటాంగదాది-
భూషాంశ్చతుర్భుజయుజః సజలాంబుదాభాన్॥

7వ భావము:-

  సంవత్సరాంతమున - బ్రహ్మదేముడు తను మాయంచేసిన గోవులను, గోపబాలురును -(ఏక రూపమున నీచే సృష్టించ బడిన) కొత్త గోవత్సములును గోపబాలురును, వేరుచేసి  గుర్తించలేక మూఢుడయ్యెను. అప్పుడు - నీచే సృజించబడిన గోపాలురును గోవులును విడదీసి బ్రహ్మదేమునికి చూపించితివి. ఆహా! ప్రభూ! ఏమి అద్భుతమిది. వారందరు నీలమేఘచ్ఛాయతో -చతుర్భుజములతో - భుజకీర్తులతో, కిరీటము మొదలగు అలంకారములతో నీవలెనే కనిపించిరి.


52-8
ప్రత్యేకమేవ కమలాపరిలాలితాంగాన్
భోగీంద్రభోగశయనాన్ నయనాభిరామాన్।
లీలానిమిలీతదృశః సనకాదియోగి
వ్యాసేవితాన్ కమలభూర్భవతో దదర్శ॥

8వ భావము:-

  భగవాన్! పద్మసంభవుడగు బ్రహ్మదేమునికి నీదివ్య రూపమును ఆ గోపబాలురలలో సాక్షత్కరింపజేసితివి; వారిలో నీరూపము -  లక్ష్మీదేవి పరిచర్యలు చేయుచుండగా - అర్ధనిమీలిత నేత్రములతో - నీవు ఆదిశేషునిపై శయనించి ఉన్నట్లు కనిపించినది. సనకాది మహామునులు సహితము నిన్ను సేవించుచున్నట్లుగా కనిపించిన, ఆ నీ రూపములు దివ్యసౌందర్య కాంతులతో ప్రకాశించుచుండెను.


52-9
నారాయణాకృతిమసంఖ్యతమాం నిరీక్ష్య
సర్వత్ర సేవకమపి స్వమవేక్ష్య ధాతా।
మాయానిమగ్నహృదయో విముమోహ యావత్
ఏకో బభూవిథ తదా కబలార్ధపాణిః॥

9వ భావము:-

  అసంఖ్యాకముగా ఉన్న ఆ నారాయణరూపములను తానే సేవించుచున్నట్లుగా బ్రహ్మదేముడు చూచెను. నీ మాయ పూర్తిగా ఆవరించి ఉండుటచే  బ్రహ్మదేముడు ఏమియును తెలుసుకొనలేకపోయెను. భగవాన్!  నీవు బ్రహ్మను అనుగ్రహించి, వెనువెంటనే, సగము తినుచున్న అన్నపుముద్దను చేతియందుధరించి ఒకేఒక గోపబాలునిగా - బాలకృష్ణునిగా కనిపించితివి.


52-10
నశ్యన్ మదే తదను విశ్వపతిం ముహుస్త్వాం
నత్వా చ నూతవతి ధాతరి ధామ యాతే।
పోతైస్సమం ప్రముదితైః ప్రవిశన్ నికేతం
వాతాలయాధిప।విభో।పరిపాహిరోగాత్॥

10వ భావము:-

  ప్రభూ! మదము నశించగా బ్రహ్మదేముడు విశ్వాధిపతివయిన నీకు నమస్కరించి, నిన్ను మరల మరల స్తుతించుచూ తనస్థానమునకు వెడలెను. నీవు నీతోటి గోపబాలురతో కలిసి ఆనందముగా గృహము చేరితివి. అట్టి విభో! గురవాయూరుపురాధీశా! నారోగమును హరించుము - అని ప్రార్థించుచున్నాను.


దశమ స్కంధము
52వ దశకము సమాప్తము.
-x-