పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 47వ దశకము - ఉలూఖలబంధనము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
47వ దశకము - ఉలూఖలబంధనము

47-1
ఏకదా దధివిమాథకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్।
స్తన్యలోలుపతయా నివారయన్నంకమేత్య పపివాన్ పయోధరౌ॥
1వ భావము:-
కృష్ణా! నీవు పసిబాలునిగా ఉన్న రోజులలో ఒకనాడు, నీ తల్లి యశోద పెరుగు చిలుకు పనిలో నిమగ్నురాలైయుండెను. ఆసమయమున నీకు పాలు త్రాగవలెననెడి కోరిక కలిగెను. అంటూ వెంటనే నీవు ఆమె పనికి ఆటంకము కలిగించుచు ఆమెవడిచేరి పాలు త్రాగసాగితివి.

47-2
అర్ధపీతకుచకుడ్మలే త్వయి స్నిగ్ధహాసమధురాననాంబుజే।
దుగ్దమీశ। దహనేపరిస్రుతం ధర్తుమాశు జననీ జగామ తే॥
2వ భావము:-
కృష్ణా! అప్పుడు నవ్వులు విరియుచున్న నీ మోము పద్మమువలె ప్రకాశించుచుండెను. తల్లి వడిలో పడుకొని నీవు అట్లు పాలు త్రాగుచుండగా, వంట ఇంటిలో పొయ్యపై పెట్టిన - పాత్రలోని పాలు పొంగసాగెను; పొంగి పొయ్యిలో పడుచుండెను. ఆ పాత్రను దించుటకై, నీ తల్లి యశోద నిన్ను వదిలి పరుగు పరుగున వెళ్ళెను.

47-3
సామిపీతరసభంగసంగతక్రోధభారపరిభూతచేతసా।
మంథదండముపగృహ్య పాటితం హంతదేవ। దధిభాజనం త్వయా॥
3వ భావము:-
భగవాన్! పాలు త్రాగుచూ ఆనందడోళికలో మునిగియున్న నీకు నీ తల్లి అట్లు విడిచి వెళ్ళుట వలన కలుగు పసితనపు కోపప్రభావిత చిత్తముతో - అప్పుడు నీవు అచ్చటనే ఉన్న మజ్జిగచిలుకు కవ్వమును చేతబట్టి - పెరుగుతో నిండియున్న ఆ కుండను పగులగొట్టితివి.

47-4
ఉచ్చలద్ద్వనితముచ్చకైస్తదా సంనిశమ్య జననీ సమాద్రుతా।
త్వద్యశో విసరవద్దదర్శ సా సద్య ఏవ దధి విస్తృతం క్షితౌ॥
4వ భావము:-
ప్రభూ! నీవట్లు ఆ ఘటమును పగులకొట్టగా గుభిల్లు మనుచు పెద్ద ధ్వనివచ్చెను. ఆ ధ్వని విని (ఏమిఅయ్యెనో! అని) నీతల్లి యశోద వేగముగా అచ్చటకు తిరిగి వచ్చెను; వచ్చి చూడగా ఒలికిన పెరుగు ఆ ప్రదేశమంతటను పడి విశ్వమంతటా ఆవరించిన - నీ నిష్కళంక నిర్మల కీర్తివలె నుండెను. నీవు ఆమెకు అచ్చట కనిపించలేదు.

47-5
వేదమార్గపరిమార్గితం రుషా త్వామవీక్ష్య పరిమార్గయంత్యసౌ।
సందదర్శ సుకృతిన్యులూఖలే దీయమాననవనీతమోతవే॥
5వ భావము:-
పరమాత్మా! వేదమార్గమే నిన్ను తెలుసుకొనుటకు మార్గము. నిన్ను వెదికి పట్టుకొనుట ఆ యశోదకు సాధ్యము కాదు (నీవంతట నీవే ఆమెకు చిక్కవలెను). నీవు కనడలేదనే కినుకతో, ఆమె నీకై వెదకగా వెదకగా ఎట్టికేలకు ఆ పుణ్యాత్మురాలికి నీవు ఒక రోలిపై కూర్చుని పిల్లికి వెన్న చక్కగా పెడుతూ కనిపించితివి.

47-6
త్వాం ప్రగృహ్య బత భీతి భావనాభాసురాననసరోజమాశు సా।
రోషరూషితముఖీ సఖీపురో బంధనాయ రశనాముపాదదే॥
6వ భావము:-
కృష్ణా! యశోద నిన్ను పట్టుకొనుటకు నీవద్దకు వచ్చినప్పుడు - బెదిరిన కన్నులతో నీ మోము మరింత మనోహరముగానుండెను. నీకై వెదకి వెదకి వేసారిన - నీ తల్లి మోము - అలసటతో, రోషముతో కందిపోయెను. ఇతర గోపకాంతలు చూచుచుండగా ఆమె నిన్ను పట్టుకొని ఒకత్రాటిని చేతబట్టి నిన్ను బంధించుటకు పూనుకొనెను.

47-7
బంధుమిచ్చతి యమేవ సజ్జనస్తం భవంతమయి।బంధుమిచ్చతీ।
సా నియుజ్య రశనాగుణాన్ బహూన్ ద్వ్యంగుళోనమఖిలం కిలైక్షత॥
7వ భావము:-
పరమాత్మా! సజ్జనులు నీ బంధమును కోరుకొందురు. అట్టి నిన్ను , కృష్ణా! నీ తల్లి యశోద పగ్గముతో బంధించసాగెను. ఆ పగ్గము రెండు అంగుళములు తక్కువయ్యెను. ఆమె మరియొక పగ్గము తెచ్చి దానికి జతచేసి తిరిగి నిన్ను కట్టసాగెను. ఆ పగ్గమును రెండంగుళములు తక్కువయ్యెను. ఆమె ఇంకొక పగ్గము తీసుకొనివచ్చి నిన్ను బంధించ ప్రయత్నించెను. అదియును రెండంగుళములు తక్కువయ్యెను. (ఆహా! ఏమి విచిత్రమో!) ఆమె ఎన్ని పగ్గములు తెచ్చినను నిన్ను బంధించుటకు అవి రెండు అంగుళములు తక్కువయే అగుచుండెను.

47-8
విస్మితోత్స్మితసఖీజనేక్షితాం స్విన్నసన్నవపుషం నిరీక్ష్యతామ్।
నిత్యముక్తవపురప్యహో। హరే। బంధమేవ కృపయాన్వమన్యథాః॥
8వ భావము:-
ప్రభూ! అదిచూచి గోపవనితలు ఆశ్చర్యచకితులై నిన్ను చూచుచుండిరి. నీ తల్లి యశోద నిన్ను బంధించవలెనని మరల మరల ప్రయత్నించుచు తిరిగి తిరిగి విఫలురాలు అగుచు - మిక్కిలి అలసిపోవుచుండెను. హరీ! అదిచూచి - ఆమెపై దయచూపి - ఏబంధములు అంటని నీవు, ఆమె బంధమును అంగీకరించితివి. ఆమె నిన్ను రోలుకు కట్టివేసెను.

47-9
స్థీయతాం చిరములూఖలే ఖలేత్యాగతా భవనమేవ సా యదా।
ప్రాగులూఖలబిలాంతరే తదా సర్పిరర్పితమదన్నవాస్థిథాః॥
9వ భావము:-
"అల్లరివాడా! ఎంతసమయమయినను నీవు ఇచ్చటనే ఉండుము!", అని పలికి - నిన్ను రోలుకు కట్టిఉంచి - నీ తల్లి యశోద గృహములోనికి వెళ్ళెను. ఆమె అట్లు వెళ్ళగనే, ప్రభూ! నీవు ఏమాత్రమూ చింతించక - ఆ రోటిలో ఉన్న వెన్నను తీసుకొని తినసాగితివి.

47-10
యద్యపాశసుగమో విభో భవాన్। సంయతః కిము సపాశయానయా।
ఏవమాది దివిజైరభిష్టుతో వాతనాథ పరిపాహిమాం గదాత్॥
10వ భావము:-
సర్వవ్యాపీ! పరమాత్మా! సంసారబంధములేని యోగులుమాత్రమే నిన్ను సులభముగా తెలుసుకొను శక్తిని కలిగియుందురు. (నీవు బంధములకు అతీతుడవు). విభో! యశోద ఒక పగ్గముతో అట్టి నిన్ను రోలుకు కట్టివేయగలిగినది! అని దేవతలు కీర్తించిరి. అట్టి గురవాయూరుపురనాధా! వ్యాధినుండి నన్ను రక్షించమని ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము
47వ దశకము సమాప్తము.
-x-