పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 38వ దశకము - శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
38వ దశకము - శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట

38-1
 ఆనందరూప।భగవన్నయి। తే౾వతారే
ప్రాప్తే ప్రదీప్తభవదంగనిరీయమాణైః।
కాంతివ్రజైరివ ఘనాఘనమండలైర్ద్యామ్
ఆవృణ్వతీ విరురుచే కిల వర్షవేళా॥
1వ భావము:-
ఆనందరూపా! భగవాన్! అది వర్షఋతువు. నీవు భూతలమున అవతరించు సమయము ఆసన్నమయ్యెను. నీ శరీరపు నీలమేఘవర్ణకాంతులకు - ఆకాశముకూడా నీలి మబ్బుల కాంతులతో ప్రకాశించుచుండెను; ఆనంద శుభసూచకముగా వర్షము కురియసాగెను.

38-2
ఆశాసు శీతలతరాసు పయోదతోయైః
ఆశాసితాప్తివివశేషు చ సజ్జనేషు।
నైశాకరోదయవిధౌ నిశి మధ్యమాయాం
క్లేశాపహస్త్రిజగతాం త్వమిహావిరాసీః॥
2వ భావము:-
ప్రభూ! కురియుచున్న వర్షమునకు భూమి అన్నిదిక్కులలోనూ చల్లబడెను. అది అర్ధరాత్రి సమయము. అష్టమి చంద్రుడు ఉదయించు వేళ ఆయెను. ఆ సమయమున ముల్లోకవాసుల కష్టములను పోగొట్టుటకు నీవు అవతరించితివి. భగవదవతరణ జరిగి తమ అభీష్టములు నెరవేరునని సజ్జనులు ఆనందించిరి.

38-3
బాల్యస్పృశాపి వపుషా దధుషా విభూతీః
ఉద్యత్క్డిరీటకటకాంగదహారభాసా।
శంఖారి వారిజ గదా పరిభాసితేన
మేఘాసితేన పరిలేసిథ సూతిగేహే॥
3వ భావము:-
భగవాన్! జన్మించినప్పుడు నీవు శిశువు రూపముననున్ననూ - నీవు - శిరస్సున కిరీటముతోను, చేతులకు కంకణములతోను, భుజకీర్తులతోను, కంఠ హారములతోను ప్రకాశించుచుంటివి. అంతియేకాక శంఖము, చక్రము మరియు గదను ధరించి నీలమేఘవర్ణకాంతులతో ఆ ప్రసూతి గృహమున ప్రభవించితివి.

38-4
వక్షఃస్థలీ సుఖ నిలీన విలాసి లక్ష్మీ-
మందాక్ష లక్షిత కటాక్ష విమోక్ష భేదైః।
తన్మందిరస్య ఖలకంస కృతామలక్ష్మీం
ఉన్మార్జయన్నివ విరేజిథ వాసుదేవ।
4వ భావము:-
వాసుదేవా! నీలో ఐక్యమై - సుఖముగా నిలిచి - తన లజ్జా కటాక్షవీక్షణములను విలాసముగా నలుదిశలా ప్రసరింపజేయు లక్ష్మీదేవిని - నీ వక్షస్థలమున నిలుపుకొని - కంసుని దుష్కర్మలతో ఆవరించియుండిన 'అలక్ష్మిని' నిర్మూలించుటకే నీవు జన్మించినట్లు - అప్పుడు ప్రకాశించితివి.

38-5
శౌరిస్తు ధీర ముని మండల చేతసో౾పి
దూర స్థితం వపురుదీక్ష్య నిజేక్షణాభ్యామ్।
ఆనందబాష్ప పులకోద్గమ గద్గదార్ధ్రః
తుష్టావ దృష్టి మకరందరసం భవంతమ్॥
5వ భావము:-
ప్రభూ! అట్టి నిన్ను- ఇహలోక చింతనను వీడి, ఎల్లవేళల పరలోక చింతనలో ఉండు మునీశ్వరులు - చిత్తమున సహితము దర్శించలేని నీ అపురూపమైన రూపమును - వసుదేవుడు తన కన్నులతో చూచెను. ఆనందాశ్రువులతో అతని శరీరము తడిసి పులకించెను. మకరందము గ్రోలి ఆనందదోళికలో తేలయాడు భ్రమరమువలె, ఆ వసుదేవుడు గద్గదస్వరముతో నిన్ను స్తుతించెను.

38-6
దేవ।ప్రసీద పరపూరుష।తాప వల్లీ-
నిర్లూనదాత్ర। సమనేత్ర। కలా విలాసిన్।
ఖేదానపాకురు కృపా గురుభిః కటాక్షైః
ఇత్యాది తేన ముదితేన చిరంనుతో౾భూః॥
6వ భావము:-
"దేవా! పరమాత్మా! నీవు జీవులను భాధించు తాపములు అను బంధనాలను - నీ వీక్షణములు అను కొడవలితో త్రుంచివేయుదువు. అట్టి నేత్రములతో విలసిల్లు ఓ! భగవాన్! నీ కరుణాకటాక్ష వీక్షణములను మాపై ప్రసరింపజేయుము; మా వేదనను తొలగించుము" అని - వసుదేవుడు ఆ శిశురూపముననున్న నిన్ను, ఆనందపరవశుడై చూచుచూ స్తుతించెను.

38-7
మాత్రా చ నేత్రసలిలాస్తృతగాత్రవల్ల్యా
స్తోత్రైరభిష్టుతగుణః కరుణాలయస్త్వమ్।
ప్రాచీన జన్మ యుగళం ప్రతిబోధ్య తాభ్యాం
మాతుర్గిరా దధిథ మానుష బాలవేషమ్॥
7వ భావము:-
భగవాన్! నిన్ను చూచిన దేవకీదేవి మేను ఆనందాశ్రువులతో పులకించెను. ఆమెయూ నీ మహత్యమును, గుణగణములను స్తుతించెను. దేవా! నీవప్పుడు దేవకీ వసుదేవులకు వారి పూర్వజన్మ వృత్తాంతమును తెలిపితివి (వారు పూర్వ జన్మమున : పృశ్ని- సుతుపుడు, అదితి - కశ్యపులు). నీ అలౌకికరూపమును ఉపసంహరించుకొనమని నీ తల్లి దేవకి నిన్ను కోరెను; నీవు మానవ శిశురూపమును పొందితివి.

38-8
త్వత్ప్రేరితస్తదను నందతనూజయా తే
వ్యత్యాసమారచయితుం స హి శూరసూనుః।
త్వాం హస్తయోరధిత చిత్త విధార్యమార్యైః
అంభోరుహస్థకలహంసకిశోరరమ్యమ్॥
8వ భావము:-
భగవాన్! శిశురూపముననున్న నిన్ను- నందుని గృహమునకును -నీకు -మారుగా నందుని గృహమున జన్మించియున్న ఆడశిశువును దేవకివద్దకును - చేర్చమని నీవు వసుదేవునిని ప్రేరేపించితివి. మునీశ్వరుల చిత్తములందు నిలిచియుండు పరమాత్మా! వసుదేవుడు అప్పుడు నిన్ను తన చేతులలోనికి తీసుకొనెను; నీవు పద్మములమధ్య నిలిచిన రాజహంసవలె ప్రకాశించితివి.

38-9
జాతా తదా పశుపసద్మని యోగనిద్రా
నిద్రా విముద్రితమథాకృత పౌరలోకమ్।
త్వత్ప్రేరణాత్ కిమివ చిత్రమచేతనైర్యత్
ద్వారైస్స్వయం వ్యఘటి సంఘటితైః సుగాఢమ్॥
9వ భావము:-
నందుని గృహమున జన్మించిన యోగమాయ - ఆ పురజనులందరినీ గాఢనిద్రలో ముంచివేసెను. జీవచైతన్యములేని ద్వారముల తలుపులు తమంతట తామే తెరచుకొనెను. భగవాన్! నీ ప్రేరణతో అసాధ్యములు సుసాధ్యములగుటలో ఆశ్చర్యమేముండును!

38-10
శేషేణ భూరిఫణవారితవారిణా౾థ
స్త్వైరం ప్రదర్శితపథో మణిదీపితేన।
త్వాం ధారయన్ స ఖిలు ధన్యతమః ప్రతస్థే
సో౾యం త్వమీశ మమనాశాయ రోగవేగాన్॥
10వ భావము:-
భగవాన్! వసుదేవుడు – శిశురూపమున నున్న నిన్ను ఎత్తుకొని నందుని గృహమునకు బయలుదేరెను. అప్పుడు ఆదిశేషుడు తన విశాలమయిన పడగలతో వాననీటినుండి నిన్ను రక్షించుచు - తన పడగలపైనున్న మణికాంతులతో మార్గమును ప్రకాశవంతముచేయుచూ - వసుదేవునికి త్రోవచూపెను. మహిమాన్వితుడవగు ఓ! పరమేశ్వరా! గురవాయూరు పురవాసా! నా రోగమును నశింపజేయమని నిన్ను ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము
38వ దశకము సమాప్తము.
-x-