పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 32వ దశకము - మత్స్యావతారము వర్ణనము

|శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము
32వ దశకము - మత్స్యావతారము వర్ణనము

32-1-శ్లో.
పురా హయగ్రీవమహాసురేణ షష్ఠాంతరాంతోద్యదకాండకల్పే।
నిద్రోన్ముఖబ్రహ్మముఖాద్ హృతేషు వేదేష్వధిత్సః కిల మత్స్యరూపమ్।
1వ భావము
పూర్వము, ఆరవ(6) మనువయిన'చాక్షుషుని' కల్పము ముగియగనే ప్రళయము సంభవించెను. కల్పాంతరమున బ్రహ్మదేముడు శయనించగా ఆ సమయమున బ్రహ్మదేవుని ముఖమునుండి వేదములు వెలువడెను. ఆ వేదములను ' హయగ్రీవుడు' అను రాక్షసుడు అపహరించెను. ఆ వేదములను తిరిగి సంపాదించుటకు, భగవాన్! నారాయణమూర్తీ! నీవు "మత్స్యరూపమును" ధరించుటకు నిశ్చయించుకొంటివి.

32-2-శ్లో.
సత్యవ్రతస్య ద్రమిళాధిభర్తుర్నదీజలే తర్పయతస్తదానీమ్।
కరాంజలౌ సంజ్వలితాకృతిస్త్వ మదృశ్యథాః కశ్చన బాలమీనః॥
2వ భావము
ఇట్లు నీవు నిశ్చయించుకొనగా - ఒకానొకనాడు, ద్రమిళదేశపు మహారాజగు 'సత్యవ్రతుడు', తర్పణము చేయుటకై - కృతమాలా నదిలోని జలమును తన దోసిలిలోనికి తీసుకొనెను. భగవాన్! ( ఆహా! ఏమి భాగ్యము అతనిది!) అప్పుడు నీవు చిన్న చేపపిల్ల రూపమున ఆ మహారాజు చేతిలోని నీటిలో ప్రకాశించితివి.

32-3-శ్లో.
క్షిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యే౾0 బుపాత్రేణ మునిః స్వగేహమ్।
స్వల్పైరహోభిః కలశీం చ కూపం వాపీం సరశ్చానశిషే విభో! త్వమ్॥
3వ భావము
తనచేతిలోని చేపపిల్లను చూచి ఆ 'సత్యవ్రతుడు' వెనువెంటనే ఆ నదీజలమున విడిచెను. పెనుమీనములు తనను భక్షించునని చేపపిల్ల భయపడుచుండెనని తలచిన ఆ మహారాజు, తత్క్షణమే నిన్ను తన కమండలములోనికి తీసుకొని తనగృహమునకేగెను. చూచుచుండగనే నీ మత్స్యరూపము పెరగసాగను. కమండలము నుండి బావికి, బావినుండి- కొలనుకు, కొలనునుండి - సరస్సునకు మార్చిననూ పట్టనంతగా ప్రభూ! నీమత్స్యరూపము పెరగసాగెను.

32-4-శ్లో.
యోగప్రభావాత్ భవదాజ్ఞయైన నీతస్తతస్త్వం మునినా పయోధిమ్।
పృష్టోఖీమునా కల్పదిదృక్షుమేనం సప్తాహమాస్స్వేతి వదన్నయాసీః॥
4వ భావము
భగవాన్! నీరూపమట్లు పెరుగుచుండగా, నీ ఆదేశముతో ఆ 'సత్యవ్రత మహారాజు' తన యోగప్రభావముచే నిన్ను సముద్రము వద్దకు తీసుకొనిపోయెను. నీవు సముద్రమున ప్రవేశించుచుండగా, ఆ సత్యవ్రతుడు తనకు ప్రళయమును చూడవలెననెడి కోరికగలదని నీకు చెప్పెను. అప్పుడు నీవు అతనితో ఏడుదినములు వేచియుండమని చెప్పి, ఆ సముద్రగర్భమున అంతర్ధానమయితివి.

32-5-శ్లో.
ప్రాప్తే త్వదుక్తే౾హాని వారిధారాపరిప్లుతే భూమితలే మునీంద్రః।
సప్తర్షభిః సార్థమపారవారిణ్యుద్ ఘార్ణమానః శరణం యయౌ త్వామ్॥
5వ భావము
ప్రభూ! నీవు చెప్పిన రీతిగనే ఏడుదినములకు ప్రళయము సంభవించెను. భూతలమంతయూ జలధారలతో నిండిపోయెను.మహోత్తుంగతరంగాలతో కల్లోలభరితమయిన ఆ ఆజలాంబుధిని చూచి కలవరపడిన ' సత్యవ్రతుడు ' సప్తర్షులతో కలిసి నిన్ను శరణుజొచ్చెను.

32-6-శ్లో.
ధరాం త్వదాదేశకరీమవాప్తాం నౌరూపిణీమారురుహుస్తదా తే।
తత్కంపకంప్రేషు చ తేషు భూయస్త్వమంబుధేరావిరభూర్మహీయాన్॥
6వ భావము
భగవాన్! అప్పుడు నీ ఆదేశముననుసరించి ధరిత్రి నౌకరూపమును ధరించి అచ్చటకు వచ్చెను. సప్తర్షులు, సత్యవ్రతుడు ఆ నౌకను అధిరోహించిరి. ప్రళయకాలమున వీచుచున్న గాలులకు ఆ నౌక తీవ్రముగా కంపించసాగెను; అందరూ భయకంపితులవసాగిరి. ఆ సమయమున ప్రభూ! నారాయణమూర్తీ! నీవు ఆమహాసముద్రమున మహామత్స్యరూపమున " మత్స్యావతారుడవై" ఆవిర్భవించితివి.

32-7-శ్లో.
ఝషాకృతిం యోజనలక్షదీర్ఘాం దధానముచ్ఛైస్తరతేజసం త్వామ్.।
నిరీక్ష్య తుష్ఠా మునయస్త్వదుక్త్యా త్వత్తుంగశృంగే తరణిం బబంధుః॥
7వ భావము
భగవాన్! లక్షయోజనముల పొడవు ఉన్న - మిక్కిలి ప్రకాశవంతమయిన నీ "మత్స్యావతారమును" చూచిన మునులు సంభ్రమాశ్చర్యములను పొందిరి; సంతుష్టులైరి. నీవు ఆజ్ఞాపించగా వారు తాము అధివసించిన నౌకను నీ ఉన్నతమైన 'శృంగమునకు'(కొమ్ముకు) కట్టిరి.

32-8-శ్లో.
ఆ కృష్ణనౌకో మునిమండలాయ ప్రదర్సయన్ విశ్వజగద్విభాగాన్।
సంస్తూయమానో నృవరేణ తేన జ్ఞానం పరం చోపదిశన్నచారీః॥
8వ భావము
మత్స్యావతారమును ధరించిన ఓ! నారాయణమూర్తీ! ఆ ప్రళయకాల సముద్రమున; సప్తర్షులు, సత్యవ్రతుడు అధిరోహించన ఆ నౌకను నీవు లాగుకొని పోవుచు, వారికి భూమండలమున తారసపడు రాజ్యములను గురించి వివరించుచూ పోవసాగితివి. అట్లు సంచరించుచునే, ఆ రాజర్షియగు సత్యవ్రతునికి నీవు పరతత్వజ్ఞానమును భోధించితివి.

32-9-శ్లో.
కల్పావధౌ సప్త మునీన్ పురోవత్ ప్రస్థాప్య సత్యవ్రతభూమిపం తమ్ ।
వైవస్వతాఖ్యం మనుమాదధానః క్రోధాద్దయగ్రీవమభిద్రుతో౾భూః॥
9వ భావము
భగవాన్! కల్పాంతరమున ప్రళయకాలము ముగిసిపోవగనే, సప్తర్షులను వారి వారి స్థానములకు చేర్చితివి. 'సత్యవ్రతునిని' వైవస్వత మనువును చేసితివి. పిమ్మట, వేదములను అపహరించిన ఆ 'హయగ్రీవుని' మిక్కిలి క్రోధముతో ఎదుర్కొంటివి.

32-10-శ్లో.
స్వతుంగశృంగక్షతవక్షసం తం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా।
విరించయే ప్రీతహృదే దదానః ప్రభంజనాగారపతే। ప్రపాయాః॥
10వ భావము
భగవాన్! మత్సావతారమూర్తీ! అప్పుడు నీవు నీ ఉన్నతముగు శృంగముతో (కొమ్ముతో) ఆ హయగ్రీవ దైత్యుని వక్షస్థలమును చీల్చి వధించితివి. ఆ రాక్షసునినుండి వేదములను సంగ్రహించి విరించికి (బ్రహ్మదేమునికి) అందించి ఆనందింపజేసితివి. అట్టి గురవాయూరు పురప్రభూ! నన్ను రక్షింపుము.

అష్టమ స్కంధము పరిపూర్ణం
32వ దశకము సమాప్తము.
-x-