పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 21వ దశకము - జంబూద్వీపాలలో భగవదుపాసనము వర్ణనము

||శ్రీమన్నారాయణీయము||
పంచమ స్కంధము
21వ దశకము - జంబూద్వీపాలలో భగవదుపాసనము వర్ణనము

21-1-శ్లో.
మధ్యోద్భవే భువ ఇలావృతనామ్ని వర్షే
గౌరీప్రధానవనితాజనమాత్రభాజి।
శర్వేణ మంత్రనుభిః సముపాస్యమానం
సంకర్షణాత్మక మధీశ్వర! సంశ్రయే త్వామ్।।
1వ భావము
భూమండలమునకు మధ్యప్రదేశమున 'ఇలావృతము' అను భూభాగము కలదు. అచ్చట నీవు - ''సంకర్షణ'' అను రూపమున నిలిచితివి. ఈశ్వరుడు ఆస్థలమున అర్ధనారీశ్వర రూపమున - నిన్ను మంత్రములతోను, స్తోత్రములతోను ఉపాసించును. ఆ ప్రదేశమున - గౌరీదేవిని ఆశ్రయించిన స్త్రీజనులు మాత్రమే నివసించుదురు. జగదీశ్వరా! అట్టి నిన్ను ప్రార్ధింతును.

21-2-శ్లో.
భద్రాశ్వనామక ఇలావృతపూర్వవర్షే
భద్రశ్రవోభిర్ ఋషిభిః పరిణూయమానమ్।
కల్పాంతగూఢనిగమోద్ధరణప్రవీణం
ధ్యాయామి దేవ! హయశీర్షతనుం భవంతమ్।।
2వ భావము
'ఇలావృతమునకు' తూర్పు భాగమున ' భద్రాశ్వము' అను భూభాగము కలదు. అచ్చట నీవు - కల్పాంతరమున వేదములనుద్దరించిన " హయగ్రీవుని" రూపమున నిలిచితివి. 'భద్రశ్రవసులు' అను ఋషులు ఆప్రదేశమున వేదమంత్రములతో - నిన్ను స్తుతించుచు పూజించెదరు. జగదీశ్వరా! అట్టి నిన్ను - నేను ధ్యానింతును.

21-3-శ్లో.
ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే
ప్రహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణమ్।
ఉత్తుంగశాంతధవళాకృతిమేకశుద్ద-
జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతం।।
3వ భావము
భగవాన్! 'ఇలావృతమునకు' దక్షిణమున 'హరివర్షము' అను భూభాగము కలదు. అచ్చట నీవు - ఉన్నతమైన మరియు ప్రశాంతమైన తెల్లని దేహచ్చాయతో “నరసింహస్వామి" రూపమున నిలిచితివి. శుద్ధ జ్ఞానప్రధానమగు ఆరూపమును - భక్తులలో ప్రముఖులయిన ‘ప్రహ్లాదుడు' మొదలగువారు పరివేష్టించి ఉపాసింతురు. అట్టి నీరూపమును - నేను ధ్యానింతును.

21-4-శ్లో.
వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే
లీలావిశేషలలితస్మితశోభనాంగమ్
లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం
తస్యాః ప్రియాయ ధృతకామతమం భజే త్వామ్।।
4వ భావము
'ఇలావృతమునకు' పశ్చిమమున 'కేతుమాలము' అను భూభాగము కలదు. ఆప్రదేశము అతిసుందరమైనది. భగవాన్! అచ్చట నీవు సుకుమారమయిన శరీరముతో సుందరదరహాస రూపమును ధరించి నిలిచితివి. లక్ష్మీదేవికి ఆనందము కలిగించుటకు "కామదేవుని" రూపమున నిలిచిన - నీరూపమును లక్ష్మీదేవి మరియు ప్రజాపతుల పుత్రులు సేవింతురు. అటువంటి నీ దివ్యరూపమును నేను ధ్యానింతును.

21-5-శ్లో.
రమ్యే హ్యూదీచి ఖలు రమ్యకనామ్ని వర్షే
తద్వర్షనాథ మనువర్యసపర్యమాణమ్
భక్తైకవత్సలమమత్సరహృత్సు భాంతం
మత్య్సాకృతిం భువననాథ! భజే భవంతమ్।।
5వ భావము
'ఇలావృతమునకు' ఉత్తరమున 'రమ్యకము' అను భూభాగము కలదు. ఆ ప్రదేశమునకు 'మనువు' అధిపతి. భువననాథా! నీవు అచ్చట "మత్స్య" రూపమున నిలిచితివి. మాత్సర్యరహిత హృదయములందు ప్రకాశించు భక్తవత్సలా! ఆ 'మనువు' నిన్ను పూజించును. "మత్స్య రూపమున" వెలసిన ఓ భూపతీ! నిన్ను నేను ధ్యానింతును.

21-6-శ్లో.
వర్షం హిరణ్యయసమాహ్వయమౌత్తరాహం
ఆసీనమద్రిధృతికర్మఠకామఠాంగమ్।
సంసేవతే పితృగణప్రవరో౾ర్యమా యం
తం త్వాం భజామి భగవన్! పరచిన్మయాత్మన్।।
6వ భావము
ఆ 'రమ్యకమునకు' ఉత్తరమున 'హిరణ్మయమను' భూభాగము కలదు. ప్రభూ! ఆప్రదేశమున నీవు- అనితరసాధ్యమయిన మంధరపర్వతమును - అకుంఠిత దీక్షతోఎత్తి నీ మూపున నిలుపుకొనిన "కూర్మావతార" రూపమున ఆసీనుడవైతివి. పితృగణములలో ముఖ్యుడగు 'ఆర్యముడు' అచ్చట నిన్ను సేవించును. "కూర్మరూపమును" ధరించిన పరతత్వజ్ణానస్వరూపా! నిన్ను - నేను ధ్యానింతును.

21-7-శ్లో.
కించోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా
సంసేవితో మహితమంత్రనుతిప్రభేధైః।
దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా
త్వం పాహి విజ్ఞనుత! యజ్ఞవరాహమూర్తే!।।
7వ భావము
'హిరణ్మయ' భూభాగమునకు ఉత్తరమున “కురుభూములు” కలవు. ఆప్రదేశమున నీవు భూదేవితోకూడి "యజ్ఞ-వరాహమూర్తి" రూపమున వెలసితివి. అచ్చట నీరూపము అత్యంత ఉన్నతమైనది. నీకోరలతో మేఘముల అంచులను తాకుచూ మహాకాయముతో నిలిచి ఉన్న నిన్ను - తత్వవేత్తలు మరియు భూదేవియు - విశిష్టమైన మంత్రములతోను, స్తోత్రములతోనూ సేవించెదరు. అటువంటి "యజ్ఞ-వరాహమూర్తీ"! - నన్ను రక్షింపుము.

21-8-శ్లో.
యామ్యాం దిశం భజతి కింపురషాఖ్యవర్షే
సంసేవితో హనుమతా దృఢభక్తిభాజా।
సీతాభిరామ పరమాద్భుత రూపశాలీ
రామాత్మకః పరిలసన్ పరిపాహి విష్ణో!।।
8వ భావము
'ఇలావృతమునకు' దక్షిణమున 'కింపురుషము' అను భూభాగము కలదు. అచ్చట సీతాదేవికి ఇష్టమగు, "శ్రీ రాముని" రూపమున నిలిచితివి. పరమాద్భుతమగు ఆ రూపమును ధృఢభక్తితో హనుమంతుడు ఉపాసించి నిన్ను సేవించును. "శ్రీ రాముని" రూపమున వెలసిన విష్ణుమూర్తీ! నన్ను రక్షింపుము అని నిన్ను ప్రార్ధింతును.

21-9-శ్లో.
శ్రీ నారదేన సహ భారతఖండముఖ్యైః
త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః।
ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షీ
నారాయణో నరసఖః పరిపాహిభూమన్!।।
9వ భావము
'భరతఖండమున', నరనారాయణులలో ఒకరివైన నీవు , నరునికి సఖుడు - గురువు అగు "నారాయణుని" రూపమున అవతరించితివి. నారదాది ఉత్తమ భక్తులు - సాంఖ్యాయోగతత్వమున నిన్ను స్తోత్రములతో స్తుతించుచు ఉపాసించెదరు. "నారాయణ" రూపమున వెలసిన విష్ణుమూర్తీ! కల్పాంతరమువరకు నీవు సాధుజనులను రక్షించెదవు. భూమన్! అట్టి నిన్ను, నన్ను రక్షింపమని ప్రార్ధింతును.

21-10-శ్లో.
ప్లాక్షే౾ర్కరూపమయి! శాల్మల ఇందురూపం
ద్వీపే భజంతి కుశనామని వహ్నిరూపమ్।
క్రౌంచేంబురూపమథ వాయుమయం చ శాకే
త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్నిలోకాః।।
10వ భావము
భూమండల మధ్యభాగమున 'జంబూద్వీపము' కలదు. ఆ ద్వీపమునకు ఉపద్వీపములు కలవు. 'ప్రభూ! ' ప్లక్ష' ద్వీపవాసులు - "సూర్య" రూపముగను, 'శాల్మల' ద్వీపవాసులు - "చంద్ర" రూపముగనూ నిన్ను పూజింతురు; 'కుశ' ద్వీపవాసులు – “అగ్ని" రూపముగను, 'క్రౌంచ' ద్వీపవాసులు - "వరుణ" రూపముగనూ నిన్ను ఉపాస్య దైవముగా పూజింతురు; 'శాక' ద్వీపవాసులు - "వాయుదేవుని" రూపమునను, 'పుష్కర' ద్వీపవాసులు - "బ్రహ్మదేవునిగనూ" , ప్రభూ! నిన్ను పూజింతురు.

21-11-శ్లో.
సర్వైర్ర్దువాదుభిరుడు ప్రకరైర్గ్రహైశ్చ
పుచ్చాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః।
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్!।।
11వ భావము
క్షీరసాగరమున శయనించు విష్ణుమూర్తీ! 'జ్యోతిర్లోకమున' నీవు "మకర" రూపమున నిలిచితివి. ఆ 'శింశుమార' రూపము కుండలాకారముగా తలక్రిందలుగా ఉండును. తోకమొదలుకొని తలవరకూ గల నీ సర్వావయవములయందు - ధృవుడు, సప్తర్షులు, నవగ్రహములు, సకల నక్షత్రములు పరిభ్రమించును. ఆ 'శింశుమారచక్రమును' యోగీశ్వరులు తమచిత్తమందు నిలుపుకుని, త్రిసంధ్యలయందు నిన్ను ఉపాసింతురు. క్షీరసాగరసాయీ! నాకు నరకమును నివారించుము - విష్ణుపధమును ప్రసాదించుము

21-12-శ్లో.
పాతాలమూలభువి శేషతనుం భవంతం
లోలైకకుండలవిరాజి సహస్ర శీర్షమ్।
నీలాంబరం ధృతహాలం భుజగాంగనాభిః
జుష్ట భజే హర గదాన్ గురుగేహనాథ!।।
12వ భావము
ప్రభూ! పాతాళలోకమున "అది శేషువు" రూపమున వేయిపడగలతో విరాజిల్లుచు, ఏకకుండలమును మరియు భుజమున నాగలిని ధరించి - నీవు ప్రకాశింతువు. నీలాంబరధారివైన నీ "ఆదిశేషువు" రూపమును, నాగలోక వనితలు భక్తిశ్రద్ధలతో పూజింతురు. గురవాయూరుపురాధీశా! నారోగమును హరించుము. నీపై నాకు ధృఢభక్తిని ప్రసాదించుము.

పంచమ స్కంధము పరిపూర్ణం
21వ దశకము సమాప్తము.
-x-