పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 100వ దశకము - కేశాదిపాదాంతరూపవర్ణనము

||శ్రీమన్నారాయణీయము||
ద్వాదశ స్కంధము
100- వ దశకము - కేశాదిపాదాంతరూపవర్ణనము

100-1
అగ్రే పశ్యామి తేజోనిబిడతరకలాయావలీలోభనీయం
పీయూషాప్లావితో౾హం తదను తదుదరే దివ్యకైశోరవేషమ్।
తారుణ్యారంభరమ్యం పరమసుఖరసాస్వాదరోమాంచితాంగైః
ఆవీతం నారదాద్యైర్విలసదుపనిషత్సుందరీమండలైశ్చ॥
1వ భావము:-
భగవాన్! గాఢమైన నీలికలువపువ్వులకాంతిలో దేదీప్యమానముగా ప్రకాశించుచున్న ఒకతేజమును నా కనులఎదుటగా చూచితిని. ఆ మరుక్షణమే నేను అమృతవర్షముతో తడిసి పులకాంకితుడనైనట్టి అనుభూతిని పొందితిని. ఆతేజస్సునడుమ యౌవనారంభలక్షణములుగల ఒకబాలుని దివ్యరూపము ఉన్నది. ఉపనిషత్తులు సుందరీమణులవలె ప్రకాశించుచుండగా, పరతత్వజ్ఞానముతో పులకాంకితులయిన నారదుడు మొదలగు ఋషులు పరివేష్టించియుండగా ఆ బాలుడు ఒక దివ్యరూపముతో నాఎదుట సాక్షాత్కరించెను.

100-2
నీలాభాం కుంచితాగ్రం ఘనమమలతరం సంయతం చారుభంగ్యా
రత్నోత్తంసాభిరామం వలయితముదయచ్ఛంద్రకైః పింఛజాలైః।
మందారస్రజ్నీవీతం తవ పృథుకబరీభారమాలోకయే౾హం
స్నిగ్ధశ్వేతోర్ధ్వపుండ్రామపి చ సులలితాం ఫాలబాలేందువీథీమ్॥
2వ భావము:-
భగవాన్! ఆ బాలుని కేశములు నల్లగా వత్తుగా ఉండి వంకీలుతిరిగి ఉండెను; అందముగా ముడవబడి రత్నములతో అలంకరించబడియుండెను. ఆ కేశపాశములు మందారపువ్వులతో అలంకృతములై నెమలికన్నులుగల పింఛములు ధరించబడి కనిపించినవి. అనంతరము తెల్లని ఊర్ధ్వపుండ్రము (నామముతో) ప్రకాశించుచున్న బహుసుకుమారమగు ఆ బాలుని నుదురు నెలవంకవలె కనిపించినది.

100-3
హృద్యం పూర్ణానుకంపార్ణవమృదులహరీ చంచలద్ర్భూవిలాసైః
ఆనీలస్నిగ్ధపక్ష్మావళి పరిలసితం నేత్రయుగ్మం విభో।తే।
సాంద్రచ్ఛాయం విశాలారుణకమలదళాకారమాముగ్ధతారం
కారుణ్యాలోకలీలాశిశిరితభువనం క్షిప్యతాం మయ్యనాథే॥
3వ భావము:-
భగవాన్! తరువాత ఆ బాలుని నేత్రద్వయము కనిపించినది. ఆ నేత్రములు, కరణ అను సాగరములో చంచలమై అతి సున్నితముగా కదులుచున్న అలలవలె ఆహ్లాదముకలిగించుచున్నవి. ఆ కనుల కనుబొమలు నల్లని కనురెప్పపంక్తులతో విలసిల్లుచూ విశాలముగానుండి ఎఱ్ఱని తామరపూరేకుల ఆకృతితో - దయార్ధ్రదృక్కులుగల అందమయిన కనుపాపలతో కనిపించినవి. కరుణావీక్షణములతో లోకములకు శ్రేయస్సుకలిగించు విభో! కృష్ణా! ఈ అనాధపై నీ దయాదృష్టిని ప్రసరింపజేయుము.

100-4
ఉత్తుంగోల్లాసినాసం హరిమణిముకురప్రోల్లసద్గండపాళీ-
వ్యాలోలత్కర్ణపాశాంచితమకరమణీకుండలద్వంద్వదీప్రమ్।
ఉన్మీలద్దంతపంక్తిస్ఫురదరుణతరచ్ఛాయబింబాధరాంతః
ప్రీతిప్రస్యందిమందస్మితమధురతరం వక్త్రముద్భాసతాం మే॥
4వ భావము:-
భగవాన్! ఎత్తైన నాసికతో, నీలమణిఛాయతో, అద్దమువలె ప్రకాశించుచున్న చెక్కిళ్ళతో, చెవులకు ధరించిన మకరకుండలముల కాంతులు వదనమంతటనూ ప్రకాశవంతముచేయుచు ప్రసరించుచుండగా; ఎఱ్ఱని దొండపండును పోలిన పెదవులతో, వికసించుచునట్లున్న సుస్పష్టమగు పలువరుసతో, మధురమగు మందహాసము ఒలికించుచు, కనిపించుచున్న ప్రభూ! కృష్ణా! నీ వదనము నా హృదయమున వెలుగొందుగాక!

100-5
బాహుద్వంద్వేన రత్నోజ్జ్వలవలయభృతా శోణపాణిప్రవాళే-
నోపాత్తం వేణునాళీం ప్రసృతనకమయుఖాంగుళీసంగాశారామ్।
కృత్వా వక్త్రారవిందే సుమధురవికసద్రాగముద్భావ్యమానైః
శబ్దబ్రహ్మమృతైస్త్వం శిశిరతభువనైస్సించ మే కర్ణవీథీమ్॥
5వ భావము:-
భగవాన్! ఆ బాలుడు రత్నఖచితమయిన కడియములు తన ముంజేతికి ధరించి, పగడమువలె ఎఱ్ఱని కాంతులు వెదజల్లు హస్తములతో వేణువును పట్టుకొని మధురముగా పలికించుచూ రాగామృతమును కురిపించుచుండగా, ఆ వేలిగోళ్ళకాంతులు పలువర్ణములను ప్రసరింపజేయుచుండెను. సకల భువనములను ముగ్ధముచేయు అట్టి శబ్దబ్రహ్మ వేణుగానామృతముతో ప్రభూ! కృష్ణా! నా కర్ణములను తడుపుము.

100-6
ఉత్సర్పత్కౌస్తుభశ్రీతతిభిరరుణితం కోమలం కంఠదేశం
వక్షః శ్రీవత్సరమ్యం తరళతరసముద్దీప్రహారప్రతానమ్।
నానావర్ణప్రసూనావళికిసలయినీం వన్యమాలాం విలోల-
ల్లోలంబాం లంబమానామురసి తవ తథా భావయే రత్నమాలామ్॥
6వ భావము:-
భగవాన్! ఎఱ్ఱని కాంతులు విరజిమ్ము కౌస్తుభమణిని నీ కంఠమున ధరించితివి; శ్రీవత్సమును తాకుచు ఇతర కంఠహారములును నీ వక్షస్థలమన రమ్యముగా కదులుచున్నవి. పలురకములగు మనోహరమగు పుష్పములతో, చిగురుటాకులు కలిగి తుమ్మెదలను ఆకర్షించు వనమాలను ధరించితివి; నీ వక్షస్థలమునరత్నమాల వ్రేలాడుచున్నది. ఆ నీ రూపమును ప్రభూ! కృష్ణా! సదా ధ్యానింతును.

100-7
అంగే పంచాంగరాగైరతిశయవికసత్సౌరభాకృష్ణలోకం
లీనానేకత్రిలోకీవితతిమపి కృశాం బిభ్రతం మధ్యవల్లీమ్।
శక్రాశ్మన్యస్తతప్తోజ్జ్వలకనకనిభం పీతచేలం దధానం
ధ్యాయామో దీప్తరశ్మి స్ఫుటమణిరశనాకింకిణీమండితం త్వామ్॥
7వ భావము:-
భగవాన్! ఐదురకముల సుగంధలేపనములతో సువాసనలు వెదజల్లుచూ ముల్లోకములను ఆకర్షించునట్టిది; ముల్లోకములను తనలోనే ధరించియున్నప్పటికీ సన్నని తీగవంటి నడుముకలది. ఇంద్రనీలమణి వర్ణము కలిగిన దేహముపై పట్టుపీతాంబరములు ధరించి దేదీప్యమానముగా ప్రకాశించుచున్నట్టి నీ రూపము. స్పుటముగా కాంతికిరణములు వెదజల్లు మణులతో, చిరుమువ్వలతో అలంకృతమయిన నడికట్టుతో ఉన్న ఆ నీ రూపమును, ప్రభూ! కృష్ణా! నేను సదా ధ్యానింతును.

100-8
ఊరూ చారూ తవోరూ ఘనమసృణరుచౌ చిత్తచోరౌ రమాయాః
విశ్వక్షోభం విశంక్య ధ్రువమనిశమభౌ పీతచేలావృతాంగౌ।
ఆనమ్రాణాం పురస్తాన్న్యసనధృత సమస్తార్థపాళీసముద్గ-
చ్ఛాయం జానుద్వయం చ క్రమపృథుల మనోజ్ఞే చ జంఘే నిషేవే॥
8వ భావము:-
భగవాన్! నీ రూపము మేఘకాంతినిపోలిన కాంతితో లక్ష్మీదేవి చిత్తమును హరించినది. జనులకు భీతికలుగునను శంకతో ఎల్లప్పుడూ పీతవస్త్రముతో కప్పివుంచు తొడలతో; వినయముతో నిన్ను సేవించు భక్తుల అభీష్టము తీర్చి సకలఫలములను వారికి ఒసగుటకా అనునట్లు మూతపెట్టిన బుట్టవలెనుండు మోకాళ్ళతో; క్రమముగా సన్నని ఆకారముదాల్చి మనోహరముగా ఉండు కాలిపిక్కలతో - ప్రకాశించుచున్న నీ రూపమును, ప్రభూ! కృష్ణా! నేను సదా ధ్యానింతును.

100-9
మంజీరం ముంజనాదైరివ పదభజనం శ్రేయ ఇత్యాలపంతం
పాదాగ్రం భ్రాంతిమజ్జత్ ప్రణతజనమనోమందరోద్ధారకూర్మమ్।
ఉత్తుంగాతామ్రరాజన్నఖరహిమకరజ్యోత్స్నయా చాశ్రితానాం
సంతాపధ్వాంతహంత్రీం తతిమనుకలయే మంగళామంగుళీనామ్॥
9వ భావము:-
భగవాన్! నీ పదభజనమే సర్వ శ్రేయస్కరమని పలుకచున్నవా! అనునట్లు నీ కాలిఅందెలు సవ్వడిచేయుచున్నవి. నీ పాదాగ్రములు మంధరపర్వతమును లేవనెత్తి భక్తులను ఉద్ధరించిన కూర్మావతారమును తలపించుచున్నవి. నీ కాలిగోరులు ఎరుపురంగులో ఉండి చంద్రుని. చల్లనివెన్నెలవలె కాంతులను వెదజల్లుచూ భక్తుల దుఃఖమను చీకటిని పోగొట్టుటకా అనునట్లు ఉన్నవి. అట్టి మంగళప్రదమగు కాలిగోళ్ళు కలిగిన నీ పాదములను ప్రభూ! కృష్ణా! నేను సదా ధ్యానింతును.

100-10
యోగీంద్రాణాం త్వదంగేష్వధికసుమధురం ముక్తభాజాం నివాసో
భక్తానాం కామవర్షద్యుతరుకిసలయం నాథ। తే పాదమూలమ్।
నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే। కృష్ణ। కారుణ్యసింధో।
హృత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానందసందోహలక్ష్మీమ్॥
10వ భావము:-
భగవాన్! కృష్ణా! నీ అవయవములన్నింటిలోనూ అత్యంత ప్రీతిపాత్రమయునది, ముక్తులగు యోగీంద్రులకు నివాసమయినది, భక్తుల అభీష్టఫలములనొసగు కల్పవృక్షపల్లవమయినది, నా చిత్తమున స్థిరముగా నిలిచియుండిన నీపాదమూలము నా అశేష తాపమును హరించుగాక! కరుణాసముద్రా! పరమానందము అను భాగ్యమును (లక్ష్మిని) ప్రసాదించెదవుగాక!

100-11
అజ్ఞాత్వా తే మహత్వం యదిహ నిగదితం విశ్వనాథ। క్షమేథాః
స్తోత్రం చైతత్ సహస్రోత్రరమధికతరం త్వత్ప్రసాదాయ భూయాత్।
ద్వేధా నారాయణీయం శ్రుతిషు చ జనుషా స్తుత్యతావర్ణనేన
స్ఫీతం లీలావతారైరిదమిహ కురుతామాయురారోగ్యసౌఖ్యమ్॥
11వ భావము:-
విశ్వనాథా! కృష్ణా! నీ మహత్యమును పూర్తిగా తెలుసుకొనకనే వ్రాసినందులకు నన్ను క్షమించుము. వేయికిపైగా శ్లోకములతో వ్రాయబడిన ఈ గ్రంథము అత్యంత అనుగ్రహప్రదము. నారాయణునిగురించి వ్రాయబడుటచేతను, నారాయణుడుఅను భక్తకవిచే వ్రాయబడుటచేతను ఈ గ్రంథము "నారాయణీయమ్" అనిపిలవబడుటకు రెండువిధములుగాను తగియున్నది. వేదములచే కీర్తించబడిన నారాయణుని లీలావతారములను సంగ్రహముగా వర్ణించిన ఈ గ్రంథమును చదివినవారికి, వినినవారికి ఆ గురవాయూరు పురాధీశుని అనుగ్రహము సిద్ధించుగాక! ఆయురారోగ్యములు ప్రాప్తించుగాక!

నారాయణీయం ఇతి సుసంపూర్ణం
ద్వాదశ స్కంధము సంపూర్ణం
100వ దశకము సమాప్తము
-x-
ఓ నమో భగవతే వాసుదేవాయ
ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనాః సుఖినేభవంతు