1)
| శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా!
|
2)
| అంగన పనుపున దోవతి కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా సంగతి విని దయ నొసఁగితి రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!
|
3)
| అండజవాహన! విను బ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితి వందురు కొండికపని గాక దొడ్డ కొండా! కృష్ణా!
|
4)
| అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధిఁ దరువ పొలుపున నీ వా నందంబగు కూర్మమవై మందరగిరి యెత్తితౌర! మాధవ కృష్ణా!
|
5)
| అందెలఁ బాదము లందును సుందరముగ నిల్పినావు సొంపమరంగా సుందర! మునిజనసన్నుత! నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
|
6)
| అందెలు గజ్జెలు మ్రోయఁగఁ జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందునిసతి యా గోపిక ముందఱ నాడుదువు మిగుల ముఱియుచు కృష్ణా!
|
7)
| అంసాలంబితకుండల! కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్ సంసారిరీతి నుంటివి. సంసాదిక వైరి! సత్ప్రశంసిత! కృష్ణా!
|
8)
| అక్రూరవరద! మాధవ! చక్రాయుధ! ఖడ్గపాణి! శార్ఙ్గి! ముకుందా! శక్రాది దివిజ సన్నుత! శుక్రార్చిత! నన్ను గరుణ జూడుము కృష్ణా!
|
9)
| అగణిత వైభవ! కేశవ! నగధర! వనమాలి! యాది నారాయణ! యో భగవంతుఁడ! శ్రీమంతుఁడ! జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా! |
10)
| అనుదినము కృష్ణశతకము వినినఁ బఠించినను ముక్తి వేడుకఁ గలుగున్ ధనధాన్యము గోగణములు తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయు కృష్ణా!
|
11)
| అపరాధ సహస్రంబుల నపరిమితములైన యఘము లనిశము నేనున్ గపటాత్ముఁడనై చేసితిఁ జపలుని ననుఁ గావు శేషశాయివి కృష్ణా!
|
12)
| అప్పా! యిత్తువు దయతో నప్పాలను నతిరసంబు లనుభవశాలీ అప్పా! ననుఁ గనుఁగొనవే యప్పా! ననుఁ బ్రోవు వేంకటప్పా! కృష్ణా!
|
13)
| అయ్యా! పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్ జయ్యన్గలుచుఁచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా!
|
14)
| అల్ల జగన్నాథుకు రే పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్ గొల్ల సతి యా యశోదయుఁ తల్లియునై చన్నుఁ గుడిపెఁ దనరగ కృష్ణా!
|
15)
| అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్ దుష్టునిఁ గంసు వధింపవె సృష్టిప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!
|
16)
| ఆ దండ కావనంబునఁ గోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ! నాదండ కావరమ్మీ వేదండముఁ గాచినట్టి వేల్పువు కృష్ణా!
|
17)
| ఆదివరాహుఁడ వయి నీ వా దనుజు హిరణ్య నేత్రు హతుఁ జేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని వడి గొడుగు నెత్తి మెరసితి కృష్ణా!
|
18)
| ఇరువదొకమాఱు నృపతుల శిరములు ఖండించితౌర! చేగొడ్డంటన్ ధరఁగశ్యపునకు నిచ్చియు బరఁగవె జమదగ్ని రామ భద్రుఁడ కృష్ణా!
|
19)
| ఎటువలెఁ గరిమొఱ వింటివి యెటువలెఁ బ్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్ అటువలె నను రక్షింపుము కటకట! నిను నమ్మినాఁడ గావుము కృష్ణా!
|
20)
| ఏ తండ్రి కనక కశ్యపు ఘాతకుఁడై యతని సుతుని గరుణను గాచెన్ బ్రీతిసురకోటి పొగడఁగ నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా!
|
21)
| ఏ విభుఁడు ఘోర రణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు, నా విభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా!
|
22)
| ఒకసారి నీదు నామము ప్రకటముగాఁ దలఁచువారి పాపము లెల్లన్ వికలములై తొలఁగుటకును సకలాత్మ యజామిళుండు సాక్షియె కృష్ణా!
|
23)
| ఓ కారుణ్య పయోనిధి! నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా!
|
24)
| ఓ పుండరీకలోచన! యో పురుషోత్తమ! ముకుంద! యో గోవిందా! యో పురసంహార సఖుఁడ! యో పుణ్యుఁడ! నను ను బ్రోవు మో హరికృష్ణా!
|
25)
| ఓ భవబంధ విమోచన! యో భరతా గ్రజ! మురారి! యోరఘు రామా! యో భక్త కామధేనువ! యో భవహర! నన్నుఁగావుమోహరి కృష్ణా!
|
26)
| కంటికి రెప్పవిధంబున బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్ జంటయు నీవుండుట నే కంటక మగు పాపములను గడచితి కృష్ణా!
|
27)
| కందర్పకోటి సుందర! మందరధర! భానుతేజ! మంజుల దేహా! సుందర విగ్రహ! మునిగణ వందిత, మిముఁ దలతు భక్తవత్సల కృష్ణా!
|
28)
| కుంభీంద్ర వరద! కేశవ! జంభాసుర వైరి! దివిజ సన్నుత చరితా! అంభోజనేత్ర! జలనిధి గంభీరా! నన్నుగాఁవు కరుణను కృష్ణా!
|
29)
| కుక్షిని నఖిల జగంబులు నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక! వటపత్రముపై దక్షతఁ బవళించినట్టి ధన్యుఁడ కృష్ణా!
|
30)
| కెరలి యఱచేతఁ గంబము నరుదుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్ ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార! నగధర కృష్ణా!
|
31)
| కొంచెపువాఁడని మదిలో గొంచకుమో వాసుదేవ! గోవింద! హరీ! యంచితముగ నీ కరుణకుఁ గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా!
|
32)
| క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ పతి! మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా? కృష్ణా!
|
33)
| క్రూరాత్ము డజామీళుఁడు నారాయణ యనుచు నాత్మనందను బిలువన్ ఏ రీతి నేలుకొంటివి యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా!
|
34)
| గంగమొదలైన నదులను మంగళముగఁ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముఁ దలచుఁ సాటి రావుర కృష్ణా!
|
35)
| గజరాజ వరద! కేశవ! త్రిజగత్కల్యాణమూర్తి! దేవమురారీ! భుజగేంద్ర శయన! మాధవ విజయాప్తుఁడ! నన్నుఁ గావు వేడుక కృష్ణా!
|
36)
| గిరులందు మేరు వౌదువు సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్ బరమాత్మ! చంద్రుఁడౌదువు, నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!
|
37)
| గోపాల దొంగ మురహర పాపాలను బాఱఁ ద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి! దయతో నా పాలిటఁ గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా!
|
38)
| గ్రహభయదోషముఁ బొందదు బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను, తహతహలెక్కడివి నిన్నుఁ దలచిన కృష్ణా!
|
39)
| ఘనులగు ధేనుకముష్టిక దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిం అనఘాత్మ! రేవతీపతి యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా!
|
40)
| చిలుక నొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలఁచు జనులకరుదా కృష్ణా!
|
41)
| చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్ జొక్కపు నీ గుణజాలము నక్కజ మగు లెక్కబెట్ట నజునకు కృష్ణా!
|
42)
| చూపుము నీ రూపంబును బాపవు దుష్కృతములెల్లఁ బంకజనాభా! పాపుము నాకును దయతో శ్రీపతి! నిను నమ్మినాఁడ సిద్ధము కృష్ణా!
|
43)
| జయమును విజయున కీయవె హయముల ములుగోల మోపి యదలించి మహా రయమున ఱొప్పవె తేరును భయమున రిపుసేన విఱిగి పాఱగ! కృష్ణా!
|
44)
| తటపట లేటికిఁ జేసెదు కటకట పరమాత్మ నీవు ఘంటాకర్నున్ ఎటువలె నిపుణునిఁ జేసితి నటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!
|
45)
| తిరుమణి దురితవిదూరము తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్ తిరుమణి పెట్టిన మనుజుఁడు పరమ పవిత్రుండు భాగ్యవంతుఁడు కృష్ణా!
|
46)
| తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేఱె పదవి పుట్టుట యేమో హరి! మిముఁ దలచిన వారికి నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!
|
47)
| త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్ కృపగల రాజవు బళిరే కపటపు బుద్ధావతార ఘనుఁడవు కృష్ణా!
|
48)
| దండమయా! విశ్వంభర! దండమయా! పుండరీక దళనేత్ర హరీ! దండమయా! కరుణానిధి! దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా!
|
49)
| దశకంఠుని బరిమార్చియు గుశలముతో సీతఁదెచ్చి కొనియు నయోధ్యన్ విశదముగఁ గీర్తి నేలిన దశరథ రామావతార! ధన్యుఁడ కృష్ణా!
|
50)
| దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్ దిక్కెవ్వరయ్యహల్యకు దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా! |
51)
| దివిజేంద్రసుతునిఁ జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై దివిజేంద్ర సుతుని గాచియు రవిసుతుఁ బరిమార్చి తౌర! రణమున కృష్ణా!
|
52)
| దుర్జనులగు నృపసంఘము నిర్జింపఁగ వలసి నీవు నిఖిలాధారా! దుర్జనుల సంహరింపను నర్జునునకుఁ బ్రేమఁ సారథైతివి కృష్ణా!
|
53)
| దుర్భర బాణము రాఁగా గర్భములోనుండి యభవ! గావుమటన్నన్ నిర్భర కృప రక్షించితి వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!
|
54)
| దుర్మతిని మిగుల దుష్టపుఁ గర్మమములు జేసినట్టి కష్టుండ ననున్ నిర్మలునిఁ జేయవలె ని ష్కర్ముఁడ నిను నమ్మినాను సతతము కృష్ణా!
|
55)
| దుర్వార చక్రధర కర! శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా! నిర్వాణనాథ! మాధవ! సర్వాత్మక! నన్ను గావు సరుగున కృష్ణా!
|
56)
| దుష్టుండ దురాచారుఁడ దుష్ట చరిత్రుఁడను జాల దుర్బుద్ధిని నే నిష్టనినుఁ గొల్వనేరను కష్టుఁడ ననుఁ గావు కావు కరుణను కృష్ణా!
|
57)
| దేవేంద్రుఁ డలుకతోడను వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్ గోవర్థనగిరి యెత్తితి గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!
|
58)
| నందుని ముద్దుల పట్టిని మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నిను దలఁతు భక్తవత్సల! కృష్ణా!
|
59)
| నరపశువ మూడచిత్తుఁడ దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ గుఱుతెఱుఁగ నెంతవాఁడను హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!
|
60)
| నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా!
|
61)
| నారాయణ! లక్ష్మీపతి! నారాయణ! వాసుదేవ! నందకుమారా! నారాయణ! నిను నమ్మితి! నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా!
|
62)
| నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము నీ నామము నేఁ దలంతు నిత్యము కృష్ణా!
|
63)
| నీవేతల్లివి దండ్రివి నీవే నా తోడునీడ నీవే సఖుడౌ నీవేగురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!
|
64)
| పంచేంద్రియ మార్గంబుల కొంచెపు బుద్ధినిఁ జరింతు కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా!
|
66)
| పదియాఱు వేల నూర్వురు సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్ విదితంబుగ బహురూపుల వదలక భోగింతు వౌర! వసుధను కృష్ణా!
|
67)
| పదునాలుగు భువనంబులు కుదురుగ నీ కుక్షి నిల్పుకుని నేర్పరివై విదితంబుగ నా దేవకి యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా!
|
68)
| పరనారీ ముఖపద్మము గురుతుఁగ గుచకుంభములను గొప్పును నడుమున్ అరయంగనె మోహింతురు నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా!
|
69)
| పరులను నడిగిన జనులకుఁ గురుచ సుమీ ఇది యటంచు గురుతుగ నీవున్ గురుచఁడవై వేడితి మును ధరఁ బాదత్రయము బలిని దద్దయు కృష్ణా!
|
70)
| పరుసము సోఁకిన యినుమును వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్ హరినీ నామము సోకిన సురవందిత! నేను నటుల సులభుఁడ కృష్ణా!
|
71)
| పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం బాణీముత్యము ముక్కున జాణువునై దాల్తు శేషశాయివి కృష్ణా!
|
73)
| పాలను వెన్నయు మ్రుచ్చిలఁ ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుఁడవా బ్రహ్మఁ గన్న ప్రభుఁడవు కృష్ణా!
|
74)
| బలమెవ్వఁడు కరి బ్రోవను బల మెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వఁడు రవిసుతునకు బలమెవ్వఁడు నాకు నీవు బలమౌఁ కృష్ణా!
|
75)
| బృందావనమున బ్రహ్మా నందార్భకమూర్తి వేణు నాదము నీవున్ మందార మూలమున గో విందా! పూరింతు వౌర! వేడుక కృష్ణా!
|
76)
| భద్రార్చిత పదపద్మ! సు భద్రాగ్రజ! సర్వలోకపాలన! హరి! శ్రీ భద్రాధిప! కేశవ! బల భద్రానుజ! నన్నుఁ బ్రోవు భయహర కృష్ణా!
|
77)
| భారద్వాజసగోత్రుఁడ గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్ పేరు నృసింహ్వాయుఁడను శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా!
|
78)
| మందుఁడ నేదురితాత్ముఁడ నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్ సందేహింపక కావుము నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!
|
79)
| మగమీనమవై జలనిధిఁ జగతుని సోమకుని జంపి పద్మభవునకున్ నిగమములు దెచ్చియిచ్చితి సుగుణాకర! మమ్ముఁ గరుణఁ జూడుము! కృష్ణా! |
80)
| మడుఁగుకుఁ జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నే మదిని దాల్తు నచ్యుత! కృష్ణా!
|
81)
| యమునకు నిఁక నే వెఱువను కమలాక్ష! జగన్నివాస! కామితఫలదా! విమల మగు నీదు నామము నమరంగఁ దలఁచెను వేగ ననిశము కృష్ణా!
|
82)
| రఘునాయక నీనామము లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా! అఘములఁ బాపుము దయతో రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా!
|
83)
| వడుగవువై మూడడుగుల నడిగితివౌ బలిని బళిర యఖిల జగంబుల్ దొడిగితివి నీదు మేనున గడుచిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా!
|
84)
| వనజాక్ష! భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా!
|
85)
| వలపుల తేజీ నెక్కియు నిలపై ధర్మంబు నిలువ హీనులఁ ద్రుంపన్ గలియుగము తుదిని వేడుక కలికివి గానున్న లోక కర్తవు కృష్ణా!
|
86)
| వారిజనేత్రలు యమునా వారిని జలకంబు లాడ వచ్చిన నీవుం జీరలు మ్రుచ్చిలి తెచ్చితి నేరుపురా యిదియు నీకు నీతియె కృష్ణా!
|
87)
| వావిరి నీ భక్తులకున్ గావరమున నెగ్గు సేయు గర్వాంధులనున్ దేవ! వధించుట వింటిమి నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా!
|
88)
| విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింపఁదలఁచి విష్ణుఁడ వనగా విశ్వముఁ జెఱుపను హరుఁడవు విశ్వాత్మక! నీవె యగుచు వెలయుదు కృష్ణా!
|
89)
| వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ! మురారీ! నా దిక్కు జూచి కావుము నీ దిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా!
|
90)
| శక్రసుతుఁ గారుకొఱకై చక్రముఁ జేఁబట్టి భీష్ముఁ జంపఁగఁ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ! సర్వలోక నాయక కృష్ణా!
|
91)
| శతకోటిభాను తేజుఁడ! యతులిత సద్గుణగణాఢ్య యంభుజనాభా! రతినాథ జనక! లక్ష్మీ సతిహిత! ననుగావు భక్తవత్సల కృష్ణా!
|
92)
| శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్ ఉరమున వజ్రపుఁ బతకము సిరినాయక! యమరవినుత శ్రీహరి కృష్ణా!
|
93)
| శుభ్రమగు పాంచజన్యము నభ్రంకషపగిది మ్రోవ నాహవ భూమిన్ విభ్రము లగు దనుజసుతా లభ్రూణము పగులఁజేయు ఘనుఁడవు కృష్ణా!
|
94)
| శ్రీధర! మాధవ! యచ్యుత! భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా!
|
95)
| శ్రీలక్ష్మీనారాయణ! వాలాయము నిన్నుఁ దలఁతు వంద్యచరిత్రా! ఏలుము నను నీ బంటుగఁ జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!
|
96)
| సుత్రామనుత! జనార్దన! సత్రాజిత్తనయనాథ! సౌందర్యకళా చిత్రావతార! దేవకి పుత్రా! ననుఁగావు నీకుఁ బుణ్యము కృష్ణా!
|
97)
| స్తంభమున వెడలి దానవ డింభకు రక్షించినట్టి ఠీవిని వెలయన్ అంభోజ నేత్ర! జలనిధి గంభీరుఁడ! నన్నుఁగావు కరుణను కృష్ణా!
|
98)
| హరి! నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్టి సురలు పొగడఁగఁ గరిఁ గాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా!
|
99)
| హరిచందనంబు మేనునఁ గర మొప్పెడు హస్తములను గంకణరవముల్ ఉరమున రత్నము మెఱయఁగ పరఁగితివో నీవు బాల ప్రాయము కృష్ణా!
|
100)
| హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరినీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
|
101)
| హరిసర్వంబునఁ గలఁడని గరిమను దైత్యుండు పలుక గంబములోనన్ ఇరవొంద వెడలి చీల్పవె శరణనఁ బ్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా!
|
102)
| హా వసుదేవకుమారక! కావుము నా మానమనుచుఁ గామిని వేఁడన్ ఆ వనజాక్షికి నిచ్చితి శ్రీవర! యక్షయ మటంచుఁ జీరలు కృష్ణా! |