పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : ముందు మాట

మడికి సింగనాచార్య విరచిత
ద్విపద భాగవతము

ముందు మాట

  శ్రీమద్భాగవత పురాణము దశమ స్కంధము శ్రీకృష్ణుని చరిత్ర వైభవములను వివరిస్తుంది. పోతన తలుగు భాగవతములో ఈ దశమ స్కంధము సింహభాగము నాక్రమించి యుండెను. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారము. శ్రీమద్భాగతమును సంపూర్ణముగా కాకపోయినను ఆంధ్రీకరించిన కవులు పోతన కాక కొందరు గలరు. వారిలో ప్రముఖ కవి మడికి సింగనాచార్యులు దశమ స్కంధమును ద్విపద భాగవతము పేర 15వ శతాబ్దిలో ఆంధ్రీకరించెను. దీనిని శ్రీవాసిష్ఠ అ. మహాదేవశాస్త్రి, పండితుడు, సరస్వతీ మహల్ గ్రంథాలయము, తంజావూరు వారు తమ గ్రంథాలయము తరఫున పరిష్కరించి ( - చూ. ద్విపద భాగవతము - ముందు పుటలు) పుణ్యం కట్టుకున్నారు.

కృతికర్త – మడికి సింగనార్యుడు

  ఈ కృతికర్త మడికి సింగనార్యుడు సంస్కృతాంధ్రములందు అసాధారణ పాండిత్యము కలవాడు, నీతి వేదాంతశాస్త్రములు యందు అభిరుచి కలవాడున. పద్మపురాణ ఆంధ్రీకరణ చేసిన ఈ మహాకవి లేఖిని నుండి భాగవత దశమస్కంధము, ప్రభావంతమైన అమృతవాహినిగా పండిత పామర రంజక మగు ద్విపదలతో రచించిచబడినది.

  పద్మపురాణణమును తెనిగించన సింగనాచార్యులు అనియూ, వీరు 15వ శతాబ్దము వాడనియూ పరిష్కర్త శ్రీవాసిష్ఠ అ. మహాదేవశాస్త్రి నిర్ణయించిరి. ఈ భాగవత రచన హూణశకము 1420 నకు ముందు రచింపబడినదనియూ, సింగన ప్రౌఢ వయసులో ఉన్నప్పుడు తెలుగు భాగవతమును సుసంపూర్ణంగా తెలుగులకు ప్రసాదించిన జాతీయ మహాకవి బమ్మెఱ పోతనామాత్యుల వారు తమ యౌవన దశలో భోగినీ దండకము రచియించి ఉండనోపును అనియూ నిశ్చయించిరి. అనగా సింగన భాగవత రచనా కాలమునకు బమ్మఱ పోతనామాత్యుల వారు భాగవత ఆంధీకరణకు పూనుకొని యుండలేదు. సింగన నియోగి బ్రాహ్మణ భారధ్వాజ గోత్రీకుడు. వీరి తల్లిదండ్రులు అయ్యల మంత్రివరుడు, లింగాంబికలు. వీరు తిక్కన సోమయాజుల మనుమరాలి మనుమడు, గోదావరి మండలములోని పెద్దమడికి నివాసి. సింగన్నకృతమగు వాసిష్ఠ రామాయణములోని యీక్రింది పద్యములను గమనింపుడు.

సీ. అతండు తిక్కనసోమయాజుల పుత్రుఁడై; కొమరారు గుంటూరి కొమ్మ విభుని
పుత్రి చిట్టాంబిక బుధలోక కల్పక; వల్లి వివాహమై వైభవమున
భూసారమగు కోటభూమిఁ గృష్ణానది; దక్షిణ తటమున ధన్యలీల
నలరు రావెల యను నగ్రహారము తన; కేక భోగంబుగా నేలుచుండి

యందుఁ గోవెల గట్టి గోవిందు నెన్న
గోపీనాథుఁ బ్రతిష్టయుఁ గోరి చేసి
యఖిల విభవములందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడ మంత్రివిభుఁడు.

క. అయ్యువతీరమణులకును
నయ్యల మంత్రీంద్రుఁ డుదితుఁడై ధారుణిలో
నెయ్వెడ నర్థార్థులు మా
యయ్య యని పొగడఁగ నెగడె సౌదార్యమునన్.

సీ. ఆత్రేయ గోత్రపవిత్ర పేరయమంత్రి; పుత్రి సింగాంబికఁ బుణ్యసాధ్వి
వెలయ వివాహమై వేఁగి దేశంబులో; నేపారు రాజమహేంద్ర పురికి
నధిపతి తొయ్యేటి యనపోత భూపాలు; మంత్రియై రాజ్యసంపదఁ బొదలి
యొప్పారు గౌతమి యుత్తర తటమున; మహనీయమగు పెద్దమడికి యందు

స్థిరత రారామతతులు సుక్షేత్రములును
బెక్కులార్చించి సితకీర్తి బెంపు మిగిలి
యఖిలజగదన్నదాతనా నవనిఁ బరఁగె
మధుర గుణధుర్యఁ డయ్యల మంత్రివరుఁడు

చ. ఒనరఁగఁ దద్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నబ్బయాంకు బుధసన్నుతి పాత్రుని నారయాహ్యయున్
గని నరసింహ నామములు గారవ మారఁగఁ బెట్టిరందఱున్.

క. వారలలో నగ్రజుఁడను
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్య
శ్రీరచనాచతురమతిని సింగమహ్వయున్.

తిక్కన కొడుకు – గుంటూరి కొమ్మ విభుడు – వారి పుత్రిక చిట్టాంబిక. - ఆమె భర్త అల్లాడ మంత్రి – వారి పుత్రుడు అయ్యల మంత్రి భార్య సింగాంబిక (ఆత్రోయ గోత్ర పేరయ మంత్రి పుత్రిక) – వారి పుత్రుడు సింగనార్యుడు.

  వీరి రచనలు పద్మపురాణము, ద్విపద భాగవతము, వాసిష్ఠ రామాయణము, సకల నీతి సమ్మతమను నీతిగ్రంథము. సింగన పద్మపురాణము, ద్విపద భాగవతములను ఔబళ కందనామాత్యునికి అంకితమిచ్చెను. వాసిష్ఠ రామాయణమును అహోబిలస్వామికి అంకితమిచ్చెను.

కృతి భర్త - కందనామాత్యులు

  కృతిభర్త ఔబళ కందనామాత్యులు రామగిరి పట్టణాధీశ్వరుండగు కుమారముప్ప భూపాలుని మంత్రి. వీరి తాతకు తాత కాకతీయ గణపతి నాయకుని మంత్రి ఐన గన్నయమంత్రి. గన్నయమంత్రి కుమారుడు మల్లన. వీరి పుత్రుడు గణపతి, వారి పుత్రుడు అప్పయామాత్యుడు (ద్వితీయ పుత్రుడు). అప్పయామాత్యుని మూడవ కుమారుడు కృతిభర్త కందనమంత్రి.

పరిష్కర్త - మహాదేవ శాస్త్రి

  మహాదేవశాస్త్రి వారి జనకులు మఱియు గురువు శ్రీ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి మునులు. వీరి కుల పరమ గురువులు శ్రీరమణమహర్షులవారు. ఉపోద్ఘాతమును శ్రీరమణులకు నమస్కరించి ఆరంభించారు. శ్రీ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి శలవిచ్చిన శ్రీకృష్ఠ భగవానుని స్తోత్రముతో ముగించారు. ( చూ. ద్విపద భాగవతము – ఉపోద్ఘాతము. ఆ శ్లోకము:

శ్లో॥
భూమిభార వారణాయ యోయదుష్వభూ ద్విభు
ర్విస్మయం శిశోశ్చ యస్య చేష్టితాని తేనిరే
శర్మవః స పూరుషో రథాంగమాయుధం దధ
త్కర్మయోగదేశికః కరోతు పార్థసారథిః.

మహదేవశాస్త్రి గారు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో పండితులు. ఆ సమయంలో ఈ గ్రంథాలయములో తెనుఁగు వ్రాతప్రతుల సంఖ్య సుమారు 816 ఉన్నవి. ఇవి తంజావూరాంధ్ర నాయక రాజుల కాలమునుండి వచ్చుచున్నవి. వాటిలో 150 సంఖ్యతో సింగనార్యుని ద్విపద భాగవతము బహు క్లిష్ట దశనున్న తాళపత్రి ప్రతి గలదు. ఈ ప్రతి ఒక్కటే తప్పించి ఎక్కడను మరొక ప్రతి లేదు. కనుక ఈ తాళపత్ర ప్రతిని మాతృకగా తీసుకొని, ఎంతో శ్రమకోర్చి ప్రచురించారు మహాదేవశాస్త్రి. అభినందనీయమైన వారి కృషికి బహుధా కృతజ్ఞతలు.

సంకలనము

  చక్కటి జాతీయ ఛందస్సు ఐన ద్విపదలతో మహాకవి కృతమైన ఈ భాగవత దశమ స్కంధము రసజ్ఞులైన ఆంధ్ర సాహితీ జగత్తు ఆస్వాదిస్తుందని ఆశిస్తున్నాము. పై ప్రతిని మాత్రుకగా గ్రహించి, ప్రతి శీర్షికనూ ఛందోపరీక్ష చేసి, యతిప్రాసల గుర్తింపుతో, బహు లఘు టీకలను చేర్చి భాగవత గణనాధ్యాయి అనబడు ఊలపల్లి సాంబశివ రావు, లలిత, నందవరపు సర్వలక్ష్మి గార్లచే సంకలనం క్రీ.శ. 2019లో చేయబడినది. ప్రపంచంము నలుమూలల నున్నతెలుగులకు మిక్కిల అనుకూలంగా ఉండునట్లు యూనికోడులో చేయడమైనది..

  - భాగవత గణనాధ్యాయి