పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : సాధుసద్గుణ పక్ష - భాగవతమహిళ

స్త్రీ పురుషులలో ఏ ఒక్కరిని గూర్చి చెప్పవలసివచ్చినా, అనివార్యంగా మరొక్కరి ప్రమేయాన్ని గుర్తించవలసిందే. స్త్రీ లేని పురుషజీవితం అసంపూర్ణం, అసమగ్రం. ఆమె జన్మనిచ్చి, స్తన్యమిచ్చి, వ్యక్తిత్వాన్ని దిద్ది తల్లిపాత్ర పోషిస్తుంది. అర్ధాంగిగా ఓర్పుతో, నేర్పుతో ఆవేశంతో ప్రక్కదారులు పట్టనీయకుండా పురుషునికి ‘మగవాడ’ నే గౌరవాన్నికల్పిస్తుంది. ఆజన్మాంతము అండగా దండగా నిలుస్తుంది. అటువంటి స్త్రీని పురుషుని జీవితం కంటే వేరని నిర్ణయించి, కట్టుబాట్లకు లోనుజేసి, హింసకు గురిచేయడం భారతీయ సంస్కృతి కాదు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అనుట వట్టిమాట కాదు. ‘నారి’ యనగా జ్ఞానం కలది. ప్రపంచానికి ఆదిశక్తి యై సంసారాన్ని సమర్థంగా నడిపించు జ్ఞానం కలదిగా స్త్రీని గుర్తించాలి. స్త్రీకి స్వాతంత్ర్యం లేదనే కుటిల నీతిని ప్రక్కన పెడితే.
‘ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్’ అని సకల విద్యలకు అర్హత కల దన్న సంస్కారం మనది. ఆమెను శక్తికి, విద్యకు, సంపదకు అధినేత్రిని జేసి ఆరాధించిన సంస్కృతి మనది. వేదాలలో, ఉపనిషత్తులలో, తాత్త్విక, ధార్మిక చర్చల సందర్భాలలో కీలక వ్యక్తులుగా నిలిచి ఆదర్శప్రాయు లైనారు స్త్రీలు. సంస్కృతికి ఆధారమైన వేద, ఉపనిషత్, పురాణాలు స్త్రీకి సమున్నత స్థాయిని కలిగించినాయి. స్వార్థపరుల కౌటిల్యం మానవులను ముక్కలు చేసినట్లే స్త్రీలకు కూడా షరతులు ఏర్పాటు చేసింది. ధర్మం జయించుగాక।

పురాణాలలో సర్వోత్కృష్టమైనదిగా కీర్తి నొందిన భాగవతం స్త్రీకి సమున్నత స్థానం కల్పించింది. ప్రత్యేకించి పోతన్న చేత తెలుగుతనం పొందిన భాగవతం స్త్రీని వివిధ సందర్భాలలో ఏ విధంగా చిత్రీకరించిందో రేఖామాత్రంగా పరిశీలిద్దాం.
పోతన తెలుగువారి గుండెల్లో రఘుకుల తిలకుణ్ణి ప్రతిష్ఠించినాడు. కవితామృత తరంగాలపై ఆ రామచంద్రుణ్ణి ఊయల లూపినాడు. రాజు కాని రాజు, రాజ్యం లేని రాజు, రాజభోగాలు కోరని కవిరాజు, అహంకారాలకు త్రోసిరాజు అయిన బమ్మెర పోతరాజు పద్యాలు ప్రతి ఆంధ్రుని నోట నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పాలుత్రాగి పరుగులెత్తే లేగదూడల్లా, వెన్నెల్లో గెంతులేస్తూ ఆడుకొనే అమ్మాయిల్లా ఆకర్షిస్తాయి. లేతమామిడి చిగురుల్లా, మందారపుష్పంలోని మకరందంలా చవులూరిస్తాయి. ఒక్కొక్కమారు నిర్మల గంగా భంగిమల్లా గలగాలా ముందుకు సాగిపోతాయి.
ఆయన స్త్రీ పాత్రల్లో ప్రోదిచేసిన ఆర్ద్రతను పరిశీలిస్తే తొల్త సరస్వతీమాతయే ఆయన సర్వస్వం. తన భాగవత పురాణ రచన నిరాఘాటంగా సాగటానికి ఆమె ముందు వినమ్రుడై నిలుస్తాడు. నేను వ్యాసవాల్మీక కాళిదాసాదుల కున్న ప్రజ్ఞ కలవాడిని కాదని, దయాంభోనిధి వైన నీవే నాకు మేల్పట్టువై కాపాడ మని ప్రార్థిస్తాడు. ఆ వాణిలో శర్వాణి దర్శనం చేసి ఆమెవల్లనే తనకు మహత్వ కవిత్వ పటుత్వ సంపద లభ్యమవుతుం దన్న సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించినాడు. చతుర్ముఖుని మానసాన్ని వశీకరించుకొనే పల్కుల పరువం కల్గి, అక్షదామం శుకం వారిజం పుస్తకం చతుర్భుజాలలో కీలించిన, చదువులతల్లికి సాష్టాంగప్రణామాలు ఆచరిస్తాడు. సర్వశుక్లయైన శారద శుభాకార దర్శనం అనునిత్యం తనకు కలగాలని ఆకాంక్షిస్తాడు. ఆకలిదప్పులు తీర్చుకోవటానికై తన కవితా ఫలాన్ని కీచకసదృశు లైన నీచ భూపతులకు అమ్మ నని అమ్మ ముందు త్రికరణశుద్ధిగా నమ్మబలికినాడు. దారాసుతాదుల పోషణార్ధం హాలికవృత్తినే స్వీకరించినాడు.
తర్వాత కన్నతల్లి మమకారాన్ని గుర్తుచేసుకుంటాడు. నవమాసాలు మోసి కనిపెంచిన తన బిడ్డల్నే కాదు, దీనులైనవారి అవసరాలు తీర్చుతూ కూడ జగజ్జనని స్థాయికి ప్రతి గృహిణి ఎదగా లన్నది ఆయన ఆశయం. ధర్మావలంబనమతులై, లలిత గుణాల వాలురై, అవసరం వస్తే గాంభీర్యాన్ని కూడ నిలుపుకోదగిన ఉన్నత చిత్తంతో మాతృమూర్తులు మసలుకోవాలన్నాడు. తమ పిల్లలకు దయాసత్యాలను ఉగ్గుపాలతోనే రంగరించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. అది సాధ్యం కానినాడు ఆ తల్లుల జన్మ నిరర్థకమే అంటాడు.
అశ్వత్థామ ఉపపాండవుల్ని సంహరించిన సందర్భంలో ద్రౌపది పాత్రలో స్త్రీత్వం, మాతృత్వం, ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి పోతన్నలో అర్జునుడు అశ్వత్థామను బంధించి తన యొద్దకు తెచ్చినప్పుడు ఆమె ‘సుస్వభావ’ యై ఆ బాలఘాతకునకు నమస్కరించింది. ‘పుత్రాకృతి నున్న ద్రోణుని’ గా పూజ్యభావంతో చూచింది. ‘శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మ మగునే తండ్రీ;’ అని మాతృతామాధుర్య ముట్టిపడేటట్లు సంబోధించింది. ఇట్టి విపత్కర స్థితిలో అశ్వత్థామ యొక్క జననిని గుర్తు తెచ్చుకొని ఉదాత్తచిత్తయై ‘భవదీయ మాత నే డెక్కడ నెట్టి శోకమున నేక్రియ నేడ్చుచు పొక్కుచున్నదో’ అని నిట్టూర్చింది. తన భర్తకు తల్లుల్ని క్షోభపెట్టడం మానుకొ మ్మని అభ్యంతర సూచన చేసింది తప్ప పల్లెత్తుమాట పల్కలేదు.
ప్రహ్లాదచరిత్రలో లక్ష్మిపాత్ర నవనీత సదృశంగా తీర్చబడింది. ఆమెను పోతన్నహరికి పట్టపుదేవిగా హరిసేవా నిపుణమతిగా, హరిగతిగా, హరిరతిగా, వినుతించినాడు. హరి రోషాన్ని అపనయించగల సమర్థురాలని కూడ చెప్పినాడు. ఏ స్త్రీ భర్తను సేవలతో సంతోషింప చేస్తుందో ఆమెయే పతిని వశవర్తుని చేసికోగల దనే సత్యాన్ని తెలిపినాడు. ఉగ్రమూర్తి యైన వేళ కాక భర్త శాంతు డైనప్పుడే దగ్గరచేరి దారికి త్రిప్పుకోగల మనోహారిగా చిత్రించినాడు. (ప్రహ్లాద జనని పాత్ర ఈ గ్రంధంలోనే మరొక వ్యాసంలో ప్రస్తావింపబడింది.)
వామనావతార ఘట్టంలో వింధ్యావళి భర్త ననుసరించే భార్యగా మౌనపాత్ర పోషించినట్లు చేసినాడు పోతన్న. భర్త సంపాదన సర్వస్వం ఒక పొట్టి వడుగునకు ధారాదత్తం చేస్తున్నా డని తెలిసి కూడ ఆమె అడ్డు తగల లేదు. సరికదా వామనుని పాదాలు కడగటానికి పతి సంజ్ఞామాత్రం చేతనే కలశంతో జలం తెచ్చింది. తన భర్తను విరాణ్మూర్తి బంధించి నప్పుడు మాత్రం ఆమెలోని స్త్రీత్వం మేల్కొనింది. ‘పతి భిక్షాం దేహి’ యని అభ్యర్థించింది. భర్తకు కష్టం వస్తే భార్య యెంతగా దుఃఖిస్తుందో లక్ష్మిని అడుగుమనింది. వలదనక, అడ్డు పల్కక, జగత్రయీరాజ్య మిచ్చిన నా భర్తను సర్వనాశనంచేసావే యని దెప్పిపొడవటంలో గడుసుదనం ప్రకటించింది.
తల్లులు తమ సంతానాన్ని పిలవటంలో వంశోద్ధారకునిగా భావించటం అదితి వామనుణ్ణి పిలవటంలో కనిపిస్తుంది.

నన్ను గన్నతండ్రి। నాపాలి దైవమ।
నా తపఃఫలంబ। నా కుమార।
నాదు చిన్ని వడుగ। నా కులదీపిక।
రాగదయ్య భాగ్యరాశి వగుచు-

అట్లే చిన్ననాట పిల్లల అందాలను చూచి మురిసిపోతూ తల్లులు పరవశత్వంతో జోలపాట పాడుతూ యశోద కృష్ణుని లాలించటం ఈ క్రింది పద్యంలో కనిపిస్తుంది. ఇందులో పోతన్న మాతృస్థానీయుడైనాడు.

జోజో కమలదళేక్షణ।
జోజో మృగరాజమధ్య।జోజో కృష్ణా।
జోజో పల్లవకర పద।
జోజో పూర్ణేందు వదన। జోజో కృష్ణా।

ఊర్వశి పాత్ర ఆధారంగా స్త్రీ లోలురైన వారికి చెంప పెట్టవంటి సందేశాన్ని అందించాడు పోతన్న. పురూరవుడు ఊర్వశిపై వలపు గలిగి, ఆమె లేనిదే తా నుండలేని దుర్దశకు వచ్చి తనను మన్మథుని బారినుండి రక్షించగల సుఖానుభూతిని అందించ మని ప్రాధేయపడగా -

మగువలకు నింత లొంగెదు
మగవాడవె నీవు?పశువు మాడ్కిన్ వగవన్
దగవే? మానుష వశువును
మృగములు గని రోయు గాక మేలని తినునే।

అన్నది.
శ్రీ రామచరిత్రలో—

సిగ్గుపడుట గల్గి, సింగారమును గల్గి,
భక్తి గల్గి, చాల భయము గల్గి,
నయము ప్రియము గల్గి, నరనాథు చిత్తంబు
సీత తనకు వశమునచేసికొనియె.

అని సీతను గూర్చి పోతన చెప్పినాడు. భర్త తనకు వశం కావడానికి ఉత్తమస్త్రీలు వేటిని ప్రబలమైన ఆయుధాలుగా పూనెదరో వాటిని పేర్కొన్నాడు. అవి సిగ్గు, సింగారం, భక్తి, భయం, నయం, ప్రియంలు వీటిని గల స్త్రీలకు ఎల్లెడల సానుకూల వాతావరణం ఉంటుం దనడం నిర్వివాదం.
కుచేలుని భార్య అభిజాత్యం (వంశం) గొప్పదే. కాని మెట్టినింట దారిద్ర్యం ఎదుర్కోవలసివచ్చింది. మలమల మాడు పొట్టకు పట్టె డోరెము పెట్టు మన్న వారి ఆర్తనాదం వీనులు సూడినట్లయింది. ఆకులు చేతపట్టుకొని తన ముందు నిలచిన తనయుల దుస్థితికి వగచిం దని పోతన వర్ణించినాడు. ఆమె లలిత పతివ్రతా తిలకం కాబట్టి పేదరికాన్ని దీర్చు ఉపాయం ఊహింపు మని భర్తను సున్నితంగా వేడుకొనింది. బాల్యస్నేహితు డైన కృష్ణుని గుర్తుకు తెచ్చింది. ఆయన కటాక్షరవి దీప్తిచే తమ నట్టింట తిష్ఠవేసికొన్న దారిద్ర్యాంధకారాన్ని తొలగించవచ్చు నని సూచించింది. భర్త తలలో నాల్కయై భార్య మెలగుటన నెట్టిదో తన ఇంటినే చూచిన పోతనను మనం ఇక్కడ చూడవచ్చు.
తిర్యగ్జడముల కదలికలు కూడ కవుల హృదయాలను స్పందింప జేస్తాయి. వారు వాటికి మానవీకరణం చేసి వాని నాధారంగా సందేశాత్మక భావాలను వెలువరిస్తారు. బలరామ కృష్ణులు మధురానగర ప్రవేశ సందర్భంలో సూర్యు డస్తంగతు డగుట, పద్మములు ముకుళించుట వర్ణించు తీరు గమనార్హం.

తరుణుడగు శీత కరునిన్
మరగి వియల్లక్ష్మి తన్ను మాని ముదుకడున్
ఖరకరుడు ననుచు ద్రొబ్బిన
కరణిన్ రవి పశ్చిమాద్రి కడ గ్రుంకె నృపా।

ఈ పద్యంలో అధమస్త్రీ గుణం తెల్పబడింది. ఆకాశకాంత యువకుడైన చంద్రునిపై వలగొనింది. ఈదాక ఆమె సూర్యునితో ఉండింది. కాని వాడు ముసలి యని తీక్షణస్వభావు డని, అతనిని సముద్రంలోనికి ద్రొబ్బిందట. కళలు గల్గు గాక కమల తో డగుగాక.

శివుని మౌళిమీద చేరుగాక
అన్యు నొల్ల తపనుడగు మత్పతి యని
సాధ్వి భంగి కమలజాతి మొగిడె.

ఇందొక ఉత్తమస్త్రీ స్వభావం చెప్పబడింది. ఆమె కమల. అనగా పద్మినీ జాతిస్త్రీ. తన భర్త యైన సూర్యుని కోల్పోవటంతో చంద్రు డనే ధూర్తు డొకడు ఆమెపై చూపు నిల్పినాడు. ఆమె సాధ్వి. కావున ఆ పరాయివాడు షోడశకళా ప్రపూర్ణు డైనా (అందం) , లక్ష్మికి తోబుట్టు వైనా (ఐశ్వర్యం), శివుని శీర్ష మావాస స్థానం (అధికారం) కలవా డైనా లక్ష్యపెట్టలేదు. తపింపజేసే స్వభావం కలవా డైనా సూర్యుడే నా భర్త. అతడు లేనినాడు నాకు బ్రతుకు అక్కరలేదన్నట్లుగా తానూ కన్నులు మూసింది. - అని ఈ పద్యభావం.
కుటిల స్వభావు లైన స్త్రీలు కొందరు ఒక్క వెలుగు వెలిగిన భర్తల నైనా అలక్ష్యం చేయటం అట్లుండగా, అతని వినాశనాన్నే కోరుకుంటా రనే విషయాన్నే కాక, నీచస్వభావు లైన పురుషులు కూడ, భర్తృహీను లైన స్త్రీలను ఎట్లైనా లోబరచుకోవటానికే యత్నిస్తారని, భర్తలో కొన్ని లోపము లున్నా అతడి తోడిదే లోక మనుకొనే ఉత్తమకాంతలు లేకపోలే దని పోతన రసరమ్య వ్యంగ్యచిత్రణ చేసినాడు.
క్షీరసాగర మథనవేళ అతిలోకభయంకర మైన అగ్నిజ్వాలల కోలాహలంతో పుట్టిన హాలాహలాన్ని మ్రింగుటకు భర్తను సమ్మతింపజేసిన పార్వతిని గూర్చి-

‘మ్రింగెడువాడు విభుం డని ,
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ,
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’

అనే పద్యం వ్రాసినాడు పోతన. పార్వతికి తన మాంగల్యంపై గల విశ్వాస మెంత గొప్పదో జగత్కల్యాణంపై గల ఆకాంక్ష అంతకంటే గొప్పది. ఇట సతుల పాపట బొట్టు నిత్యసుమంగళ యైన పార్వతి పాత్ర వన్నెకెక్కింది. నరకాసుర సంహారఘట్టంలో సత్యభామ పాత్రచిత్రణలో పోతన్నకు నాచన సోముడు ఆధారమై యుండవచ్చును గాక, పరస్పరవిరుద్ధా లైన సన్నివేశాల మధ్య ఏకత్వసాధనా చణత పొతన్నలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
ఆమె తరుణాంగుళులచే వల్లకీ తంత్రులు మీటుటలోనే కాదు, శస్త్రాస్త్రప్రయోగంలోను; సరసకర్పూర కదళికాతరుల మధ్య సాపరాధుడైన భర్తను దండించుటలోనే కాదు, ఆమురళీధరుని మన స్సెరిగి వర్తించుటలోను; సమానమైన నేర్పు కలది. పోతన్న కలంలో ఈమెలోని ఓర్పు నేర్పు, భక్తి యుక్తులు, వీరశృంగారాలు ఏకకాలంలో ఎట్లు ప్రదర్శితా లైనాయో చక్కగా రూపుదిద్దుకొన్నవి. వినయానికి లోపంరాని కార్యదీక్ష, శృంగారానికి భంగం కల్గని వీరత్వం, వీసంకూడ వీగకుండ సమస్థాయిలో మేళవించినాడు బమ్మెరపోతన.
ఆమె యుద్ధసన్నద్ధుడైన భర్తతో నీ కదనకౌశలం ఇతరులు చెప్పుచుండగా విన్నానే గాని ఎన్నడూ రాక్షసవీరులతో పోరు నప్పటి నీ ప్రావీణ్యం నేనుగా చూడలే దన్నది. అర్ధంచేసుకొని స్పందించ గల డనుకొన్న ప్రాణనాథుడు మిన్నకున్నాడు. నేను కనులార చూచిన నీ రణక్రీడా విశేషాలను ఇచ్చటి నీ ప్రియురాండ్ర కెల్ల చెప్పగలను. వారు మెచ్చునదే విద్య అన్నది నీకు తెలియదా? అన్నది. ‘అబలవు నీవేడ? రణరంగ మేడ?’ వలదు వల దన్న మగని మాటకు నిరుత్సాహపడక ‘దానవులైన నేమి మరి దైత్య సమూహము లైన నేమి నీ మానిత దివ్యబాహువుల మాటున నుండగ’ యని కాదనలేని స్థితికి తెచ్చుకొనింది. కృష్ణుడు యుద్ధసన్నద్ధుడు కాగా, కొప్పు జుట్టి, కొంగు ముడిచి, నడుము బిగించి ముందు నిల్చింది. తూష్ణీభావంతో విల్లిచ్చినాడు. ఒక్కమారుగా ఆమెలో క్రొంగ్రొత్త శక్తి ప్రదీప్త మైంది. ఇట్లు ఆమె చాకచక్యంగా భర్తతో స్వీయ మనోభీష్టం నెరవేర్చుకొనింది.
కుంతి శ్రీకృష్ణుని మేనల్లునిగా, రక్తసంబంధునిగా లెక్కింపదు. పురాణపురుషునిగా, దేవదేవునిగా, అనంతుడుగా, అఖిలభూత బహిరంతరస్థుడైన పరమేశ్వరునిగా ఆరాధించింది. తన తనయుల్ని కాపాడిన విషయం అట్లుండగా కంసునిచే బంధింపబడిన అతని తల్లి దేవకిని రక్షించినట్లు, దృతరాష్ట్రు తనయలు పెట్టే కష్టాలకు తాను బలికాకుండ తనను కాపాడినట్లు పేర్కొనింది. తన పట్ల కృష్ణుడు జననీభావము గల్గి గౌరవించి నందుకు కృతజ్ఞతాభావాన్ని ప్రకటించింది. అందుకే ఆమె కూడ అతనిని పుత్రభావంతో చూచింది. తన కళ్ళ ముందు బాలకృష్ణుని లీలలు గోచరించినాయి. తన్మయీభావంతో -

కోపముతో నీవు దధికుంభము భిన్నము నేయుచున్నచో
గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట -

లోని చోద్యాన్ని గుర్తుకు తెచ్చుకొనింది. ఇది పోతన హృదయ వ్యాఖ్యయే. ఇట్లు లౌకికమైన విషయాల మధ్య చుట్టుకొన్న భ్రమమాణ చిత్తం కలదై కూడ, చివరకు తనకు యాదవు లందు పాండుసుతు లందు గల వ్యామోహాన్ని విచ్ఛేదము చేయు మని, జీవిత ప్రత్యామ్నాయ ఫలం వైపు మొగ్గుచూపింది.
గాంధారి మాత్రం పుట్టంధు డైన భూభర్తను భర్తగా వరించుటలోనే తృప్తిచెందకుండ, అతడు చూడలేని ప్రపంచాన్ని తానుమాత్రం ఎందుకు చూడా లని కళ్ళకు గంతలు కట్టుకున్న సాధ్వీమణి అయ్యింది. అతిశయించిన వైరాగ్యభావంతో పతివెంట దుర్గమారణ్యాలకు వెళ్ళిపోయింది.
పుత్రుడైన కపిలాచార్యునివల్లనే దేవహూతి తత్త్వజ్ఞానాన్ని పొందింది. పార్వతి శివుని సేవించినట్లు భర్త యైన కర్దముని దేవహూతి సేవించింది. చంచలభావంతో కామోపభోగాలు అభిలషించి నందుకు బాధపడింది. దుర్గుణాలకు దూరంగా ఉండింది. భర్తచే దివ్యదృష్టిని అనుగ్రహంగా పొందింది. సాక్షాత్తు విష్ణువునే కుమారునిగా పడసింది.
గోపవనితలు నిర్మల భక్తిప్రపూర్ణులు. శ్రీకృష్ణుని వేణుగాన మాధుర్యానికి పరవశు లై బంధు, పతి, మిత్రాదులను విడచి తన్ను చేరిన గోపికలతో

‘ ధ్యానాకర్ణన దర్శన
గానంబుల నా తలంపు కల్గిన చాలున్
పూనెదరు కృతార్థత్వము,
మానవతుల్ చనుడు మరలి మందిరములకున్’

అన్నాడు. తమ ఒచ్చెం లేని భక్తిని ఆ మోహనుడు మరోవిధంగా భావించినాడని తలచి కాబోలు ‘ఏ పొత్తుల నొల్లమో పురుషభూషణ। దాస్యము లిచ్చి కావవే’ అని ఆయనసేవలో తరించి పోవాలనే తలపును ప్రకటించినారు. అంతేగాక ఆయన సుందర ముఖావలోకనమే తమ నిరంతరాకాంక్షగా తెల్పుచు -

నీ వడవిన్ బవల్ దిరుగ నీ కుటిలాలక లాలితాస్య మి
చ్ఛావిధి జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనున్

కావున రాత్రు లైనా నిను కన్నుల నెప్పుడు చూడకుండ లక్ష్మీవర। రెప్పలడ్డముగ జేసె నిదేల విధాత క్రూరుడై. ఈ విషయంలో ఎట్టి అపవిత్రతకు చోటులేదనే విషయాన్ని శుకుని ద్వారానే పోతన

“ గోపజనము లందు, గోపిక లందును,
సకల జనుల యందు సంచరించు
నా మహాత్మునకు పరాంగన లెవ్వరు?
సర్వమయుండు లీల సల్పె గాక।”

అని చాటినాడు.శ్రీకృష్ణుని చోరునిగా, జారునిగా చిత్రించి కువిమర్శలు చేసేవారు నోటికి తాళం వైచుకొని మిన్నకుందురు గాక.