పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : ముందు పుటలు

శ్రీరామ
పోతన

డా॥ ఆశావాది ప్రకాశరావు

(వినయారంభం)
(అమృతోదయం)
(సామయిక - స్పందనారామం)
(శ్రీ కె. జయరాంగారికి)

వ్యాసముల పట్టిక
1) శ్రీమద్భాగవత వైశిష్ట్యం
2) ఆంధ్ర మహాభాగవతం - పోతన వ్యక్తిత్వం
3) వదాన్యులకాదర్శం - వామన ఘట్టం
4) అనన్య శరణాగతి - గజేంద్రు వినతి
5) జీవేశ్వర సంబంధం - రుక్మిణీ కల్యాణం
6) ప్రహ్లాదజనని
7) సాధు సద్గుణపక్ష - భాగవత మహిళ
8) భాగవత పురుషార్ధాలు
9) దశావతారములు
10) ‘చేతవెన్నముద్ద ‘ తో ఒక్కపూట
11) ఆళ్వారుల సమదర్శనం


గ్రంథ ప్రణీత - డాక్టర్ ఆశావాది
గ్రంథ స్వీకర్త - శ్రీ కె. జయరాం.

శ్రీ కె. జయరాం గారు
రాష్ట్ర మంత్రి అయిన
సందర్భంలో
వారిని సత్కరించి
అభినవాదం చేసిన
డాక్టర్ ఆశావాది

శ్రీలేఖ సాహితీ
సంస్థ వరంగల్
నిర్వహించిన
సదస్సులో
సత్కరింపబడిన
డాక్టర్ ఆశావాది


భాగవతసౌరభం
(వ్యాససంపుటి)

డా॥ ఆశావాదిప్రకాశరావు, ఎం.ఎ., డి.లిట్.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు
పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ గ్రహీత.
పెనుకొండ. - అనంతపురంజిల్లా.

ప్రచురణ
భక్తిలహరి
6-5-659, శ్రీనగర్ కాలనీ,
అనంతపురము.

ఆశావాది సాహితీ స్వర్ణోత్సవ శుభవేళా వికాసితము


Bhagavatha Sowrabham
(Essayas on Pothana Bhagavatham)
By
Dr. Asavadi Prakasa Rao, M.A., D.Litt., Retd., Principal (GDC)4/292 - Kummaradoddi, PENUKONDA - 515 110. Ph: 9440488600

1000 copies., August 2008., అమూల్యము, Copies Can be had from:The Author (or)
Sri K . Jayaram, B.A., LL.B., Ex. Minister, ‘Bhakthi Lahari’, D.No.6-5-659, Srinagar colony, ANATHAOUR - 515 001., Ph: 9848779326

Printed at: PLANOGRAPHERS, Chirag Ali Lane, Abids, Hyderabad-500 001


(వినయారంభం)

కొత్తపల్లి జయరాం, బి.ఏ., యల్.యల్.బి., రాష్ట్ర మాజీమంత్రి, ఆంధ్రప్రదేశ్

ఏ పూర్వ జన్మఫలమోకాని, 2002 వ సం॥లో తిరుమల - తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుడను కాగలిగినాను. ఇది ఆశించకనే కలసివచ్చిన వరం. ప్రత్యక్షంగా దీనికి కారణభూతులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, ప్రియతములు, గౌరవనీయులు అయిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు. పుణ్యము, పురుషార్ధము రెండూ కలగలిపిన వారి సుహృద్భావానికి సర్వదా కృతజ్ఞుడను.
భక్తి బృందావనంలో ప్రవేశించడమే ప్రతి మానవునకు కర్తవ్యం. తరువాతి వ్యవహారమంతా అచ్యుతుడైన ఆ గోపాలుడే నడిపిస్తాడు. నా విషయంలో అదే జరిగింది. ఎక్కడకి వెళ్ళినా ధార్మిక గ్రంథాలను కొనడం నేను అలవాటు చేసుకున్నాను. ఊపిరి సలపని కార్యవ్యగ్రత వల్ల, వాటిని చదివేవాడిని కాదు. కట్టలు కట్టలుగా అనేకంగా ఉన్నా, వాటిని చూచినప్పుడల్లా ఏదో చెప్పరాని నిట్టూర్పు, నైరాశ్యం నాలో కలిగేది. ధర్మకర్తల మండలి సమావేశములకు వెళ్ళినపుడు ఎన్నో సాంప్రదాయక అంశాలు చర్చకు వచ్చేవి. వాటిపట్ల స్పష్టమైన అవగాహనకోసం గ్రంథాలను తిరగవేయడం అలవాటయింది. కొన్నాళ్ళు ఆ గ్రంథాలు నన్ను బంధీచేసినవి.
ఈ ప్రస్థానం లో భకారత్రయం అనదగిన భారత, భాగవత, భగవత్గీతాది గ్రంథాల లోతులకు వెళ్ళడం సాధ్యమయ్యేది కాదు. నిఘంటువు సాయంతో అర్థమయితే అయ్యేదేకాని ఆంతర్యం అంతుబట్టేది కాదు. ఇంతలోనే ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన భారతం; సరళ గద్యానువాదంతో వెలువడిన పోతన భాగవతం; అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘంవారి సంస్కృతభాగవతం నన్ను సంక్రమించాయి. ఆ గ్రంథాలు తొలుత కరదీపికలైనా తరువాత హృదయజ్యోతిని వెలిగించిన వనుట అతిశయోక్తికాదు.
పురాణపఠనంలో అనుసరించవలసిన వ్యూహాన్ని తెలియజేసినవారు శ్రీ రూపేశ స్వామిగారు(ISKON - తిరుపతి) మరియు శ్రీ ఆశావాది ప్రకాశరావుగారు. ఈ సవినయ ప్రారంభం చివరకు దినచర్యలో ఒక భాగమయ్యింది. అవిశ్రాంతంగా గ్రంథాలను చదివినాను, చదువుతున్నాను. మిత్రులతో పంచుకొనే నిమిత్తమై పఠనా పర్యవసానములైన నా ప్రకంపనాలకు అక్షరరూపం ఇవ్వాలన్న ఆలోచన కలిగింది. దాని సాకారం సర్వేశ్వరాధీనం.
శ్రీ ఆశావాదిగారు కళాశాల విద్యాభ్యాసంలో రెండేండ్లు పైమెట్టులో ఉండేవారు. ఇరువురం హాస్టల్లో ఒకేగదిలో ఉండేవారం. ఒకరినొకరు అర్థంచేసుకోవటం మా మధ్య ఉండేది. అనంతరం ఇరువురం విభిన్న వృత్తుల్లో ప్రవేశించాం. నేనేమో కర్నాటక రాష్టంలో ఉండేవాడిని. రెండు దశాబ్దాలు దాటాక ఒకరినొకరు కలుసుకోవటం, గతస్మృతులు నెమరు వేసుకోవటం జరిగింది. ఆపై మామీద అద్వితీయ అజ్ఞాతశక్తి అమృతవర్షం కురిపించింది. మమ్మల్ని అందలం ఎక్కించింది. ఇదంతా ఆనందకరమైన అనుభూతి ప్రదమైన అభ్యుదయం.
శ్రీ ఆశావాది ప్రకాశరావు ఆంధ్రసాహితీలోకంలో మేరుశిఖరిని అధిరోహించి నాడనేది జగమెరిగిన సత్యం. ఆయన సన్నిహితమి త్రులు శ్రీ కుంచం అశ్వత్థయ్య (పెనుకొండ) వారు గండపెండేరం వేస్తున్న సందర్భంలో, అచ్చటి సహృదయులు కొందరు "ఆశావాది సాహితీ స్వర్ణోత్సవాలు" నిర్వహింప దలచినట్లు తెలిసింది. వారి ఆప్తుడుగా నేనుగా ఏదైనా చేయగలనా ? అన్న ఆలోచనకు రూపకల్పనమే "భాగవత సౌరభం" అనే ఈ గ్రంథ వికసనం. ఈ చర్యవల్ల మేమిరువురం భాగవతుల పరిధిలో చేరినట్లైనది. పరాత్పరుని లీలల్లో ఇదొక కిరణం.
భాగవతంయొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పవలసివస్తే -

లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై -

అనే పోతన పద్యాన్ని పేర్కొనాలి. అనంతాలైన భగవంతుని లీలలు భావించేవారికి హృద్యంగా, ఆలకించేవారికి ఇంపుగా, మననం చేసేవారికి సొంపుగా ఉండేటట్లు వర్ణించిన ఏకైక గ్రంథరాజం భాగవతం. దీని పఠన, శ్రవణాదులవల్ల కలిగే చరమఫలం ముక్తి అని పలుమారులు నొక్కి చెప్పబడింది.
శ్రీవెంకటేశ్వర స్వామి దయాలబ్ధిచే ధన్యుడనైన నేను భాగవతకథలు, వాటి విశ్లేషణకు సంబంధించిన గ్రంథాలపై ఆసక్తి పెంచుకున్నాను. "పలికెద వేరొండు గాథ పలుకగనేలా?" అని బమ్మెరవారు అన్నట్లుగా పైమార్గంలో వెలువడిన రచనలను అచ్చువేయించడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చినాను. ఉడుతాభక్తిగా నిర్మమకారంగా ఈకార్యం ముగించినాను. భగవత్కృపచే మంచిపని చేస్తున్నా నన్న తృప్తితో ఉన్నాను.
మన పురాణసంస్కృతి ఎంతో గొప్పది. స్వార్థపరులైన కొందరు వాటిలో సత్యదూరములైన విషయాలను చొప్పించినారు. అట్టివాటిని జల్లెడపట్టి, సహస్ర నామాంకితుడైన సర్వేశ్వరుని గాథలోని పరమార్థాన్ని దర్శించటంలో అందరు భాగస్వాములు కావలెనని ఆశిస్తున్నాను. అనురాగంతో అన్న ఆశావాది నాకు అంకితంగా గ్రంథమివ్వటం పట్ల కృతజ్ఞుడుగా, నా గూర్చి పద్యాలు చెప్పడం పట్ల నిర్మమకారంగా ఉన్నాను. అంతా దైవసంకల్పం.
ఇట్టి గ్రంథాన్ని చదివి భక్తిమార్గంలో అచంచలంగా ఉండండి. అప్పుడే మా ఉద్దేశ్యం నెరవేరుతుంది. అందుకే దీనిని అభిమానులకు అమూల్యంగానే అందిస్తున్నాను.

ఇట్లు, హరిచరణ స్మరణలో, కొత్తపల్లి జయరాం.
గీత


అమృతోదయం

నా విద్యాభ్యాసం అనంతపురం కేంద్రంగా జరిగింది. తొల్త పేదవిద్యార్ధుల వసతిగృహమైన కేశవ విద్యానికేతన్ లో నీడ పొందినాను. అక్కడ నిద్రలేవగానే శుద్ధి కార్యక్రమాల అనంతరం ప్రార్థనాదికాలమధ్య భక్తితో కొంతకాలం గడుపవలసి వచ్చేది. తర్వాత సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతిగృహం ఆశ్రయమయ్యింది. అక్కడకూడా బ్రాహ్మీముహూర్తాన భగవద్గీతా పఠనాదికాలు జరిగేవి. ఇవన్నీ సాత్వికజీవన విధానానికి బీజం వేశాయి.
ఇట్లుండగా భాగవతపఠనానికి అనివార్యమైన అవసరం అనంతపురం ప్రభుత్వ కళాశాలలోనే ఏర్పడింది. అది 1962-65 మధ్యకాలం. ఆ దినాలలో ప్రతిసంవత్సరం పోతన భాగవతంలోని కొన్ని స్కంధాలపై తెలుగు శాఖ వ్యాసరచన స్పర్థలు నిర్వహించేది. విజేతకు మీనాక్షి సుందరం స్మారక నగదు పురస్కారం లభించేది. చదువుతూ సంపాదనపై దృష్టి ఉంచిన నాకు, శారీరక కష్టం చేతకాక, జ్ఞానసంపాదనలో మానసిక కష్టానికి అలవాటుపడిన కారణంగా గ్రంథపఠనం తప్పనిసరి అయింది. పోటీమనస్తత్వం కూడా దీనికి తోడయ్యింది. ఇలా భాగవతుల జీవితాలకు, భాగవతుల భావాలకు, భాగవత పద్యాలకు చేరువ కాగలిగాను. జిజ్ఞాసువులను ప్రోత్సహించే డా॥ నండూరి రామకృష్ణమాచార్య, డా॥ అప్పజోడు వెంకటసుబ్యయ్య వంటి ఉపన్యాసకుల ఆశీస్సులతో పురస్కారయోగ్యత సంపాదించినాను. పోతన భాగవతపాత్రల, సన్నివేశాల ప్రభావం నామీద పడింది.
కళాశాల విద్యార్థిగా ఉండగానే శ్రీ భోగిసెట్టి జూగప్పగారి చలువవల్ల శ్రీశైలజ్యోతి మాసపత్రికలో సహ సంపాదకస్థాయిలో స్థానం పొందటమేకాక, అప్పటి రాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి శ్రీశైల సందర్శనంలో వారిపై పద్యాలుచెప్పి వారిచే అమృతాశీర్వచనములు పొందగలిగాను. కొన్ని నిమిషాలైన వారి సరసన కూర్చొని వారి మధురభాషణములు వినగలిగే అదృష్టం కలిగింది. ‘మల్లికార్జున దేవుండు మాకు దిక్కు’ అనే మకుటంతో అక్కడి స్వామిపై అప్రయత్నంగా ఓ ఐదుపద్యాలు దొర్లినాయి. 1963 వేసవిసెలవుల్లో ఏలూరులో 3నెలలపాటు శ్రీ బస్వా సింహాద్రి అప్పారావుగారి దగ్గర భాగవతం చదువుకొన్నాను. ఆ దినాల్లోనే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు మా కళాశాలలో చేసిన భాగవతోపన్యాసం నన్ను ప్రభావితుణ్ణి చేసింది. శ్రీశ్రీశ్రీ పుట్టపర్తి సాయిబాబాగారి ప్రసంగాలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి.
అలతికాలంలోనే సహవిద్యార్థుల ప్రోత్సాహం మధ్య అవధానం జయప్రదంగా ముగించినాను. డా॥ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి నుండి అవధానంలో ఏకదేశమైన నిషేధాక్షరి నిర్వహరణలోని మెలుకవలను పొందగలిగాను. మరో అంశమైన పురాణపఠనానికి నా అవధాన ప్రారంభదశలో భాగవతంలోని ప్రసిద్ధఘట్టాలనే స్వీకరించేవాడిని. శ్రోతల్ని ఏదోవిధంగా ఆనందింపజేయటంలో భాగంగా వినయప్రతిపాదకంగా భక్తిసంబంధి అంశాలను అనుపానం చేసేవాడిని. ఇలా చెప్పినదానిలో జీవించాలనే బలమైన ఆలోచన కలగటమేకాక భాగవతంతో అనుబంధం పెంచుకోవాలన్న ఆశకూడా హెచ్చింది.
ఆ దినాల్లోనే ఆపదమొక్కులవాడైన ఏడుకొండలవాని దర్శనార్థం వెళ్ళాను. పాదచారినై కొండనెక్కాను. అలనాడు అన్నమయ్య మోకాళ్ళపర్వతం చేరగానే అదిగో అల్లదివో శ్రీహరివాసమూ - అంటూపాట అందుకున్నాడుట! ఆ క్షేత్రమహత్యమో, అక్కడి ప్రకృతి సౌందర్యాల రహస్యమో, ఏ అనిర్వచనీయానుబంధమో చెప్పలేను - ‘శరణు శ్రీ వెంకటేశ్వరా శరణు శరణు’ అంటూ నానుండి మూడు పద్యాలు వెలువడ్డాయి. ఈ విక్రియకు ఆశ్చర్యచకితుణ్ణి అయినాను. ఈ అవిస్మరణీయ జ్ఞాపకాలే ఎన్నోమారులు నాచేత ఎన్నోపద్యాలు, పాటలు, శ్లోకాలు, దేవునితో అధిక్షేపణాత్మక సంభాషణలు నిద్రలో చేసే స్థితికూడ వచ్చింది. నాలో కీర్తిదాహం అధికమయ్యేకొద్ది అవన్నీ లీలామాత్ర జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. అయితే ఈ అనుభూతులను ఆలకించే అవకాశం నా ఆప్తమిత్రులకు ఎప్పటికప్పుడు లభిస్తూనే ఉండేది. అందుకే వారికి నేటికీ నాపై అవధుల్లేని అనురాగంతోడి ఆరాధనాభావం. 2002న బ్రహ్మోత్సవాల్లో ఏడుకొండలవాని సన్నిధిలో కొండపై భాగవతోపన్యాసం చేయటం నా అదృష్టంకాక మరేమిటి?
డిగ్రీచదువు ముగిశాక తెలుగుపండిత వృత్తిలో ప్రవేశించాను. పోతన భాగవత భాగాలు కొన్ని విద్యార్థులకు బోధించవలసి వచ్చింది. దాటవేసే పద్ధతిలో పాఠం ముగించటం కాకుండ జ్ఞానులైన పెద్దల పాదసన్నిధిలో నేర్చుకొన్నవాటితో అంకితభావంతో పాఠం చెప్పేవాడిని. చిన్ననాటినుండి మా నాన్న దగ్గర, మా ఉపాధ్యాయుల దగ్గర విన్నవి, చలనచిత్రాల ద్వారా తెలిసికొన్నవి జోడించి ఆకర్షణీయంగా పాఠం చెప్పటం, భక్తిని ప్రదీప్తం చేయటం అలవాటవుతూ వచ్చింది.
1967లో ఒకమారు వేదాంతం లక్ష్మయ్యగారి భగవద్గీతా ప్రసంగం బెళగుప్ప మండలం అంకంపల్లిలో జరిగింది. వారి సరసన వేదికపై నాలుగుమాటలు వినిపించినాను. వారు చాలా సంతోషించి, ఇప్పటి నీ యీ మార్గాన్ని వదలకు, నీకు మంచిభవిష్యత్తు ఉంది అన్నారు. సరైన వక్త లభిస్తే ఆనాటి ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు సారస్వతసంఘ సమావేశాలకు ఆహ్వానించేవారు. అట్టి సదవకాశాలను అనేకంగా పొందగలిగాను. ఎక్కువగా పోతన వ్యక్తిత్వంపై, తెలుగు భాగవతంలో సుప్రసిద్ధ ఘట్టాలపై ప్రసంగించేవాడిని. నాలో తెలియనితనం అధికస్థాయిలో ఉండినమాట వాస్తవమే అయినా, నేను చెప్పే విషయాలలో గాఢత లేకపోయినా, అవి హృదయస్పర్శిగా ఉండటం, చదివే పద్యాలలో శ్రావ్యత, స్పష్టత ఉండటం, అప్పటికే అవధానిగా ముద్రపడి ఉండటం నాకు మంచి గుర్తింపే లభింపజేసింది. సన్మాన పరంపరలు నా బాధ్యతను పెంచాయి.
మూడేండ్ల పండితవృత్తికి మంగళంపాడి ఎం.ఏ., విద్యార్థినైనాను. 1970 నుండి డిగ్రీ చదివే విద్యార్ధులకు పాఠ్యాంశాలు బోధించటంతో నాలో మరింత స్పష్టత చేకూరింది. గుంతకల్లు కళాశాలలో పనిచేస్తూ ఉండగా తిరుమల -తిరుపతి దేవస్థానంవారి పోతన భాగవతం ప్రాజెక్టులో తృతీయస్కంధానికి సరళగద్యానువాదంచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసికొన్నాను. రెండుభాగాలుగా అది పునర్ముద్రణకు యోగ్యమై పంచ సహస్రాధిక సంఖ్యలో ప్రతులు భాగవత ప్రియులకు అందినాయి. ఆ రచనా సందర్భంలో అనేక సందేహాలను శ్రీ కలచవీడు శ్రీనివాసాచార్యులు, శ్రీ దాదన చిన్నయ్యవంటి పండితుల సన్నిధిలో తీర్చుకోగలిగాను.
నేను ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉండేవాడిని. మద్రాసు చాప్టర్ పక్షాన ఏర్పాటైన సభలకు వెళ్ళినపుడు వారి సౌజన్యంతో తమిళనాటగల దేవాలయాల్లో పెక్కింటిని దర్శించే అవకాశం లభించింది. అందులో రామేశ్వరం, తంజావూరు, మధుర, కంచి, కన్యాకుమారి వగైరాలు ప్రధానమైనవి. ఏరాష్ట్రంలో అనేకములైన దేవుని కోవెలలు, అందులో ఆర్చామూర్తులు కొలువైయున్నారో, అక్కడే ఉప్పెనయై తలెత్తిన నిరీశ్వరవాదుల వెల్లువలో, కొట్టికొనపోకుండ నేటికీ నిల్చియున్న ఆ దేవాలయాల్లోని సంప్రదాయ సౌరభాల గుబాళింపులకు ఆశ్చర్యం చెందినాను. ఇదికూడా నన్ను భక్తిమార్గంలో కట్టివేయడంలో ప్రధాన భూమిక పోషించింది.
నగరి కళాశాలలో పనిచేస్తూ ఎఱ్ఱనపీఠం, ఒంగోలువారు ప్రకటించిన ఉత్తమ సిద్ధాంత గ్రంథరచన పోటీలో పాల్గొని, సంస్థ నిర్దేశించిన ‘ప్రహ్లాద చరిత్ర -ఎఱ్ఱన పోతనల తులనాత్మక పరిశీలన’ అనే అంశంపై డా॥ గంగవరప్పగారి చెన్నయ సహరచయితగా పరిశోధనాత్మక గ్రంథం వ్రాసి పురస్కారం పొందినాము. నేను శ్రీ దోర్నాదుల చిన్న వరదరాజులుశ్రేష్ఠిగారి షష్టిపూర్తి సందర్భంగా వారి కోరికమన్నించి రామకథను ఆశువుగా పద్యాలలో అల్లుటేకాక, హనుమత్ స్తోత్రమంజరి, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర కదంబాలను సంకలనం చేసియిచ్చాను. వారు వాటిని ప్రచురించి భక్తులకు పంచిపెట్టారు. ఆ గ్రంథం రెండుమారులు వెలుగుచూచింది. ఈ కృషికూడా నేను మరింతగా శ్రమించడానికి, నా సామర్ధ్యాన్నిపెంచుకోవడానికి కారణమయ్యింది.
తమిళనాట తిరుత్తణిలో అష్టావధానం చేసే అవకాశం లభించింది. ఆంధ్రసంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆ అవధానం కారణంగా అక్కడ శ్రీ కైశెట్టి సుబ్రహ్మణ్యం, శ్రీ వేలమూరి వేంకటశేషు ప్రభ్రుతులైన సాహిత్యాభిమానులకే కాక శ్రీసుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ అర్చకస్వాములకు కూడా ప్రీతిప్రదుడ నయ్యాను. అప్పటినుండి నేను దైవదర్శనానికి ఎప్పుడు వెళ్ళినా వారు నన్ను శేషవస్త్రంతో సత్కరించేవారు. ఇదొక గొప్ప అనుభూతిని మిగిల్చింది. దైవభావనను నాలో స్థిరీకరించింది.
పెనుకొండలో పనిచేస్తూ అక్కడకి సమీపంలోనున్న శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద స్వామి ఆశ్రమం, సానిపల్లెకు; శ్రీపురక్షేత్రం, ఈదులబల్లాపురంలకు పెక్కుమారులు అఖిలాంధ్ర కర్ణాటక సాధుసమ్మేళనాలకు హాజరై, వారి సాంగత్యంలో నా ఆలోచనలకు కొంత స్పష్టత సమకూర్చుకో గలిగాను. బాబాగారి వాక్యవిభూతిలోని కొన్ని భావాలకు ‘విభూతిగీత’ గా అనువాదపద్యాలు వ్రాసినాను. పదవీవిరమణానంతరం శ్రీపురక్షేత్రాధిపతి శ్రీశ్రీశ్రీ రామకోటి రామకృష్ణానందగిరి స్వాములవారి భావాలకు పద్యరూపమిచ్చినాను. అది ‘ఆధ్యాత్మిక తత్త్వప్రబోధము’ అనేపేర ప్రకాశితమైంది.
ఇప్పుడీ ‘భాగవత సౌరభం’ అనే వ్యాససంపుటి నా హితులచేతికి అందుతూ ఉంది. దీని నేపథ్యం కొంత వివరించుట నా కనీసధర్మం. భాగవత కల్పవృక్షం ఏ ఒక్కరి సొత్తుకాదు. ఆసక్తిగలవారెందరైనా దాని మధుర మహాస్వాదుఫలాలను అనుభవింప వచ్చు. ఆ ఫలంతో వారివారి శక్త్యానుసారం వివిధ భోజ్యాలను తయారుచేసికోవచ్చు. శక్తిలేనివారు ఇతరులు వండినదానినే రుచిచూచి తమ అనుభూతుల్ని మేళవించి సాటివారికి పంచవచ్చు. కాన ఇక్కడ యాజమాన్య చర్చకంటె ఉపయోగిత్వమే ప్రధాన ధ్యేయం కావలెను. అప్పుడే దాని జగద్ధితాశయం సార్థకమవుతుంది. నా యీ వ్యాసముల కూర్పులో పై సత్యాన్ని అనుసంధించుకొని దోషములు నావిగా, గుణములు పూర్వోప లభ్యములుగా భావించి నన్ను మన్నించి ఆశీర్వదించగలరు. ఇవన్నీ వివిధ సందర్భాలకు తయారుచేసినవి. వీనిలో1, 2 క్రమసంఖ్యగలవి ఆకాశవాణీ ముఖంగా ప్రసారమైనవి. 9, 11లు వరంగల్లు సదస్సులకు సమర్పించినవి. తక్కినవి పత్తికొండ, గుంతకల్లు, పెనుకొండ, షాద్ నగర్, తిరుపతి, నర్సంపేట, కడప సభలలో చేసిన ప్రసంగాలు. ఇట్టి అవసర మేర్పడవచ్చు నని సిద్ధంచేసుకొన్న వ్యాసము లింకా ఉన్నాయి. అవికూడా ప్రజలమధ్య చేరవేయగల సదవకాశమునకై ఎదురుచూస్తున్న ‘ ఆశావాది’ ని నేను.
ఈ గ్రంథప్రచురణ బాధ్యత చేపట్టినవారు శ్రీ కొత్తపల్లి జయరాంగారు. తెలుగు దేశం ఎం.ఎల్.ఏ., గా మా సింగనమల నియోజకవర్గంనుండి ఎన్నికై విప్ గా, మంత్రిగా, టి.టి.డి. ధర్మకర్తలమండలి సభ్యులుగా నుండి క్రమంగా రాజకీయ, ప్రజా, పారమార్థమిక సేవలందించినారు. ఈ ప్రస్థానంలో కొంతకాలం విశ్రాంతి లభించగా ఏడుకొండలవాని కొలువులో మూర్తీభవించిన భక్తికి సాక్ష్యంగా ఇటీవల నిరంతరాయంగా పురాణవిజ్ఞాన జిజ్ఞాసతో కవిత్రయంవారి భారతాన్ని సంపూర్ణంగా ఒకమారు, ఆపై నింపాదిగా భాగవతాన్ని నాలుగుమారులు చదివినారు. పఠన సందర్భంలో తనలో తలెత్తిన భావ ప్రకంపనాలకు వాగ్రూపమిస్తూ వాటిని ప్రసంగయోగ్యంగా తీర్చే యత్నంలో కూడా ఉన్నారు. మరోవైపు రసరమ్యభావాలకు పద్యరూపమివ్వటంలోనూ తనకాలాన్ని వ్యయిస్తున్నారు. దైవపూజా తత్పరులై పవిత్రత పెంపొందించుకొంటున్నారు.
ఈవిధమైన జ్ఞానతృష్ణతో, కొన్ని శతాబ్దాలుగా తెలుగువారినెల్ల ఆశ్చర్యానికి లోను చేస్తూ, అధ్యయనానికి ప్రేరేపిస్తున్న పై రెండు పురాణాలను ఆలోచనామగ్నులై చదవడమనేది విశ్వవిద్యాలయాల్లో భాషాసాహిత్యాల బోధనాబాధ్యతలు కలవారు కూడా చేయడంలేదనేది తిరుగులేని సత్యం. భాగవత పథాన్ని అంటిపెట్టుకొని ఉండవలసినవారికి తప్పనిసరిగా ఉండవలసిన అర్చన, కీర్తన, అతిథి సంప్రీణనము, ఆర్ధ్రతాప్రధాన వర్తనలతో మసలు కొంటున్నవారు శ్రీ కొత్తపల్లి జయరాంగారు. నేను అభ్యర్ధించకనే నా భాగవత వ్యాసాలకు అచ్చురూప మందించే ఉత్సుకత చూపినారు. వారి యీ సాధుసమ్మతమైన సౌజన్యానికి సంతోషిస్తూ ఋణస్థుడనై నమస్కరిస్తూ ఈ వ్యాససంపుటిని వారికే అంకితమిస్తున్నాను.

- ఆశావాది ప్రకాశరావు.


సామయిక - స్పందనారామం

ఉ॥
శ్రీ జయరామ సోదరుడు శిష్టుడు శాసనసభ్య వేదికా
భ్రాజితకేతనుండు జనరంజనకార్య నిబ్ధబుద్ధి వి
ద్యాజయశీలు డూర్జిత సదాశయు డున్నత న్యాయ శాస్త్ర సం
భాజను డీ సభా స్థితిని వర్తిలె నెంతయు నౌచితీస్థితిన్.

- 27-6-28 బాబూజీ మిత్రమండలి, అనంతపురం - అష్టావధానసభ


కం॥
కలి యాన దుర్గ మగుటన్
కలుగునొ? విజయం బటంచు కాతరుడైతిన్
కలుగుట నా కిరుగడలన్
సలలిత జయశబ్ద వాచ్యసఖులు జయంబౌ.
ఉ॥
హాటక గర్భురాణి సుతు నర్చితుజేయగ నెంచి యెన్నడో
దీటగు పట్టుపుట్టములు దీప్తసువర్ణపు టుంగరమ్ము వే
నూట పదారులిచ్చి బుధనుత్యముగా నను సత్కరించె నీ
నేటి సభాధిపున్ సుఖుని నిర్మలు శ్రీ జయరాము నెన్నదన్
- 28-11-92 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (నార్త్), కల్యాణదుర్గం, అష్టావధాన సభ


తే॥గీ॥
కొత్తగా విచ్చు కొన్నట్టి కోర్కెగాదు
పల్లెలందున ప్రాచీన పద్యరక్తి
అట్టి జాగ్రన్మనస్కుల నంజలింతు
విజయ సాహితీరామ నివేశమతుల
- 28-3-1993 సాహితీ స్రవంతి, సెట్టూరు, (కంబదూరు మండలం) అష్టావధాన సభ


సీ॥
స్వర్ణాంగుళీయక సన్మాన మొనరించి
పట్టుపుట్టుంబులు కట్టజేసె
పువ్వాడ తిక్కన భూర్యభినందన
పుక్కిలింపగజేసె పువ్వులట్లు
కొలకలూరి ఇనాకు వలపుల దీవెన
లందింపగాజేసె డెందమార
సాటి కులస్థుల సౌజన్య గంధమ్ము
గ్రమ్మరిమపజేసె గూఢముగను
చిన్ననాటి చెల్మి చెరగని స్మృతి నిల్పి
నాదు ప్రగతి జూచి మోదమందు
కొత్తపల్లి ధాము గుణవంతు జయరాము
మంత్రి పుంగవునకు మాన్యనతులు.
మెరుపుతీగలు ( ఖండకావ్యము),
- ఆశావాది ప్రకాశరావు.

కృతిస్వీకర్త, మిత్రమణి శ్రీ కె. జయరాంగారికి సమర్పించిన మధుమానసం

కం॥
శ్రీ మహీ తిమ్మాపుర సే
వా మందిరమందు విద్యబడసెన్ క్రమతన్
క్షేమంకర భావాలకు
వే మొగ్గెన్ తత్ఫలంబె వికచాబ్జము గాన్
కం॥
శ్రీ చెన్నమ దాసప్పల
రోచిస్సై కొత్తపల్లి క్రొంబోణిమియై

పూచిన పుణ్యఫలమ్మై దోచె నశేషజన ప్రేమ ధూర్వహ యశుడై
ఉ॥
కష్టపరంపరన్ గడచి కాలము కోసము వేచియుండి సం
శిష్టుల మిత్రులన్ విడక శ్రేయము ప్రేయము తూచి పంచి ధీ
నిష్టత భక్తిభావ పరిపూర్ణుడునై చదివించి పల్వురన్
తుష్టుల జేసి విద్దెలకు దోహలుడయ్యె విశాలబుద్ధికిన్
చం॥
తన యనునార నెల్లర నుదారగుణంబున. చేరదీసి చే
తన మహోపకారమును తప్పక గూర్చెడు దొడ్డబుద్ధి చెం
తన పనివట్టి పెంచె నుత ధర్మమె వర్మముగాగ నాత్మ చిం
తనమున మున్గు యోగమును దాల్చె సతంబును సార్థకాభిదన్
ఉ॥
సాహితి మా తపంబనుచు సారతరోక్తుల పల్కుచుంద్రు కా
నీ హితమొప్పు భాగవతనీతి పఠింపగ జూడరౌర స
మ్మోహిత దీక్ష నిప్పటికి పూర్తిగ నాలుగు మారులర్థ సం
గ్రాహితు బుద్ధివై చదివి కల్మష దూరడవైతి వున్నతిన్
ఆ॥వె
అన్నయనుచు పిల్చి ఆర్ధ్రత కలబోసి
మంత్రి అహము విడచి మనసు నిల్పి
నాకు కూర్చదగిన శ్రీకర కార్యాల
మాటుగొనక చేయు మధురమూర్తి
తే॥గీ॥
ఆది పురుషుని చింతన నాత్మనిల్పి
భగవత సౌరభము గ్రోలి పరవశించి
యోగపాలకు కృష్ణు సదూహ లతకు
ప్రణతుడై వెల్గుమా। జయరామ। సుఖుడ।

- ఆశావాది ప్రకాశరావు.