పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : జీవేశ్వర సంబంధం - రుక్మిణీ కల్యాణం

అహంకారం నశించడానికి భక్తి; శాశ్వత సత్యాన్ని తెలిసికోవడానికి జ్ఞానం; సాధు ప్రవృత్తిలో ఉండటానికి వైరాగ్యం; బాగవుతాం అనే విశ్వాసం బలపడటానికి భాగవతపఠనం అవసరం.

కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణింపుచున్ ముక్తి వై
కల్యుండెవ్వడు తృప్తుడౌ, నవి వినంగా క్రొత్తలౌచుండు, సా
కల్యంబేర్పడ,,,,,,,,,,,,,,,,,,,,,,,, యెరుంగన్ పల్కవే

అని పరీక్షిత్తు శుకమహర్షిని ప్రశ్నించాడు. ఇట ముక్తి వైకుల్యుడనగా చాంచల్యం తొలగినవాడు, లోకభ్రాంతి లేనివాడు. సాకల్యం అనగా శుభం కలిగేటట్లు; సంపూర్ణంగా తెలిసేటట్లు; అభ్యుదయవాంఛ కలిగేటట్లు అని అర్థం. అసలు కల్యం అనేమాటకు ప్రాతఃకాలం అనే అర్థముంది. కాబట్టి అదే అభ్యుదయం ( అభి+ ఉదయం).
కల్యాణాత్మక కథ రుక్మిణీ కల్యాణమే. కల్యాణ శబ్దయుక్తమైన కథ ఇది తప్ప మరొకటి భాగవతంలో లేనేలేదు. మహాకవి పోతన్న ఈ ఘట్టాన్ని ఒక స్వతంత్ర కావ్యంగా తీర్చాడు. ‘శ్రీకంఠ చాపఖండన’ అంటూ శ్రీకారం చుట్టబడిన ఈ కథ సీతా కల్యాణాత్మక కావ్యార్థసూచనతో ప్రారంభించబడి రుక్మిణీకల్యాణంతో ముగియటం మరో విశేషం. అక్కడ సీతకై రాముడు శివధనుర్భంగం చేయగా, ఇక్కడ రుక్మిణికై కృష్ణుడు ‘శౌర్యమే ఉంకువ’ ( కాన్క) చేసినాడు.
మన భారత దేశంలోని వైవాహిక వ్యవస్థను, స్త్రీ పురుష సంబంధాలను, ప్రత్యేకించి స్త్రీలోని ఆదర్శం ఒకమారు సింహావలోకనం చేసికొంటే రుక్మిణీ కల్యాణం లోని విశేషాల ఔచిత్యం తెలుస్తుంది.
వేదాంతమతం స్త్రీని గర్హిస్తుంది. ఆమె ప్రతిమగల ఇంట ఉండటంకూడ నిషేధిస్తోంది. తాత్త్వికమతం స్త్రీని విష్ణుమాయగా పేర్కొంటోంది. తస్మాత్ జాగ్రత్త। జాగ్రత్త। అంటుంది. వల్లభమతం విశ్వంలోని జీవు లందరు స్త్రీలని, ఈశ్వరుడొక్కడే పురుషుడని పేర్కొంటుంది. అంతేకాక పురుషుడైన జీవుడు నిరంతర స్త్రీసంగమంచే స్త్రీత్త్వాన్ని, స్త్రీయైన జీవుడు పురుషసంగమంచే పురుషత్వాన్ని పొందుతున్నట్లు చెబుతుంది. మోక్షమతం పురుషునకు స్త్రీ వలె, స్త్రీకి పురుషుడుకూడ ప్రతిబంధకమంటుంది.
కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధర్మవిరుద్ధంగాని కామం నా స్వరూపమే అన్నాడు. కాబట్టి కులస్త్రీతోడి కామం దోషంకాదని తెలుస్తున్నది. నిజానికి లోకంలో ప్రతివ్యక్తికి తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు తర్వాత భార్య లేదా భర్తయే గణనీయులు. పురుషునికి చతుర్విధ సాఫల్యసిద్ధి భార్యవల్లనే సాధ్యం. కోటలోనిరాజు శత్రువిజయం పొందునట్లు గృహిణి సాంగత్యంలో గృహస్థుడు అరిషడ్వర్గాలను జయిస్తాడు. పడవసాయంతో నావికుడు సముద్రాన్ని దాటునట్లు భార్య తోడ్పాటుతో భర్త సంసారాన్ని దాటగల్గుతాడు.
భారతీయ మహిళ కొక ఉత్తమ ఆదర్శం ఉంది. ఆమె పురుషుణ్ణి వలచి, తపించి, రక్తసంబంధాలు వదలుకొని , భర్త పరివారంతో ఏకీభావం చెంది అతని గోత్రాన్ని వీర్యాన్ని స్వీకరించి వంశాభివృద్ధి చేస్తూ జన్మజన్మలకు అతడే భర్త కావాలని కోరుకుంటుంది. వివాహ మంటే దేహబేదంచేత రెండుగా విడిపోయిన రెండు ఆత్మల్ని ఒకటిగా చేసే కర్మ. ఇలా జీవేశ్వర సంబంధం ప్రేయసీ ప్రియుల బంధంగా ముడివడి జన్మను సార్థకం చేస్తుంది. ఇర్వురిమధ్య భక్తిని ప్రదీప్తం చేస్తుంది. పరమాత్ముని వరించడంలో పరమభక్తునికి పతివ్రతకు సామ్యం ఉంది.
సామాన్య పాఠకుడు పురాణాల కథతోనే ఆనందిస్తాడు. కాని ఉన్నతస్థాయి పాఠకుడు ఆ కథలలో మరో పార్స్వమైన అంతరార్థాన్ని విచారణ చేస్తాడు. ఈ దృష్టితో రుక్మిణీకల్యాణమనే అగాధజలధి నుండి ఎన్నెన్నో ఆణిముత్యాల రహస్యకాంతులు వెలిజిమ్ముతాయి. ఒక్కమారు రుక్మిణి పుట్టినింటిని చూద్దాం.
ఆమె తండ్రి భీష్మకుడు. భీష్మకశబ్దానికి పట్టుదల కలవా డని అర్థం. ఏమిటా పట్టుదల? భగవంతునికి తన సర్వస్వాన్ని సమర్పించాలి అనుకోవటం. అందుకే ఆయన కూతురును కృష్ణునకు ఈయదలచినాడు. అతని సంతానం ఐదుగురు పంచేంద్రియాలకు ప్రతీక లయితే వారిలో పెద్దవాడైన రుక్మి నోటికి సంకేతం. దాని ఆధిపత్యాన్ని, దుడుకుదనాన్ని, కాదనలేని బలహీనుడు భీష్మకుడు. అతని దేశం విదర్భ. అనగా అనేక దర్భలతోకూడినది. దర్భ పవిత్రతకు స్థానం. ఈ కథలో ఏమిటా పవిత్రత? కృష్ణు నంతటి వానిని విదర్భదేశం అల్లుడిగా పొందటం. అట్టి నగరానికి భీష్మకుడు పాలకు డనుటచే అతడు పరమాత్మానుసంధాన దీక్షలో ఉన్నాడని భావించాలి. అతని కున్నది ఒకే ఒక కూతురు. ఆమె సర్వేంద్రియ ప్రకృతికి బుద్ధికి ప్రతీక. ప్రకృతి పురుషునితో అనగా భగవంతునితో కలిస్తే చైతన్యం. విడిగా ఉంటే జడం. కాబట్టి పరమాత్మలో లీనంకావాలనే ప్రయత్నంలో ఉండటం దాని లక్షణం.
కథలో ప్రధానపాత్ర రుక్మి. ఇతనిలోని అసంబద్ధతలను తెలియజేయడానికి పోతన్న చక్కని పదబంధాలను వాడినాడు. రుక్మి అనఘుడు. ఇది సామాన్యార్థంలో కాక బలేబుద్ధిమంతుడు అనే నిందార్థంలో ప్రయోగింపబడింది. అట్లే వాడు దుస్సంధుడు. దుష్టసాంగత్యము కలవాడు, చెడుకూటమిని ఆలోచించువాడు, కలయిక కూర్చుటలో సరైన అవగాహన లేనివాడు, అని అర్థం. వాడు అంధుడు కూడ. అంటే, బాహిరసౌందర్యమేకాని, ఆత్మసౌందర్యం చూడలేనివాడు.
శిశుపాలుని మొదటిపేరు సునీధుడు. అనగా వాడు పుట్టుకతో మంచివాడే. సహవాస దోషంతో పిల్లవాడి మనస్తత్వం వచ్చి శిశుపాలుడైనాడు. చిన్ననాడు ఎందరో శిశువులతో ఎత్తుకోబడినాడు కదా। ఇట్టి శిశుపాలుడు జీవాత్మకు సంకేతం. జీవాత్మ దృష్టిలోకంలో నచ్చిన ప్రతివస్తువు మీదికి పోతూ ఉంటుంది. బుద్ధికి సంకేతం రుక్మిణి. ఆమెను శిశుపాలునికి ఇవ్వాలి అనుకోవడం బుద్ధిని జీవాత్మతో కలపటం. పరమాత్మానుసంధానం పొందాలనుకొనే బుద్ధి జీవాత్మతో ముడివడదు. కాబట్టి బుద్ధి(రుక్మిణి) వేదవిజ్ఞానాన్ని అనగా అగ్నిద్యోతన నామధేయుడైన బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించింది. ఆవేదవిజ్ఞానం ( బ్రాహ్మణుడు) పరమాత్మకు అనగా శ్రీకృష్ణునకు బ్రహ్మజిజ్ఞాసా రూప విషయ నివేదన (రుక్మిణి హృదయవాంఛ) చేస్తుంది. ఇది నిర్విఘ్నంగా నిర్వహింపబడటానికి దైవబలం కూడ అవసరం కాబట్టి దుర్గాప్రార్థనలో ‘హరిన్ పతిజేయు మమ్మ’ అని వేడుకున్నది. పరమాత్మను పొందాలనే బుద్ధి యొక్క ప్రగాఢవాంఛకు అడ్డునిలిచే పంచేంద్రియాలను (భీష్మక తనయులను); వాటికి మద్దతు పలికే వయోవికారాలను (జరాసంధాదులను) అదుపులో పెట్టాలి. శిశుపాల దంతవక్త్రాదులు కృష్ణునితో పోరలేక పారిపోవడం - పరమాత్మలో చేరగలిగే సాధనలో వారింకా పరిపక్వస్థితి చెందలేదన్న విషయాన్ని తెలియజేస్తుంది. కృష్ణుడు రుక్మి తలగొరగటం బుద్ధి వెర్రితలలు వేస్తే ఫలితం ఎంత వికారంగా ఉంటుందో చూపటం.
మొత్తం మీద బుద్ధి జీవాత్మకు లోబడకుండ పరమాత్మ యందే లగ్నం కావా లన్నది కథాసారాంశం. ముక్తి కారణమైన జీవసందేశ సాధన కథాపరంగా రూపొందింపబడింది.
రుక్మిణీ మహిమాదికాన్ని చెప్పవలసివస్తే, ఆమె సాక్షాత్తు లక్ష్మియే. క్షీరసాగర మథనానంతరం దేవత లందరూ లక్ష్మినే కాంక్షిస్తున్నా, ఆమె మాత్రం వారిని కాదని ఎక్కడో యోగముద్రలోనున్న విష్ణువునే వరించింది. ఆయన అర్ధాంగిగా, పాదదాసిగా కోరి స్థిరపడింది. విష్ణువు వివిధ మన్వంతరాలలో ఎన్నో అవతారాలు ఎత్తినా, ఆయనతో లక్ష్మి భూలోకానికి దిగివచ్చింది. నృసింహావతారంలో స్వల్పకాలం. ఆపై శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల్లో సంపూర్ణంగా దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుని జీవితంలో రుక్మిణిగా ఆమె అగ్రస్థానం వహించటానికి కారణం ఆమె లక్ష్మ్యంశ కావటమే. అందువల్లనే రుక్మిణీ కృష్ణుల దేవాలయాలు మనదేశంలో అనేకంగా వెలసినాయి. సత్యభామ ఐశ్వర్యంతో కృష్ణుని కొలవాలని చూస్తే రుక్మిణి ఒక తులసిదళాన్ని తక్కెడలో నిల్పి హృదయం విలువను లోకానికి చాటింది. బ్రాహ్మణ పురోహితునితో రుక్మిణి సందేశం పంపేటప్పుడు తానెవ్వరో కృష్ణునకు చెప్పదలచింది. లక్ష్మిగా ఉన్నప్పుడు విష్ణువునుండి ఉపదేశంగా పొందిన ప్రవృత్తి మర్గాన్ని ఎన్నుకొని గుర్తు చేసింది. పోతన్నఆ భావాన్ని ఎంత ఆర్ధ్రంగా చిత్రించాడో క్రింది పద్యం చూడండి-

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక
దేహతాపంబులు తీరిపోవు
ఏ నీ శుభాకార మీక్షింప కన్నుల
కఖిలార్థ లాభంబు కలుగుచుండు
ఏ నీ చరణసేవ నేప్రొద్దు చేసిన
భువనోన్నతత్త్వంబు పొందగల్గు
ఏ నీ లసన్నామ మేవేళ భక్తితో
తలచిన బంధసంతతులు వాయు
అట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన, నానలేదు
కరుణ జూడుము కంసారి ఖలవిదారి
శ్రీయుతాకార। మానినీ చిత్తచోర।

పంచేంద్రియాలు నీ కోసమే ఉన్నాయి. నీవు నాకు కానినాడు నేను జ్ఞానేంద్రియశూన్యురాల నవుతానంటూ శ్రవణంతో ప్రారంభించి “ధన్యచరిత” “నీకు దాస్యంబు చేయని జన్మమేల జన్మజన్మలకు” అంటూ దాస్యభక్తితో హృదయాన్నే ఆవిష్కరించింది.
జీవుడు ముక్తికై సకల లౌకిక ప్రయోజనాలపై విరక్తి పొందాలి. రుక్మిణి ఆ తీవ్రస్థాయిలో ఉంటూ తలపులోని చిక్కు తల్లికి చెప్పక, కన్నులనుండి వెడలునీరు తుడువక, చందనాది మై పూతలు పట్టక తదేక ధ్యానమగ్న మైనది. ఆధునిక యుగంలో ఈ విధమైన జీవేశ్వర బుద్ధితోడి విరక్తిని రామకృష్ణ పరమహంస, మీరాబాయి, అక్కమహాదేవి మొదలగు భాగవతోత్తములలో చూడవచ్చు. ఇట్టి జీవేశ్వరమైత్రి అనాది. జీవుడు భక్తి కలవాడైతే చాలు. దేవుడు కరుణాళుడై చేయూత నిచ్చి ఉద్ధరిస్తాడు. అహంకరిస్తే నృసింహుడై చీల్చి యైనా, వామనుడై తలమీద పాదంమోపి యైనా కన్నులు తెరిపిస్తాడు. ఇదే భాగవతం మనకిచ్చే సందేశం. ఈ కల్యాణ గాథలో పోతనకవితా కమనీయతకూడ కొంత దర్శించటం కల్యాణవాణిలో మునకవేసినట్లే.
రుక్మిణీ జననంతో భీష్మకుని రాజగృహం ‘బాలేందురేఖ దోచిన లాలిత యగు నపరదిక్కువలె’ నున్నదట; ఆమె చిన్నప్పటి క్రీడలన్నీ తెలుగింటి కన్నెల అటలే. ఈ విధంగా ఆమెను తెలుగు అమ్మాయిగా చేసినాడు పోతన్న. ఏ విధంగా రుక్మిణి శ్రీకృష్ణుని విద్యా, రూప, గుణ, బలాదుల విని కృష్ణుడే తనకు తగిన విభుడని భావించిందో; అట్లే కృష్ణుడుకూడ రుక్మిణి యొక్క రూపం, శీలం, బుద్ధి మున్నగు లక్షణాలు విని ఆమెయే తనకు తగిన ఇల్లాలని భావించినాడు. ఇట్లు ఇరువురి మధ్య ఈడుజోడు కుదిరింది. స్త్రీ తనకు ఇష్టములేని పురుషుణ్ణి ఎంతగా ఛీత్కరించుకొంటుందో ‘సింహముపాలి సొమ్ము గోమాయువుకోరు చందమున’ మత్తుడైన శిశుపాలుడు ఉన్నాడనటంలో తెలుస్తున్నది. కృష్ణుడుకూడా తదనుగుణంగానే ‘పేరవంబుల నడిమిభాగంబున లెక్కగొనక చను కంఠీరము’ పగిది ఆమెను గ్రహించినాడు. రుక్మిణి ప్రణయ సందేశాన్ని వృద్ధబ్రాహ్మణుడు వినిపించిన విధం, దానిని కృష్ణుడు విన్న వైనాలలో బ్రాహ్మణుని ఉత్తమవక్తగా, కృష్ణుని ఉత్తమశ్రోతగా చిత్రించినాడు పోతన. రాయభారం వెళ్ళిన బ్రాహ్మణుడు ‘ఆ యెలనాగ నీకు తగు, అంగనకున్ తగు దీవు’ అనుటలో- ఆమె ప్రకృతి, నీవు పురుషుడవు; ఆమె లక్ష్మి, నీవు నారాయణుడవు; ప్రకృతి పురుషునితో కలిస్తేనే చైతన్యం, లేకపోతే ఆ ప్రకృతి జడం అనే భావం స్ఫురిస్తున్నది. ఆ ప్రత్యేకతలు ఆమెలో గాఢంగా భావన చేసినాడు కావుననే ‘మానుద్రచ్చి నవవహ్నిశిఖన్ వడిదెచ్చు కైవడి దెత్తు’ రుక్మిణి నని విప్రోత్తమునితో కృష్ణు డన్నాడు. తోడుగా ఈ యిర్వురి వివాహం ఊరి వారి కెల్ల ఉత్సాహ సంధాయి అయ్యింది.
స్వయంవరార్థం వచ్చిన కృష్ణునకు భీష్మకుడు ఎదురేగి విద్యుక్త ప్రకారంగా పూజించి, మధుపర్కాలిచ్చి, వివిధాభరణాలు కాన్కచేసినాడు. మిగిలిన రాజ నివహానికి వారివారి వయో వీర్య విత్తముల కొలది కోరిన పదార్థాల నెల్ల ఇప్పించి పూజించినట్లు పోతన పేర్కొనటం వెనుక సూక్ష్మ పరిశీలనం వల్ల ఒక విషయము విదితమవుతుంది. శ్రీ కృష్ణు డేమీ కోరలేదు. కాని ఆయనకు సకలమర్యాదలు చెల్లింపబడినాయి. మిగిలినవారు తమ తమ యోగ్యతలకు అనుగుణమైనవి కోరి ఇప్పించుకొన్నారు. భీష్మకుని ఆంతర్యమేమిటో ఇట తేటతెల్లమవుతున్నది. ఆయన స్వయానా కృష్ణు నర్చించి, మిగిలినవారి బాధ్యత పరివారానికి అప్పగించినాడు. యథారాజా తథాప్రజా యన్నట్లు ‘మగడు గావుత చక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్’ అనుకొన్నారు దేశప్రజలు.

అళినీలాలక, పూర్ణచంద్రముఖి, నేణాక్షిన్, ప్రవాళాధరన్, కలకంఠిన్, నవపల్లవాంఘ్రియుగళన్, గంధేభ కుంభస్థనిన్ పులినశ్రోణి, నిభేంద్రయాన, నరుణాంభోజాత హస్తన్, మహోత్పరిగంధిన్, మృగరాజమధ్య గని విభ్రాంతాత్ములై రందఱున్.

గౌరీపూజ ముగించుకొని పాదచారియై హరిరాక కెదురుచూస్తూ వీరమోహినియై వచ్చిన రుక్మిణి అచ్చటవారి కెలా కనపడిందో ఈ పద్యంలో వర్ణించబడింది.

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీరవేంద్రావల గ్ను నవాంభోజదళాక్షు చారుతర వక్షున్ మేఘసంకాశ దే హు నగారాతి గజేంద్రహస్త నిభబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

రుక్మిణి కంటబడిన కృష్ణుని వర్ణనం ఈ పద్యంలో ఉంది. రుక్మిణీ కృష్ణు లిర్వురిలోను పండ్రెండు చొప్పున సౌందర్య స్థానాలున్నట్లు చెప్పి ఒకరు మరొకరికి ఏవిధంగానూ తీసిపోని జగదేకసౌందర్యం గలవారు సుమా। అన్నట్లు పోతన పరమోత్కృష్టంగా వర్ణన చేసినాడు.
పోతన్న కొన్ని నికృష్టపాత్రల ద్వారా కూడా ఆశ్చర్యకర మైన ఉదాత్తవిషయాలను పలికిస్తాడు. రుక్మి కృష్ణుని వెన్నంటుచు -

మాసరివాడవా మాపాప కొనిపోవ
నేపాటి గలవాడ?వేదివంశ?
మెందు జన్మించితి?వెక్కడపెరిగితి?
లెయ్యది నడవడి?యెవ్వరెఱుగు?
మానహీనుడవీవు మర్యాదలును లేవు
మాయ గైకొనిగాని మలయరావు
నిజరూపమున శత్రు నివహంబుపై పోవు
వసుధేశుడవు గావు, వావిలేదు…..

అంటూ శ్రీకృష్ణుని నిర్గుణత్వాన్ని ఘనతను చాటించినాడు. రుక్మి జన్మను ధన్యం చేసినాడు. అట్లే జరాసంధుని నోటినుండి ‘దేహధారి స్వతంత్రుడు కాడు జంత్రగాని చేతి జంత్రపు బొమ్మకైవడి ఈశ్వరతంత్ర పరాధీనుండై సుఖదుఃఖముల యందు వర్తమానంబులు నడుపు’ అని వేదాంత భావాలు పలికించినాడు. ఈ విధంగా రుక్మిణీకల్యాణ ఘట్టంలో మనకు అడుగడుగునా జీవేశ్వరసంబంధం కనిపిస్తుంది.