పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : దశావతారాలు.


అనంత చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఏదో ఒక ఉపాధిలో కేంద్రీకృతం కావటమే అవతారం. తౄ ధాతువునకు ‘అవ’యను ఉపసర్గ చేరగా భావార్థంగా అవతారం అనేపదం ఏర్పడింది.అవతారం స్థాయిలోని మార్పును సూచిస్తుంది. ‘అవతరణ’ అనుట ఇట్టిదే.

అవతారాలు ఎందుకు? అంటే భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణభగవానుడు
“ యదా యదాహి ధర్మస్య
గ్లానిర్భవతి భారత।
అభ్యుత్థాన మధర్మస్య
తదా- త్మానం సృజామ్యహమ్”
అన్నాడు. అనగా ధర్మానికి హాని జరిగి నప్పుడు, అధర్మం పెచ్చిరిల్లి నప్పుడు, ధర్మవిఘాతకుల హతమార్చుటకు, ధర్మవర్తనులను ఉద్ధరించుట ద్వారా ధర్మసంస్థాపనం చేయుటకు అనుకూలమైన ఉపాధిని ఎంచుకుంటున్నాడు. ఇదియే అవతారం. భగవంతుడు అవతారమెత్తుటకు పరమ ప్రయోజనం.

ధర్మ సంస్థాపన కాగా అవాంతర ప్రయోజనం భక్తరక్షణాదులు. ఈ విషయాన్నే భారతం కూడా “ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడిన్” అని చెప్పుచున్నది. సత్యం ధర్మం సృష్టికి మూలస్థంభాలు. వాటికి హాని జరిగినప్పుడు సృష్టికి చెదలు పట్టుతుంది.. మరి వాటిని ఉద్ధరించవలసింది ఎవ్వరంటే? ఎవరికివారే. అలా జరగని పక్షంలో భగవంతుడు చొరవ తీసుకొని ధర్మసంస్థాపన చేస్తాడు. తాను సృజించిన సకల చరాచర జీవరాసు లన్నింటిని అనుగ్రహించుటే అవతార తత్త్వం. అందులకే భగవంతుడు దేవ, మానవ యోను లందేగాక తిర్యక్ జడము లందు కూడా అవతరించి తన సమగ్ర సర్వైశ్వర్యాన్ని ప్రకటించుకొన్నాడు.

అనంతరూపాలు, నామధేయాలు గలిగిన భగవంతుని అవతారాలు అనంతాలు. ప్రభావవంతాలైన అవతారాలు లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి. అవతారధర్మాలు, ఉద్దేశ్యాలను అనుసరించి వీటిని అంశావతారాలు, కళావతారాలు, స్ఫూర్త్యవతారాలు, వైభవాతారాలు, అర్చావతారాలు, ఆవేశావతారాలుగా వింగడించవచ్చు.

నారదుని కోరికమేరకు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని యొక్క ఏకవింశతి(21) లీలావతారాలను తెలియజెప్పినాడు. వేదశాఖల చివర నున్న ఉపనిషత్తులవలె అనంతములైన అవతారాలలో కొన్నింటిని ముఖ్యమైనవిగా పేర్కొన్నను, వాటిలోకూడా దశోపనిషత్తులు చాలన్నట్లు భగవంతుని సర్వజ్ఞత్వ, సర్వేశ్వరాది విశిష్ట గుణజాలాలను తెలిసికొనుటకు దశావతారాలు ప్రధానంగా పరమభాగవతోత్తములు విశ్వసించినారు.
మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః।
రామోరామశ్చ శ్రీ రామశ్చ కృష్ణః కల్కిరేవచ॥ అని పేర్కొనబడినవే దశావతారాలు. ఈ అవతారాల చరిత్రను తెలియజేసేదే శ్రీ మహా భాగవతం.

అష్టాదశపురాణాల కర్తయైన వ్యాసుడు 17 పురాణములను రచించి, పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రచించినప్పటికి అతని మనసును ఏదోఒక అసంతృప్తి వెంటాడుతూ ఉండింది.

అరూఢ నయవిశారదుడైన నారదుడు, నిగమ విభజన విద్యాజని తోల్లాసుడైన వ్యాసుని జూచి కాతరుని కైవడి వగవ కారణ మేమని ప్రశ్నించినాడు. వ్యాసుడు ‘సర్వజ్ఞుడవైన ఓ నారదా। నీ వెరుగని దేమున్నది. నా కొరతకు కారణమును నీవే చెప్పు’ మని పలికినాడు. నారదుడు “పరాశరాత్మజా” ధర్మచయ మంతా నీచే ప్రపంచింపబడింది. కాని, అందులో విష్ణుకథలు లేవు, హరిని కోరి నుతింపక పోవుటయే నీ యీ కొంచెపుతనానికి కారణం. అని చెప్పినాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడు కృష్ణకథలను శ్రీమద్భాగవత పురాణంగా వర్ణించినాడు.

భగవంతునికి ప్రత్యేకంగా కథలంటూ ఉండవు. భక్తులకథలే భగవంతుని లీలలు. అట్లే భగవంతుని లీలానుకంపనాలే భక్తుల చరిత్రలు, భగవంతుడు, భాగవతుల మధ్య నున్న అద్వైతభావమే భాగవతం.

శూలికైనా, తమ్మిచూలికైనా ఎరుగ గహనమైన భాగవత తత్త్వం భక్తులకు మాత్రం కరతలామలకం, తద్భిన్నులకు అయఃపిండం. దీనిని తెలుగుచేసిన పోతనగారు తన పురాకృత పుణ్యశుభాధిక్యం చేత రసికభావ విదులకు భాగవతరసాన్ని అందించానని చెప్పుకొనుట అతిశయం గాదు. వారు పలుకుటతోనే భవహరాన్ని పొందినారు. శ్రీకైవల్య పదము జేరినారు. అట్టి పటుత్వ మహత్వ కృపాబ్ధి భాగవతం. దీని వైభవం క్రింది శ్లోకంలో చెప్పబడింది.
‘భా’ శబ్దో కీర్తివచనో
‘గ’ శబ్దో జ్ఞాన వాచకః।
సర్వేష్ట వచనో ‘వశ్చ’
‘తో విస్తారస్య వాచకః।
ధర్మార్థకామమోక్షాంశ్చ
ముక్తి వర్ణ చతుష్టయీ।
ప్రాప్యంతే యతో-నేన
తస్మాద్భాగవతం స్మృతమ్॥
లలితస్కంధం, కృష్ణమూలం అయిన భాగవత కల్ప శాఖియొక్క మహాఫలం మోక్షసిద్ధి. అతిరహస్యమైన హరిజన్మకథల సమాహారం భాగవతం. ఇది తనకు నెలవని ఏరీతిగానూ పల్కటానికి వీలుగాని భగవంతుని ఆవాసం సుజనుల హృదయ భూమి. వారికి ఎటువంటి కష్టం వాటిల్లినా ఆ అనంతుడు అవతారాన్నితీసుకుంటాడు. ‘తదైక్షత బహుస్యాం ప్రజాయేతి’ (నేను అనేక మయ్యెదను గాక) అని ఏకమైన అద్వితీయ బ్రహ్మం సంకల్పించినట్లు శ్రీమన్నారాయణుడు తన ఇచ్ఛాశక్తి చేత అవతారాలను ధరిస్తూ భక్తులను కాపాడుతూ ఉంటాడు. దశావతారాల దాల్చిన హరి ఎన్ని పనులు చేశాడో చూడండి.

,p> వేదము లుద్ధరించి, గిరి వీపున మోసి, ధరన్ ధరించి, ప్ర
హ్లాదునిగాచి, నొంచిబలి, హైహయవంశజులన్ వధించి,వి
చ్ఛేదమొనర్చి రావణుని, చే హరిమూని,కృపాబ్ధినించి,మ్లే
చ్చాదుల మూర్ఛ ముంచియు దశాకృతి బొల్చిన కృష్ణు మ్రొక్కెదన్.
దినావసానంలో బ్రహ్మ నిద్రకు లోనై తన్ముఖోద్దిష్టాలైన ప్రామిన్కులను జారవిడుచుకొని అయోమయానికి లోనైనాడు. చివరకు శ్రీమన్నారాయణుని శరణు వేడుకొన్నాడు. ఆ వేదాలను అప్పటికే సోమకాసురుడనే దైత్యుడు హరించినాడు. చతుర్ముఖుని మొర విని కేశవుడు మీన శరీరాన్ని ధరించి, సోమకుని త్రుంచి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించి, పునస్సర్గకు కారణభూతు డైనాడు. ఇది మత్స్యావతారకథ. ఇందులో వ్యాసభగవానుడు అంతర్లీనంగా పండించిన భాగవతత్త్వం గమనిద్దాం.

భయంకరమైన క్లిష్టసమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రతివ్యక్తి బ్రహ్మదేవునివలె లయస్థితికి లోనవుతాడు. నిద్ర సర్వానర్థాలకు కారణం. అట్టి నిద్రలో వ్యక్తి జ్ఞానాన్ని (వేదములు = విద్ = జ్ఞానే; వేద మనగా జ్ఞానము) కొల్పోతాడు. ఆ క్షణంనుండి బ్రతుకు అంధకార బంధురమే. మాయ అనే చీకటి దట్టంగా కమ్ముకొని దిక్కుతోచని స్థితిని కల్పిస్తుంది. అప్పుడైనా మానవుడు మాధవుణ్ణి ఆశ్రయించాలి. ‘దిక్కే నీవు నాకు దిక్కే కృష్ణా’ యని దీనుడై ధ్యానమగ్నుడు కావాలి. మణులున్న గుట్టలో వెదకిన వానికి మణి లభించినట్ల, సకల శుభలక్షణుడైన విష్ణువును ధ్యానించి మరల పోగొట్టుకున్న జ్ఞానధనాన్ని కైవసం చేసుకొన తురీయ పురుషార్థప్రాప్తి పొందాలని ఈ అవతారం బోదిస్తున్నది.

అగ్ని ఒక్కటే అయినా వివిధ దారుసంపర్కాలవల్ల నానా విధాలుగా తోచునట్లు, విశ్వాత్ముడగు పరమపురుషుడు కార్య కారణ రూపమైన మాయతో కలసి అనేకరూపాలను గైకొన్నట్లు కనిపిస్తాడు. ఆ విధంగా స్వీకరించిన మరొక తిర్యగవతారం కూర్మం.

అమృతప్రాప్తికై సురాసుర లందరూ కలిసి క్షీరసాగరం సమీపించినారు. సాగరమథనం సామాన్యమా? మంధరాన్ని కవ్వంగా చేసికొన్నారు. వాసుకి సర్పాన్ని ఆ పర్వతానికి చుట్టినారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు పట్టుకొన్నారు. అయితే సముద్రంలోపల మునిగిపోతున్న మంధరపర్వతాన్ని చూచి వేల్పులు చింతాక్రాంతు లైనారు. వనజాక్షుడు ఆ వార్థి నడుమ లక్ష యోజనాల పర్యంతమైన కర్పరంతో బ్రహ్మాండాన్నైనా మ్రింగివేయగల మఖగహ్వరంతో, సకల చరాచర జంతురాసుల మ్రింగి లోపలకు తీసుకోగల్గిన పెద్దకడుపుతో, విశ్వంమీద మరోవిశ్వం పడినా కదలని పటిష్టమైన పాదాలతో, బయటికి లోపలికి వెళ్ళగలిగిన తొండంతో, అంబుజాక్షాలతో ఒక మహా కమఠమైనాడు. ఆ అద్రిని వీపున మోస్తూ తరికడవకు కుదురువలె క్షీరసాగర మథనానికి తోడ్పడినాడు. ఆ మథనంలో అమృతం సిరిని ప్రాప్తించింది.

క్షీరసాగరం వలె ఆకర్షణీయమై మానవుని భ్రమింపజేస్తుంది సంసారం. అందులోని సారమెంత? ఏమిటి? అని విచారించి చూస్తే సంసారంలో సారం ఏమీలేదు. బాహ్యప్రపంచానికి అస్తిత్వాన్ని ఇచ్చేది జీవుని యొక్క అంతర ప్రపంచమే. అంతఃకరణంలో ఉండేదే బాహ్యంలో ఉంటుంది. అచ్చట ప్రతిఫలించని దానికి ఇచ్చట ఉనికి లేదు. అందుకే మంధరమనే నిశ్చయాత్మకమైన బుద్ధితో, క్షీరమనే సంశయాత్మకమైన మనస్సును, సద్వివేకమనే విచారణ రూపంగా మథనంచేయాలి. ఇదే సాధన. కాని నిరాలంబమైన సాధన కొనసాగుతుందా? అసాధ్యం. మనస్సు మాయలాడి. బుద్ధిని ముంచి సాధకుణ్ణి వశపరచుకొని పశుప్రాయుణ్ణి చేస్తుంది. అందుకే సాధనా ప్రారంభదశలో మనస్సుకు ఆలంబనగా నామ, రూప విశిష్టమైన భగవదవతారమైన మంత్రాన్ని గురుముఖంగా అందుకోవాలి. మనస్సులో నామాన్ని ప్రతిష్టించుకుంటే నామానికి నామికి భేదం ఉండదు. పవిత్రమైన పరమాత్మ యొక్క ఉనికి ఏర్పడి అమృతత్వ సాధనకు (మోక్షానికి) ఊత మౌతుంది.

ఆరంభదశలో సాధకునికి కలిగే విఘ్నాలు హాలాహలతుల్యాలు. ఎవని మనస్సులో ఇహమాత్రార్థ ఫలభోగ విరాగం, శమం, దమం, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం, నిత్యానిత్యవస్తు వివేకం, ముముక్షుత్వాలు ప్రబలంగా ఉంటాయో అతడే సాధనలో నిలవగలడు. పట్టువదలక సాధన కొనసాగిస్తే సాధకుణ్ణి ప్రలోభపెట్టడానికి క్షీరసాగరంలో ఐరావతాదులు పుట్టినట్లే వశీకరణాది శక్తులు అలవడుతాయి. అమిత సంపదలు కలుగుతాయి. వీటికి లోనైనవాని జీవితం తమోమయం అవుతుంది. కాబట్టి వీటిని కృష్ణార్పణం చేయాలి. శీలం విడనాడరాదు. చివరకు మిగిలేది అమృతం. మృతిలేనివారికి జననం ఉండదు. అనగా జన్మజరామరణరూప సంసారం హరమవుతుంది. బ్రతుకు హరిమయ మవుతుంది. సిరి యబ్బుట రాజస లక్షణం. దానిని తోసిరాజంటేనే సాధకునికి సత్త్వగుణ లక్షణం అబ్బుతుంది. సాత్త్వికగుణంవల్ల జ్ఞానం, దానివల్ల మోక్షం ప్రాప్తిస్తుంది.

అసురీప్రకృతిగల వారికి అమృతప్రాప్తి లేదు. వారు సాధనచేసినా మోహరూపమైన కామాది అరిషడ్వర్గాల ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. కావున దైవీప్కృతిని అలవర్చుకోవాలి. మనస్సులో మంథనమనే ధ్యానం కొనసాగునప్పుడు అది నిరాధారంగా ఉండడంచేత, మంధరపర్వతం అనేబుద్ధి, జలమనెడి భ్రాంతిలో మునిగిపోతూ ఉంటుంది. అట్టి దారుణ పరిస్థితుల్లో శ్రీహరిని ఆశ్రయిస్తే, ఆయన కూర్మరూపధారియై (భగవన్నామ మనెడి ఆధారం ద్వారా) మంథర పర్వతాన్ని (బుద్ధిని) సాగరం (సంసారం) లో మునిగిపోకుండా కాపాడుతాడు అని ఈ అవతారం సందేశమిస్తున్నది.

శ్రీహరి లీలావతారాలలో తరువాతిది వరాహావతారం. దితిపుత్రుడైన హిరణ్యాక్షుడు భుజా విజృంభణంతో క్ష్మాచక్రాన్ని చాపగా చుట్టుకొనిపోయినాడు. అచ్యుతుడు వరాహమై వసుంధర నుద్ధరించినాడు. అమరారి అమరవర్థనుణ్ణి ఎదిరించ నెంచి నారదుని సూచనమేరకు రసాతలానికి పోయినాడు. అచ్చట కువలయ భరణోద్ధాముడైన జలదశ్యాముడు కాంచనలోచనునకు కనిపించినాడు. భూమి తనకు బ్రహ్మవరంచేత లభించిందని, దాని కొనిపోరాదని ఆక్షేపించినాడు. యజ్ఞవరాహరూపంలో నున్న హరి తన బలంచేత భూమిని నీటి మధ్య నిలిపినాడు.

రోషభీషణాటోపాలతో తలపడే బెబ్బులల వలె హరి, దైత్యుడు పోరాడినారు. వరయోగీంద్రులు యోగమార్గంలో ఎవ్వనిని తమోభవహారానికై మనోవీధిలో సుస్థిరంగా నిలుపుకోవటానికి ప్రయత్నిస్తారో అట్టి అచ్యుతుని ముఖాంభోజాన్ని దర్శిస్తూ ఆ దితిపుత్రుడు హరిచేత చచ్చినాడు.

వర అనగా శ్రేష్ఠమైనదని, అహమనగా దినమని అర్థం.అనగా అది శుభదిన మని తాత్పర్యం. ఏది శుభదినం? మమకారం అంతరించినరోజు. అహంకారం అణగారిన రోజు. అసురీసంపద మూర్తీభవించిన జీవుడు హిరణ్యాక్షుడు. హిరణ్యమనగా బంగారు, అక్షియనగా కన్ను. అనగా సంపదమీద దృష్టి గలవాడు. ఎవనికి సంపదపై మమకారం ఉంటుందో అట్టి జీవుని అహంకారం గాలితోడైన అగ్నివలె విజృంభిస్తుంది.

పరిశుద్ధాంతఃకరణంలో మాత్రమే పరమాత్మ కనిపిస్తాడు. హిరణ్యాక్షుడే మమకారంలో కూరుకుపోయిన జీవుడు. అతనికి మోక్షం కలగాలంటే ఒక వరాహం రావాలి. ఆ శుభదినమే భగవంతుని వెదుక్కుంటూ వెళ్ళే రోజు. భవబంధాలు తెగిపోయే రోజు. సాధకునికి అహంకార, మమకారాలు ప్రతిబంధకా లని తెలియజెప్పటమే ఈ అవతార పరమార్థం.

హిరణ్యాక్షుని హరి వధించి నందుకు అతని సోదరుడు హిరణ్యకశిపుడు క్రుద్ధుడైనాడు. హరిని సంహరించాలని పంతం పూని పద్మసంభవునిచే వరం పొందినాడు. సకలభువనాలు హరికై గాలించినాడు. తన ప్రారబ్దం తీరే సమయం ఆసన్నమైంది. అతనికి సుజనమనోzహ్లాదకు డైన ప్రహ్లాదుడు పుత్రుడుగా జన్మించినాడు.

అనవరతం హరినామస్మరణతో పరవశచిత్తుడైన ప్రహ్లాదుడు తండ్రికి కొరకారానికొయ్యగా మారినాడు. తన కంటే దైవం వేరు లేడని హిరణ్యకశిపుడు విఱ్ఱవీగుచున్నాడు. తను హృద్భాషల హరి దప్ప అన్యమెరుగని ప్రహ్లాదుని హరిభక్తి మాన్పించటానికి అతడు పెట్టని హింస లేదు. చివరకు విసిగి ఎక్కుడున్నాడురా హరి? చూపించు మన్నాడు. ప్రహ్లాదుడు.
ఇందు గల డందు లేడను
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
దెందెంచు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!
అని “కలడంబోధి కలండు గాలి, ఈయా అననేల? విశ్వమంతా హరిమయం” అని నొక్కి వక్కాణించినాడు. ఆ బ్రహ్మతృణపర్యంతం వెలుగొందు హరిని హిరణ్యకశిపుడు స్తంభంలో చూపు మన్నాడు. ‘అభయం సర్వభూతేభ్యః దదాయ్యేతద్ర్వతం మమ’ అని ప్రతిన బూనిన భగవంతుడు నృసింహుడై స్తంభంనుండి బయలువెడలినాడు. హిరణ్యకశిపుని వక్షఃకవాటాన్ని కుఠార సదృశమైన నఖాలచేత వ్రయ్యలు చేసి ప్రహ్లాదుని రక్షించినాడు.

‘అహం బ్రహ్మzస్మి’ అను మహావాక్యంలోని ‘అహం’ శబ్దం అహంకార వాచ్యం కాదు.నేతి నేతి యని పంచకోశాదుల విచారించి పొందిన అంతఃకరణ విశిష్ట చైతన్యాన్నే ‘అహం’ శబ్దవాచ్యంగా గుర్తించాలి. అట్లు గుర్తించని సాధకుడు అహంకారియై భగవంతుడు తానే యను గర్వంతో కన్నుమిన్నుగానక మన్ను పాలగుచున్నాడు. అట్టి అహంకారికి ప్రతిరూపుడే హిరణ్యకశిపుడు. నిశ్చలభక్తి కలిగినవారి చేష్టలు అహంకారులకు గిట్టవు. అడుగడుగున ఆటంకములు సృష్టిస్తారు. భక్తిమార్గాన్ని వీడరాదని తెల్పుటయే ప్రహ్లాదతత్త్వం. దానికి ఫలం భగవత్సాక్షాత్కారం. అహంకార విదూరులైన వారికి సాక్షాన్మోక్షం. అట్లుకాని వారికి దండన జరుగు నని ప్రబోధించు అవతారమే ఈ నరసింహావతారం.

బలిదానమే బలమైన దానం. వర మిచ్చినవాడికి శిరమివ్వడం. ఇదే సంపూర్ణశరణాగతి. ఎవరు తమ శిరస్సును అనగా (తలపులను) శ్రీహరికి సమర్పిస్తారో వారు శ్రీహరి దివ్యపదాన్ని అనగా మోక్షాన్ని శిరాన ధరిస్తారు. ఇట్టి మహోన్నత తత్త్వప్రతిపాదకమైన అవతారమే వామనావతారం. మహతో మహీయః రూపుడైన హరి వామనుడై యాచనకు పూనుకున్నాడు. ఇచ్చేవాడు మహాదాత బలి. వరచేలంబులో, మాడలో, కరులో, వామాక్షులో, అశ్వంబులో, ధరణీఖండమో, ఏదికావాలో కోరుకొమ్మన్నాడు. కాని, మూడడుగులు చాలన్నాడు వామనుడు. ఆ మూడు ఏమని చెప్పగలం? గుణరహితుడు కనుక సత్త్వరజస్తమోగుణా లందామా? దేహత్రయ (స్థూల సూక్ష్మ కారణ) అతీతుడు కనుక దేహాభిమానం అడిగాడా? దార, ధన, పుత్ర, యను ఈషణత్రయమును కోరెనా?

చతుర్దశ భువనాలను కుక్షిలో నిడుకొన్నవాడు, మూడుఅడుగుల నేల యాచించడమా? అది వింతల్లో వింత. పరమాత్ముని వన్నీ పరమాద్భుత చర్యలే, లీలలే. పుట్టి నేర్చుకొన్నాడో, పుట్టక నేర్చుకొన్నాడో నేరుపులన్నీ నేర్చిన ఆ పుట్టుక లేనివాడు. బలి శిరస్సు వంచి ప్రణమిల్లగానే తన నిజస్వరూపం చూపినాడు. పసిబిడ్డలతో తండ్రులు ఆడుకొనేటప్పుడు తాము కూడా పసివారైపోతారు. పసిబిడ్డ తండ్రిప్రేమకు పాత్రుడై మురిసిపోతాడు. భువన సంసారికి ఎందరు పిల్లలో?

ఇక భూమికి భారమై యున్న అనేకుల్ని సంహరించి సమాజశరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం పరశురామావతార పరమార్థం.

‘రామోవిగ్రహవాన్ధర్మః’ అన్న ధర్మరూపమే రామావతారం. సీత అనగా మనస్సు. అది బహిర్ముఖమై కాంచనం మీదకి మళ్ళింది. ఉనికే లేని బంగారుజింకను కోరుకొనింది. అందువల్ల రామునికి దూరమై దశేంద్రియా లనబడే దశకంఠునికి బందీ అయ్యింది. ఇంద్రియ వశమైన మనస్సుకు దుఃఖమే మిగులుతుంది. అందుకే అశోకవనంలో శోకం. అదే శ్రీరామ నిరీక్షణా ధ్యానం. ఏ భక్తులేతే ఇంద్రియ సుఖాలు విషతుల్యాలు రాక్షస సమాలని వివేకం కలిగి భగవంతుని గూర్చి అనన్యభక్తితో ధ్యానిస్తారో వారిని ఆయన విస్మరించడు.

దూరమైన మనస్సు ఆత్మలో కలిసినప్పుడే జీవునికి నిత్యానందం. అది బ్రహ్మచర్యంవల్ల సాధ్యం. అందుకే బ్రహ్మచారి యైన హనుమంతుని సాహచర్యం రామునకు అవసర మయ్యింది. బ్రహ్మచర్యం మనస్సును (సీతను) గుర్తించి పట్టుకోగలదు.

రాముడు పరమాత్మ. అనగా జ్ఞానం. రావణుడు అజ్ఞానం. వెలుతురు రాగానే చీకటి తొలగినట్లు రామ ప్రవేశంతో రావణ నిష్క్రమణం జరిగింది. అజ్ఞానం నశించగానే సీత యనే మనస్సు రాముడనే పరమాత్మలో కలసిపోతుంది. ఇక అయోధ్య అనెడి హృదయంలో రామప్రతిష్ఠాపనే పట్టాభిషేకం. అదే జీవ బ్రహ్మైక్యం.

ధేనుకు డను రాక్షసుడు కేవల దేహాభిమాని. స్వార్థజీవి. తాళవన మాక్రమించుకొని దానిలోనికి ఎవ్వరిని రానీక ఫలములను తానే అనుభవిస్తూ ఉన్నాడు. బలవంతు డని విర్రవీగువారలకు బలమైన దేవుడు బలదేవుడు. సరైన సమయంలో వచ్చి శిక్షిస్తాడు.

మానవజీవనపోరాటమే మల్లయుద్ధభూమి. దాని కధిపతి అజ్ఞానమనే కంసుడు. మనం జయించవలసిన మల్లయోధులు చాణూర ముష్టికులే, వారే కామ క్రోధాలు. ప్రేమచేత కామాన్ని జయించాలి. అందుకే ప్రేమస్వరూపమైన కృష్ణుడు కామ ప్రతీకమైన చాణూరుణ్ణి చంపినాడు. దైవబలంచే క్రోధాన్ని జయించాలి. అందుకే బలదేవుడు క్రోధానికి ప్రతీక యైన ముష్టికుని వధించినాడు.

అట్టి బలభద్రునికి సోదరుడుగా జన్మించి సంపూర్ణావతారంగా వెలుగొందిన కృష్ణుని జీవితం మహిమాన్వితం. ఆయన అనుచరులు నవవిధ భక్తిమార్గాలలో ఆశౌరిని కొలిచి తరించినారు. మిథ్యాభిమానానికి వశవర్తులైన గోపికల వలువలు హరించినాడు. కుచేలుని అటుకులకు అంతస్థు లిచ్చినాడు. యశోదకు బిడ్డడై వైష్ణవమాయను చూపించినాడు. అజ్ఞానానికి పరాకాష్ఠ యైన కంసుని వధించినాడు. అహంకారులైన శిశుపాల దంతవక్త్రులను దునుమాడినాడు. పాండవులను వెన్నంటి చీర లిచ్చినాడు. విజయునకు రథసారథ్యం వహించి చివరకు కర్తవ్యవిమూఢుడై యుండిన అర్జునునికి గీత బోధించినాడు. ఇట్లు సకల రూపులు తన రూపమైన ఆరూపరహితుని ఏ రూపంతో కొలవాలి? ఏ లీలను కొనియాడాలి?

జ్ఞాని బుద్ధుడు. సృష్టిలోని ప్రతిజీవి విరాట్ పురుషుని ప్రతిరూప మని జ్ఞాని ప్రగాఢ విశ్వాసం. అజ్ఞాన హననం అతని కర్తవ్యం.

శంబల గ్రామంలో విష్ణుడనే బ్రాహ్మణునకు భగవంతుడు కల్కి మూర్తియై జన్మించి ధర్మసంస్థాపన చేస్తాడు.

తాను సృష్టించిన ప్రతిజీవి తనకు ప్రియమైనదే అని చెప్పుటకే భగవంతుడు వివిధములైన అవతారాలు ధరించినాడు. ఈ దశావతార తత్త్వాన్ని మానవులు గుర్తించి మనుగడ సాగిస్తే భాగవత పరమార్థమైన భవరాహిత్యాన్ని పొందగలరు.