పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : అనన్య శరణాగతి - గజేంద్రుని వినతి

పాంచభౌతిక దేహం గలవాడు మానవుడు. అతని శరీరం దశేంద్రియాలతో కూడుకొన్నది. ఇంద్రియాలమీద మనసుకు ఆధిపత్యం ఉంటుంది. ఈ ఇంద్రియ వ్యామోహంలోపడి కొన్ని జీవులు కాదు, కాదు, అన్నిజీవులు ఇంద్రియ లంపటత్వానికి గురై మరణించేవే. రూపానికి ఆకర్షితమై మిడుత, శబ్దానికి ఆకర్షితమై జింక, స్పర్శకు ఆకర్షితమై ఏనుగు, రసనకు ఆకర్షితమై చేప, గంథానికి ఆకర్షితమై తుమ్మెద మరణిస్తున్నాయి. ఒక్కొక్క ఇంద్రియ ప్రభావానికే ఈ జీవులిలా నాశనమైపోతూంటే మరి మానవుడు పంచేంద్రియ వివశుడై నాశనం కాకుండా ఎలా మనగలడు? వీటి నుంచి ఎలా విడుదల పొందగలడు. కైవల్యపదాన్ని ఎలా పొందగలడు? దుఃఖం నుంచి ఎలా విముక్తిని పొందగలడు?
విముక్తిని పొందుటయే మోక్షం. ఇది ‘ముంచ్’ అనే ధాతువునుండి పుట్టింది. దీనికి ‘విడివడుట’ అని అర్ధం. అతిసాధారణమైన చిన్నచిన్న బాధలనుండి బయటపడినపుడు వ్యావహారికంగా ‘మోక్షం లభించిందని’ అంటాం. కాని మోక్షమన్న పదానికి ఉన్న విస్తృతి వేరు. భాగవతంలో పోతన ప్రారంభ పద్యంలో ‘శ్రీకైవల్య పదంబు చేరుటకునై’ నందంగనా డింభకుని ప్రార్థన చేసినాడు. ఆ కైవల్యం మోక్షానికి పర్యాయమే కాని; స్వర్గాది భోగలోకములకు సంబంధించినది కాదు. భగవద్గీతలో భగవంతుడు ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నాడు. పుణ్యక్షయంతో మళ్ళీ మర్త్యలోక జన్మ వస్తుందని ఈ మాటకు అర్థం. అనగా స్వర్గాది లోకాలు పునరావృత్తి సహితమైనవి. మోక్షం పునరావృత్తి రహిత మైంది. మోక్షాన్ని పొందినవారికి ఆగామి, సంచిత, ప్రారబ్ద కర్మలు ఉండవు. అందువల్ల కర్మ భోక్తృత్వ / కర్తృత్వ / కారణమైన జన్మ రాదు. కావున మరణం లేదు. అదియే మోక్షం. ‘నే పలికిన భవహర మగునట’ అని పోతన అనడంలో పరమార్థం ఇదే. భవహరమే మోక్షం. భగవంతుని చేరుటకు ఒకే ఒక మార్గముందని శ్రుతులు ఘోషిస్తున్నాయి. అది జ్ఞానోదయం, అనగా అజ్ఞాన నివృత్తి. ‘జ్ఞానా దేవతు కైవల్యం’ అని ఉపనిషద్వాణి హెచ్చరిస్తూ ఉంది. మరి జగన్మిధ్యత్వము, బ్రహ్మ సత్యత్వముల అపరోక్షజ్ఞానం కలగాలంటే నిర్మలాంతఃకరణ సాధనకు సామగ్రులు అనేకం ఉన్నాయి. అయితే ‘మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ’ అని ఋషివాక్యం. అట్టి భక్తిని ప్రబోధించు గ్రంథం భాగవతం. ఈ భావాన్ని ప్రదీప్తం చేయటానికే ప్రతీకాత్మకంగా భాగవతంలో గజేంద్రమోక్షణ కథ చెప్పబడింది. ఒక ఏనుగు దారితప్పి, దప్పిగొని నీటికై ఒక కొలను చేరుతుంది. దాహం తీర్చుకొని ఇంటి ముఖం పట్టక అక్కడే జలక్రీడల్లో నిమగ్నమవుతుంది. ఇంతలో ఒక మొసలి వచ్చి ఏనుగు కాలు పట్టుకొంటుంది.దాని పట్టునుండి విడిపించుకోవడానికి స్వశక్తి వల్ల కలిగిన గర్వంతో చాలా కాలం పోరాడుతుంది. రోజురోజుకు బలం క్షీణిస్తుంది. స్వస్థానబలంచేత మొసలిబలం పెరుగుతుంది. నిస్సహాయస్థితిలో పూర్వపుణ్య పరిపక్వం వలన రక్షించు మని దైవాన్ని ప్రార్థిస్తుంది. కొంతసేపు భగవంతుని అస్తిత్వాన్ని గూర్చి ‘కలడు కలం డనెడువాడు కలడో లేడో ‘ అనుకుంటుంది. చివరకు శరణాగత భావంతో ‘నీవేతప్ప నితఃపరం బెరుగ’ నని మొరపెట్టుకోగా శ్రీహరివచ్చి తన చక్రధారతో మొసలిని ఖండించి కరిని రక్షిస్తాడు. ఇది కథా సారాంశం.
కానీ కథను జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక సూక్ష్మాంశాలు పాఠకుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తూ కనిపిస్తాయి. భక్తిముఖంగా మనల్ని నడపడానికి భాగవత పురాణం ఎట్టి ప్రాతిపదికలు వేసిందో అర్థమవుతుంది.
జంతువులు కూడా భక్తి, ముక్తి, జ్ఞానాదులతో మెలగుతా యన్న సత్యానికి ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మాహత్యం, చిన్నయసూరి నీతిచంద్రిక వగైరాలు సాక్ష్యాలై నిలుస్తున్నాయి. శరణాగత భక్త కోటిలో కాకాసురుడు, విభీషణుడు, ద్రౌపది, గజేంద్రులను వేదాంత దేశికులవారు తన నాలాయిర దివ్యప్రబంధంలో పేర్కొంటారు. ఉత్తరోత్తరం బలీయ మన్న న్యాయాన్ని అనుసరించి గజరాజు అగ్రశ్రేణి భక్తికి చెందుతాడు. ఈ కథ ఇంటింటి కథ. ఇందులో వినవచ్చేది సంసారమొర. దాని వెనక నిరంతరాయంగా సాగే సర్వజీవుల వేదన ఉంది. ఒక్కొక్కమారు మన చర్యలు మన అధీనంలో ఉండవు. మరేదో అజ్ఞాతశక్తి మనల్ని నడుపుతున్నదా? అన్నట్లు పరిస్థితులు తయారవుతుంటాయి. ఇక్కడ మగ ఏను గొకటి ఆడఏనుగుల కూటమినుండి వేరై దారి తప్పింది. దీనికి కారణం ‘ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు కాకుండుట‘ లేకుంటే ప్రమాదానికి లోనై యుండేది కాదని కవి చెప్పక చెప్పినట్లయింది.దీనికి పోషకంగా ఆడయేనుగుల కంటే మగఏనుగు; అంతకంటే మడుగు, సౌందర్యాతిశయంగా ఉన్నట్లు కవి వర్ణించాడు. సొగసులకు లొంగినవాడు కోరి ప్రమాదాన్ని నెత్తికెత్తుకున్నట్లే అనుట గర్భితార్థం. గజేంద్రుడు పశువు. స్తుతించే నోరులేదు. కాబట్టి సంస్కృత భాగవతం జపించిందంటూ పేర్కొంది. (జజాపపరమం జాప్యం) అందుకే గజేంద్ర స్తుతి పాఠానికి ‘పరమజాప్యం’ అనికూడాపేరు.
కాశీ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులైన మదనమోహన మాలవ్యగారి తండ్రి మహామనామాలవ్యాగారు పూనా ఆగాఖాన్ మందిరంలో పదకొండురోజులు గాంధీగారికి శ్రీమద్భాగవతం వినిపించారు. “ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవరు ఆర్తభావంతో ప్రత్యూషకాలంలో పఠనంచేస్తాడో వాడు సమస్త సంకటాలనుండి విడివడుతాడు. ఋణబాధలనుండి విముక్తుడవుతాడు. ఇది నా అనుభవం. అని వారు పేర్కొన్నారు.’

గీతాసహస్రనామైవ
స్తవరాజోహ్యనుస్మృతిః
గజేంద్ర మోక్షణం చైవ
పంచరత్నాని భారతే ॥

భగవద్గీత, విష్ణుసహస్రనామ స్తోత్రం, భీష్మ స్వరాజం, అనుస్మృతి, గజేంద్రమోక్షం - అనే ఈ ఐదు మహాభారత సముద్రంలోని పంచరత్నాలు. విషయవస్తు వొక్కటే అయినా భాగవతంలోని గజేంద్రమోక్షానికి, భారతంలోని గజేంద్రమోక్షానికి కథలో కొంత భేదముంది. భాగవత గజేంద్రమోక్షమే దేశంలో ఎక్కువ వ్యాప్తిని, యశస్సును సంపాదించింది.
గ్రహించట కాని వదలటం తెలియంది ‘గ్రాహం’ అనగా మొసలి. ఈ కథలో సార్థకనామం. గజేంద్రుని కాళ్ళు, కడుపు, కళ్ళు, కుంభస్థలాలతోపాటు కాస్త తొండం మిగిలితే దాంతోనే దగ్గరలో ఉన్న ఒక పుష్పాన్ని పట్టుకొని పైకెత్తి “నీవేతప్ప నితఃపరంబెరుగ” నంటూ ఆరాటపడింది. అల్లాడింది. చావుకు సమీపమైంది. శరణార్థిని నన్ను కావుమన్నది. మనం భగవంతునకు నిరహంకారముతో అర్పించే వస్తువు పూర్ణమవుతుంది. క్రమంగా కరి నిరహంకారమైన పిమ్మటే సాక్షాత్కారం లభించింది.
భగవద్గీత సూత్ర గ్రంథం. భాగవతం దృష్టాంత గ్రంథం. అందుకే దీన్ని ‘శ్రుణుత భాగవతం, పిబత భాగవతం’ అన్నారు. ‘శుకముఖ సుధాద్రవమున మొనసి యున్న భాగవత రసాస్వాద పదవి గనుడు రసిక భావవిదులు’ అంటాడు. పోతన్నమహాకవి.
పురంజనోపాఖ్యానంలో మృత్యువునకు ‘భయ’ మనే పేరు పెట్టబడింది. గజేంద్రు డెంత పెద్దవాడైనా, మృత్యువు వానికంటే పెద్దది. తమోగుణం మనస్సును ఆవరించిన కాలమే తామస మన్వంతరం. అరభక్తి తమోగుణం, అర్థార్థి భక్తి రజోగుణం, జిజ్ఞాస భక్తి సత్త్వగుణం, జ్ఞానభక్తి త్రిగుణాతీతం - వీటికి క్రమంగా గజేంద్రుడు, ధ్రువుడు, ఉద్ధవుడు, ప్రహ్లాదుడు ఉదాహరణలుగా నిలుస్తారు.
మోహం అనే మొసలి గజేంద్రుని కాలు పట్టుకుంది. మహాప్రస్థానం (మరణం) కాళ్ళనుండి ప్రారంభ మవుతుంది. అంతం చూసేదాక వదలదు. వదిలించుకోలేక గజం సతమత మైంది. త్రికూటపర్వతం యొక్క మూడు శృంగాలూ త్రిగుణాలు. ఏనుగు అజ్ఞాన జీవులకు సంకేతం. ఏనుగులు పదివేల యోజన పర్యంత స్థలంలో విహరించా యట. భాగవతంలో ‘దశ’ శబ్దం ఎక్కడవచ్చినా జ్ఞాన కర్మేంద్రియాల పదింటికీ సంకేతం. ఈ ఇంద్రియాలతో చేరిన మనోవృత్తులు అనంతాలు. అందుకే ‘దశలక్షకోటి’ అని ఆడఏనుగులకు సంకేతం చెప్పబడింది.
‘కాంతమీది ఆశ, కనకంబుపై ఆశ లేనివాడు, పుడమి లేనివాడు’ అంటాడు వేమన. పుడమి లేడంటే చచ్చాడని అర్థం. కాముని గెలవనివాడు కాలున్ని గెలువలేడు. కామునితో దెబ్బతిన్నవాడు కాలునితో దెబ్బతినక తప్పదు. దెబ్బతిన్నా కొందరికి బుద్ధి రాదు. కాని గజేంద్రునికి బుద్ధి వచ్చింది. “పూర్వజన్మ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి” కాపాడింది. “నహికల్యాణ కృత్కచిత్ దుర్గతిం తాత గచ్ఛతి” (మంచిపనులు చేసేవాడు ఎప్పుడు దుర్గతులు పొందడు) అన్నట్లు పూర్వజన్మలో తాను చేస్తూ వచ్చిన స్తోత్రపాఠం ఈ జన్మలో జ్ఞాపకం వచ్చింది. అదే ‘పరమజాప్యం’ అనబడే గజేంద్రస్తోత్రం.
ఈ స్తోత్రం సంస్కృతంలో ఇరవై ఎనిమిది శ్లోకాలు. కాని పోతన మూలాన్ని విస్తరించి భావపారవశ్యంతో స్తుతించాడు.ఇక్కడ సూక్ష్మేక్షికతో చూసి నపుడు హరి తొలుత నక్రాన్ని చంపి మోక్షమిచ్చాడు. ఆపై గజేంద్రుని ఉద్ధరించాడు. అంటే భక్తుని కంటే ముందు భక్తుని పాదం పట్టుకున్నవానికే మోక్షం లభిస్తుంది. అందుకు ఈ గజేంద్రమోక్షమే తార్కాణం.
గజేంద్రమోక్ష కథ నాలుగు మన్వంతరాల క్రిందటిది. క్షీరసాగరంలో శ్వేతద్వీపం విష్ణునివాస స్థానం. ఆ సమీపవాసులు విష్ణువునకు నిత్యసన్నిహితులు. హూహూ అను గంధర్వుడు విష్ణుకీర్తనాపరుడు. అతనిని శపించిన దేవలుడు విష్ణుతత్త్వ మెరిగిన దేవర్షి. మకరం జలజంతువుల్లో విష్ణుస్వరూపం. గజరూపి యైన ఇంద్రద్యుమ్నుడు వైష్ణవ ముఖ్యుడు. ఇతనిని శపించిన అగస్త్యుడు శ్రీకృష్ణుని పరీక్షించిన మహర్షి. మకరిని ఖండించిన సుదర్శనము విష్ణువు పంచాయుధాల్లో ముఖ్యమైంది. వెంటవచ్చిన సిరి వైష్ణవీపీఠం. వారి వెంట వచ్చిన పక్షీంద్రుడు విష్ణుభక్తాగ్రగణ్యుడు. ఈ విధంగా కథంతా విష్ణుమయమే. అందుకే “హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు” అని పోతన అంటాడు.
త్రికూటంపై సహస్రారం ఉంది. అది పరమాత్మ స్థానం. త్రిగుణాత్ముకు డైన జీవుడు త్రికూటస్థుడు. పరమాత్మ కంటే ఒక మెట్టు క్రిందుగా ఉన్నాడు. జీవుడు ఊర్ధ్వగతు డైతే ఈశ్వరుని సులభంగా చేరుకోగలడు. కాని అత డెప్పుడూ అధోగతుడై సంసారంలో చిక్కి మొరపెడుతుంటాడు. బాల్యంలో నిష్కల్మషుడైన వాడు యవ్వనంలో కామాసక్తుడై తృష్ణకు లోనవుతాడు. తృష్ణ తీర్చుకోవడం తప్పు కాదు గాని కామరూప సరస్సులోనే విహరించ గోరడం బంధానికి కారణమవుతుంది. జీవుని కామమే తృష్ణ.అదే బంధం. బంధితునికే మోక్షం అవసరం. జీవన్ముక్తిని పొందినవానికి ఎందుకు? అందుకే గజేంద్రుని కామలీలతో కథ ప్రారంభమైంది.
శృంగారానికి ఉద్దీపన విభావం వసంతం. వసంతం చైత్రంనుండి వచ్చినా దాని సూచన మకర సంక్రమణంతోనే ప్రారంభ మవుతుంది. వర్షారంభం మకరాది జలజంతువులకు హర్షారంభాన్ని ఇస్తుంది. ‘మత్తేభయూధంబు మడుగు సొచ్చె’ నన్న పోతన తరువాత కథకు ఎక్కువ మత్తేభ విక్రీడిత పద్యాలను ఎన్నుకొన్నాడు. శ్రీహరి హృదయాంత రంగమంతా మత్తేభమయ మని చెప్పటానికి. ఇది పోతన వేసిన ఎత్తుగడ. ఇలా ఔచితీ భరితమైన ఛందోవిన్యాసాన్ని ప్రదర్శించినాడు. ఓ కమలాక్ష ఓ వరద——- యను ఉత్పలంతో వరదుణ్ణి కరిచేత అర్చింప జేసినాడు. సరస్సులో ఉత్పలాలేగాని చంపకా లుండవు గదా.
సంపూర్ణ విశ్వాసం జ్ఞానానికి భూమిక. దాన్ని ద్యోతకంచేస్తూ ఇరవై రెండు పద్యాల్లో భగవంతుడు గుర్తురాని కరిపోరాటాన్ని వర్ణించాడు. ఇక భగవంతుడే శరణ్య మనుకొని 18 పద్యాల్లో కరిని దరికి, మకరిని సరసిక్ పెనుగులాడించాడు. నీవే తప్ప నితఃపరం బెరుంగ ననడంలో కర్తృత్వం, తత్కారణమైన అహంకారం సున్న కాగా తరువాత భగవత్సాక్షాత్కారమే। ఆ తర్వాత కథే ముంటుంది?
పోతన కాళిదాసువలె ఉపమాలంకారాన్ని పోషించినాడు. అవి కథాదీప్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. ‘భాను కబళించి పట్టు స్వరాభాను పగిది, ఒక్క మకరేంద్రు డిభరాజు నొడిసి పట్టె’ నన్నాడు. ఇచ్చట భాను డనగా సూర్యుడు, దేవుడు, సాధువు, ప్రకాశమానుడు, బృహత్ శరీరుడు, స్వర్భానుడు అనగా రాహువు, రాక్షసుడు, క్రూరుడు, తమోగ్రహం, అల్పశరీరి. ఏనుగు -సాధువై, తెలివైన, పెద్ద జంతువు. మొసలి -క్రూరమైన, మొరటుతనం కల, చిన్నజంతువు. రాహువు, సూర్యుణ్ణి పీడించి విడుస్తాడే గాని ప్రాణా లపహరింపడు. మకరంకూడా గజరాజు విషయంలో అంతే. రాహువు విష్ణుచక్రంచే ఖండింపబడటం, ఇక్కడ చక్రంతో ఖండింపబడటం మంచి సామ్యం. ‘డస్సె మత్తేభ మల్లంబు, బహుళపక్ష శీత భానుపగిది’ అని, తమముం బాసిన ‘రోహిణీ విభు’ క్రియన్ దర్పించి అని చంద్రునితో పోల్చాడు. భాను, శీతభాను లిరువురకూ స్వర్భానువు శత్రువే. శీతభానుడు షోడశకళాత్మకుడు. అమావాస్య నాటికి పౌర్ణమి నాటినుండి ఒక్కొక్క కళ కోల్పోయి ఒకే కళతో మిగిలి కోలుకుంటాడు. గజేంద్రుడు కూడా మకరి రక్తపానంచే సమస్త దేహబలం కోల్పోయి ఒకే ఒక ఆత్మబలంతో మిగిలినాడు. దాంతోనే బలంపుంజుకోవాలి. ‘పాదద్వంద్వము నేలమోపి…..’ అనే పద్యంలో “నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్రమై” అన్నాడు. రేఫ పునరుక్తి. రేఫను క్రార అని కూడ అంటాం. క్రార అంటే క్రయ్యు నట్టి రేఫం. క్రయ్యుట అనగా కలియబడుట. రేఫ చిహ్నం ఏ అక్షరంతో కలసినా దాని అధోభాగాన్నంతా ఆక్రమిస్తుంది. అట్లే నక్రం కూడా గజపాదాన్ని క్రారవలె ఆక్రమించిందని పోతన సూచన చేసినాడు.
యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. దాన్ని సౌమ్యం - హఠం అని రెండు విధాలా సాధించవచ్చు. సామాన్య యోగి (సౌమ్య) తన గుణసంపదచే ముక్తికాంత తన యొద్దకే వచ్చేటట్లు నడచుకొంటాడు. హఠయోగి బలవంతంగా తానే ఆమెను వెన్నాడుతాడు. ఇట మకరి పంచేంద్రియాల బంధించిన హఠయోగికి ప్రతీక. ఒక్కమారు యోగి బ్రహ్మానందంలో మునిగితే, బాహ్యాన్ని విస్మరిస్తాడు. ఇక్కడ మొసలి ఏనుగు కాలినుండి కారుతున్న రక్తాన్ని తనివితీరా త్రాగుతూ ఆ ఆనందంలో మునిగి ఉంది.
ఇందొక దివ్యోపదేశం కూడా ఉందనిపిస్తుంది. ‘బుద్ధి లతకున్ మారాకు’ హత్తించాడట గజేంద్రుడు. ఇచ్చట ‘గూఢపదం’ అనే చిత్రకవిత్వ ప్రక్రియద్వారా ‘మా’ను ‘రా’ కు హత్తించు మన్నాడు. అప్పుడు అది ‘రామ’ అవుతుంది.
‘రామ’ పదం ఆనంద ద్యోతకం, యోగికి సద్యఃఫలం ఆనందం. యోగులు పవనుణ్ణి అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను బంధించి, పంచేంద్రియోన్మాదం ఖండించిన తర్వాత బుద్ధిలో రామతత్త్వాన్ని హత్తించుకొని ఆనందాన్ని పొందుతారనే యోగసాధన రహస్యం అమర్చబడి ఉంది. పోతన రామభక్తుడు కనుక సాధకుల కిది ప్రతిలోమ దివ్యోపదేశం.
‘రావే యీశ్వరా।‘ అని గజేంద్రుడు పిలిచాడు. వైకుంఠంలో ఉద్యానవనంలో లక్ష్మీదేవితో సరసమాడుతున్న హరికి మొర వినిపించింది. అంటే కొలతలేస్తూ వెళ్ళేవారికి వేలమైళ్ళలో ఉండే వైకుంఠం, కోరిపిలిచిన భక్తులకు మాత్రం ‘కూతవేటు’ దూరంలోనే ఉంటుందని అర్ధం. ఇంతకీ వైకుంఠం ఎక్కడ ఉంది అంటే మనం నివసించే భూమండలానికి పైన వాయుమండలం, దానిపైన మేఘమండలం, ఆపైన మేరువు, ఆపైన గంగ, ఆపైన నందనోద్యానం, ఆ పైన వైకుంఠం ఉన్నాయి. అక్కడనించి విష్ణువు బయలుదేరి నందనోద్యానం చేరగానే తుమ్మెదలు, గంగదరికి రాగానే గండుమీనులు, మేరుపర్వతం చేరగానే చిలుకలు, మేఘాల సమీపానికి రాగానే మెరుపుతీగలు, వాయుమండలానికి రాగా చక్రవాకాలు విష్ణువు వెంబడి వస్తున్న లక్ష్మిని చేరా యనడం అద్భుతమైన కల్పన. ఇంతటి రసాలవాలమైన గజేంద్ర మోక్షం ఫలశ్రుతిః

గజరాజ మోక్షమ్మును
నిజముగ పఠియించు నట్టి నియతాత్ములకున్
గజరాజ వరదు డిచ్చును
గజతురగ స్యందనములు కైవల్యంబున్।