పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెఱ పోతన చరిత్రము : బమ్మెఱ పోతన చరిత్రము - 4

పంచమస్కంధము— గంగన
సీ.
ధరణీశ! మాయచేతను దాఁటఁగారాని;
పదమునఁ బెట్టంగఁబడ్డ జీవుఁ
డెలమిమై గుణకర్మములఁ జేయుచును లాభ;
మాశించి తిరుగు బేహారి మాడ్కి
ఫల మపేక్షించుచుఁ బాయక జీవుండు;
సంసారగహన సంచారి యగుచు
ననవరతము నుండు నా మహావనమందుఁ;
గామ లోభాది తస్కరులుగూడి.
ధరణి విజితేంద్రియుఁడు గాని నరునిఁబట్టి
ధర్మ మనియెడి యా మహాధనమునెల్ల
నరసి గొనిపోవుచుండుదు రనుదినంబుఁ
గాన సంసారమందు నాకాంక్ష వలదు.

క.
అరయఁగ సంసారాటవిఁ
దరలక యా పుత్రమిత్ర దారాదు లనం
బరఁగుచు నుండెడు వృకములు
పరువడి నరబస్తములను భక్షించు వడిన్.

తరలము.
మలసి సంసృతి ఘోరకానన మందిరంబుల నెల్లనుం
జెలఁగి గుల్మలతాతృణాదులచేత గహ్వరమైన ని
శ్చలనికుంజములందు దుర్జన సంజ్ఞలంగల మక్షికం
బుల నిరోధము దన్ను సోఁకినఁ బొందుచుండు విపద్దశన్.

ఆ.
మఱియు నీ గృహస్థమార్గంబునం దెల్ల
విషయములను బొంది విశ్వమెల్లఁ
గడఁకతోడ నిట్లు గంధర్వలోకంబుఁ
గాఁ దలంచి మిగుల మోదమందు.

ఆ.
మరిగి కాననమునఁ గొఱవిదయ్యముఁ గాంచి
యగ్నిఁగోరి వెంట నరుగుమాడ్కిఁ
గాంచనంబు గోరి కలవారియిండ్ల పం
చలను దిరుగు నరుఁడు చలనమంది.

ఆ.
బహుకుటుంబి యగుచు బహుధనాపేక్షచే
నెండమావులఁగని యేగు మృగము
కరణిఁ బ్రేమఁజేసి గురువులు వాఱుచు
నొక్కచోట నిలువకుండు నెపుడు.

ఆ.
మఱియు నొక్కచోట మత్తుఁ డై పవన ర
జోహతాక్షుఁ డగుచుఁ జూపు దప్పి
దిక్కెఱుంగ కొండుదిశ కేగు పురుషుని
కరణిఁ దిరుగు నరుఁడు నరవరేణ్య!.

వీరభద్రవిజయము.
సీ.
కమలషండము నున్నఁగాఁ జేసి యిరుసుగాఁ;
గావించి కెందమ్మికండ్లఁ గూర్చి;
తగ నించు మోసుల నొగలుగాఁ గావించి;
కర మొప్పఁ గేదెఁగికాడి వెట్టి;
సంపెంగమొగ్గల చనుగొయ్య లొనరించి;
పల్లవంబులు మీఁదఁ బఱపుఁ జేసి;
చెలువైన పొగడదండలచేత బిగియించి;
యెలదీఁగె పలుపులు లీలఁ జొనిపి;
తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెన వెట్టి;
గండురాజకీరగములఁ గట్టి;
మెఱయ చిగురుగొడుగు మీనుటెక్కము గ్రాలఁ
దేరు బన్ని సురభి తెచ్చె నపుడు.

సీ.
ఖద్యోత బృందంబు గర్వింప వచ్చునే;
పరఁగ దేజః ప్రదీపంబుమీఁద;
పరఁగఁ దేజః ప్రదీపంబు శోభిల్లునే;
యాభీల ఘోర దావాగ్నిమీఁద;
ఆభీల ఘోర దావాగ్ని పెంపేర్చునే;
పవలింటి భానుబింబంబుమీఁద;
పవలింటి భానుబింబంబు వెలుంగనే;
ప్రళయకాలానల ప్రభలమీఁద;
ప్రళయకాలగ్ని కోటిచేఁ బ్రజ్వరిల్లు
మంటఁ గలకంఠఁ బరఁగు ముక్కంటిమీఁద
; వ్రాల నేరదు నీ పెంపు దూలుఁ గాని
జితజగజ్జనసంఘాత చిత్తజాత!”

మ.
బలభేద్యాది సురాళితోఁ బలుకు నా పంతంబు చెల్లింప ను
త్పలగంధీ తలఁపొందడె గాని యతఁ డీ బ్రహ్మాండభాడావళల్
కలఁగం జేయు సదాశివుం డని యెఱుంగం జాలుదుం జాలునే
కలకంఠీరవ! కంబుకంఠి! శివు వక్కాణింప నిం కేటికిన్.

శా.
ఏరా దక్ష! యదక్షమానస! వృథా యీ దూషణం బేలరా?
యోరీ పాపము లెల్లఁ బో విడువరా; యుగ్రాక్షుఁ జేపట్టరా;
వైరం బొప్పదురా; శివుం వలఁపరా వర్ణింపరా; రాజితో
త్కారాతుం డగు నీలకంఠుఁ దెగడంగా రాదురా; దుర్మతీ!

సీ.
కలయ నీరేడులోకముల దొంతులతోడఁ;
బాగొప్ప మూఁడు రూపములతోడ;
మూఁడు మంత్రములతో మూఁడు కాలములతో;
భ్రమయించు పుణ్యపాపములతోడ;
సలలిత ఖేచరాచర జంతుకోటితో;
భూరితేజములతో భూతితోడఁ;
జంద్రానలావనీ జల వాయు గగనాత్మ
తరణులతోడఁ; జిత్రములతోడ;
భర్గదివ్యమహిమ బ్రహ్మాండములు సేయుఁ
గాచు నడఁచుఁ గాని కానరాదు
నిఖిల మెల్లఁ దాన నీవును నేనును
దాన కాన నింద దగదు సేయ.

ఉ.

ఒండొరు సుందరాంబువుల నోలి మునింగియుఁ దేలి తెప్ప లై
యొండొరుఁ బాయ లే కునికి నున్మదు లై నిజ బోధ వీథి నొం
డొండన దెప్ప లై గుణగణోన్నతి కూటమిఁ జేర్చి శంభుఁ డా
కొండలరాజుకూఁతునకుఁ గూరిమి నిట్లనియెన్ బ్రసన్నుఁ డై.

శా.
ఓ వామేక్షణ! యో కురంగనయనా! యో కాంత! నీ యిష్టమై
నీవా నన్నును నేలుకొంటివి సతీ నీ వాఁడ నే నైతి ని
చ్చో వద్దింకను నంది నెక్కి గడఁకన్ శోభిల్లగాఁ బ్రీతితో
రావే పోదము వెండికొండకు మనోరాగంబుతోఁ గన్యకా!

భాగవతము – భీభత్సము
శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

భాగవతము—భక్తి
శా.
అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.

సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే?
; ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;.
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.

సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;.
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.

సీ.
సంసారజీమూత సంఘంబు విచ్చునే? ;
చక్రిదాస్యప్రభంజనము లేక;
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక;
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే? ;
హరిమనీషా బడబాగ్ని లేక;
ఘనవిప ద్గాఢాంధకారంబు లడగునే? ;
పద్మాక్షునుతి రవిప్రభలు లేక;.
నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంజనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర.

భాగవతము — శృంగారము.
శా.
శ్రీకంఠా! నిను నీవ యేమఱకు మీ చిత్తంబు రంజించెదన్;
నాకద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం
తాకారంబు జగద్విమోహనము నీకై చూచెదేఁ జూపెదం;
గైకో నర్హము లండ్రు కాముకులు సంకల్పప్రభావంబులన్.

సీ.
ఒక యెలదోటఁలోనొకవీథి నొకనీడఁ;
గుచకుంభముల మీఁదఁ గొంగు దలఁగఁ
గబరికాబంధంబుఁ గంపింప నుదుటిపైఁ;
జికురజాలంబులు చిక్కుపడఁగ
ననుమానమై మధ్య మల్లాడఁ జెక్కులఁ;
గర్ణకుండల కాంతి గంతు లిడఁగ
నారోహభరమున నడుగులుఁ దడఁబడ;
దృగ్దీప్తి సంఘంబు దిశలఁ గప్ప
వామకరమున జాఱిన వలువఁ బట్టి
కనక నూపుర యుగళంబు గల్లనంగఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ
బంతిచే నాడు ప్రాయంపుటింతిఁ గనియె.

శా.
ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము
న్నే కల్పంబుల యందుఁ గాన; మజుఁ డీ యింతిన్ సృజింపంగఁ దా
లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరఁగా
నే కాంతుండుఁ గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?.

ఆ.
వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల
శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి
తఱలి యెఱుకలేక మఱచె గుణంబు
ల నాలి మఱచె నిజగణాలి మఱచె.

ఆ.
ఎగురవైచి పట్ట నెడలేమి చే దప్పి
వ్రాలు బంతి గొనఁగ వచ్చునెడను
బడతి వలువ వీడి పడియె మారుతహతిఁ
జంద్రధరుని మనము సంచలింప.

మ.
రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్ రోమాంచ విభ్రాజితం
గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల
త్కచ బంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దనకాంత చూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్..

ఆ.
పదము చేరవచ్చు ఫాలక్షుఁ బొడగని
చీర వీడిపడిన సిగ్గుతోడ
మగువ నగుచుఁ దరుల మాటున డాఁగెను
వేల్పుఱేఁడు నబల వెంటఁ బడియె.

మ.
ప్రబలోద్యత్కరిణిం గరీంద్రుఁడు రమింపన్ వచ్చు లీలన్ శివుం
డబలా పోకుము పోకుమీ యనుచు డాయం బాఱి కెంగేలఁ ద
త్కబరీ బంధము పట్టి సంభ్రమముతోఁ గౌగిళ్ళ నోలార్చె నం
త బహిః ప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహునిర్ముక్త యై.

సీ.
వీడి వెన్నున నాడు వేణీభరంబుతో;
జఘన భారాగత శ్రాంతితోడ
మాయావధూటి యై మఱలిచూచుచుఁ బాఱు;
విష్ణు నద్భుతకర్ము వెంటఁదగిలి
యీశాను మరల జయించె మరుం డనఁ;
గరిణి వెన్కను కరి కరణిఁ దాల్చి
కొండలు నేఱులుఁ గొలఁకులు వనములు;
దాఁటి శంభుఁడు చనం దన్మహాత్ము.
నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ
బడిన చోటెల్ల వెండియుఁ బైడి యయ్యె
ధరణి వీర్యంబు పడఁ దన్నుఁదా నెఱింగి
దేవ మాయా జడత్వంబు దెలిసె హరుఁడు.

క.
జగదాత్మకుఁడగు శంభుఁడు
మగిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్
విగతత్రపుఁడై నిలిచెను
మగువతనం బుడిగి హరియు మగవాఁ డయ్యెన్.

ఆ.
కాము గెలువవచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపుటంపఱ గెలువంగ
వశము గాదు త్రిపురవైరి కైన.

సీ.
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని;
తరలి పోవంగఁ బాదములు రావు;
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని;
తక్కిన పనికి హస్తములు చొరవు;
నీ వాగమృతధార నిండఁ గ్రోలనె గాని;
చెవు లన్యభాషలఁ జేరి వినవు;
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని;
చూడ వన్యంబులఁ జూడ్కి కవలు;
నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ;
లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు
మా మనంబు లెల్ల మరపించి దొంగిలి
తేమి చేయువార మింకఁ? గృష్ణ!

చ.
సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్
సరసిజనేత్ర! మా తపము సంపదఁ జేరితి మెట్టకేలకున్
మరలఁగ లేము మా మగల మాటల నొల్లము; పద్మగంధముల్
మరగినతేఁటు లన్య కుసుమంబుల చెంతనుఁ జేరనేర్చునే?

ఆ.
సవతు లేక నీ విశాల వక్షఃస్థలిఁ
దొళసితోడఁ గూడఁ దోయజాక్ష!
మనుపు మనుచు నెపుడు మాకాంత నీ పాద
కమలరజముఁ గోరుఁ గాదె కృష్ణ!

ఉ.
అత్తలు మామలున్ వగవ నాఱడి కోడక నాథులన్ శుగా
యత్తులఁ జేసి యిల్వరుస లాఱడి పోవఁగ నీదు నవ్వులన్
మెత్తని మాటలన్ మరుఁడుమేల్కొని యేఁచిన వచ్చినార మే
పొత్తుల నొల్లమో పురుషభూషణ! దాస్యము లిచ్చి కావవే.

మ.
మగువల్ చిక్కరె తొల్లి వల్లభులకున్? మన్నించి తద్వల్లభుల్
మగపంతంబు తలంపరే? తగులముల్ మా పాలనే పుట్టెనే?
మగవారాడెడి మాటలే తగవు నీ మాటల్ మనోజాగ్నిచేఁ
బొగులం జాలము; కౌఁగలింపుము మముం బుణ్యంబు పుణ్యాత్మకా

ఉ.
కుండలదీప్త గండమును గుంచితకుంతల ఫాలమున్ సుధా
మండిత పల్లవాధరము మంజులహాస విలోకనంబునై
యుండెడు నీ ముఖంబుఁ గని యుండఁగ వచ్చునె? మన్మథేక్షు కో
దండ విముక్త బాణముల దాసుల మయ్యెద; మాదరింపవే.

సీ.
నీ యధరామృత నిర్ఝరంబులు నేడు;
చేరి వాతెఱలపైఁ జిలుకకున్న
నీ విశాలాంతర నిర్మలవక్షంబుఁ;
గుచకుట్మలంబులఁ గూర్పకున్న
నీ రమ్యతర హస్తనీరజాతంబులు;
చికురబంధంబులఁ జేర్పకున్న
నీ కృపాలోకన నివహంబు మెల్లన;
నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న.
నీ నవీన మాననీయ సల్లాపంబు
కర్ణరంధ్రదిశలఁ గప్పకున్న
నెట్లు బ్రతుకువార? మెందుఁ జేరెడువార?
మధిప! వినఁగఁ దగదె యాఁడుకుయులు.

మ.
భవదాలోకన హాస గీతజములై భాసిల్లు కామాగ్నులన్
భవదీయాధరపల్ల వామృతముచేఁ బాఁపం దగుం, బాఁపవే
ని వియోగానల హేతిసంహతులచే నీఱై, భవచ్చింతలన్
భవదంఘ్రిద్వయవీధిఁ బొందెదము నీ పాదంబులాన ప్రియా!.

క.
తరు మృగ ఖగ గో గణములు
కర మొప్పెడు నిన్నుఁ గన్నఁ గానము విన్నం
గరఁగి పులకించు, నబలలు
గరఁగరె నినుఁ గన్న నీదు గానము విన్నన్?.

సీ.
ఈ పంచబాణాగ్ని నేమిట నార్తుము;
నీ మంజువాగ్వృష్టి నెగడదేని?
నీ మన్మథాంభోధి నే త్రోవఁ గడతుము;
నీ దృష్టి నావ యై నిలువదేని?
నీ చిత్తజధ్వాంత మే జాడఁ జెఱుతుము;
నీ హాసచంద్రిక నిగుడదేని?
నీ దర్పకజ్వర మే భంగి నడఁతుము;
నీ నవాధరసుధ నింపవేని?.
నెట్లు నిర్వహింతు? మేలాగు మాలాగు;
కరుణ చేయ వేనిఁ గదియ వేని
మరుఁడు నిర్దయుండు మన నిచ్చునే? యశో
దా కుమార! యువతి ధైర్య చోర!.

సీ.
మానినీమన్మథు మాధవుఁ గానరే;
సలలితోదార వత్సకములార!
సలలితోదార వత్సక వైరిఁ గానరే;
సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే;
ఘనతర లసదశోకంబులార!
ఘనతర లసదశోకస్ఫూర్తిఁ గానరే;
నవ్య రుచిరకాంచనంబులార!.
నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే
గహనపదవిఁ గురవకంబులార!
గహనపదవి గురవక నివాసిఁ గానరే
గణికలార! చారుగణికలార!

సీ.
కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ;
మొనసి పాదాగ్రంబు మోపినాఁడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ;
దృణములోఁ దోపఁదు తెఱవ జాడ
ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాఁ డిక్కడఁ;
గూర్చున్న చొప్పిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మోవి యిచ్చినాఁ డిక్కడ;
వెలఁది నిక్కిన గతి విశదమయ్యె.
సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ
జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడఁ
ననఁగి పెనఁగియున్న యంద మొప్పె.

సీ.
ఒక యెలనాగ చెయ్యూఁదినాఁ డిక్కడ;
సరస నున్నవి నాల్గు చరణములును
నొక నీలవేణితో నొదిఁగినాఁ డిక్కడ;
మగ జాడలో నిదె మగువ జాడ
యొక లేమ మ్రొక్కిన నురివినాఁ డిక్కడ;
రమణి మ్రొక్కిన చొప్పు రమ్యమయ్యె
నొక యింతి కెదురుగా నొలసినాఁ డిక్కడ;
నన్యోన్యముఖములై యంఘ్రు లొప్పె.
నొకతె వెంటఁ దగుల నుండక యేగినాఁ
డడుగుమీఁదఁ దరుణి యడుగు లమరె
నబల లిరుగెలంకులందు రాఁ దిరిగినాఁ
డాఱు పదము లున్నవమ్మ! యిచట.

భాగవతము—వేదాంతము.
సీ.
భూమీశ! విను మయ్య పూర్వకాలమునఁ బు;
రంజనుం డను నొక్క రాజు గలఁడు;
అతని కవిజ్ఞాతుఁ డనుపేరఁ దగిలి వి;
జ్ఞాతచేష్టితుఁ డగు సఖుఁడు కలఁడు;
ఆ పురంజనుఁడు పురాన్వేషియై ధరా;
చక్రంబుఁ గలయంగ సంచరించి
తన కనురూపమై పెనుపొందు పుర మెందు;
వీక్షింపఁ జాలక విమనుఁ డగుచు.
నే పురము లుర్విఁ బొడఁగనె నా పురములు
గామములఁ గోరు తనకు న క్కామములను
సీబొందుటకు వానిని ననర్హములుగఁ దన మ
నమునఁ దలఁచి యొకానొకనాఁ డతండు.

వ.
చనుచున్న సమయంబున హిమవత్పర్వత దక్షిణసానువులందు.

సీ.
వర నవద్వార కవాట గవాక్ష తో;
రణ దేహళీగోపురముల నొప్పి
ప్రాకార యంత్రవప్రప్రతోళీ పరి;
ఘట్టాల కోపవనాళిఁ దనరి
సౌవర్ణ రౌప్యాయస ఘన శృంగంబుల;
రమణీయ వివిధ గేహముల మించి
రథ్యాసభా చత్వరధ్వజ క్రీడాయ;
తన సుచైత్యాపణతతిఁ దనర్చి
మరకతస్పటిక విదూరమణి వినూత్న
మౌక్తికాయుత ఖచిత హర్మ్యములు గలిగి
విద్రుమద్రుమ వేదుల వెలయు నొక్క
పురముఁ గనియె భోగవతినిఁ బోలు దాని..

భాగవతము—రౌద్రము.
సీ.
పంచాననోద్ధూత పావకజ్వాలలు;
భూనభోంతరమెల్లఁ బూరితముగ;
దంష్ట్రాంకురాభీల ధగధగాయితదీప్తి;
నసురేంద్రు నేత్రము లంధములుగఁ;
గంటకసన్నిభోత్కట కేసరాహతి;
నభ్రసంఘము భిన్నమై చలింపఁ;
బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై;
ఖరనఖరోచులు గ్రమ్ముదేర;.
సటలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి
పట్టె నరసింహుఁ డా దితిపట్టి నధిప!

క.
సరకుగొనక లీలాగతి
నురగేంద్రుఁడు మూషికంబు నొడసిన పగిదిన్
నరకేసరి దను నొడిసిన
సురవిమతుఁడు ప్రాణభీతి సుడివడియె నృపా!

క.
సురరాజవైరి లోఁబడెఁ
బరిభావిత సాధుభక్త పటలాంహునకున్
నరసింహునకు నుదంచ
త్ఖరతరజిహ్వున కుదగ్ర ఘన రంహునకున్.

మ.
విహగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా
గ్రహుఁడై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్.

భాగవతము — యుద్ధవర్ణనము.
సీ.
సమద పుష్పంధయ ఝంకారములు గావు;
భీషణకుంభీంద్ర బృంహితములు
వాయునిర్గత పద్మవనరేణువులు గావు;
తురగ రింఖాముఖోద్ధూతరజము
లాకీర్ణజలతరం గాసారములు గావు;
శత్రుధనుర్ముక్త సాయకములు
గలహంస సారస కాసారములు గావు;
దనుజేంద్రసైన్య కదంబకములు.
కమల కహ్లార కుసుమ సంఘములు గావు;
చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు
కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ?
వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు. ".

వ.
అనిన బ్రియమునకుఁ బ్రియంబు జనియింప డగ్గఱి.

ఉ.
దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ
తో నరుదెంతు" నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్.

వ.
ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబుల గ్రుచ్చి మురాసుర పాశపరివృతంబైన ప్రాగ్జోతిషంబు డగ్గరి.

మ.
గదచేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత
ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్ భంజించి చక్రాహతిం
జెదరన్ వాయుజలాగ్ని దుర్గముల నిశ్శేషంబులం జేసి భీ
ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్.

శా.
ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులున్
నాకారాతుల మానసంబులును భిన్నత్వంబు సెందంగ న
స్తో కాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రే
ఖాకాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణి చైతన్యమున్.

మ.
బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్.

వ.
కవి కలహంబునకు నరకాసురుండుగమకింపం దమకింపగ విలోకించి సంభ్రమంబున.

శా.
వేణిన్ జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ
బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీరసంరంభయై
యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్.

క.
జన్యంబున దనుజుల దౌ
ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ
జన్యవతిఁ జూచి యదురా
జన్యశ్రేష్ఠుండు సరససల్లాపములన్.

క.
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

క.
హరిణాక్షికి హరి యిచ్చెను
సురనికరోల్లాసనమును శూరకఠోరా
సురసైన్యత్రాసనమును
బరగర్వనిరాసనమును బాణాసనమున్.

శా.
ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే
షావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై
తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా
గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్.

క.
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!

పోతన శృంగారవీర రసమూల ప్రకర్షిత.
సీ.
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు;
శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు;
గండమండలరుచిఁ గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు;
బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమశబ్దంబు పరిపంథి;
సైనిక కలకల స్వనము నుడుప.
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.

మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

మ.
అలినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో
వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై.

సీ.
బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల;
రణరంగమున కెట్లు రాఁ దలంచె?
మగవారిఁ గనినఁ దా మఱుఁగుఁ జేరెడు నింతి;
పగవారి గెల్వనే పగిదిఁ జూచెఁ?
బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు;
ఖగపతి స్కంధమే కడిఁది నెక్కె?
సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య;
పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె?.
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?.

సీ.
వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ;
బాణాసనం బెట్లు పట్ట నేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ;
గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె?
సరవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే;
నిపుణత సంధించె నిశితశరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి;
యస్త్రమంత్రము లెన్నఁ డభ్యసించెఁ?.
బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే
గతి నొనర్చె సింహగర్జనములు?
ననఁగ మెఱసెఁ ద్రిజగదభిరామ గుణధామ
చారుసత్యభామ సత్యభామ.

శా.
జ్యావల్లీధ్వని గర్జనంబుగ; సురల్‌ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ;
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్.

సీ.
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు;
నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై ఘన ధూమకేతువై;
యలరుఁ బూఁబోఁడి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై;
మెఱయు నాకృష్టమై మెలఁత చాప;
మమృత ప్రవాహమై యనల సందోహమై;
తనరారు నింతిసందర్శనంబు;.
హర్షదాయియై మహారోషదాయియై
పరఁగు ముద్దరాలి బాణవృష్ణి;
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.

క.
శంపాలతాభ బెడిదపు
టంపఱచే ఘోరదానవానీకంబుల్‌
పెంపఱి సన్నాహంబుల
సొంపఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్.

వ.
అయ్యవసరంబున గంససంహారి మనోహారిణింజూచి సంతోషకారియుం గరుణరసావలోకనప్రసాదియు మధురవచనసుధారస విసారియుం దదీయసమర సన్నాహనివారియు నై యిట్లనియె.

క.
మగువ మగవారి ముందఱ
మగతనములు సూప రణము మానుట నీకున్
మగతనము గాదు; దనుజులు
మగువల దెసఁ జనరు మగలమగ లగుట హరీ! ".

క.
నరకా! ఖండించెద మ
త్కరకాండాసనవిముక్త ఘనశరముల భీ
కరకాయు నిన్ను సుర కి
న్నరకాంతలు సూచి నేఁడు నందం బొందన్.

వ.
అని పలికి హరి నరకాసుర యోధులమీద శతఘ్నియను దివ్యాస్త్రము బ్రయోగించిన నొక్కవరుసను వారందఱు మహావ్యధజెందిరి మరియును.

మ.
శర విచ్ఛిన్న తురంగమై పటుగదాసంభిన్న మాతంగమై,
యురుచక్రాహత వీరమధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై,
సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో
హరి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్.

వ.
అప్పుడు.

ఆ.
మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు
శస్త్రసముదయముల జనవరేణ్య!
మురహరుండు వరుస మూఁడేసి కోలలన్
ఖండితంబు సేసె గగన మందు.

క.
వెన్నుని సత్యను మోచుచుఁ
బన్నుగఁ బద నఖర చంచు పక్షాహతులన్
భిన్నములు సేసె గరుడుఁడు
పన్నిన గజసముదయములఁ బౌరవముఖ్యా!

వ.
మరియు విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపఁజాలక హత శేషంబయిన సైన్యంబు పురంబుసొచ్చుటం జూచి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతశక్తింగొని గరుడుని వైచె నతండునన విరులదండవ్రేటున జలింపని మద్దోండవేదండంబునుంబోలె విలసిల్లె నయ్యవసరంబున గజారూఢుండయి కలహరంగంబున.

మ.
సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁ డా చక్రాయుధున్ వైవ శూ
లము చేఁబట్టిన, నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో
త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర
త్నమయోదగ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్ధమున్.

శా.
ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో!
తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం గృపం గావఁడే!
చెల్లంబో! తలఁ ద్రుంచె" నంచు నిల నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై.

క.
కంటిమి నరకుడు వడఁగా
మంటిమి నేఁ" డనుచు వెస నమర్త్యులు మునులున్
మింటం బువ్వులు గురియుచుఁ
బంటింపక పొగడి రోలిఁ బద్మదళాక్షున్.

భాగవతము— అద్భుతరసము
శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

భాగవతము — రెండర్థముల పద్యములు.
సీ.
ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు? ;
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు? ;
నా యంతవాఁడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ? ;
బూని ముప్పోకల బోవ నేర్తు;
నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ? ;
నేరుపు లన్నియు నేన నేర్తు;.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.

సీ.
మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ;
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి?
; వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు;
మాయఁ గైకొని కాని మలయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు;
వసుధీశుఁడవు గావు వావి లేదు.
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు.".

సంపూర్ణము.