పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెఱ పోతన చరిత్రము : బమ్మెఱ పోతన చరిత్రము - 1

బమ్మెర పోతన చరిత్రము

రచన:- మద్దూరి శ్రీరామమూర్తికవి –1944

ఆర్కైవ్.కాం వారి సౌజన్యంతో

బమ్మెరపోతరాజు కవి

హిందూజనంబులకెల్ల పవిత్రగ్రంథములు మూడు. (1) శ్రీమద్రామాయణము (2) భాగవతము (3) భారతము. ఈ మూడు గ్రంథములును సమగ్రముగా నొక్కకవివర్యునిచే రచింపబడియుండలేదు. రామాయణము, భాగవతము, ఈరెండును దొలుత నొక్కరిచే రచింపబడినను కాలక్రమమున నందలిభాగములు నశింపగా నితరులు వానిని పూరించిరి. కాని భారతము సమగ్రముగా నొక్కనిచే రచింపబడి యుండలేదు.

1. భాస్కరరామాయణము: ఇద్దానిని దొలుత భాస్కరుడు రచించెను.

బాలకాండము:— భాస్కరామాత్యపుత్ర మల్లిఖార్జున భట్ట ప్రణీతము

అయోధ్యకాండము:— నిశ్శంక వీరమారయకుమారి రుద్రదేవ ప్రణీతము.

అరణ్యకాండము:— భాస్కరప్రణీతము.

కిష్కింధాకాండము:— మల్లిఖార్జునభట్ట ప్రణీతము.

సుందరకాండము :— మల్లిఖార్జునభట్ట ప్రణీతము.

యుద్ధకాండము:— అయ్యలార్యప్రణీతము.

2. భాగవతము భాగవతమును సమగ్రముగా నాంధ్రమున రచించిన వాఁడు బమ్మెరపోతనామాత్యుఁడు. ఈతఁడు రచించిన గ్రంథములోని భాగములు నశింపగా నీతని శిష్యులగు సింగరాజు, వెలిగందల నారాయణ మున్నగువార లా నశించినభాగములను రచించియుండిరి.

ఉ.
మానినిలీడుగారుబహు । మానని వారితదీనమానస
గ్లానికి దానధర్మమతి । గౌరవమంజులతాగభీరతా
స్థానికి ముగ్దసానికి । సదాశివపాదయుగార్చనానుకం
పానయవాగ్భవానికిని । బమ్మెరకేసయ లక్కసానికిన్.

క.
ఆమానినికిం బుట్టితి
మేమిరువురమగ్రజాతుఁ । డీశ్వరుసేవా
కాముఁడు తిప్పన పోతన
నామవ్యక్తుం డసాధు । నయయుక్తుండన్.

ఈతడు భాగవతగద్యయం దిట్లు వ్రాసియున్నాడు.

గ.
ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలితకవితావిచిత్రకేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైస,

ఇట్లు వ్రాయుటచేత నీతఁడు స్వయంకృషి చేతనే విద్యాధనమును సంపాదించియున్నాఁడని మనము తలంపవలసివచ్చుచున్నది. మఱియు పరమేశ్వరకరుణాకలితుండనికూడ చెప్పుకొనియున్నాఁడు. కాని వీరభద్ర విజయములోని గద్యయు భాగవతగద్యవలెనుండక వేరువిధముగా నుండుట గమనించవలసియున్నది.

వీరభద్రవిజయములోని గద్యము:
ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్యదివ్యప్రసాద పాదపద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయప్రణీతంబయిన వీరభద్రవిజయంబు.

ఇట్లు భిన్నముగా ఆశ్వాసాంతగద్యముండుటకు కారణమగపడదు. తొల్లిటిపుస్తకమునకు భాగవతమును రచించునెడల గల సహజ పాండిత్యబిరుదము వీరభద్రవిజయములోని గద్యంలో లేకుండుట ఆలోచన కవకాశ మిచ్చుచున్నది. మఱియు వీరభద్రవిజయములో గల యివటూరి సోమనారాధ్య ప్రశంస భాగవతమునందెచ్చటను గానరాదు. ఈ కారణములవలన వీరభద్రవిజయమితని కృతియగునా కాదా యని సందేహింపవలసి వచ్చుచున్నది.

వీరభద్రవిజయములో భాగవతమునందలి శయ్యాసౌభాగ్యములంతగా కానరావు. పోతనభాగవతమునం దెచ్చటజూచినను విచ్చలవిడిగా ప్రయోగించిన అంత్యప్రాసముగల యలంకారము గానరాదు. మఱియు భాగవతమునందు లేనట్టి దోషములు పెక్కులుగా వీరభద్రవిజయమునంగలవు. ఇందువలన నీతఁడు వీరభద్రవిజయమును భాగవతమునకంటె ముందుగా రచించియుండునని యనుకొనవలసి యున్నది. కాని భాగవతమును రచించుటలో శివదూషణచేయుటచే నతనికి నేత్రావరోధము కలిగినట్టును అందులకై యాతఁడు బంధుజన ప్రేరితుడై వీరభద్రవిజయము రచింపసమకట్టెనని అనుశృతముగా వచ్చుకథలవలన తెలియవచ్చుచున్నది. ఇందుకనుగుణ్యముగా వీరభద్రవిజయములో,

ఉ.
భాగవతప్రబంధమతి । భాసురతన్ రచియించి దక్షదు
ర్యాగ కథాప్రసంగమున । నల్పవచస్కుడనైతి దన్నిమి
త్తాగతవక్త్రదోషపరి । హారముకై యజనైకశైవశా
స్తాగమ వీరభద్రవిజ. । యంబు రచించెద వేడ్కనామదిన్.

భాగవతమునందు పోతన గావించిన శివదూషణ, శివభక్తాగ్రేసర దూషణ మొదలైనవి.

సీ.
అనయంబులు ప్తక్రి । యాకలాపుడుమాన
హీనుడు మర్యాద । లేనివాడు
మత్తప్రచారుడు । న్మత్తప్రియుడు దిగం
బరుడు భూతప్రేత । పరివృతుండు
దామసప్రమథ భూ । తములకు నాథుండు
భూతిలిప్తుండస్థి. । భూషణుండు
నష్టశౌచుండు ను । న్మదనాధుడును దుష్ట
హృదయుడుగ్రుడును బ । రేతభూని
కేతనుడు వితతవిస్రస్త । కేశుడశుచి
యయినయితనికి శివనాము । డను ప్రవాద
మెటులగలిగె నశివుడగు ని । తనికి నెఱిగి
యెఱిగి వేదంబు శూద్రున । కిచ్చినటుల.

తే.
వసుధనెవ్వారు ధూర్జటి । వ్రతులు వారు
వారి కనుకూలురగుదురె । వ్వారు వారు
నట్టిసచ్ఛాస్త్ర పరిపంథు । లైనవారు
నవనిపాషండులయ్యెద । రని శపించె.

ఇది యిట్లుండగా భోగినీదండకము యొక్క అంత్యమునందీ క్రింది పద్యము కానవచ్చుచున్నది.

ఉ.
పండితభర్తనీయుడగు । బమ్మెరపోతన యాసుధాంశు మా
ర్తాండ కులాచలాంబునిధి । తారకమై విలసిల్లభోగినీ
దండకమున్ రచించె బహు । దాన విహర్తకురావుసింగ భూ
మండలభర్తకున్ విమత । మానవనాధమదాపహర్తకున్.

పోతన జననకాల నిర్ణయము.
ఈతఁడు భాగవతమును రచించినపిమ్మట రచించిన భోగినీదండకమును సర్వజ్ఞసింగమనాయున కంకితము గావించియుండెను. సర్వజ్ఞ సింగమనాయుఁడు 15 వ శతాబ్దముయొక్క మొదటనుండినవాడగుటచే నీతడును ఆ కాలముననే యుండెనని తలంపవలసి వచ్చుచున్నది. మఱియు వీరభద్రవిజయమున బేర్కొన్న యివటూరి సోమనారాధ్యులవారుగూడ ప్రౌఢరాయులకాలములో నుండియుండుటచే నీతఁడు గూడ ప్రౌఢదేవరాయుల కాలములోనివాడని తలంపవలసివచ్చుచున్నది. శ్రీనాథునకును యీతనికి బాంధవ్యమున్నటులను శ్రుతముగావచ్చు కథలవలన తెలియుచున్నది. కావున శ్రీనాధునకీతఁడు సమకాలీనుఁడని చెప్పవలయును. పదునాల్గవ శతాబ్దముయొక్క అంత్యమున నీతడు జనించి యించమించుగా పదునేనవ శతాబ్దముయొక్క మధ్యవరకును జీవించియుండెననుట సత్యమునకు సమీపముగా వచ్చును.

పోతన నికేతనము. ఈతఁడు తననివాస మేకశిలానగరమని భాగవతమున నిట్లు జెప్పి యున్నాడు.

వ.
ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాతపాదపసమాశ్రయంబునను హరి కరుణావిశేషంబునను గృతార్థంబు సిద్ధించెనని బుద్ధినెఱింగి లేచి మరలికొన్నిదినంబులకు నేకశిలానగరంబునకు జనుదెంచి యందు కురువృద్ధబంధుజనానుజ్ఞాతుండనై,

ఏకశిలానగర మిప్పుడెక్కడను గానరాదు. ఏకశిలయన నొంటిమిట్టుమని కొందరును, ఓరుగల్లు అని కొందరును యర్ధములను దీసి తమతమవాదములను స్థిరపరచుకొన దీర్ఘములగు నుపన్యాసములనిచ్చి యున్నారు. ఆవిషయములను గూర్చి చర్చించుటకిందు తావు చాలమిని విడువవలసి వచ్చినది.

పోతనామాత్యుని వాక్సుద్ధి.
పోతనామాత్యుడు పల్కినయెల్ల నిక్కమగుచుండుననుట జనశ్రుతముగానున్నది. అందులకీ క్రిందికధ యుదాహరణములని వచింతురు.

శ్రీకృష్ణుండు మహానుభావుండు గావున బ్రాహ్మణకుమారుండు మృతిజెంది దుఃఖించుచుండగా నక్కుమారుని సజీవితుం జేసెనని వ్రాయుచుండగా పోతన కుమారులలో నొక్కడు మరణించుటయు మరల జీవించుటయు గల్గెను.

రుక్మిణీకల్యాణమున రుక్మిణీదేవిని వర్ణించుచు నీ క్రిందిపద్యమును రచించునెడ.

సీ.
దేవకీసుతుకోర్కె । తివలు వీడంగ
వెలదికి మైదీవ । వీడదొడగెఁ
గమలనాభుని చిత్త । కమలంబు వికసింపఁ
గాంతినింతికి ముఖ । కమలమొప్పె
మధువిరోధికి లోన । మదనాగ్ని పొడసూపఁ
బొలతికి కనుదోయి । బొడవు సూపె
శౌరికి ధైర్యంబు । సన్నమై డాయంగ
జలజాక్షి మధ్యంబు । సన్నమయ్యె
హరికి బ్రేమబంధ । మధికంబుగాఁ గేశ
బంధ మధికమగుచు । బాలకమరె

యని వ్రాయునంత కుయ్యలతొట్టిం బరుండి నిద్రించుచున్న యాతని బాలిక దొర్లి క్రిందనున్న కుంపటిలోబడి కమరివాసన వేయనారంభించెను. అంతట పోతన్న
పద్మనయనువలన । బ్రమదంబు నిండారె
నెలత యౌవనంబు । నిండియుండె
యని పద్యమును పూర్తిగావించునప్పటికి యా బాలిక కుంపటినుండి లేచి సుఖముగా నుండెను.

ఇట్టి విషయములనేకముల నుదహరింపవచ్చును గాని యివి సత్యమునకు దూరమైయుండునని యీ కాలముననతలంపకపోరు. ఇవి యాతనియందుగల గౌరవము చేతను, యాతనికూలంకష ప్రజ్ఞ చాటుటకును కల్పితములై యుండును.

పోతనకు సరస్వతీదేవి ప్రత్యక్షమగుట.
పోతన భాగవతమును రచించుచుండగా నొక్కనాడు శ్రీ నాధుడరుదెంచి హాలికులకు గుశలమాయని పరియాచకమునకై పల్కెను. అంత పోతరాజు.

ఉ.
బాలరసాలసాల నవ । పల్లవకోమల కావ్యకన్యకన్
కూళలకిచ్చి యప్పడుపుఁ।గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహ । నాంతర సీమలకందమూలకౌ
ద్దాలికులైననేమి నిజ । దారసుతోదరపోషణార్థమై.

అని యుత్తరు వొసంగెను. శ్రీనాథుఁ డంతసిగ్గుపడి “బావా ! పరిహాసమున కట్లంటిని. ఇంతలోననే కోపింపవలయునా!” అని కొంతతడ విష్టాగోష్ఠియందు గడపెను.

నాటినుండి నాలుగైదు దినంబులు శ్రీనాథుండు పోతనతో “బావా! పాపమో పుణ్యమో! యెవ్వరుచూచినారు. ఈకుటుంబమును పోషించుకొనిన పిమ్మటగదా పరము సంగతి యాలోచించుకొనవలయును. దారిద్ర్యముకంటె నీచమేమియును లేదుగదాయని బలుకుచు నాతని మది ద్రిప్పబోయెను.

శ్రీనాథుఁడు వెడలిపోయినపిమ్మట పోతన యొక్కనాడింటియందు బియ్యము మున్నగునవేమియు లేకుండుటచే మిగుల వ్యసనపడి కట్టా! ఎన్నిదినములు నేనుపవసింతును. నేనెట్లో యేజలాహారముతోడనో నిలువగలను గాని యాలుబిడ్డలమాట యేమి, ఏమైననుసరే గ్రంథము నెవ్వరికైన నంకితమిచ్చి ధనంబును గొనియెదనుగాకయని నిశ్చయించుకొని భాగవతమును చంకబెట్టి యుత్తరీయమును కప్పికొని వీధిలోని కరుదెంచెను. తోడనే యాతని కట్టెదుట వలవల కన్నీరు గార్చుచు విలపించు సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమెనుగాంచి పోతనమది కరిగిపోయెను. అంతనాతఁడు సరస్వతి నద్దేశించి యిట్లనియెను.

ఉ.
కాటుక కంటినీరు చను । కట్టుపయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని । గాదిలికోడల! యోమదంబ ! యో
హాటకగర్భురాణి నిను । నాకటికింగొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల । కమ్మ ద్రిశుద్ధిగనమ్ము భారతీ!

భాగవత కృతిపతిత్వ నిర్ణయము.
పోతనామాత్యుడొకయుద్గ్రంధమును రచింపకోరి యొక్కరాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్రసముత్తుంగభంగ యగు గంగకుంజని క్రుంకులిడి వెడలి మహానియమంబయిన పులినతలమంటపమధ్యంబున మహేశ్వరధ్యానంబుసేసి కించిదున్మీలితనేత్రుండనై యున్నయెడ,

సీ.
మెఱుగు చెంగటనున్న । మేఘంబుకై వడి
నువిదచెంగటనుండ । నొప్పువాడు
చంద్రమండలసుధా । సారంబుపోలికి
ముఖమున జిరునవ్వు । మొలచువాడు
వల్లీయుతతమాల । వసుమతీజముభంగి
బలువిల్లుమూపున । బరగువాడు
నీలనగాగ్ర స । న్నిహితభానునిభంగి
ఘనకిరీటముదల । గలుగువాడు
ఆ.
పుండరీకయుగము । బోలుకన్నులవాడు
వెడదయురమువాడు । విపులభద్ర
మూర్తివాడు రాజు. । ముఖ్యుడొక్కరుడు నా
కన్నుగవకు నెదుర. । గానబడియె.

వ.
ఏను నారాజ శేఖరుం దేఱిచూచి భాషింప యత్నంబుసేయు నెడ నతండు దాన రామభద్రుండ, మన్నామాంకితముగా శ్రీ మహాభాగవతంబు దెనుంగుసేయుము, నీకు భవబంధములు దెగునని యానతిచ్చి తిరోహితుండనై సమున్మీలితనయనుండనై వెఱగుపడి చిత్తంబున,

క.
పలికెడిది భాగవతమట
పలికించువిభుండు రామ । భద్రుండుట నే
బలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాధ । పలుకగనేలా .

అని పరమేశ్వరునకు కృతినీయదలంచి,

ఉ.
ఇమ్మనుజేశ్వరాధముల । కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్నిపుచ్చుకొని । చొక్కి: శరీరమువాసి, కాలుచే
సమ్మెటవాటులం బడక । సమ్మతితో హరికిచ్చిచెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు. । భాగవతంబు జగద్ధితంబుగన్.

అని వక్కాణించి కృత్యాదిని,

శా.
శ్రీ కైవల్యపదంబు జేరుటకునై । చింతించెదన్ లోకర
క్షాకారంభకు భక్తపాలన కళా । సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళిలోలవిలస । ద్దృగ్జాలసంభూతనా
నా కంజాత భవాండకుంభకు మహీ । నందాంగనాడింభకున్.

అని శ్రీ కృష్ణభగవానుని సంస్తుతించియున్నాడు. కాని స్కంధాంత పద్యంబులందునను, తక్కిన స్కంధాదులయందును శ్రీరాముని సంబోధించియున్నాడు.

ఉదాహరణలు.

మాలిని.
అనుపమగుణహరా । హాస్యమానారివీరా
జనవితతవిహారా । జానకీచిత్తచోరా
దనుజఘనసమీరా । దానవశ్రీవిదారా
ఘనకలుషకఠోరా । కంధిగర్వాపహారా.

ఉ.
క్షంతకు గాళియోరగని । శాలఫనణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధ । రాజచతుర్విధఘోరవాహినీ
హంతకు నింద్రనందున ని । యంతకు సర్వచరాచరావళీ
మంతకు నిర్జితేంద్రియ స । మంచితనభక్త జనాననగంతకున్.

ఉ.
న్యాయికి భూసురేంద్రమృత । నందనదాయికి రుక్మిణీ మన
స్థ్సాయికి భూతసమ్మదవి । ధాయికి సాధుజనానురాగసం
ధాయికి పీతవస్త్రపరి । ధాయికి పద్మభవాండభాండని
ర్మాయికి గోపికానివహ । మందిరయాయికి శేషశాయికిన్.

పైపద్యములను బట్టియు, స్కంధాదిపద్యములను బట్టియు నీతడు రామకృష్ణుల యవతారములయెడ నభేదబుద్ధిగల్గి యిరువురును యొక్కరేయని దలంచువాడనుట తెల్లమగుచున్నది. అయినను ఈతఁ డద్వైతియగుటచే భాగవతమును అద్వైతపరముగనే రచించియున్నాఁడు గాని విశిష్టాద్వైతపరముగ నాంధ్రీకరించి యుండలేదు.

పోతనకు మహావిష్ణువు గ్రంథరచనయందు తోడ్పడుట.
పోతన మహాభాగవతమున నష్టమస్కంధమును ఆంధ్రీకరించుచు గజేంద్రమోక్షకథా సందర్భమున,

మ.
అలవైకుంఠపురంబులో నగరిలో ……….

అనునంతవరకును పద్యమునువ్రాసి యాపైనేమివ్రాయుటకును దోపక బెద్దయుంబ్రొద్దు చిందించి యానాటికింక గ్రంధరచన పొసగదని కట్టిపెట్టి కుమార్తెను బిలిచి అమ్మా! పుస్తకమును గొనిపోయి జాగ్రత్తపరుపుము అని చెప్పి యటనుండి లేచి యాహ్నికముల దీర్చికొనుటకు నదికరిగెను.

భక్తవత్సలుడును కరుణాంతరంగుడును అగు శ్రీ మహావిష్ణువు తన భక్తుడగుపోతన తనయానతిచే భాగవతమును దెనిగించుచు నాలోచన కుదరక గ్రంథరచనముగించి స్నానార్థమరిగినతోడనే యాతనికి దోడ్పడనెంచెను. తోడనే యాతఁడు పోతనరూపమును ధరించి యింటిలోని కరుదెంచి కుమార్తెను బిలిచి అమ్మా! ఇందాకటి పుస్తకమను గంటమును గొనితెమ్మ, పద్యమును సంపూర్తిగావించెదను. అని వచించెను. పోతనకుమార్తె నిక్కమునకు తనతండ్రియే మరలివచ్చి యిట్లడుగుచున్నాడని తలంచి యాపుస్తకమును గొనివచ్చి యిచ్చెను. మహావిష్ణువా గ్రంథమున పోతనవిడచిన పాదమును యిట్లు పూరించెను.

మ.
అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబుదాపల,

అని మాత్రము వ్రాసి యటుపిమ్మట పోతన సులభముగా నా పద్యమును పూరించగలడని యెంచి పుస్తకమును యెప్పటియట్లు కట్టి పోతనకుమార్తెకిచ్చి వెలికేగెను. ఆబాలికయు గ్రంథమునుగొని జాగ్రత్తపరచెను. పోతన యా దినమంతయును నాపద్యమునుగూర్చియే యాలోచించుచు గడిపివైచి మరునాఁడు ప్రాతః కాలమున కుమార్తె “నంపించి కుమారీ ! పుస్తకమునుగొనితెమ్ము. ఎట్లో యద్దానిని పూర్తి చేసెదను” యని పల్కెను. కుమార్తె పుస్తకమును గొనివచ్చి యందించెను. పోతన గ్రంథమును విప్పిచూడగా నందు దన వ్రాతగాక ముత్యములకోవవలె వ్రాయబడియున్న వ్రాతను దిలకించి, యాపద్యము తానువ్రాసిన దానికంటె నెక్కుడుగా నుండుటయుగాంచి కుమార్తెను పిలిచి “అమ్మా! ఇది వ్రాసినవారెవ్వరు చెప్పు”మని ప్రశ్నించెను. అంత నామె “జనకా! నిన్నమీరు స్నానమునకేగిన కొన్ని నిముషములకు దిరిగివచ్చి నా చే పుస్తకమును దెప్పించి వ్రాసియుండిరికాదా. ఇప్పుడిది యెవ్వరు వ్రాసిరని యడిగెదరేల” యని ప్రశ్నించెను. అంత పోతన, “నిన్న నేను పుస్తకము మరల ముట్టుకొనలేదు.. ఆ మహావిష్ణువేవచ్చి యియ్యదివ్రాసియుండును. కుమారీ! నీవు చాల యదృష్టవంతురాలవు. వెన్నుని జూడగల్గితివని నుడివి యా పద్యమును యొకనిముషములో నిట్లుపూరించెను.

మ.
అలవైకుంఠపురంబులో నగరిలో । నామూల సౌధంబు దా
పలమందారవనాంతరామృత సరః । ప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోదియగు నా । పన్న ప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రముపాహిపాహి ణియనుగు। య్యాలించిసంరంభియై.

ఇయ్యది యనుశ్రుతముగా వినవచ్చుకధల నాధారముగా గొని వ్రాయబడియున్నది.

పోతన గ్రంథరచనయందుండ మహావిష్ణువాతనిని సర్వజ్ఞ సింగమనాయుని బారినుండి రక్షించుట.
పోతనరచించు భాగవతమును దానెట్లైనను కృతిగొనవలయునని సంకల్పించుకొని సర్వజ్ఞసింగమనీడు తనసేనానాయకునకు గొంతబలమునొసంగి నీవేగి బమ్మెరపోతనామాత్యుని దండించియైన బట్టుకొని మహాభాగవతముతోగూడ నాతని నిచ్చటకు గొనిరావలసినదని నియమించెను. ఆసేనానాయకుఁడును తృటిలో నాకార్యమును సాధించుకొనివత్తు నని బీరములు పలికి వెడలిపోయెను. భక్తపరాధీనుడగు వెన్నుడు తనభక్తున కపకారముసేయబోవుచున్న నాతని యభిప్రాయమును గ్రహించి యాతని మందలించి వెనుకకు పంపనెంచెను. కాని యంతలోనిట్లు వితర్కించెను. ఈతనిని వెనుకకిపుడే పంపినచో రేపో లేక మరియొకనాడో చనుదెంచి యీతఁడు పోతనను బాధింపకమానడు. సర్వజ్ఞసింగమనీఁడు ముష్కరుఁడు. అతనికి తగినశిక్ష విధించినగాని సరియైన మార్గమునకురాఁడు.అని వితర్కించుకొని తనతొలుతటి యభిప్రాయముపహరించుకొనియెను. ఈసేనానాయకుఁడు పోతనయింటిని ముట్టడించెను. ఆసమయమున పోతన నిర్భీతితోనుండెను. అపుడు పోతన భాగవతమున యజ్ఞవరాహవతార ఘట్టమును వ్రాయుచుండెను. అందీ క్రింది పద్యమును రచించెను.

సీ.
కఠినసటాచ్ఛటో । త్కట జాతవాతని
ర్ధూతజీమూత సం । ఘాతముగను
క్షురనిభసునిశిత. । ఖరపుటాహతచల
త్ఫణిరాజ దిగ్గజ । ప్రచయముగను
జండ దంష్ట్రోత్థ వై । శ్వాన రార్చిస్స్రవ
ద్రజితహేమాద్రి వి । స్రంభముగను
ఘోరగంభీరఘు । ర్ఝరభూరి నిస్వన
పంకిలాఖిలవార్థి । సంకులముగ
బొరలుఁ గెరలునటించు నం । బరము దెరల
రొప్పునుప్పర మొగయును । గొప్పరించు
ముట్టెబిగియుంచు ముసమున । మూరుకొనుచు
నడరు సంరక్షితక్షోణి । యజ్ఞ ఘోణి.

అనుపద్యమును రచించునప్పటి కేవిధానపోతనను రక్షింతునాయని యాలోచించుచున్న శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహరూపముదాల్చి యా సేనానాయకుని సైన్యమును ప్రతిఘటించుచుండె.

సీ.
తివిరిచతుర్దశ । భువనంబులను దొంతు
లొరగఁ గొమ్ములజిమ్ము. । నొక్కమాటు
పుత్తడికొండ మూ । పురమును నొరయంగ
నురుకుచురాపాడు । నొక్కమాటు
నాభీలవాలహ తాహతిచేమింటి
నొరసిబ్రద్దలుసేయు । నొక్కమాటు
గన్నుగోనల విస్ఫులిం । గములు సెదర
నురుభయంకర గతిఁదోచు । నొక్కమాటు
పరమయోగీంద్ర జనసేవ్య । భవ్యవిభవ
యోగ్యమైకానఁగా నగు । నొక్కమాటు

అని రచించునప్పటికి యజ్ఞవరాహరూపముననున్న హరివిక్రమించి నిర్వక్రపరాక్రమంబున దన్ను ప్రతిఘటించిన ప్రతివీరులనెల్ల నొక్కుమ్మడిగూల్చుచుచు సేనానాయకునిబట్టి తొల్లి యజ్ఞవరాహము హిరణ్యాక్షునిఛేదించివధించిన తెరంగున మట్టు బెట్టెను.ఇట్లు సర్వజ్ఞసింగమనాయని సైన్యమును ధ్వంసముసేసి దీనితో యా నృపాలునకు బుద్ధివచ్చును. ఇక నెన్నడును పోతనను బాధింప బలమును పంపకుండును. అని వితర్కించుచు నంతర్హితుండయ్యెను. సింగమనాయుడు తనకనేక యుద్ధములలో దోడ్పడినట్టియు, విశ్వాసపాత్రుఁడైనట్టియు సేనానాయకుడు మరణించినందుల కెంతయో విలపించెను. పోతనకు యీ సంగతియంతయు దరువాత తెలియవచ్చెను. పరమేశ్వరునకు దనయందుగల వాత్సల్యమునకెంతయు సంతసించినవాఁడై తా నాసమయమున రచించుచున్న ఘట్టమగు బ్రహ్మాదులు యజ్ఞవరాహమూర్తిని సంస్తుతించుటయందు భక్తి భావమును యిట్లువెల్లివిరియునట్లు వర్ణించియున్నాఁడు.

చ.
తలఁప రసాతలాంతరగతక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై
గలుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే? రమేశ్వరా!

చ.
సకల జగన్నియామక విచక్షణలీలఁ దనర్చు నట్టి నం
దకధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా
జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
టకుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా

ఉ.
విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్
విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని సన్నుతిసేయఁగ మాకు శక్యమే?

సీ.
పంకజోదర! నీ వపారకర్ముండవు;
భవదీయకర్మాభ్ది పార మరయ
నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు
; పరికింపఁగా మతిభ్రష్టు గాఁక
విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ;
మాయాపయోనిధి మగ్న మౌటఁ
దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల;
నే మన నఖిలలోకేశ్వరేశ!
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత!"

సీ.
పంకజోదర! నీ వపారకర్ముండవు;
భవదీయకర్మాభ్ది పార మరయ
నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు;
పరికింపఁగా మతిభ్రష్టు గాఁక
విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ;
మాయాపయోనిధి మగ్న మౌటఁ
దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల;
నే మన నఖిలలోకేశ్వరేశ!
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత

భాగవతమున గొన్నిభాగములు శిధిలమగుటకు గల కారణములు. ఇపుడు ముద్రితమై మనకు లభించుచున్న భాగవతము సంపూర్ణముగా పోతనామాత్య ప్రణీతముగాదు. పోతనామాత్యుఁ డు రచించిన భాగవతములో కొన్ని భాగములు శిధిలములు కాగా నట్టిభాగములను యితరులు పూరించిరి. పోతనామాత్యకృతమగు నా భాగములేల నశించినవి యను ప్రశ్నకు జనశ్రుతముగా నొండు రెండుకథలు వినవచ్చుచున్నవి. వానిని క్రింద బొందుపరచుచున్నాడను.

పోతనామాత్యుఁడు మహాభాగవతము నాంధ్రీకరించుచున్నట్లును, అతని కవిత్వమత్యంత మనోహరమైనదై సుధామయోక్తులతో నిండి యున్నదనియు వేంకటగిరి సంస్థానమున కధిపతియైన రావు సర్వజ్ఞ సింగమనాయునకు దెలియవచ్చెను. అతఁడు పోతనను ప్రార్థించి యా గ్రంథమును దానంకితమును పొందనభిలషించెను. పోతనామాత్యుఁడు తన భాగవతమును తనయిష్టదైవమగు శ్రీరాములకే యంకితమొసంగుటకు కృతనిశ్చయుఁడై యుండెను.అందువలన సింగమనాయుని యభిమత మీడేరదయ్యెను.

పోతనకు మఱదియగు శ్రీనాధుఁడు పోతనచెంతకరుదెంచి యాతఁడు మిగులదరిద్రుడై తినతిండియైనలేక యవస్థపడుచుండుట దిలకించి యాతనితో “బావా! యేల ఈవిధముగా కష్టము లనుభవించెదవు. నీవు రచించుచున్న యీ భాగవతము నెవ్వరికైన నంకిత మొసంగరాదా? నీ యట్టివాడంకిత మొసంగిన నెంతేని ధనంబు నొసంగుట కెందఱెందఱో సిద్ధముగానున్నా”రని పల్కెను, కాని పోతన యంగీకరింపడయ్యెను.

సింగమనాయుఁడు తనకోర్కెనెఱవేఱమికి గివిసిపోతనచెంతనున్న భాగవతమున దెప్పించి యద్దానిని నశింపుజేయవలయునను తలంపున దనయంతఃపురమున నొక్కచో పాతిపెట్టించెను. పోతనయు రామచంద్రున కంకితముగా నేను గ్రంథమురచించితిని. అయ్యది లోకమునవెలసి కలకాలముండుట యా రామచంద్రునకు సమ్మతమయ్యెనేని యాతఁడే యా గ్రంథమును వెలిగొనివచ్చును,అని తలంచి మిన్నకుండెను. కొన్నిదినములుగడచెను.

ఒక్కనాడు సింగమనాయుని స్వప్నమున శ్రీ రామచంద్రుఁడు సాక్షాత్కరించి యాతనికిట్లనియెను. “ఓయీ! లోకములోనున్నస్వార్థపరులలో నగ్రగణ్యుండవై యేల భగవదపచారము గావించెదవు. మహాత్ములగు కవి సౌర్యభౌములు తుచ్ఛములగు నీయీ ధనంబుల కాసజెంది నిన్ను సేవింతురనియే తలంచితివా? పోతన్నవంటి భక్తశిఖామణి, కవిపుంగవుఁ డు నిన్నాశ్రయించునా! అతఁడు తన భక్తిప్రభావమున నన్నే తన హృదయపంజరమున బంధించి యున్నాఁడు. అట్టివానియెడ నీవు మహాపచార మాచరించి యుంటివి. అజ్ఞానవశంబునగాని జ్ఞానవశంబునగాని నాకపచార మాచరించినవారిని మన్నింతునుగాని నా భక్తునకు గీడొనరించిన వాని నెన్నటికిని క్షమింపను. కావున నీవు పాతిపెట్టించిన గ్రంథమును వెలికిదీసి యద్దానిని సభక్తిపూర్వకముగా పోతనామాత్యునకర్పించి క్షమాభిక్షకోరుకొనుము. అట్లుగాదేని నీవు నా కోపానలంబున బగ్గునమాడిభస్మావశేషుఁ డయ్యెదవు.” ఇట్లు పలికి రామచంద్రుఁ డంతర్హితుడయ్యెను.సింగమనాయఁ డుదయమున మేల్కాంచి కాలోచితముల దీర్చుకొని సుస్నాతుఁడై శ్రీరామచంద్రుని భక్తితాత్పర్యములు ముప్పిరిగొన పూజించి స్వయముగా నా గ్రంథమును ద్రవ్వి యద్దానిని శిరముపైనిడుకొని పోతనామాత్యుని గృహమునకు గొనిపోయి యర్పించి పోతనపాదములపైవ్రాలి “మహానుభావా! తమయెడ మహాపరాధము గావించియుంటిని. రక్షించవలయును.” అని పెక్కువిధముల ప్రార్థించెను. పోతనామాత్యు డాతనిని మన్నించి పంపివైచెను.

పోతన గ్రంథమును విప్పిచూడగా నందు గ్రంధపాతములు బొడకట్టెను. పోతన తిరుగవానిని రచింపక యేలనో విడచెను. తరువాత వెలిగందల నారయారు లద్దానిని పూరించియుండిరి.

పోతనామాత్యుఁడు స్వవిరచితమగు భాగవతమును తన దేవతార్చన పెట్టెయందుంచి నిత్యపూజలు సలుపుచు గౌరవించుచుండెడివాఁడు. అటుపిమ్మట దన యవసానకాలమున కుమారుఁడగు మల్లనను బిలచి “నాయనా! ఎట్లో కష్టపడి గ్రంథమును సమగ్రముగా రచించితిని. పొట్టకూటికై యద్దాని నొరులకు విక్రయింపక యిన్నిదినములవరకు దాచియుంచితిని. నాకవసానము సమీపించినది. నేనీగ్రంథమును నీ హస్తమునందిడి పోవుచున్నాను. నీవు నా యందెట్టి భక్తివిశ్వాముల జూపియుంటివో యట్లే యీగ్రంథమునెడగూడ భక్తివిశ్వాసములు గల్గి లోకమున వెలయింపుము.” అని జెప్పి మరణించెను. తదనంతరము మల్లనాదులు గ్రంథమును పరిశోధింపగా నందు కొన్నిభాగములు క్రిములచే నాశనముగావింపబడినవి. పోతనామాత్యుని శిష్యులుమల్లన మున్నగువారాలోపములను పూరించియుండిరి.

శ్రీనాధుఁడు.
శృంగారనైషధము కాశీఖండము మున్నగు గ్రంధరాజములను రచించి విశేషవిఖ్యాతి గడించిన శృంగార శ్రీ నాధకవిసార్వభౌముఁడు పోతనామాత్యునకు మఱది. శ్రీనాధుఁడు పోతననుగూడ తనవలెనే యొక భూపాలునాశ్రయముననుంపవలెనని, విశ్వప్రయత్నము లొనరించుచుండువాఁడు. ఈతఁడు పోతనామాత్యుని నివాసభూమి యగు యేకశిలానగరమునకు తరచుగా పోవుచుండునాఁడు. పోతన గాన్పించినప్పు డెల్ల “బావా! ఇదేమి దుక్కిటెడ్లనుగొని పొలముదున్నుచు నెంతకాలము గడిపెదవు.

క.
కమ్మని గ్రంథమ్మొకటి
ఇమ్ముగ నే నృపతికైన । కృతియిచ్చినచో
గొమ్మని యియ్యరె వెయ్యా
ర్లిమ్మహిదున్నంగనేల । యిట్టిమహాత్ముల్.”

అని వచించుచుండువాఁడు. పోతనయు యెప్పటికప్పుడు యేదో విధముగా తగినసమాధాన మొసంగుచుండువాఁడు. ఒకనాఁడు శ్రీనాధుఁడు పల్లకియందెక్కి పోతనామాత్యుని జూడ నరుదెంచుచుండెను. ఆ సమయమున పోతన తన చేనుగట్టున గూర్చిండి యేదోవిషయమును గూర్చి యాలోచనలు సలుపుచుండెను. పోతన కుమారుఁడగు మల్లన యరకకట్టి పొలము దున్నుచుండెను. శ్రీనాధుఁడు పోతనకు తన శక్తి సామర్థ్యములు జూపవలయునని పల్లకి మోయువారలను బిలచి “ఓరీ వెనుకప్రక్కనున్నవారు. పల్లకిదండిని వదలిపెట్టుఁడు పల్లకి యెప్పటియట్లు నడువగలద”నియెను. బోయీలు పల్లకిదండిని వదలివైచిరి. పల్లకి మామోలుగా నేగుచుండెను. పొలమును దున్నుచున్న మల్లన యదిగాంచెను. తోడనే యాతఁడాశ్చర్య మగ్నుండై “నాయనా ! మామ శ్రీనాధుఁ డరుదెంచుచున్నాఁ డు. పల్లకి వెనుకబోయీలు లేకుండగనే నడచుచున్నది. చాల విచిత్రముగా నున్నదని పల్కెను. పోతన తన యాలోచనమును చాలింపక “కుమారా! వింతయేమున్నది. దాపలియెద్దును విప్పివేయుము.నీ నాగలికూడ యట్లే నడువఁ గల”దనియెను. మల్లన యావినోదమును జూడవలయునని దాపలకట్టిన యెద్దును విప్పివైచెను. నాగలి యెప్పటియట్లు నడుచుచుండెను. మల్లన యెంతయు వింతనొంది తిలకించుచుండెను. శ్రీనాధుఁడు బోయీలవలన నాగలి దాపలియెద్దు లేకుండగనే నడచుచుండుట విని యెంతయు సంతసించి మరల బోయీలనుపిలచి, “ఓరీ! ముందుభాగమునుగూడ వదలిపెట్టు”డని యాజ్ఞాపించెను. బోయీలు పల్లకిదండిని వదలివైచిరి. పల్లకి యెప్పటియట్లు నడచిపోవుచుండెను. మల్లన యదిగాంచి తండ్రి కెఱింగించెను. పోతనయు “గుమారా! ఆశ్చర్యము జెందకుము. వలపలియెద్దునుగూడ విప్పివేయుము. నాగలి యెప్పటికంటె సులభముగా నడువగల”దని పల్కెను. మల్లనయు నట్లే గావించెను. నాగలి యధాప్రకారముగా సాగిపోవుచుండెను. బోయీలు రెండువైపులను యెద్దులు లేకుండ బోవుచున్న విషయమును శ్రీనాథునకు తెలియజేసిరి. శ్రీనాథుఁడు తన యపరాధమును గుర్తించి దిగ్గున పల్లకినుండి దిగి పోతనామాత్యుని సమీపించి, “బావా! క్షేమమా! తమ దర్శనార్ధ మగుదెంచుచుంటి”నని వచించెను. పోతనయు నాతని సముచితగౌరవమున నాదరించి తనగృహమునకు గొనిపోయెను.

విందుభోజనములు.
పోతనామాత్యుఁడు స్నానసంధ్యాదికములు గావించుకొని దేవతార్చన గావించుచుండెను. శ్రీనాథుఁడు వీధియరుగుపై గూర్చుండి మల్లన మున్నగువారితో నేదో విషయములను గూర్చి ముచ్చటించుచుండెను. శ్రీ నాథుఁ డాగర్భశ్రీమంతుఁడు. బుద్ధివచ్చినదాది గ్రంథముల రచించి యే భూపాలునకో యంకితమొసంగి వారిచే మన్నన లందుచుండువాఁడు. కావున భోగలాలసుఁడై యుండెడువాఁడు. గడియ భోజనమున కాలస్యమైన యుగముగా దలంచి తల్లడిల్లువాఁడు. అట్టివాఁడు పోతనయింటి కతిథిగా వచ్చెను. దేవతార్చన యగుచున్నది. అంత నింతట నది తెమలునట్లు గాన్పడదు. అతని ఆకలి ఆకసమంటుచున్నది. అట్టిస్థితిలో నాతఁ డెట్లుండునో పాఠకమహాశయులే యూహింతురుగాక. మరియు శ్రీనాథుండొక్కడు మాత్రమేగాక యాతనితో నరుదెంచిన వారును, శిష్యులును, మరికొందరు పండితులును గూడ నుండిరి. వీరందరికిని పోతన యానాడు విందుచేయుట కుద్దేశించెను. పోతన యెంతటిభాగ్యవంతుడో శ్రీనాథుండు చక్కగా నెఱుంగును. రెండుజాములు కావచ్చినది. ఇంట వంట జరుగుచున్నసవ్వడి యేమాత్రమును వినబడుటలేదు. ఇదంతయును గమనించి శ్రీనాథుఁడు ‘కట్టా’ ఈతని సం సారము లేమిడిగల్గినది. నేనొక్కడనేగాక పలువురు నాతో వచ్చినవారు గలరు. వీరికందరికిని దగు పదార్థముల నీతఁ డెక్కడనుండి తేనోపును’ అని విచారించుచుండగా పోతన దేవతార్చనము పూర్తిగావించుకొని వెలికరుదెంచి “బావా! ప్రొద్దుపోయినది లెమ్ము మడికట్టుకొనుము. వడ్డన యగుచున్న”దనియెను. శ్రీనాథుండు ఆకలితో నున్నవాడుగావున బ్రతుకుజీవుఁడా యని లేచి మడి గట్టుకొనియెను. అతనితోబాటుగ పండితులెల్లరును మడిగట్టుకొనుటకై లేచిరి. భోజనమునకు శ్రీ నాధుడు మున్నగు వారెల్లరును పీటలపై కూర్చునుండిరి. అంత పోతన “అక్కా! తడవేల వడ్డన గావింపు” మని కేకవైచెను. తోడనే భారతీదేవి చక్కని స్త్రీ రూపము ధరించి ప్రత్యక్షమై వివిధ భోజ్యములను వారి కెల్లరకును వడ్డించెను. శ్రీనాదుఁడు తానీవరకెన్నడును రుచిచూడని భోజ్యము లభించుటచే నెంతయు సంతసించి తృప్తితీర భుజించెను. శ్రీ నాధుఁడు పోతన మాహత్యమున కెంతయు సంతసించి యాతని నెన్నియోవిధముల నుతించెను.