పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : వానరులెవరు?

  రామావతారమునందు వానరములు గొప్ప సహాయ మొనర్చి యుండెను. ఆ వానరములెవరు? రామాయణము బాలకాండ 17వ సర్గయందిట్లున్నది:-
పుత్రత్వంతుగతే విష్ణౌరాజ్ఞస్తస్యమహాత్మనః
ఉవాచదేవతాః సర్వాః స్వయంభూర్భగవానిదమ్॥
సత్యసంధస్య వీరస్య సర్వేషాంనో హితైషిణిః
విష్ణో సహాయాన్ బలినః సృజధ్వంకామరూపిణః॥

  విష్ణుభగవానుడు దశరథ పుత్రుడగు శ్రీరామచంద్రమూర్తి రూపమున అవతరించిన పిదప బ్రహ్మదేవుడు దేవత లందరితోడను “మీరు మీశక్తివలన కామరూపములను సృజించి భగవానునకు సహా మొనర్పు”డని చెప్పెను. బ్రహ్మయొక్క ఆజ్ఞ ననుసరించి ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుని, కుబేరుు గంధమాదనుని, విశ్వకర్మ నీలుని, వాయుదేవుడు హనుమంతుని సృజించిరి. వారందరును కామరూపులే సుడీ!
రామాయణము యుద్ధకాండమునందిట్లున్నది:-
తేకృత్వామానుషంరూపం వానరాః కామరూపిణః
కుశలం పర్యపృచ్ఛంస్తే ప్రహృష్టాభరతంతదా॥
నవనాగ సహస్రాణి యయురాస్థాయవానరాః
మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః॥

  కామరూపులగు వానరములు మనుష్యరూపమునుధరించి భరతుని కుశలమడిగిరి. అనేక భూషణ భూషితులగు వానరులు మనుష్యరూపమునుధరించి తొమ్మిదివేల ఏనుగులపైనెక్కి వెళ్ళిరి.
రామాయణము సుందరకాండ ద్వితీయ సర్గ యందిట్లున్నది:-
సూర్యోచాస్తంగతే రాత్రౌ దేహంసంక్షిప్యమారుతిః
వృషదంశకమాతోzథ బభూవాద్భుతదర్శనః

  సూర్యాస్తమయ మైనపిదప హనుమంతుడు శరీరమును చిన్నదిగానొనర్చి పిల్లిరూపమును ధరించెను. ఈ అపూర్వరూపముతో నాతడు రావణుని అంతఃపురమును ప్రవేశించెను. దేవతాస్వరూపులగు వానరులు కామరూపులనుటకీ ప్రమాణములు చాలును.