పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : శ్రీరామావతారము

  ఇక, ఏడవ అవతారము రామావతారమైయున్నది. ఈ రామావతారమువలన ఆదర్శజీవితమున కొక దృష్టాంతము చూపింపబడినది. ఇదియే ప్రపంచమునందలి మానవుల కెల్లరకును అనంత కాలమువరకు కళ్యాణ మార్గమైయున్నది.
రామాయణము బాలకాండయందిట్లు చెప్పబడియున్నది.
కౌసల్యాజనయద్రామం దివ్యలక్షణసంయుతం
విష్ణోరర్థంమహాభాగం పుత్రమైక్ష్వాకునందనం॥
భరతోనామకైకేయ్యాం జజ్ఞేసత్యపరాక్రమః
సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః సర్వైఃసముదితోగుణైః॥
అథలక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్ సుతౌ
వీరౌసర్వాస్త్రకుశలౌ విష్ణోరర్దసమన్వితౌ॥

  దశరధునకు ముగ్గురు భార్యలుండిరి. అందు కౌసల్యాదేవి దివ్యలక్షణ సంయుతుడును, విష్ణుభగవానుని అర్ధాంశము నగు శ్రీరామచంద్రుని ప్రసవించెను. కైకేయియు సర్వగుణ సంపన్నుడును, విష్ణుభగవానుని చతుర్థాంశమునగు భరతుని ప్రసవించెను. సుమిత్రాదేవి వీరులును, అస్త్రవిద్యానిపుణులును విష్ణుభగవానుని అష్టమాంశములునగు లక్ష్మణ శత్రుఘ్నలను ప్రసవించెను. ఈ విధముగా నలుగురును కలసి విష్ణుభగవానుని పూర్ణరూపమాయెను. మాయ పరమాత్మయొక్క నిత్యసంగినియైయున్నది. కావున మహామాయ సీతాదేవి రూపమును ధరించి స్త్రీజాతికొక సంపూర్ణమగు ఆదర్శమును చూపించి యున్నది.
రామోత్తర తాపన్యుపనిషత్తునందిట్లున్నది.
శ్రీరామసాన్నిధ్యవశా జ్జగదాధారకారిణీ
ఉత్పత్తిస్ధితిసంహారకారిణీ సర్వదేహినామ్
సాసీతాభవతిజ్ఞేయా మూలప్రకృతిసంజ్ఞితా॥

  పరమాత్మ స్వరూపుడగు శ్రీరామునిసాన్నిధ్యమునందు జగత్తునకంతకును ఆధారరూపిణియును. సృష్టి స్థితి ప్రళయకారిణియును, మూలప్రకృతి స్వరూపిణియునగు సీతాదేవి యుండెను. ఆదర్శమానవ జీవితము రామావతారమునందు చక్కగా ప్రదర్శింపబడెను. ఆదర్శ సతీజీవనము సీతాదేవి ద్వారా చక్కగా చూపింపబడినది. కావుననే అంశావతారము లన్నింటిలోను రామావతారమే ముఖ్యమైనది. కావుననే, ప్రపంచమునందు రామావతారము ఇంతగా పూజింపబడుచున్నది. రామావతారమందలి దేశకాలపరిస్థితులను పరిశీలించినయెడల రామావతారముయొక్క ఆవశ్యకత గోచరింపగలదు. పూర్వావతారమగు పరశురామావతారము వలన ప్రపంచమునందలి క్షత్రియు లందరును నశించిరి. క్రమక్రమముగా బ్రాహ్మణశక్తి అన్యమార్గములను పట్టుటచే, రావణునివంటి అత్యాచారులు సహితము బ్రాహ్మణ వంశమునందు జన్మింపసాగిరి. ఆసమయమున, ఏదైనా ఒక భగవచ్ఛక్తి ఆవిర్భవించి క్రుంగిపోవుచున్న క్షాత్రశక్తిని ఉద్ధరించి, బ్రాహ్మణ క్షాత్ర శక్తులకు సామంజస్య మొదవించి, ప్రపంచమునకొక ఆదర్శమానవ జీవితమును చూపించ వలసిన అవసరము కలిగినది. కావుననే శ్రీరామచంద్రమూర్తి క్షత్రియకులమునం దుద్భవించవలసి వచ్చినది. రావణాసురుని వలన పతివ్రతలగు స్త్రీలనేకులు చెడగొట్టబడిరి. పతివ్రతల హృదయవిదారకరోదనము భూనభోంతరాళముల భేదించుచుండెను. అప్పుడు మహామాయయే సీతారూపమున అవతరించి, రావణుని నాశనమునకు సహాయపడి స్త్రీజాతికొక ఆదర్శ జీవితమును చూపించెను.

  అన్నదమ్ములగు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడులు ప్రపంచమునకొక గొప్ప ఆదర్శము చూపెట్టిరి. రామచంద్రుని యందు సంపూర్ణ మానవత్వమును, సీతాదేవియందు ఆదర్శ నారీతత్వమును ప్రకటింపబడినవి.
రామాయణము బాలకాండమునందిట్లున్నది
ఇక్ష్వాకువంశప్రభవో రామోనామజనైశ్మ్రుతః
నియతాత్మా మహావీరో ద్యుతిమాశాధృతిమాన్ వశీ॥
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీశ్రీమాన్మత్రునిబర్హణః
విపులాంసోమహాబాహుః కంబుగ్రీవోమహాహనుః॥
మహోరస్కోమహేష్వాసో గూఢజత్రురరిండమః
ఆజానుబాహుఃసుకరాః సులలాటః సువిక్రమః
సమఃసమవిభక్తాంగః స్నిగ్థవర్ణఃప్రతాపవాన్
పీనవక్షోవిశాలాక్షో లక్ష్మీవాంచ్ఛుభలక్షణః॥
ధర్మజ్ఞఃసత్యసంధశ్ఛ ప్రజావాంచహితేరతః
యశస్వీజ్ఞానసంపన్నః శుచిర్వశ్యఃసమాధిమాన్
ప్రజాపతినమఃశ్రీమాన్ ధాతారిపునిషూదనః
రక్షితాజీవలోకస్య థర్మస్యపరిరక్షితా॥
రక్షితాస్వస్య స్వస్య స్వజనస్యచరక్షితా
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదేచనిష్ఠీతః
సర్వశాస్తార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వలోకప్రియఃసాధు రదీనాత్మావిచక్షణః॥
సర్వదాభిగతఃసద్భిః సముద్రఇవసింథుభిః
ఆర్యఃసర్వసమశ్చైవ సదైవప్రియదర్శనః॥
సచసర్వగుణోపేతః కౌసల్యానందవర్థనః
సముద్రఇవగాంభీర్యే ధైర్యేణహిమవానివ॥
విష్ణునాసదృశోవీర్యే సోమవత్ ప్రియదర్శనః
కాలాగ్నిసదృశఃక్రోధే క్షమయాపృధివీసమః
ధనదేవసమస్త్వాగే సత్యేధర్మఇవాపరః॥

  ఇక్ష్వాకు వంశమునందు జగత్ప్రసిద్ధుడగు శ్రీరామచంద్రు డుత్పన్నమాయెను. వానియందు సంపూర్ణ మానవుని కుండవలసిన సమస్త సద్గుణములును నిండియుండెను. అతడు మహావీర్యవంతుడును, కాంతిమంతుడును, ధృతిమంతుడును, జితేంద్రియుడును, బుద్ధిమంతుడును, రాజనీతియందు పరిపూర్ణ జ్ఞాతయును, వక్తయును, శ్రీమంతుడును, బహిరంతర శత్రునాశకుడును, విపులమస్తకుడును, మహాబాహుడును, శంఖమువలె రేఖాత్రయ విశిష్టగ్రీవము గలవాడును, విశాలవక్షము గలవాడును, మహాధనుర్థరుడును, సుశీలుడును, విశాలనేత్రములు గలవాడును, స్నిగ్ధశ్యామలవర్ణము గలవాడును, ప్రజాహితపరాయణుడును, కీర్తి సంపన్నుడును, శౌచ సంపన్నుడును, బాహ్యభ్యంతర శుద్ధిగలవాడును, వినయశీలుడున, యోగయుక్తుడును, ప్రజాపోషణ సామర్థ్యయుక్తుడును, జీవరక్షకుడును, ధర్మరక్షకుడును, స్వజనరక్షకుడును, వేదవేదాంగ మర్మజ్ఞుడును, ధనుర్వేద పరిజ్ఞాతయును, సర్వలోక ప్రియమగు మృదుమధుర స్వభావముగలవాడును, దైన్యస్వభావము లేనివాడును, లౌకికాలౌకిక సర్వక్రియాశీలుడును, సర్వసత్పురుష సంసేవితుడును, సుఖదుఃఖాది ద్వంద్వవికారరహితుడును, సర్వసద్గుణ సంయుతుడును, రాజునకుండవలసిన యోగ్యతలు గలవాడును, క్రోధమునందు కాలాగ్ని రుద్రుడును, క్షమయందు పృధ్వీతుల్యుడును, ధనదానమునందు కుబేరుడును, సత్యపాలనమునందు సాక్షాత్ ధర్మరాజునై యుండెను. ఇన్ని సద్గుణము లాతనియందు కేంద్రీకరించుటచేతనే అతడు సమస్త మానవులకును, సమస్త క్షత్రియులకును, సమస్త గృహస్థులకును, ఆదర్శప్రాయుడై యున్నాడు. ప్రజలందరును బాగుగా సుఖించునపుడే రాజు నిజముగా సార్థకుడగును.