పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : శ్రీకృష్ణావతార ప్రశంస

  శ్రీకృష్ణావతారమునందు భగవానుడొనర్చిన కార్యములన్నింటిని ప్రతిహిందువుడును ఎరింగియే ఉన్నాడు. కావున, వానినిగూర్చి వివరింపవలసిన అవసరములేదు. కాని, కొన్ని ముఖ్యవిషయములను మాత్ర మిచట విశదీకరించెదము. భగనానుడు సచ్చిదానంద స్వరూపుడగుటచే ఆతని అవతారము నందు సహితము సత్ భావము, చిత్ భావము, ఆనంద భావములను 3 భావములునుండును. సత్ భావమునకు కర్మతోడను, చిత్ భావమునకు జ్ఞానముతోడను, ఆనందభావమునకు భక్తితోడను, సంబంధమున్నది. కావున పూర్ణావతారమునందు కర్మ, జ్ఞాన, భక్తులను 3 లీలలును ప్రదర్శింపబడినవి. ఆతడు పూర్ణకర్మిష్ఠియును, పూర్ణజ్ఞానియును, పూర్ణరసికుడు నైనప్పటికిని, త్రిగుణాతీతుడగుటచే నిర్లిప్తుడైయుండును. శ్రీకృష్ణుడు పూర్ణావతారమగుటచే ఆతని జీవితమునందు కర్మ, జ్ఞాన, భక్తిభావముల, సర్వోత్తమ అలౌకిక ఆదర్శము చక్కగా ప్రదర్శింపబడినది. అంశావతారమునందు అంశకళలుమాత్ర ముండుటచే వానిపనులన్నియు ఏదొ ఒక ముఖ్యభావమును మాత్రమే ఆశ్రయించియుండును. శ్రీ రామచంద్రునియందు మర్యాదాభావమే ముఖ్యమగుటచే సీతాదేవి నిర్దోషియని ఎరింగియును, కేవల వంశమర్యాదా రక్షణముకొరకు ఆమెను వనముల కంపినాడు. కాని పూర్ణావతారము భావాతీతమగుటచే ఏదో ఒక భావము నాశ్రయించి కార్యము లొనర్పవలసిన అవసరములేదు. వారు కేవల జగత్కళ్యాణము కొరకును, సమిష్టి ధర్మరక్షణముకొరకును కార్యము లొనర్చెదరు. కావుననే ధర్మరాజుచేత అసత్యములను పల్కించి ద్రోణుని చంపించినను శ్రీ కృష్ణునకు పాపమురాలేదు. అటులనే ఆతడొనర్చిన అనేక కార్యములను లౌకికదృష్టితో చూచినప్పుడు చెడుగా కాన్పించినను జగత్కళ్యాణదృష్టితో పరిశీలించినప్పుడుమాత్రము అది సంపూర్ణ నిర్దోషయుతములుగానే కాన్పించును. ఇదియే పూర్ణావతారమందలి కర్మరహస్యమై యున్నది. ఇక ఆతని భక్తిలోని రహస్యమేమన:- అన్నిరసములలోని భక్తులును ఆతని విభిన్నలీలలను ఆశ్రయించి తమకు అనుగుణ్యముగ స్వీకరింపవచ్చును. కారణమేమన ఆతడు పూర్ణావతారమగుటచే ఆతనియం దన్నిరసములును నిండియున్నవి. కావుననే ఆతనిభక్తులయం దన్నిరసములవారును ఉన్నారు. పాండవులు సఖ్యరసమందలి భక్తులు! విదురాదులు దాస్యరసమందలి భక్తులు! యశోదాదులు వాత్సల్యరసమందలి భక్తులు! భీష్మాదులు వీరరసమందలి భక్తులు! వ్రజగోపికలు కాంతారసమందలి భక్తులు!