పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : శంకా సమాధానములు

  ఈ కాంతారసమునందలి రహస్యము లెరుంగజాలక కొందరుమూఢులు శ్రీకృష్ణుని మహోన్నత చరిత్రముపై కళంకము నారోపింప ప్రయత్నించుచున్నారు. కావున రాసలీలను గురించి కొంచెము వివరించుట సమంజసమని భావింపుచున్నాము.
శ్రీమద్భాగవతమునందిట్లున్నది.:—
యోగేశ్వరేణ కృషేనతాసాం మధ్యేద్వయోర్ద్వయోః
ప్రవిష్ఠేన గృహీతానాం కంఠేస్వనికటం స్త్రీయః

  రాసలీలా సమయమున యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు అనేక శరీరములను ధరించి, ఇద్దరిద్దరు గోపికలమధ్య తాను ఒక్కక్కడుగా నిల్చుండెను. గోపికలు తమతమ యిండ్లనుండి పారిపోయి వచ్చిరి. కావున, శ్రీకృష్ణుడు గోపికారూపములను ధరించి, వారిపతులకు అనుమానము కలుగకుండ వారిగృహములయం దుండెను.

  గొప్ప యోగియగువాడుతప్ప ఇన్నిరూపములను ధరించి ఇట్లు మెలంగగలడా? కావుననే వేదవ్యాసుడిచట శ్రీకృష్ణుని “యోగీశ్వరు” డని వ్రాసినాడు. కామేశ్వరుడనియో, రతీశ్వరుడనియో వ్రాసియుండలేదు. ఇక ముఖ్యముగ ఆలోచింపవలసిన విషయమేమన, స్వయముగా తానొక్కడే స్త్రీరూపములను పురుషరూపములనుకూడ ధరింపగలిగిన యోగీశ్వరునియందు కామముద్భవించునా, లేదా, యనునదియే ఆలోచనీయాంశము. తనపై తనకు కామము కలుగదనియు, ఇతరులపై మాత్రమే కామము కలుగుననియు, పాఠకులకందరకును, తెలిసియేయున్నది. రమించుట యనునది ద్వైతమునందే సంభవించును కాని అద్వైతమునందు సంభవింపజాలదు. ఆత్మారాముడగు యోగిమాత్రమే తనయందు తాను రమించును. కాముకుడగువాడు ఇతరులతో రమించును. వాడు తనతో రమింపజాలడు. కావున ఒకే కృష్ణుడు స్త్రీరూపమునందును పురుషరూపమునందును అద్వితీయముగా నున్నప్పుడు, అతని యోగస్థితి కామదశకన్న ఉన్నతమై యున్నదని నిస్సందేహముగా చెప్పనగును. భాగవతమునందిట్లు వ్రాయబడియున్నది:-
గోపీనాం తత్పతీనాంచ సర్వేషాం చైవదేహినాం
యాzస్తశ్చరతి సోzధ్యక్షః క్రీడనేనేహదేహభాక్
అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాశ్రితః
భజతైతాదృశీః క్రీడాయాః శ్రుత్వాతత్పరోభవేత్॥

  ఏభగవానుడు గోపికలయందును, గోపికల భర్తలయందును నిండియున్నాడో, ఆభగవానుడు శరీరమునుధరించి ఇట్టి లీల లొనర్చుటకు కేవలము భక్తవాత్సల్యమే కారణమైయున్నది. కావున కృష్ణునియందు కామాదిభావముల నారోపించుట సమంజసముకాదు. వేదవ్యాసుని “యోగీశ్వరేణ కృష్ణేన” అను వాక్యమే దీనిని ఋజువుచేయగలదు.

  కానీ, స్థూలసంభోగ ద్యోతకములగు భాగవతశ్లోకముల భావమేమని కొందరు ప్రశ్నించవచ్చును. పూర్వజన్మయందు భగవానుని సంయోగము నాశించి తపమాచరించిన ఋషులందరును గోపికలై యుద్భవించిరి. వారు శ్రీకృష్ణుని మధురమోహనమూర్తిని దర్శించినపుడు, స్థూలరూపమున వానితో కలియవలయు ననెడి కోరిక వారికి కలుగుట స్వాభావికమే యగును. కాని, భాగవతమునం దిట్లు చెప్పబడియున్నది:-
నమయ్యావేశిత ధియాంకామః కామాయకల్పతే
భర్జితః క్వథితోథానః ప్రాయోబీజాయనేవ్యతే॥

  భగవానునియెడ కామభావముతో ప్రీతి కలిగినప్పటికిని, ఆ కామము దగ్ధబీజమువలె అంకురము నుత్పన్న మొనర్పజాలదు. అది ఎట్లు సంభవమగునని పరీక్షిత్తు ప్రశ్నించగ బ్రహ్మర్షియగు శుకుడిట్లనుచున్నాడు.:-
కామంక్రోధం భయం స్నేహమైక్య సౌహృదమేవచ
నిత్యం హరౌ విదధతోయాన్తి తన్మయతాంహితే॥
నచైవం విస్మయః కార్యోభవతా భగవత్యజే
యోగేశ్వరేzశ్వరే కృష్ణేయత ఏతద్ విముచ్యతే॥

  కామ, క్రోధ, స్నేహ, భయాది భావములలో ఏదో ఒకదానిద్వారా భక్తుడు భగవానునియం దాసక్తుడై క్రమక్రమముగా తన్మయతనంది, ఆ తన్మయతద్వారా భగవానునియందు లవలీనమై, భక్తుడు ముక్తినందుచున్నాడు. గోపికలు సహిత మటులనే పూర్వ సంస్కారముననుసరించి శ్రీకృష్ణుని యందాసక్తులై స్థూలసంభోగమును వాంఛించిరి. కాని శ్రీకృష్ణుని అలౌకికశక్తివలన ఆకర్షింపబడి కొలదిసేపటిలోనే తన్మయులయ్యెడివారు. వారు తన్మయులైనపిదప, తమనుతామే మరచినపిదప, మనస్సే నశించినపిదప, మనస్సులోని కామాదులెట్లు నిలువగలవు. ఈవిధముగా తన్మయతద్వారా, మనస్సును మనోవృత్తులను పోగొట్టుకొని భగవానునియందు లవలీనులై గోపికలు ఉన్నతగతినందిరి. ఇదియే రాసలీలలోని గూఢరహస్యము.

  ఇటులనే వస్త్రాపహరణమును గురించియును కొందరు అనేకవిధముల శంకించుచుందురు. దీనిలోని రహస్యమేమన, గోపికలు శ్రీకృష్ణుని పతిగా పొందవలయుననెడి తలంపుతో కాత్యాయనీవ్రత మాచరింపుచుండిరి. భాగవతమునం దిట్లున్నది:-
“నందగోపసుతందేవి పతింమే కురుతేనమః॥“

  తల్లీ! కాత్యాయనీ నందకుమారుడగు శ్రీకృష్ణుని నాయొక్క భర్తగా అనుగ్రహింపుము; నేను నీకు నమస్కరింపుచున్నాను.

  శ్రీకృష్ణుడు పరమాత్మయగుటచే, పరమాత్మనుపొందుటకెన్ని యోగ్యత లుండవలయునో అన్ని యోగ్యతలును లేనియెడల శ్రీకృష్ణుడు వారికి భర్త కాజాలడు. కావున, వస్త్రాపహరణముద్వారా శ్రీకృష్ణుడు గోపికల యోగ్యతను పరీక్షించి యున్నాడు. జీవునకు శరీరముపై అభిమాన మున్నంతవరకును, పరమాత్మను పొందజాలడనుట శాస్త్రీయసిద్ధాంతమై యున్నది. కామ, భయ, లజ్జాదులు శరీరముపై అభిమాన మున్నంతవరకును మనుష్యుని ఆశ్రయించి యుండును. కాని, బాలునియందు కామములేదు; కావుననే దిగంబరిగా నుండుటకు బాలుడు సిగ్గుపడుటలేదు. అటులనే పరమహంసలగు మహాత్ములు సహితము పరమాత్మనుపొంది శరీరాభిమానమును త్రెంపుకొనుచున్నారు. కావున, వారుకూడ నగ్నముగానే తిరుగుచున్నారు. ఎంతవరకిట్టిస్థితి లభించదో, అంతవరకును కామక్రోధాదులు వీడజాలవు.; అంతవరకును పరమాత్మలభింపడు; అంతవరకును వస్త్రములతో తనసిగ్గును కాపాడుకొను చుండవలయును. గోపికలు పరమాత్మను పొందవలయునని వాంఛించుచుండిరి. కాని, వారికి దేహాభిమానము నశింపలేదు. ఈ విషయమునే శ్రీకృష్ణుడు “వస్త్రాపహరణము” ద్వారా స్పష్టీకరించెను. ఎంతవరకు దిగంబరిగా నుండుటకు సిగ్గుపడుదురో అంతవరకును పరమాత్మ లభింపజాలడని ప్రబోధించెను. ఈవిధముగా కృష్ణునియందు భక్తిలోని అన్నిరసములును సంపూర్ణత నందినవి. ఇక ఆతని జీవనమునందు జ్ఞానమెట్లు పూర్ణత్వమందెనో, కొంచెము గీతాశాస్త్రమును పరిశీలించిన యెడల తెలియగలదు.

  పురుషధర్మవిజ్ఞానము రాజధర్మవిజ్ఞానము, సమాజనీతి విజ్ఞానము, సాధారణధర్మవిజ్ఞానము, ఆపద్ధర్మవిజ్ఞానము, ధర్మయుద్ధనీతివిజ్ఞానము, వర్ణాశ్రమధర్మవిజ్ఞానము, మొదలగు జ్ఞానకాండయందలి అన్ని అంగములును, లీలావిగ్రహుడగు భగవానుని కథలవలనను, ఉపదేశములవలనను, చక్కగ గ్రహింపవచ్చును. ఇదియే శ్రీకృష్ణుని జ్ఞానమయ జీవితమందలి అపూర్వ ఆదర్శమైయున్నది. కావున, పూర్ణావతారమగు శ్రీకృష్ణునియందు కర్మ, ఉపాసనా, జ్ఞానములు సామంజస్యము నందినవి.