పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : పరశురామావతారము

  ఆరవ అవతారము పరశురామావతారము. ఈ అవతారమునందు బ్రాహ్మణద్వేషులగు క్షత్రియులనందరను భగవానుడు నాశనమొనర్చెను.
మనుసంహితయందిట్లున్నది:—
నాబ్రహ్మక్షత్రమృధ్నోతి నాక్షత్రంబ్రహ్మవర్థతే
బ్రహ్మక్షత్రశ్చసంపృక్త మిహచాముత్రవర్ధతే॥

  బ్రహ్మశక్తి లేనిదే క్షాత్రశక్తి పుష్టి నొందజాలదు. క్షాత్రశక్తి లేనిదే బ్రాహ్మణశక్తి వృద్ధినొందజాలదు. రెండింటియొక్క పరస్పర సహాయ సహానుభూతులవలననే ప్రపంచకళ్యాణము జరుగగలదు. కాని, త్రేతాయుగమునం దొకానొకప్పుడు బ్రాహ్మణ క్షత్రియుల యందలి పరస్పర సహానుభూతి నశించెను. క్షత్రియులు అధికార మదోన్మత్తులై, నిరపరాధులగు బ్రాహ్మణులను హింసింపసాగిరి. ఈ కారణమున ధర్మమునందు గ్లాని సంభవించెను. దత్తాత్రేయుని వరప్రభావమువలన గర్వించి కార్తవీర్యార్జునాదులు తమతపోబలమును ధర్మనాశనమునందు వినియోగింపసాగిరి. అప్పుడు భగవానుడు అవతారమును ధరించి అధార్మికమగు క్షాత్రశక్తిని నాశనమొనర్చి ప్రపంచమునందు శాంతిని, ధర్మమును స్థాపించెను. కావుననే పరశురాముడు 21 మారు భూలోకమందలి దుష్టక్షత్రియులనెల్లరను వధించెను. కాని, శ్రీరామచంద్రావతార ముద్భవించిన వెంటనే, పరశురాముని శక్తియంతయును శ్రీరామునియందు ప్రవేశించెను.
రామాయణమునందిట్లున్నది.
తతఃపరశురామస్య దేహన్నిర్గత్యవైష్ణవమ్
పశ్యతాంసర్వదేవానాం తేజోరామముపాగమత్॥

  పరశురామునిలోని శక్తి రామచంద్రునియందు ప్రవేశించెను. దేవతలందరును ఈ అలౌకిక దృశ్యమును చూడసాగిరి.