పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : మత్స్యావతారము

  ఇక, 10 అవతారములగురించి సంక్షిప్తముగ వివరించెదను. ఈ పది అవతారములలోను, మొట్టమొదటిది మత్స్యావతారము నైమిత్తిక ప్రళయ సమయమున, సృష్టి యంతయును జలమగ్నమైనయపుడు, సృష్టిబీజమును రక్షించుట కీయవతారము ఆవిర్భవించును. జలమునుండి సృష్టిని రక్షింపవలయును. కావున జలచరమగు చేపరూపమున భగవదవతారము జరుగవలసియున్నది. ఈ విషయమును గురించి యగ్నిపురాణమునందిట్లు వర్ణింపబడియున్నది.:— పూర్వకల్పాంతరమునందు నైమిత్తిక ప్రళయము జరిగిన పిదప పృధ్వివ్యాది లోకములన్నియు జలమగ్నములయ్యెను. ఆ సమయమునకు క్రితమే వైవస్వతమనువు ఘోరమగు తపమొనర్చుచుండెను. ఒకరోజు అతడు కృతమాలా నదియందు తర్పణమొనర్చుచున్నపుడు, ఒక చిన్నచేప అతని దోసిలిలోనికి వచ్చెను. మనువు దానిని మరల నీటియందు వదలివేయబోయెను. కాని ఆ మత్స్యమిట్లనెను, “రాజా; నన్ను నదియందు పారవేయకుము. నేను నదియందలి “మొసలి” మొదలగు జంతువులను చూచి చాల భయపడుచున్నాను.” అనెను. ఆమాటలనువిని మనువు దానిని తన చెంబులో పడవైచెను. కొంచెము సేపున కామత్స్యము మరింత పెద్దదిగానై నాకు మరియొక స్థానము చూపింపుమని అడిగెను. మనువు దానిని ఒక సరస్సునందు పడవైచెను. కాని, అది క్రమక్రమముగా పెరుగుచు సరస్సునంతయు కప్పివైచెను. మనువు దానిని చూచి, “దేవా! నీవు భగవానుడవుకాని, సామాన్యమత్స్యమువుకావు. నన్ను భ్రాంతియందు పడవేయకుము” అని ప్రార్థించెను. అప్పుడా మత్స్యరూపమందున్న భగవానుడు “నేను దుష్టులను నాశనమొనర్చి ధర్మమును రక్షించుటకై అవతరించినాను. నేటికి ఏడవదినమున ప్రళయము సంభవించి ప్రపంచమునంతయును జలమగ్నమగును. అప్పుడు నేనొక నావను పంపెదను. దానియందు నీవును, సప్తఋషులును నివసింపవలయును” అని సెలవిచ్చెను. అటులనే 7 వ దినము ప్రళయము జరిగెను. నావవచ్చెను. నావయందు సప్తఋషులును, మనువును కూర్చుండి సృష్టిబీజములను కాపాడిరి.