పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : కల్క్యావతారము

  ఇక 10 వ అవతారము కల్కిఅవతారము.ఈ అవతారమింకను ఆవిర్భవింపలేదు. కలియుగము 4 లక్షల32 వేలసంవత్సరముల పరిమాణము కలిగియున్నది. అదిప్పటికి 5 వేలసంవత్సరములు మాత్రమే గడచినది. కావున కల్కిఅవతార ముద్బవించుటకు కింకను చాలాకాలము గడువవలసి యున్నది. ఇంకను ధర్మమునకు సంపూర్ణమగు గ్లాని సంభవింపలేదు. అనేకవిధములగు భగవద్విభూతులవలనను, ఆవేశావతారములవలనను, ఋషులవలనను, కొంతవరకు ధర్మము కాపాడబడుచునే యున్నది. కావున, ఇప్పుడే భగవంతుడు అవతరింపవలసిన ఆవశ్యకత కలుగలేదు. ఆ అవతార ముద్భవించెడి సమయమునందు దేశకాలపరిస్థితు లెట్లుండునో ఆవిషయమంతయును శ్రీమద్భాగవతాది గ్రంథములందు స్పష్టముగా వివరింపబడి యున్నది. అప్పుడు ప్రపంచమంతయును మహాపాపభూయిష్టమై యుండును. మనుష్యులందరును ధర్మచ్యుతులగుదురు. రాజులు ప్రజాపీడన మొనర్చెదరు. మ్లేచ్ఛులకు రాజ్యాధికారము లభించును. అప్పుడు కల్కి అవతార ముద్భవించి మ్లేచ్ఛులను, పాపులను నాశనమొనర్చి పుణ్యాత్ములను రక్షించును. అతడవతరించినపిదప మరల సత్యయుగము ప్రారంభించి ధర్మము వ్యాపించును. ఇదియే అంశావతార, పూర్ణావతారముల సంక్షిప్త వివరణమై యున్నది.

  ఈ అంశావతార పూర్ణావతారములేకాక, ఇంకను 3 విధములగు అవతారములున్నవని ఇంతకుక్రితమే చెప్పి యున్నాము.
“నిమిత్తాద్ విశేషా విశేషా”
“అంతరావిర్భావ నిత్యత్వం

  ఏదేని ఒక నిమిత్తమువలన విశేష, అవిశేషావతారము లుద్భవించును. అంతఃకరణమునందు భగవానుని నిత్యావతారముండును. విశేషావతారమునే ఆవేశావతారమనికూడ చెప్పెదరు. పద్మపురాణ ప్రమాణమును చూడుడు:-
“అవిష్టోzభూత్ కుమారేషునారదే చహరిర్విభుః”
“ఆవివేశపృథుందేవః శంఖీ చక్రీ చతుర్భుజః”

  భగవానుడు సనత్కుమారాది మునులయందును, నారదాదుల యందును, పృథునందును ఆవిష్టుడైయున్నాడు. కావున వీరందరును ఆవేశావతారములు. ఒక్కొక్కప్పుడు భగవద్భావ మావేశించి, అన్యసమయములయందు ప్రాకృతజనమువలె నుండెడివారే అంశావతారము లనబడుదురు. ఇదియే శాస్త్రోక్తమగు విశేష , అవిశేషావతార రహస్యమై యున్నది. దీక్షనొసంగునప్పుడు గురువులో అవిశేషావతారమే ప్రకటమగును. గురువు సాక్షాత్తు భగవంతుడని ఆర్యశాస్త్రములయందు చెప్పబడియున్నది. భగవానుడు నిరాకారుడగుటచే, మనుష్యునకు ప్రత్యక్షసంబంధమును కలిగియుండజాలడు. కావున “ గురువు” అను మనురూపమగు కేంద్రముద్వారా భగవంతుడు తన జ్ఞానశక్తిని ప్రకటమొనర్చి, శిష్యుని తనవైపు ఆకర్షించును.

  ఈవిధముగా విశేష, అవిశేషావతారములవలన అధర్మనాశనమును, ధర్మోన్నతియును జరుగుచుండును.

  సర్వవ్యాపియును, సర్వశక్తిమంతుడును, జ్ఞానమయుడునగు పరమాత్మ సర్వాంతర్యామి యగుటచే ప్రతిజీవియొక్క హృదయమందును విరాజమానుడై యున్నాడు. ఆ హృదయాసనమునందుండియే భగవానుడు జీవులను పాపకర్మమునుండి మరల్చును. పుణ్యకర్మములవైపు చిత్తవృత్తిని ప్రేరేపించుచు, జీవుడు అధోగతినందకుండ కాపాడుచుండును. దీనికే నిత్యావతారమని పేరు. పైన ఉదహరించిన పూర్ణకళావతార, అంశావతారములకువలెనే, ఈ యవతారముల యందు సహితము కళలలో వ్యత్యాసముండును. ఉదాహరణముగా:-
ఆవేశావతారమగు చైతన్యునకును, నారదునకును చాల వ్యత్యాసముండును. కారణమేమన, భగవానుడు నారదుని ఆవేశించినసమయమున షోడశకళలతో ఆవేశింపవచ్చును. అటులనే గురువునందును సంభవించవచ్చును. అటులనే, నిత్యావతారమునందు సహితము విబిన్నవ్యక్తులయందు వ్యత్యాసము లుండవచ్చును. ఒకనియందు యంతరాత్మ పాపకార్యము లొనర్పవలదని బోధించుచున్నను వాడు వినకపోవచ్చును. మరియొకడు క్రమక్రమముగా భగవానుని ప్రబోధమును స్వీకరించి ఉన్నతి నందవచ్చును. సామాన్యమానవునికన్న శరునజ్ఞుడగు వానియందెక్కువ కళలుండును. వానికంటెను భక్తునియందు ఎక్కువ కళలుండును. వానికన్నను పూర్ణజ్ఞానియగు జీవన్ముక్తునియందు ఎక్కువ కళలుండును. ఇదియే సర్వశక్తిమంతుడును, షోడశకళాపూర్ణుడునగు భగవానుని 5 విధములగు యవతారములలోని తత్త్వమైయున్నది. భగవచ్ఛక్తియొక్క వికాసకేంద్రము లగుటచే వీరందరును పూజ్యులైయున్నారు. కావున “అవతారోపాసన” నవధా విభక్త ఉపాసనలోని ఒక ప్రధానాంగమై యున్నది. కాన నీ పై విషయములను గుర్తెరింగి భగవదావతారములను నిందింపక యుపాసించి యైహికాముష్మిక సుఖంబులం బొందెదరుగాక।

అవతారమీమాంస సంపూర్ణము.