పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : బుద్ధావతారము

  ఇక 9 వ అవతారము బుద్ధావతారము. శ్రీమద్భాగవతమునం దిట్లు వ్రాయబడియున్నది:-
తత:కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్
బుద్ధో నామాంజనసుతః కీకటేషు భవిష్యతి॥

  బుద్ధావతారము కలియుగమునం దవతరించినది. కీకట ప్రదేశము (ఇప్పటి గోరఖ్ పూర్ జిల్లా) నందు శుద్ధోనునకు పుత్రుడై బుద్ధభగవాను డుదయించెను.

  బుద్ధావతార ముదయించుటకుపూర్వము ప్రపంచమంతయు అల్లకల్లోలముగా నుండెను. జ్ఞానహీనమగు కర్మకాండయును, ఉపాసనయును విపరీతముగా వ్యాపించెను. మూర్ఖులగు వారు వైదికయజ్ఞములను పేరుతో లక్షలకొలది పశువులను వధించుచుండిరి. నరబలులుసహిత మొసంగబడుచుండెను. జీవహత్య పెరిగిపోవుటచే ధర్మమునకు గ్లాని సంభవించెను. అసురభావము వృద్ధినందెను. అప్పుడు బుద్ధభగవాను డవతరించి, ఘోరమగు పశుహత్యలను ఆపి, రాక్షసభావమును, నాశనమొనర్చెను. బుద్ధుడు భగవదవతారమైనను, వేదవిరోధమగు మతమును స్థాపించుట కొకకారణమున్నది! అంశావతారమందలి కార్యములన్నియు దేశకాలముల ననుసరించి యుండుననియు, వారు స్థాపించిన ధర్మము ఏక దేశీయమగుటచే, అది పరివర్తనశీలమై యుండుననియు ఇంతకుక్రితమే మనవిజేసి యున్నాము. దేవునిపేరిట జరుగుచున్న అత్యాచారముల నాపుటకు బుద్ధుడప్పు డట్టిమతమునే స్థాపింపవలసియుండెను. అంతకన్న గత్యంతరమేమియును లేదు. విషము ప్రాణోపద్రవకరమగు వస్తువైనను, కఠినరోగగ్రస్తునకు విషమును కూడ ఔషధరూపమున త్రాగించినట్లే, బుద్ధావతారకాలమందలి జీవహత్యారూపమగు భయంకర జాతీయరోగమును నాశనమొనర్చుటకు నాస్తికతయను విషమును బుద్ధుడు ప్రయోగింపవలసివచ్చెను. దీనివలన అతడు ఆసమయమునందు జీవహత్యారూపమగు పాపమును తొలగించి జ్ఞానమూలకమగు బౌద్ధధర్మమును వ్యాపింపజేసెను. కాని, రోగావస్థయందు పుచ్చుకోవలసిన విషమును ఆరోగ్యావస్థ యందు సేవించినయెడల ప్రాణోపద్రవకర మైనటులనే, ఈ నాస్తికధర్మము తాత్కాలికముగ ఫలవంతమైనను క్రమక్రమముగా భయంకరరూపమును ధరించి పాపమును వృద్ధిజేయదొడంగెను. అప్పుడు భగవానుడగు శంకరుని కళవలన అంశావతారముగ శంకరాచార్యు డవతరించి, తన ప్రచండ శాంకరీ ప్రతాపమువలన భారతదేశమునందు బౌద్ధధర్మమును అణచివైచి వైదికధర్మమును పునఃప్రతిష్టిత మొనర్చెను.