పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : భగత్కలా విచారము

  సర్వవ్యాపకుడును, నిరాకారుడునగు పరమాత్మను స్థూల లౌకిక రూపమున ప్రదర్శించుట యనునది యొక అపూర్వ విషయమై యున్నది. కావుననే, అవతార విషయమున అనేక సందేహా లుత్పన్నము లగుచున్నవి. ఇచ్ఛారహితుడగు భగవానుని అంతఃకరణమునందు సంసారికివలె ప్రపంచమునందు లీలారూపము ధరింపవలయుననెడి ఇచ్చ ఎట్లు జనించినది? మాయారహితుడగు నిరాకార పరమాత్మ మాయామయుడగు స్థూలదేహము నెట్లు ధరించెను? దేశకాల వస్తువులనలన సీమారహితుడై సర్వవ్యాపకుడగు పరమాత్మ ఒకచోటినుండి మరియొక చోటికి వచ్చెననునది, అసమంజసము కదా! కారణమేమన - వారు అంతకు క్రితము లేనిచోటికే కదా రావలయును? ఉన్నచోటునుండి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ లేడనియే కదా భావము? ఇట్లు ఒక చోటునుండి మరియొక టోటికి ఈ స్థూల శరీరముతో పరమాత్మ పరుగెత్తవలసిన కారణము మాత్రమేమున్నది? ఆతడు సర్వశక్తి సమన్వితు డైన యెడల తన ఇచ్ఛా మాత్రముననే దుష్టులను సంహరింపజాలడా?

  అలౌకిక భావమయమగు అవతార తత్వమును గూర్చి ఇట్టి శంకలెన్నియో కలుగుచున్నవి. కావున, ఈ పుస్తకమునందు పైప్రశ్నల కన్నింటికి సంక్షిప్తముగ జవాబులు చెప్పి అవతారతత్త్వ నిరూపణ మొనర్పబడును. అవతార విషయమున శాస్త్రముల యందనేక ప్రమాణము లున్నవి.
ఋగ్వేదము మం. 6, అ, సూ. 47, శి లో:-
రూపంరూపం ప్రతిరూపోబ భూవతదస్యరూపం ప్రతిచక్షణాయ
ఇంద్రోమాయాభిః పురురూపఈయతేయుక్తా హ్యాస్యహరయఃశతాదశ॥

  భక్తులయొక్క ప్రార్థన ననుసరించి భగవంతుడు మాయా సంయోగముతో జీవ, అవతారాది అనేకరూపములను ధరించును. అట్టి రూపము లనేకములున్నవి. కాని 10 మాత్రమే ముఖ్యమైనవి.
భగవద్గీతయందిట్లున్నది:-

అజోపిసన్నవ్యయాత్మా భూతానామీశ్వరోzపిసన్
ప్రకృతింస్వామవష్టభ్య సంభవామ్యాత్మమాయయా।
యదాయదాహిధర్మస్య గ్లానిర్భవతిభారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానంసృజామ్యహమ్॥
పరిత్రాణాయసాధూనాం వినాశాయచదుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామియుగేయుగే॥

  అజన్ముడును, అవ్య యుడును, సర్వభూతేశ్వరుడు ఐనను మాయయొక్క ఆశ్రయమువలన పరమాత్మ ప్రపంచమునం దవతరించుచున్నాడు. ధర్మగ్లానియును, అధర్మవృద్ధియును కలిగిన వెంటనే భగవంతుడు అవతారమును ధరించుచున్నాడు. సాధువులను రక్షించుటకొరకును, దుష్టులను నాశనమొనర్చుటకును, ధర్మమును సువ్యవస్థిత మొనర్చుటకును, పరమాత్మ ప్రతి యుగమునందును అవతరించును. ఈవిధముగా ఆర్యశాస్త్రములయందు అవతారమును గురించిన అనేక ప్రమాణములు లభించుచున్నవి.

  పరమాత్మ సర్వశక్తి మంతుడును, సర్వవ్యాపకుడు నగుటచే, అతడు ఒకచోటనుండి మరియొక చోటికి వచ్చెననుట మాత్రము విజ్ఞాన విరుద్థమేయగును. కాని, అవతార విషయమునందు మాత్ర మేమియును అసంభవత కానిపించుటలేదు. అవతారమనగా ఒకచోటనుండి మరియొక చోటికివచ్చుట యని అర్థమెంత మాత్రమును కాదు. కాని, సర్వవ్యాపకుడగు పరమాత్మయొక్క శక్తి, ఒకానొక విశేష కేంద్రమునుండి ప్రకటమగుటకే అవతారమనిపేరు. అవతార శబ్దమందలి అవతరణము (క్రిందికిదిగుట) భావమూలకము మాత్రమే. పరమాత్మయొక్క విశేషశక్తి, మాయద్వారా సంబంధింపబడి ప్రకటింపబడుటకే భావరాజ్యమునందు అవతరణ మనబడును.

  పరమాత్మ సర్వవ్యాపకుడగుటచే అతని శక్తికూడ సర్వవ్యాపినియై యున్నది. అతని పై ఆధారపడియున్న జడచేతనాత్మకమగు దృశ్యప్రపంచముద్వారా ఆశక్తి వికాసమును పొందుచుండును. కావుననే జడచేతనాత్మకముల యందెల్లడల కాన్పించు శక్తియంతయును అతని శక్తియే; అతనియొక్క ఈ శక్తియే అగ్ని యందును, జలము నందును, ఓషధుల యందును, వనస్పతుల యందును, ప్రపంచము నందంతటను వ్యాపించి యున్నది.
పంచ దశీకారుడిట్లనుచున్నాడు:—
సర్వశక్తిమయంబ్రహ్మ నిత్యమాపూర్ణమద్వయమ్
యధోల్లసతిశక్త్యాసౌప్రకాశమధిగచ్ఛతి॥

  అద్వితీయ బ్రహ్మమునందు శక్తి నిండియున్నది. ఈ శక్తి ఎప్పుడు దృశ్యమును ఆశ్రయించి ఉల్లసించుచున్నదో, అప్పుడు ఇది దృశ్య జగత్తునందు ప్రకాశించు చున్నది. వికాసమును పొందిన ఈ శక్తియే, శాస్త్రములయందు “కళ” యని పిలువబడును. “షోడశ” శబ్దము పూర్ణత్వ ప్రతిపాదక మగుటచే పూర్ణశక్తి వికసించినచోట షోడశ కళాశక్తులును ప్రకటమైనట్లు భావింపబడును. పూర్ణ చంద్రుడు షోడశ కళాపూర్ణశక్తి యని చెప్పబడును. పరమాత్మయందు పూర్ణశక్తి యుండుటచే, పరమాత్మ షోడశ కళాపూర్ణుడని చెప్పబడుచున్నాడు,
ఛాందోగ్యము నందిట్లున్నది.
“షోడశ కలః సోమ్యపురుషః”

  పరమాత్మ షోడశ కళాశక్తి యుక్తుడై యున్నాడు.
తైత్తరీయ బ్రాహ్మణయమునం దిట్లున్నది.
“షోడశకలోవై పురుషః”

  పరమాత్మకు షోడశ కళలున్నవి. పరమాత్మయొక్క ఈ షోడశ కళాత్మక శక్తియే జడచేతనాత్మకమగు సమస్త జగత్తునందును ప్రాప్తమై యున్నది. జీవుడు తన యోని యందు ఉన్నతినందిన కొలదియును, పరమాత్మయొక్క ఈ కళ జీవుని ఆశ్రయమువలన వికాసమును పొందుచున్నది. కళావికాసమందలి హెచ్చుతగ్గలే జీవయోనియందలి ఉన్నతి, అవనతి సూచకములని కూడ చెప్పవచ్చును. ఒకయోనిలోని —-
(ఇక్కడ ఒకపుట కనిపించుటలేదు)
———
చెదరు. మనుష్యుని యందైనను, అంతకన్న తక్కువ యోనియందలి జీవునియందైనను, ఈ అలౌకిక శక్తియున్నయెడల వారి శరీరము సామాన్య శరీరముగా కానుపించినను, వారిని అవతారములుగా ఎరుంగవలయును. సాధారణ జీవుల యందీ అలౌకికశక్తి ధరింపగల సామర్ధ్యముండదు. ఇదియే శాస్త్రములయందలి అవతార సిద్ధాంతము! 9 కళలలో నుండి 15 కళల వరకును అంశావతారమనియును, 16 కళలతో నిండిన కేంద్రమునకు పూర్ణావతారమనియు పేర్లు.

  ఓషధి, వనస్పతి, వృక్ష, లతాదులయందు ప్రాణాధారణమొనర్చు శక్తియును, పుష్టినొసంగు శక్తియు నుండుటచే వీనియందు భగవచ్ఛక్తిలోని ఒక కళమాత్రమున్నదని తెలియవలెను. స్వేదజ, అండజ జరాయుజ, పశు, మనుష్య, దేవతాదులకు సహితము అన్నమయకోశము ద్వారా ఉర్భిజగణమే తృప్తి నొసంగుచున్నది. ప్రపంచమునందలి దివ్య సౌందర్యమును, బ్రహ్మాండ ప్రకృతియందలి అపూర్వమగు స్థితిదశలును, శోభయును, భగవానుని చిత్రవిచిత్రరూప విలాసములును, ఉర్భిజములలోని ఏక కళావికాస ఫలమని ఎరుంగవలయును. ఉర్భిజములయందు కేవలము ఒకకళ ప్రకటితమగుటచేతనే, వానియందు జీవభావమును, సకలేంద్రియ క్రియలును కాన్పించుచున్నవి. ఈ విషయములను నేటి సైంటిష్టులు సహితము యంత్రములద్వారా రుజువుల చేయుచునే యున్నారు.

  ఇక స్వేదజమునందు రెండు కళలు వికసించినవి, దీనియందు అన్నమయ ప్రాణమయ కోశములు రెండును కాన్పించుచున్నవి. ఉర్భిజమునందు, ప్రాణమయకోశము లేకపోవుటచేత ఉర్భిజములు అటునిటు తిరుగజాలకున్నవి. కాని, స్వేదజములు బాగుగా తిరుగగలవు. చెదపురుగువంటి పురుగులలో అత్యద్భుతమగు గృహనిర్మాణ శక్తియును, కలరా, ప్లేగు క్రిములలో క్షణమాత్రమున మనుష్యుల ప్రాణములను హరింపగలశక్తియును రక్తాణువులయందుగల రోగనిరోధక శక్తియును, వీర్యకీటక(కణ)ములయందుగల ప్రజోత్పాదక శక్తియును, స్వేదజములోని భగవచ్ఛక్తియొక్క రెండు కళలవికాస ఫలమని ఎరుంగవలయును.

  ఇక, అండజమునందు 3 కళలు వికసించినవి. అన్నమయ ప్రాణమయ కోశములతోపాటు, మనోమయ కోశము కూడ అండజములయందు వికాసము నందినది. కావుననే, వానియందు మిక్కుటమగు మానసిక ప్రేమ కాన్పించుచున్నది. ఆడపావురము మగపావురములు, శుకశారికలు చక్రవాకీ చక్రవాకములును, ఒండొంటిని ప్రేమించు కొనుటను చూచుచున్నాము. పక్షులయందు మనోమయ కోశము వికసించుటచేతనే వానియందు వాత్సల్యభావము సహితము అపూర్వముగ వికసించినది. పక్షులు తమ సంతానమును గాఢముగా ప్రేమించును. “వైనతేయశ్చ పక్షిణామ్” అని అండజముల యందు సహితము తన విభూతియున్నదని భగవానుడు చెప్పుచున్నాడు.

  ఇక జరాయుజాంతర్గతమగు పశుయోనియందు 4 కళలు వికసించినవి. వీనిలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములతో పాటు, విజ్ఞానమయ కోశముకూడ పశువులయందు కాన్పించుచున్నది. ఉత్కృష్ట పశువులనేకములు మనుష్యులవలనే అనేక పనులొనర్చుచున్నవి. మనోమయకోశము మరింత వికసించుట చేత, ప్రేమించుట, ప్రేమనుపొందుట, స్నేహము చేయుట మొదలగు పనులను చేయుచున్నవి. ఇతిహాసమును పరిశీలించిన యెడల, ప్రభుభక్తిగల గుఱ్ఱములు, కుక్కలు, ఏనుగులు మొదలగు జంతువులు అనేక పర్యాయములు తమ యజమానిని విపత్తునుండి రక్షించుచినట్లును, తమ యజమానికొరకు ప్రాణములను సహితము త్యజించినట్లును, యజమాని మరణించిన పిదపను వాని శవము వద్ద నిరాహార దీక్షనుబూని కడకు ప్రాణములను వదలినట్లును, తెలిసికొనగలము. ఇవి అన్నియు, పశుయోనియందు భగవచ్ఛక్తి యొక్క 4 కళలు వికసించుట చేతనే కలిగెనని తెలియవలెను.

  ఇక, మనుష్యులయందు నిమ్నోన్నత తారతమ్యము ననుసరించి, ఈ ఈశ్వరీయ కళలు 5 నుండి 8 వరకును వికసించును. 5 కళలు గలవాడు సామాన్యమానవుడు. 6 కళలు నుండియును విశేషశక్తిగ పరిగణంచబడును. దీనిని శాస్త్రములయందు “విభూతి” యందురు.
గీతాశాస్త్రమునందిట్లున్నది:—
యద్ యద్ విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేనవా
తత్తదేవానగచ్ఛత్వంమమతే జోంzశసంభవాత్॥

  ప్రపంచమునందున్న ఐశ్వర్యయుక్త, తేజోయుక్త, శక్తియుక్త పదార్థము లన్నియు భగవచ్ఛక్తియొక్క వికాసమువలన జనించినట్లు భావింపవలయును. భగవానుని విశేష శక్తివలన పొందిన విభూతులద్వారా ప్రపంచమునందనేక ధార్మిక కార్యములు నెరవేరుచున్నవి. అవతారముయొక్క ఆవశ్యకత కలుగనంతవరకును, సామాన్యముగా ఈ విభూతులవలననే ధర్మము రక్షింపబడుచుండును. ప్రవక్తలును, శక్తి సంపన్నులగు దేశ నాయకులును ఈ శ్రేణియందే గుణింపబడెదరు. కాని, ఒక విషయమును మాత్రము ముఖ్యముగ గ్రహింపవలసియున్నది. ఈ విభూతులయందు అసంపూర్ణశక్తి మాత్రమే ఉండుటచేత వీరివలన జరుపబడెడి కార్యములు సహితము ఆయా దేశకాలములకు మాత్రమే అనుకూలించి యుండును.

  షోడశకళాప్రపూర్ణుడును, సర్వశక్తివంతుడునగు భగవానుని 8 కళల వరకును లౌకికమగు మనుష్యాదులయందు ప్రకటమగుట కవకాశమున్నది. కాని 8 కళలకుపైన ఆశక్తిని ధరించుటకు లౌకిక కేంద్రములు అసమర్థములై యున్నవి. కావున, 9 నుండి 16 కళలవరకును భగవచ్ఛక్తి ఏ యే మనుష్య పశ్వాదులయందు ప్రకటితమగునో వారందరును అవతారములని పిలువబడుదురు.
భగవద్గీత యందిట్లున్నది.:—
భావయత్యేషసత్యేనలోకాన్ వైలోకభావనః
లీలావతారాసురతోదేవ తిర్యజ్నిరాదిషు॥

  లోకపాలకుడగు భగవంతుడు దేవ, తిర్యక్, మనుష్యాది శరీరములద్వారా లీలావతారమును ధరించి ప్రపంచమును రక్షింపుచుండును.