పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : బలరామకృష్ణావతారములు

  ఇక 8 వ అవతారము బలరామ, కృష్ణావతారములై యున్నవి. ఇందు బలరాముడు అంశకళావతారమును, శ్రీకృష్ణుడు పూర్ణకళావతారమునై యున్నారు. భాగవతమునందిట్లున్నది:-
ఏతేచాంశకలాః పుంసఃకృష్ణస్తుభగవాన్ స్వయం.

  కృష్ణుడుమాత్రమే పూర్ణకళావతారమై యున్నాడు. మిగతా అవతారము లన్నియు అంశావతారములై యున్నవి.

  ద్వాపర కలియుగ సంధికాలమునందు ప్రపంచమెల్ల పాపభూయిష్టమై పోయెను. ఒకవైపు జరాసంధాధి రాక్షసులు ప్రజలను పీడించుచుండిరి. ఒకవైపు కౌరవులు దుర్మార్గము లొనర్చుచుండిరి. మరియొకవైపు కంసుడు శిశువధ సహిత మాచరించుటకు వెనుదీయకుండెను. అట్టిసమయమున దుష్టులను శిక్షించి, ధర్మమును స్థాపించుట కొరకు కృష్ణావతార ముద్భవించెను. పూర్వజన్మయందు, భగవానుని పుత్రునిగా బడయవలయునని తప మొనర్చిన దేవకీవసుదేవులకు భగవానుడు పుత్రరూపమున జనించెను. అటులనే కొందరు ఋషులు భగవానుని ప్రతిరూపమున దర్శింపవలయునని తపమొనర్చిరి. వారందరును గోపికలై ఉద్భవించినారు. పద్మపూరాణము, పాతాళఖండమునం దిట్లున్నది:-
మానసేసరసిస్థిత్వా తపస్తీవ్రముపేయుషామ్
జపతాం సిద్ధిమంత్రాశ్చధ్యాయతాం హరిమీశ్వరమ్॥
మునీనాం కాంక్షతాం నిత్యంతస్య ఏవపదాంబుజం
ఏకసప్తతి సాహస్రసంఖ్యాతానాం మహౌజసామ్॥
తదహం కధయాన్యుద్యతద్రహస్యం పరంపనే

  మానససరోవరమునందు, భగవానుని చరణసేవ యందిచ్ఛ గలవారై 71 వేలమంది మునులు తీవ్రముగ తపమాచరించిరి. వారు సిద్ధిమంత్రములను జపించుచు, హరిని ధ్యానించిరి. వారిలో ఏమునీశ్వరులు తమ శరీర, మనః, ప్రాణ, ఆత్మల ద్వారా భగవానుని తీవ్రముగ వాంఛించిరో వారందరును గోపవంశమునందు గోపీరూపమున జన్మించిరి. ఇటులననే అనేక శ్రుతులు కూడ గోపీరూపమున జన్మించెను. “భవద్భిరం శైర్య దుషూపజన్యతామ్” అని భాగవతమునందు. దేవతలుకూడ యదువంశమునందు జన్మించినట్లు చెప్పబడియున్నది. కావున, గోపగోపీ గణమంతయును సామాన్యమానవులు కారనియును, దేవతాంశచే జన్మించినవారనియు పాఠకులు తెలిసికొందురు గాక!