పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాకరణము


శోధన

  •  


పద శోధన

  •  

ఛందోపరిచయము : వృత్తములు

 తెలుగు భాగవతములో వాడిన పద్యాదుల లక్షణములు సూక్ష్మంగా

ఛందస్సు పరిచయము

వృత్తములు

1 ఉత్పలమాల

శ్రీ రమణీముఖాంబురుహ సేవన షట్పద నాధ యంచు శృం
గార రమేశ యంచు ధృత కౌస్తుభ యంచు భరేఫనంబులన్
భారలగంబులు గదియ బల్కుచు నుత్పల మాలికా కృతిన్
గారవ మొప్పఁ జెప్పుదురు కావ్యవిదు ల్యతి తొమ్మిదింటగన్.

గణ విభజన
UII UIU III UII UII UIU IU
శ్రీరమ ణీముఖాం బురుహ సేవన షట్పద నాధయం చుశృం
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 20
ప్రతిపాదంలోని గణాలు భ, ర, న, భ, భ ,ర, వ
యతి ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య - 475
ఉదాహరణ 1:

భా9268ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసో త్తమశరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్లస త్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

ఉదాహరణ 2

భా867ఉ.
ఊహ గలంగి జీవనపు టోలమునం బడి పోరుచు న్మహా
మోహలతా నిబద్ధ పదము న్విడిపించుకొనంగ లేక సం
దేహముఁ బొందు దేహి క్రియ దీనదశ న్గజ ముండె భీషణ
గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.

2 చంపకమాల

త్రిభువనవంద్య గోపయువతీజన సంచిత భాగధేయ రుక్
ప్రభవ సముత్క రోజ్వల శిరస్థ్సిత రత్న మరీచి మంజరీ
విభవ సముజ్జ్వల త్పదారవింద ముకుంద యనంగ నొప్పు నా
జభములు జాత్రిరేఫములుఁ జంపకమా లగు నాదిశాయతిన్.

గణ విభజన
III IUI UII IUI IUI IUI UIU
త్రిభువ నవంద్య గోపయు వతీజ నసంచి తభాగ ధేయరుక్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 21
ప్రతిపాదంలోని గణాలు న, జ, భ, జ, జ ,జ, ర
యతి ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య - 486
ఉదాహరణ

భా853చ.
పదములఁ బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు ధృతిమంతుఁడు దంత యుగాంత ఘట్టనం
జెదరఁగఁ జిమ్మె న మ్మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పఱన్
వదలి జలగ్రహంబు కరి వాలముమూలముఁ జీరెఁ గోరులన్.

3 మత్తేభ విక్రీడితము

భవరోగ ప్రవినాశ నౌషధకలాప్రావీ ణ్యగణ్యుండు శై
లవిభేది ప్రము ఖాఖి లామర దరోల్లాసుండు గోవిందుఁ డం
చు వివేకు ల్సభరంబులున్నమయవస్తోమంబు గూడ న్స మ
ర్మ విధిం జెప్పుదు రా త్రయోదశ యతి న్మత్తేభ విక్రీడితిన్.

గణ విభజన
IIU UII UIU III UUU IUU IU
భవరో గప్రవి నాశనౌ షధక లాప్రావీ ణ్యగణ్యుం డుశై
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 20
ప్రతిపాదంలోని గణాలు స, భ, ర, న, మ , య, వ
యతి ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 586
ఉదాహరణలు

భా9260మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జిత హాటకం గపట భాషా విస్ఫుర న్నాటకన్
జవభిన్నార్యమ ఘోటకం గరవిరాజ త్ఖేటకం దాటకన్.
భా896మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ 'డభ్రగపతిం బన్నింపఁ' డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచల మైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

4 శార్దూల విక్రీడితము

పద్మ ప్రోద్భవ సన్నిభు ల్మసజస ప్రవ్యక్త తాగంబులున్
బద్మాప్తాంచిత వశ్రమంబుగ సముత్పాదింతురు ద్యన్మతిన్
బద్మాక్షాయ నిజాంఘ్రి సంశ్రిత మహాపద్మాయ యోగీంద్రహృ
త్సద్మస్థాయ నమోస్తుతే యనుచు నీ శార్దూల విక్రీడితన్.

గణ విభజన
UUU IIU IUI IIU UUI UUI U
పద్మప్రో ద్భవస న్నిభుల్మ సజస ప్రవ్యక్త తాగంబు లున్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 20
ప్రతిపాదంలోని గణాలు మ, స, జ, స, త , త, గ
యతి ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య - 288
ఉదాహరణలు

భా8102శా.
తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాల గ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచ ద్విలగ్నంబుతోన్.

5 తరలము

జలరుహాహిత సోదరీ ముఖ చంద్ర చంద్రిక లాదటన్
గొలఁది మీఱఁగ లోచనంబుల గ్రోలి యొప్పు మహాసుఖిన్
బలుకుచో నభరంబులుం బిదప న్సజంబు జగంబులున్
జెలువుగా దరలంబు నోలి రచింతు రంధకజి ద్యతిన్.

గణ విభజన
III UII UIU IIU IUI IUI U
జలరు హాహిత సోదరీ ముఖచం ద్రచంద్రి కలాద టన్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 19
ప్రతిపాదంలోని గణాలు న, భ, ర, స, జ , జ, గ
యతి ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 23
ఉదాహరణ

భా10.1570త.
క్రతుశతంబులఁ బూర్ణకుక్షివి; గాని నీ విటు క్రేపులున్
సుతులు నై చనుఁ బాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ!

6 మత్తకోకిల

ఒక్క చేత సుదర్శనంబును నొక్క చేతను శంఖమున్
ఒక్క చేతఁ బయోరుహంబును నొక్క చేత గదం దగన్
జక్కడం బగు మూర్తికి న్రసజాభరంబులుదిగ్యతిన్
మక్కువం దగఁ బాడి రార్యులు మత్తకోకిల వృత్తమున్.

గణ విభజన
UIU IIU IUI IUI UII UIU
ఒక్కచే తసుద ర్శనంబు నునొక్క చేతను శంఖమున్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 18
ప్రతిపాదంలోని గణాలు ర, స, జ, జ, భ , ర
యతి ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 41
ఉదాహరణ

భా1246మత్త.
అన్యసన్నుతసాహసుండు మురారి యొత్తె యదూత్తముల్
ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతుచై
తన్యము న్భువనైకమాన్యము దారుణధ్వనిభీతరా
జన్యము న్బరిమూర్చితాఖిల శత్రుదానవ సైన్యమున్.

7 మాలిని

సకల నిగమ వేద్యున్సంసృతి వ్యాధి వైద్యున్
మకుటవిమలమూర్తిన్ మాలినీవృత్త పూర్తిన్
నకలిత సమయోక్తి న్నాగ విశ్రాంతి యుక్తిన్
సుకవులు వివరింప న్సొంపగు న్విస్తరింపన్.

గణ విభజన
III III UUU IUU IUU
సకల నిగమ వేద్యున్సం సృతివ్యా ధివైద్యున్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 15
ప్రతిపాదంలోని గణాలు న, న, మ, య, య
యతి ప్రతిపాదంలోనూ 9 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 12
ఉదాహరణ

భా8744మా.
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభరనివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ!
ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తీ!

8 ఇంద్రవజ్రము

పదునొకండవ త్రిష్టుస్ఛంధంబునందుఇంద్రవజ్రయను వృత్తము
సామర్థలీలన్ తతజ ద్విగంబుల్
భూమింధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్
ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్
హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్.

గణ విభజన
UUI UUI IUI UU
గా
సామర్థ లీలన్త తజద్వి గంబుల్
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య 11
ప్రతిపాదంలోని గణాలు త, త, జ, గా
యతి ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 4

భా10.1690ఇ.
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.”

9 ఉపేంద్రవజ్రము

పురారిము ఖ్యామర పూజనీయున్
సరోజనాభున్ జతజ ద్విగోక్తిన్
దిరంబుగా నద్రి యతి న్నుతింపన్
ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్.

గణ విభజన
IUI UUI IUI UU
గా
పురారి ముఖ్యామ రపూజ నీయున్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 11
ప్రతిపాదంలోని గణాలు: జ, త, జ, గా
యతి : ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా10.1407ఉపేం.
తపస్వి వాక్యంబులు దప్పవయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!

10 కవిరాజవిరాజితం

కమల దళంబుల కైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖ ప్రభలున్
సమధిక వృత్తకుచంబులు నొప్పగ శైలరసర్తు విశాల యతిన్
సముచితనాన్విత షడ్జలగంబు లజానుగఁ బాడిరి చక్రధరున్
రమణులు సొం పలరం గవిరాజ విరాజితమున్ బహు రాగములన్,

గణ విభజన
III IUI IUI IUI IUI IUI IUI IU
కమల దళంబు లకైవ డిఁజెన్న గుకన్ను లుజారు ముఖప్ర భలున్
(1'న', 6 'జ', 1 'వ' గణాలు)
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 23
ప్రతిపాదంలోని గణాలు: న, జ, జ, జ, జ , జ, జ, వ
యతి : ప్రతిపాదంలోనూ 8 వ, 14వ, 20వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య -3
ఉదాహరణ

భా10.2489కవి.
చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచిత పుణ్యు నగణ్యునిఁ జం
దన ఘనసార పటీర తుషార సుధా రుచికాయు విధేయు సుధా
శనరిపుఖండను సన్మణిమండను సారవివేకు నశోకు మహా
త్మునిఁ గని గోపిక లోపిక లేక యదుప్రభు ని ట్లని రుత్కలికన్.

11 తోటకము

జలజోదర నిర్మల సంస్తవముల్
విలసిల్లెడుఁ దోటకవృత్తమునన్
బొలుపై స చరుష్కముఁ బొందగ నిం
పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్.

గణ విభజన
IIU IIU IIU IIU
జలజో దరని ర్మలసం స్తవముల్
(4 'స' గణములు)
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 12
ప్రతిపాదంలోని గణాలు: స, స, స, స
యతి : ప్రతిపాదంలోనూ 9 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6531తో.
కరుణాకర! శ్రీకర !కంబుకరా!
శరణాగతసంగతజాడ్యహరా!
పరిరక్షితశిక్షితభక్తమురా!
కరిరాజశుభప్రద! కాంతిధరా!

12 పంచచామరము

జరేఫలు న్జరేఫలు న్జసంయుతంబు లై తగన్
గరూ పరిస్థితిం బొసంగి గుంఫనం బెలర్పఁగా
విరించి సంఖ్యనందమైనవిశ్రమంబు లందగన్
బ్రరూఢమైనఁ బద్మనాభ పంచచామరం బగున్

గణ విభజన
IUI UIU IUI UIU IUI U
జరేఫ లున్జరే ఫలున్జ సంయుతం బులైత గన్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 16
ప్రతిపాదంలోని గణాలు: జ, ర, జ, ర, జ , గ
యతి : ప్రతిపాదంలోనూ 9 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా10.1586పంచ.
ప్రసన్న పింఛమాలికా ప్రభా విచిత్రితాంగుఁడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం
బ్రసన్న గోపబాల గీత బాహువీర్యుఁ డయ్యు ను
ల్లసించి యేగె గోపకు ల్చెలంగి చూడ మందకున్.

13 భుజంగ ప్రయాతము

భుజంగేశ పర్యంక పూర్ణానురాగన్
భుజంగప్రయాతాఖ్యఁ బూరించు చోటన్
నిజంబై ప్రభూతావనీ భృద్విరామం
బజస్రంబుగాఁ గూర్ప యా ద్వంద్వ మొప్పన్.

గణ విభజన
IUU IUU IUU IUU
భుజంగే శపర్యం కపూర్ణా నురాగన్
నాలుగు యగణములు
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 12
ప్రతిపాదంలోని గణాలు: య, య, య, య
యతి : ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా1295భు.
హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్
భరించు న్ధర న్రామభధ్రుండుఁ బోలెన్
జరించు న్సదా వేదశాస్త్రానువృత్తిన్
వరించు న్విశేషించి వైకుంఠుభక్తిన్.

14 మంగళమహాశ్రీ

చిత్తములఁ జూపులను జిత్తజునితండ్రి ప
యి జెంది గజదంతియతు లొందన్
వృత్తములతోడఁ దరుణీ మణులు గానరు
చులింపుగను మంగళమహాశ్రీ
వృత్తములఁ బాడిరి సువృత్త కుచకుంభము
ల వింత జిగి యెంతయుఁ దలిర్పన్
మత్తిలించు నబ్భజిసనంబు లిరుచోటులఁ
దనర్పఁగఁ దుదన్గగ మెలర్పన్.

గణ విభజన
UII IUI IIU III UII
చిత్తము లఁజూపు లనుజి త్తజుని తండ్రిప
IUI IIU III UU
గగ
యిజెంది గజదం తియతు లొందన్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 26
ప్రతిపాదంలోని గణాలు: భ, జ, స, న, భ , జ, స, న, గగ
యతి : ప్రతిపాదంలోనూ 9వ, 17వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
చదువుకొనుటకు వీలుగా ఉంటుందని పాదాలను రెండుగా విడదీసాము గమనించండి
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6184మంగ.
ఈవిధమున న్విబుధు లేకతమ చిత్తము
ల నేకతము లేక హరి నీశు న్
భావమున నిల్పి తగు భాగవతయోగ ప
రిపాకమున నొందుదరు వారిం
దేవలదు దండనగతిం జనదు మాకు గు
ఱుతింప నఘము ల్దలఁగు మీఁదన్
శ్రీవరుని చక్రము విశేష గతిఁ గాచు సు
రసేవితులు ముక్తిఁ గడుఁ బెద్దల్.

15 మానిని

క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ
గూర్చిన కెంజడకొప్పునకున్
వన్నె యొనర్చిన వాహిని యీతని
వామపదంబున వ్రాలె ననన్
జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విల
సిల్లు రసత్రయ చిత్ర యతుల్
పన్నుగ నొందఁ బ్రభాసుర విశ్రమ
భంగిగ మానిని భవ్యమగున్.

గణ విభజన
UII UII UII UII
క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ
UII UII UII U
గూర్చిన కెంజడ కొప్పున కున్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 22
ప్రతిపాదంలోని గణాలు: భ, భ, భ, భ, భ భ, భ, గ
యతి : ప్రతిపాదంలోనూ 13వ, 19వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
మొత్తం గణాలు: 22 X 4; ప్రాస: ఉంది; ప్రాస యతి: కూడదు; యతి: 1, 13, 19; రకము: వృత్తము
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా10.1214మాని.
కాంచనకుండల కాంతులు గండయు
గంబునఁ గ్రేళ్ళుఱుక న్జడపై
మించిన మల్లెల మేలిమి తావులు
మెచ్చి మదాళులు మింటను రా
నంచిత కంకణ హార రుచు ల్చెలు
వారఁగఁ బైవలువంచల నిం
చించుక జారఁగ నిందునిభానన
యేగెఁ గుమారుని యింటికి నై.

16 మహాస్రగ్ధర

కొలిచెం బ్రోత్సాహ వృత్తింగు తలగ గనము ల్గూడరెం డంఘ్రులం దా
బలిఁబాతాళంబుచేరంబనిచెగడమకైబాపురేవామనుండ
స్ఖలితాటోపాఢ్యుఁడంచుంగరిగిరివిరమాకారిమారన్సతానో
జ్జ్వలసోద్యద్రేఫయుగ్మాశ్రయగురులమహాస్రగ్ధరంజెప్పనొప్పున్

గణ విభజన
IIU UUI UUI III IIU UIU UIU U
కొలిచెం బ్రోత్సాహ వృత్తింగు తలగ గనము ల్గూడరెం డంఘ్రులం దా
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 22
ప్రతిపాదంలోని గణాలు: స, త, త, న, స ,ర, ర, గ
యతి : ప్రతిపాదంలోనూ 9వ, 16వ వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 2
ఉదాహరణ

భా10.2940మస్ర.
కనియెం దాలాంకుఁ డుద్యత్కట చటుల నట త్కాల దండాభ శూలున్
జన రక్తాసిక్త తాలు న్సమధిక సమరోత్సాహ లోలుం గఠోరా
శని తుల్యోదగ్ర దంష్ట్రా జనిత శిఖక ణాచ్ఛాది తాశాంతరాళున్
హనన వ్యాపార శీలు న్నతి దృఢ ఘన మస్తాస్థి మాలుం గరాళున్.

17 లయగ్రాహి

ఎందు నిల నేజనులకుం దలఁపరాని త
ప మంది కొని చేసిరొకొ నందుఁడు యశోదా
సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడు న్దొర
సి పొందగును ముప్పు తఱి నందనునిగా శ్రీ
మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసము
లు గ్రందుకొని చెప్పు మునిబృందము లయగ్రా
హిం దనర సబ్భజసలుందగ నకారము
ను బొంద నిరుచోట్లను బిఱుం దభయ లొందన్.
ఏకోనచచ్వారింశన్మాత్రా గర్భితంబుఁ ద్రింశదక్షరంబు నైన లయగ్రాహి

గణ విభజన
UII IUI IIU III UII
ఎందుని లనేజ నులకుం దలఁప రానిత
IUI IIU III UII IUU
పమంది కొనిచే సిరొకొ నందుఁడు యశోదా
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 30
ప్రతిపాదంలోని గణాలు: భ, జ, స, న, భ , జ, స, న, భ, య
యతి :
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాసయతి స్థానములు – 2వ, 10వ, 18వ, 26వ అక్షరములు.
వ్రాయుటకు, చదులుటకు వీలుకొరకు ప్రతి పాదము రెండుగా విడదీసితిమి.
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 4
ఉదాహరణ

భా6385లగ్రా.
కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపు
లు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్విను
లు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సు
రజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
భీల గతితోడఁ దమ కేలి ధనువుల్విడి
చి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!

18 లయవిభాతి

పడయరె తనూభముల న్బడయుదురు గాక పెర
పడతులును భర్తలును బడసిరె తలపన్
బుడమి గల నందుడును బడతుక యశోదయును
గడపున జగత్రయ మునిడికొనిన పుత్రున్
బడసి రట యంచు బెడ గడరు నసనత్రివృతి
గడనసగము ల్పొసగనిడ లయవిభాతిన్
నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు
వడియు పగిది న్రనము గడలు కొనుచుండున్.
ఏ కో న చ త్వాం శ న్మా త్రా గ ర్భి త పా దం బు ను చ తు స్త్రిం శ ద క్ష రం బు న యి న ల య వి భా తి

గణ విభజన
III IIU IIU III IIU III
పడయ రెతనూ భముల న్బడయు దురుగా కపెర
III IIU III III III U
పడతు లునుభ ర్తలును బడసి రెతల పన్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 34
ప్రతిపాదంలోని గణాలు: న, స, స, న, స, న, న, స, న, న, న, గ
యతి :
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి స్థానములు – 2వ, 11వ, 20వ, 29వ అక్షరములు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 3
ఉదాహరణ

భా10.11563లవి.
హసితహరినీలనిభవసనమువిశాలకటి
నసమనయనాద్రిపరిహసితమగుమేఘో1
ల్లసనమువహింపఁగరకిసలయముహేమమణి
విసరవలయద్యుతులుదెసలతుదలందుం2
బసలఁగురియంగసరభసమునబలుండుదర
హసితముముఖాబ్జముననెసఁగఘనకాలా3
యసమయమహోగ్రతరముసలమువడిన్విసరి
కసిమసఁగిశత్రువులనసువులకుఁబాపెన్.4

19 వనమయూరము

ఉన్నతములై వనమయూర కృతు లోలిన్
ఎన్నగ భజంబులపయి న్సనగగంబుల్
చెన్నొదవ దంతియతి జెంది యలవారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్.
పదునాల్గవశక్వరీచ్ఛందంబునందు వనమయూరము

గణ విభజన
UII IUI IIU III UU
గగ
ఉన్నత ములైవ నమయూ రకృతు లోలిన్
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 14
ప్రతిపాదంలోని గణాలు: భ, జ, స, న, గగ
యతి : ప్రతిపాదంలోనూ 9వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6378వన.
అంత సుర లేయు నిబి డాస్త్రముల పాలై
పంతములు దక్కి హత పౌరుషముతో ని
శ్చింత గతి రక్కసులు సిగ్గుడిగి భూమిం
గంతుగొని పాఱి రపకార పరు లార్వన్.

20 స్రగ్ధర

తెల్లంబై శైల విశ్రాంతిని మునియ
తినిం దేజరిల్లు న్ధృఢంబై
చెల్లెం బెల్లై మకారాంచిత రభన
యము ల్చెందమీద న్యకారం
బుల్లంబార న్బుధా రాధ్యు నురుగశ
యను న్యోగివంద్యుం గడు న్రం
జిల్లంజేయం గవీంద్రు ల్జితదనుజ
గురుం జెప్పెదర్ స్రగ్ధరాఖ్యన్.

గణ విభజన
UUU UIU UII III
తెల్లంబై శైలవి శ్రాంతిని మునియ
IUU IUU IUU
తినిందే జరిల్లు న్ధృఢంబై
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 21
ప్రతిపాదంలోని గణాలు: మ, ర, భ, న ,య, య, య
యతి : ప్రతిపాదంలోనూ 8వ, 15వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
వ్రాయుటకు, చదులుటకు వీలుకొరకు ప్రతి పాదము రెండుగా విడదీసితిమి.
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 3
ఉదాహరణ

భా10.2883స్రగ్ద.
కూలున్ గుఱ్ఱంబు లేనుంగులు ధరఁ గె
డయుం గుప్పలై; నుగ్గునూచై
వ్రాలు న్దేరుల్‌ హతంబై వడిఁబడు సు
భటవ్రాతముల్‌; శోణితంబుల్‌
గ్రోలున్, మాంసంబు నంజుం గొఱకు, నెము
కల న్గుంపులై సోలుచు న్బే
తాల క్రవ్యాద భూతోత్కరములు; జ
తలై తాళముల్‌ దట్టియాడున్.

21 స్రగ్వి. స్రగ్విణి

దేవకీనందను న్దేవచూడామణిన్
భూవధూవల్లభుం బుండరీకోదరున్
భావనాతీతునిం బల్కఁగా స్రగ్విణీ
భావ మాద్యంత రేఫం బగు న్షడ్యతిన్.

గణ విభజన
UIU UIU UIU UIU
దేవకీ నందను న్దేవచూ డామణిన్
4 ర – గణములు
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 12
ప్రతిపాదంలోని గణాలు: ర, ర, ర, ర
యతి : ప్రతిపాదంలోనూ 7 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6454స్రగ్వి.
వ్రాలి “యోపుత్రా! నీ వార్త దంభోళియై
కూలఁగా వ్రేయ కీ కొల్ది నన్నేటికిన్
జాలి నొందించె? నా జాడ యింకెట్టిదో?
తూలు మీ తల్లికి న్దుఃఖ మె ట్లాఱునో?"

22. శ్లో శ్లోకము (వాడినది) (సింహోన్నతము)

గణ విభజన
UUI UII IUI IUI UI
గల
హంసాయ సత్త్వని లయాయ సదాశ్ర యాయ
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 14
ప్రతిపాదంలోని గణాలు: త, భ, జ, జ, గల
యతి :
ప్రాస:
ప్రాస:
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా620శ్లో.
హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ
నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ
సత్సంగ్రహాయ సగుణాయ సదీశ్వరాయ
సంపూర్ణపుణ్యపతయే హరయే నమస్తే.