పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాకరణము


శోధన

  •  


పద శోధన

  •  

ఛందోపరిచయము : దండకము గద్యవచనాలు

తెలుగు భాగవతములో వాడిన పద్యాదుల లక్షణములు సూక్ష్మంగా

ఛందస్సు పరిచయము

దండక-గద్య-వచనాలు

1 దండకము

సిరినేలు రసికుండు శ్రీవత్సవక్షుండు నీరేరుహాక్షుండు నిత్యాసదృక్షుండు త్రైలోక్య సంరక్ష ణోపాయ దక్షుండు మాపాలి దేవుండు ధీరుం డుదారుం డితం డిచ్చు మా యిచ్చకు న్వచ్చు సౌఖ్యమ్ము లంచు న్మదిం గోరి పెద్ద ల్సకారంబుతో సంగతం బైన హం బాది నొండెన్దకారాదిగా నైన లో నెల్ల చోట న్దకారంబులం బెల్లు చెంద న్గకా రావసానంబు నై దండ కాకార మేపారఁ గీర్తింతు రెల్లప్పుడున్.

గణ విభజన
IIU III UI UI UI UI . U
.
సిరినే లురసి కుండు శ్రీవ త్సవ క్షుండు . . . . . డున్.
లక్షణము

ఒకటే పాదము. అన్నీ త(UUI) గణాలే వేసి చివర గ వేయవలె
లేదా
మొదట స(IIU), న(III), హ(UI) గణాలు తరువాత కావలిసినన్ని త(UUI) గణాలు వేసి చివర గ(U) వేయవలె

పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య - 2
ఉదాహరణ

శ్రీమానినీచోరదండము
10.1-1236-దం.
.“శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతు హేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలాకు లాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటు ఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోక పుంజంబులం బన్న విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీవా ర్యహంకార మాయా మహా మాన సాదుల్ హృషీ కాదులు న్లోకముల్ లోక బీజంబులున్ నిత్య సందోహ మై నీ మహా దేహ మం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లే కాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నో చెల్ల చెల్లన్ విచారింపఁ దా రెంత వా రెంతవా రైన మా యాదులు న్మాయతోఁ గూడి క్రీడించు లో కానుసంధాత యౌ ధాత నిర్ణేతలే నీ కళారాశికిం గొంద ఱంభోజగ ర్భాదు లధ్యాత్మ లందున్నశేషాధి భూతంబు లందు న్ననే కాధిదైవంబు లందున్ సదా సాక్షి వై యుందు వంచుం ద దంతర్గత జ్యోతి వీశుండ వంచుం ద్రయీ పద్ధతిం గొంద ఱిం ద్రాది దేవాభిదానంబులన్, నిక్కుదొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢ కర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తు లై మించి విఙ్ఞాన చక్షుండ వంచున్ మఱిం బాంచరా త్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొంద ఱీ వాత్మ వంచున్ మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు బాటింతు వంచున్; మఱి న్నీవు నారాయ ణాఖ్యుండ వంచున్; శి వాఖ్యుండ వంచున్; మఱిం బెక్కు మార్గంబులన్ నిన్నునగ్గింతు రెగ్గేమి యేఱుల్ పయోరాశి నేరాసు లై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబు లై డింది నీ యంద నూనంబు లీనంబు లౌ నేక రాకేందు బింబంబు కుంభాంత రంభంబులం బింబితం బైన వే ఱున్నదే? యెన్న నేలా ఘటాంతర్గ తాకాశము ల్దద్ఘ టాంతంబులం దేక మౌ రేఖ లోకావధిన్ వీకనే పోకలం బోక; యేకాకి వై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధు ల్గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభి ప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబు గా నేకమై యున్న నీ మేని దండం బయోజాత గర్భాండమ్ముల్ మండి తోదుంబ రానోకహానేక శాఖా ఫ లాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసి ద్ధోద రాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింప న్చల యాంభోధిలో మీను మేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీ మధుం జక్రి వై మొత్తవే యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మ లీలా పరిష్పంది వై పంది వై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనింజూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండమున్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబుల న్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవ ర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్ నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండ వయి ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్పా! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.

2 గద్యము

క. కనుగొన బాదరహితమై

పనుపడి హరిగద్దె వోలె బహుముఖరచనం
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్.
గ గద్యము నకు – వచనము వలెనే ఛందోనియమము లేదు.
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య - 14
(ప్రతి స్కంధ అంతము నందు ఒక గద్యము చొప్పున ఉన్నాయి.)

ఉదాహరణ

12-54-గ.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయణ నామధేయ ప్రణీతం బైన శ్రీ మహాభాగవతం బను మహా పురాణంబు నందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగ ధర్మ ప్రకారంబును, బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయ విశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతి నొందుటయు, సర్పయాగంబును, వేదవిభాగ క్రమంబును, బురా ణానుక్రమణికయు, మార్కండేయోపాఖ్యానంబును, సూర్యుండు ప్రతి మాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబును, తత్త త్పురాణ గ్రంథ సంఖ్యలు నను కథలుగల ద్వాదశస్కంధము, శ్రీ మహాభాగవత గ్రంథము సమాప్తము.

3 వచనము

క. కనుగొన బాదరహితమై
పనుపడి హరిగద్దె వోలె బహుముఖరచనం
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్.
వ వచనమునకు - గద్యము వలెనే ఛందోనియమము లేదు
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య - 2680

ఉదాహరణ

1-4-వ.
అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి.