పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వాఙ్మయము : వాఙ్మయము - 1

కావ్యలక్షణం గురించి తెలుసుకునేముందు , వాజ్మయము గురించి తెలుసుకోవాలి.

వాజ్మయము

దేశదేశము లందును వాజ్మయ మనేక విధములు. అందు మన భారత దేశమునందు ప్రథమమున వేదభాషయును, తరువాత అనేక ప్రాకృతములు వచ్చినవి. అందు ఆంధ్రభాష యొకటి. మొట్టమొదట అచ్చతెనుఁగు వుండెడిది. తరువాత నన్నయాదులచే సంస్కరింపబడి , గ్రంథస్తము చేయబడినది. వారు భాషకు లక్షణ గ్రంథములు నిర్మించిరి. ఆంధ్రభాషలో మూడువంతులు సంస్కృతములేయై యున్నవి.

ఆంధ్రము తత్సమము, తద్భవము (వైకృతము), దేశ్యము, గ్రామ్యము లని నాల్గువిధములు.

వైకృతమున సంస్కృతభవము, ప్రాకృతభవము, ప్రాకృతసమములు అని మూడు తెఱగులు.
గ్రామ్యము నింధ్య, అనింధ్యలని రెండు తెఱగులు. అనింధ్య గ్రామ్యము గ్రాహ్యము.
దేశ్యము ఆంధ్రదేశ్యము అన్యదేశ్యములని రెండు విధములు.
తత్సమమనగా సంస్కృతసమము.
ప్రాకృతమారువిధములు 1. ప్రాకృతము 2. మాగధి 3. శౌరసేని 4. పైశాచి 5. చూళిక 6. అపభ్రంశము (గ్రామ్యము). సంస్కృతాంధ్రములతో గలిసి భాష ఎనిమిది (8) విధములు.

వాజ్మయము ప్రభు సమ్మితములు, సుహృత్సమ్మితములు, కాంతాసమ్మితములు అని మూడు విధములుగా నున్నవి.
ప్రభుసమ్మితములు, వేదములు, ఆజ్ఞారూపములు.
సుహృత్సమ్మితములు ధర్మశాస్త్రములు ప్రోత్సాహరూపములు, హితము చెప్పునవి.
కాంతాసమ్మితములు సూచకములు, కీడు మేలులు సూచించును.

అవి కావ్యములు, ఇతిహాసములు (రామాయణ భారతాదులు)
కావ్యములు తిరిగి దృశ్యములు, శ్రావ్యములు అని రెండు విధములు.
దృశ్యములు, నాటకములు శకుంతలాదులు.
శ్రావ్యములు, కావ్యములు శ్రీ వాల్మీకి రామాయణము, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలగునవి.

కావ్యము పద్యము, గద్యము, నుభయమునని మూడు తెఱంగులు. " కావ్యం గద్యం, పద్యంచ, గద్య పద్యాత్మకం కావ్యం చంపూరిత్యభిదీయతే. అని లక్షణము.
గద్య కావ్యములనగా వచన కావ్యములు (గద్యము వృత్తగంధి, ఉత్కలిక, చూర్ణము నని త్రివిధములు) కాదంబరి, దశకుమార చరిత్రము కళాపూర్ణోదయము మున్నగునవి. (పద్య మనేక విధములు)
పద్యకావ్యములు, మనుచరిత్రాదులు ఆంధ్రభారతాదులు.
చంపూకావ్యములు ఆంధ్రభాగవతాదులు

~ (కవిశ్రీ సత్తిబాబు)