పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

లక్షణ ప్రకరణము : పదాలు- వాక్యాలు - 1

పదములు వాక్యములు రచనలు

పదములు నుండి వాక్యములు నుండి రచన

పదం లేదా మాట ఎందుకో ఇంతకు ముందు అనుకున్నాం పదాల రకాలను భాషాభాగాలు అంటారు. అవికూడా చర్చించుకున్నాం.

నిర్వచనం

ఈ పదానికి నిర్వచనం ఇలా చెప్పవచ్చు:
పదం అంటే స్వతంత్రంగా ప్రయోగించడానికి తగినదై, అర్థవంతమైనదై, ఒకటి కాని అంతకన్నా ఎక్కువ సంజ్ఞలు లేదా అక్షరాలు కలదై ఉండాలి; ఇతరములతో కూడుకుని ఉండరాదు.

ఇలాంటి పదాలు ఒకటికాని ఎక్కువ కలది, ఆ పదాలకు పరస్పర సంబంధం (అన్వయం) కలది, ఉద్దేశించిన విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పేది వాక్యం. ఇది సంపూర్ణం, అసంపూర్ణం అని రెండువిధాలు. ఒకటికన్నా ఎక్కువ వాక్యాలు కలిసి కూడ మరల వాక్యం కావచ్చు. వాక్యములు భేదాలు సామాన్యవాక్యములు, ఒకటి కన్నా అధికమైన సామాన్య వాక్యములు కలవి సంయుక్త వాక్యములు.

సామాన్య వాక్యము

ఉదా-
రాముడు సీతను చేపట్టెను.

ఉపవాక్యము సంయుక్తవాక్యము

ఈ వాక్యంలో క్రియ పూర్తి ఐంది. ఇలా భావం సంపూర్ణం కాకుండా “రాముడు సీతను చేపట్టి,” అంటే ఉపవాక్యం అంటారు. దీనికి కొనసాగింపుగా “రాముడు సీతను చేపట్టి, అడవికి వెళ్ళెను” అంటే సంయుక్తవాక్యము ఉదా-
1-15-వ.
అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచవిరచనాకుతూహలుండనై, (2) యొక్క రాకా నిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని, (3) సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని, (4) క్రుంకులిడి వెడలి, (5) మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ, (6) గించి దున్మీలిత లోచనుండనై యున్న యెడ.
ఇది ఆరు (6) ఉపవాక్యములు కూడిన సంయుక్త వాక్యము

కర్త, కర్మ క్రియ

రాముడు సీతను చేపట్టెను.
పై వాక్యంలో రాముడు కర్త, సీత కర్మ, క్రియ చేపట్టెను.
ఇందు చేపట్టెను క్రియ. క్రియ అంటే జరిగిన పని అనుకుంటే ఎవరు ఏది అని ప్రశ్నిస్తే కర్త వస్తుంది. ఎవరిని దేనిని ఏమిటి అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ. ఏమైంది అంటే క్రియ వస్తుంది. కర్త కర్మ క్రియ ఇదే వరుసలో రావలెనని నియమం తెలుగు భాషలో లేదు. ముందు వెనుకలు ఎలాగైనా రావచ్చు.
ఉదా.- సీతను రాముడు చేపట్టెను.

ఏకపదం వాక్యాలు

ఉదా- చదువు, తిను

ఏకాక్షర పద వాక్యాలు

ఉదా- రా, పో


రచనలు

ఒకటికాని ఎక్కువకాని వాక్యాలతో రచనలు వ్రాయబడతాయి.
రచనలు రకాలు
రచనలలో వచనాలు గద్యాలు ఛందోనియమం లేనివి, పద్యాలు దండకాలు ఛందోబద్దాలు, గీతాలు లేదా కవిత్వం లయప్రధానమైనవి
మరొకవిధంగా
రచనా శైలులు అనేక ఉన్నాయి ఉదా-
1. ఇతిహాసాలు ఉదా-రామాయణ భారతాలు
2. పురాణాలు-ఉదా- భాగవతాది
3. కావ్యాలు. ఉదా- రఘువంశం వంటివి
4. నాటకాలు ఉదా- హరిశ్చంద్రనాటకం మున్నగునవి
5. ప్రబంధాలు ఉదా- మనుచరిత్రాది మొదలైనవి
6. గీతాలు
7. చాటువులు
6. పాటలు
9. యక్షగానం, ఉదా- హరికథ, బుఱ్ఱకథ వంటివి
10 కథలు
11. నవలలు
12. టుమ్రీలు
….